ప్రేమ యాత్రలకు... - అచ్చంగా తెలుగు

ప్రేమ యాత్రలకు...

Share This
ప్రేమ యాత్రలకు...
-       పూర్ణిమ సుధ

పెరట్లో రాత్రంతా, మంచులో తడిసి మరింత అందాన్ని సంతరించుకున్న ఎర్ర మందారాన్ని తదేకంగా చూస్తూ, కాఫీ తాగుతున్న సుధకి చటుక్కున, పొయ్యి మీద పెట్టిన ఇడ్లీ పాత్ర గుర్తొచ్చింది. ఇప్పటికే కట్టెయ్యండి మొర్రో అని పెట్టిన పొలి కేక, తొలి కేకని చేసిన అశ్రధ్ధ గుర్తొచ్చి ప్రకృతారాధనని పక్కన పెట్టి, వంటింట్లోకి పరిగెట్టింది. కట్టేసి, విష్ణు సహస్రనామం ఆన్ చేసి, మొబైల్ లో లోడ్ చేసిన గణేశ స్తోత్రం, ఖడ్గమాల, హనుమాన్ చాలీసా అన్నీ ఒక్కోటీ చదువుకుంటూ... మధ్య మధ్యలో సతీష్ లేచాడా లేదా ? అని ఓరకంట గమనిస్తోంది. రాత్రి జరిగిన యుధ్ధం తాలూకు విషాద ఛాయలు ఇంకా మదిలో మెదులుతున్నాయి. ఈ మధ్య వారంలో నాలుగు రోజులు ఇదే తంతు... సుధ, సతీష్ చూడ ముచ్చటైన జంట. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనదగ్గ జంట. చదువు, అందం, సంస్కారం, తెలివితేటలు, ఉద్యోగం అన్నిటా సమవుజ్జీలు. పెళ్ళై ఏడనార్థం అయింది. అన్ని కొత్త పండుగలూ అయిపోయి, ఒక్కోటీ పాతబడడం మొదలయింది. వారిద్దరి మధ్య అన్యోన్యత బీటలు వారడం మొదలయింది. అంత దారుణమైన విషయం ఏంటి ? ’ప్రైవెసీ’... అసలు సినీ జనాలు పైరసీ భూతం అని అంటారు కానీ మనుష్యుల మధ్య అసలైన భూతం ’ప్రైవెసీ’. ఒకరి మొబైల్ ఇంకొకరు చూడకూడదు. నెట్ ఆక్సెస్ ఇంకొకరికి తెలీదు. బ్యాంక్ ఎకౌంట్ డిటైల్స్ అడగకూడదు. కొంత మేరకు ఫరవాలేదు. కానీ దానికి అంతెక్కడ ? అసలు ఉండే ఇద్దరికి, నాలుగు పడకగదుల ఇల్లు ఎందుకు ? అంటే ఒకటి గెస్ట్ కి, ఇద్దరికీ చెరోటి, వీకెండ్స్ కలిసి పడుకోడానికోటి అని అన్నారు... రాత్రి గొడవ మొదలైంది, వాట్సాప్ తో. సతీష్ ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అవుదామని వెళ్ళినప్పుడు, తన మొబైల్ కి ఒక మెసేజ్ వచ్చింది. మధు అని డిస్ప్లే అయింది. చాలా కాజ్యువల్ గా మధు ఎవరు అని అడగడం నియంత్రించుకుని, ఏమైనా మాట్లాడు అంది. ఏముంది ? అంతా బానే ఉంది. నీ డే ఎలా ఉంది ? అన్నాడు. మామూలే, మా దరిద్రుడు, అదే బాస్ రోజూ లాగే మీటింగ్ పేరుతో బుర్ర తిన్నాడు. నువ్వే చెప్పు అంది. ఏదైనా టాపిక్ చెప్పు మాట్లాడ్దాం అన్నాడు. చిర్రెత్తుకొచ్చిన సుధ, ఇదేమైనా డిబేట్ కాంపిటీషనా ? టాపిక్ చెప్పడానికి ? మాట్లాడాలని ఉంటే, మాటాలే కరువా ? అసలు మనసుండాలి కానీ అంటూ విస విసా వెళ్ళిపోయింది. వై ఫై ఆన్ చేసి, క్యాండీ క్రష్ ఆడుకుంటోంది లాప్ టాప్ లో. తనూ ఏదో టోరెంట్ డౌన్లోడ్ చేసుకుని, మూవీ చూస్తున్నాడు. ఈ మధ్య ఇంట్లో ఇద్దరూ ఉన్నా, ఎవ్వరూ లేరేమో అన్నట్టుంది. వంటేంటి ? అన్నాడు సతీష్. ఏం ? ఎప్పుడూ నేనే ఎందుకు ? క్రూషియల్ రౌండ్ లో ఉన్నాను. నువ్వే చెయ్ అన్నది సుధ. నేనూ మంచి సస్పెన్స్ మూవీ చూస్తున్నా..! ఒక పని చెయ్ - పిజ్జా హట్ నుండి ఆర్డర్ చెయ్ అన్నాడు. మొన్నా అదే. ఐ హేట్ ఇట్. ఇంకేదైనా...! అంది. అయితే నేను అన్నం పడేస్తా... ఏదైనా వేపుడు చెయ్ అన్నాడు. అబ ఛ... ఈసీది నువ్వు, తరిగి చెయ్యాల్సింది నేనా ? నాకాకలి లేదు. గుడ్ నైట్ అంది. చేసేదేం లేక, చాకోస్ తిని పడుకున్నాడు. అసలు మన మధ్య ఏంటి లాకింగ్ అని ఆలోచిస్తున్న సతీష్ కి, ప్రైవెసీ అన్న అనుమానమొచ్చి, తన మొబైల్ ని కావాలనే ఆరోజు ఇంట్లో వదిలి వెళ్ళాడు. అదీ కీ పాడ్ అన్ లాక్ చేసి. అర్జెంట్ మీటింగ్ అని, ఏమీ తినకుండా వెళ్ళిన సతీష్ ని చూస్తూ, తనేమైనా అతిగా ప్రవర్తిస్తున్నానా ? అని ఆలోచనలో పడింది. ఇంతలో సతీష్ బాస్ నుండి వచ్చిన కాల్ తో ఈ లోకంలోకొచ్చిన సుధ, ఆన్సర్ చేసిన తరువాత కీ పాడ్ అన్ లాక్ చేసి ఉండడం చూసి, అప్రయత్నంగా, తప్పని తెలిసినా, మెసేజెస్ లోకెళ్ళింది. మధు అని డిస్ప్లే అయిన పేరు మధుసుధన్ అని సతీష్ కొలీగ్ అని తెలుసుకుని, తన మీద తనకే కోపమొచ్చింది. అసలు ఎందుకు ఇంత అనుమానం ? ఇద్దరు చేసేది సాఫ్ట్ వేర్ ఉద్యోగాలే. ఇద్దరి జీవితాలూ ఫాస్టే. కానీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేముంది. ఇలా కాదని, తనే ఒక అడుగు ముందేద్దామని నిర్ణయించుకున్న సుధ, ఆ రోజు సాయంత్రం, ఎల్.టి.సి. ఫార్మ్ ని నింపి, లొకేషన్ పేరు నింపకుండా, సతీష్ ని అడిగి నింపుదామని ఇంటికి తెచ్చింది. ఆరోజు సతీష్ కూడా త్వరగా ఇంటికొచ్చేసాడు. ఎప్పుడూ ఇంటికి రాగానే నైట్ డ్రెస్ అనే ’దీక్షా వస్త్రాల్లోకి’ మారిపోయే సుధ, ఆరోజు, సతీష్ కి ఇష్టమైన లెమన్ ఎల్లో కాటన్ శారీ కట్టుకుని వంట చేస్తోంది. ఇవాళేమైందబ్బా ? అనుకుంటూ వంటింట్లోకొచ్చి, తను అడగకుండానే పుదీనా వలవడంలో సాయం చేస్తున్నాడు. ఇద్దరికీ ఒక ఫీల్ గుడ్ ఫీలింగ్ మొదలయింది. భోజనాలయ్యే వరకూ ముక్తసరిగా మాట్లాడుకున్నారు. కానీ విరుపుల్లేవు. ఇంతలో టి.వి ఆన్ చేయబోతున్న సతీష్ ని సమీపించి, టూర్ పేపర్ ని అందించింది. చదివిన సతీష్, నీ ఇష్టం అన్నాడు. కాదు, మన ఇష్టం... అందుకే, ఇంటికి తెచ్చాను. చెప్పు, నీ కలల ప్రపంచం అన్నది. ఇల్లు అన్నాడు సతీష్. పజిల్డ్ గా చూసిన సుధ నవ్వింది. ఆ పున్నమి వెన్నెల్లో ఇద్దరూ పెరట్లో కూర్చుని చాలా సేపు, మాయా బజార్ సినిమా నించి, మంత్రుల బ్లాక్ మనీ దాకా, ఎన్ని మాట్లాడుకున్నారో ? అర్థరాత్రి ఒకటిన్నరకి ఇద్దరికీ సమయం గుర్తొచ్చింది. నవ్వుకుని ఆనందంగా పడుకున్నారు. తరువాత రోజు ఉదయాన్నే ఆఫీస్ కి వెళ్తూనే ఒక వారం సెలవు పెట్టింది. సతీష్ కూడా అదే పని చేసాడు. ఇంటికొచ్చిందే తడవుగా కబుర్లలో పడ్డారు. ఇద్దరికీ ఒక విషయం బాగా అర్థం అయింది. వారి మధ్య దూరం పెంచుతోంది, గ్యాడ్జెట్స్, టెక్నాలజీ, అహం. నా పర్సనల్ లైఫ్ అనే ఇగో, నేనే ముందెందుకు మాట్లాడాలన్న ఇగో... టెక్నాలజీ వలలో పడి, రెండు పర్సనల్ లైఫ్ ల అస్తిత్వాన్ని నిలుపుకోవాలనే అవస్థలో పడి, ఇద్దరు కలిసి ఒక పర్సనల్ లైఫ్ ని నిర్మించుకోవాలన్న విషయాన్ని విస్మరిస్తున్నారని ఇద్దరికీ అర్థమయింది. ఇద్దరు మాట్లాడుకోవాలంటే కావాల్సింది టాపిక్ కాదు, కలిసి సమయం గడపాలన్న ఆసక్తి, మాట్లాడాలన్న కోరిక. ఇద్దరు కలిసి ఒక వంట చేయడంలో ఉన్న ఆనందం, ఇద్దరు కలిసి ఒక నచ్చిన సినిమా చూడటంలో, నచ్చిన సంగీతం వినడంలో ఉన్న ఆనందం, ఇద్దరు కలిసి వెన్నెల్లో కబుర్లు చెప్పుకోవడంలో ఉన్న ఆనందం... ఏ ప్లెజర్ ట్రిప్పులూ, ఇంటర్నెట్టులూ ఇవ్వలేవని అర్థం చేసుకున్నారు. ఇగోలు పక్కన పెట్టారు.

No comments:

Post a Comment

Pages