'కిక్' ఖరీదు - అచ్చంగా తెలుగు

ప్రియమైన పాఠకులకు మా ‘అచ్చంగా తెలుగు’ కుటుంబం తరఫున అభివందనం ! స్వాగతం ! ఈ నవంబర్ సంచికలోని అంశాల పరిచయానికి ముందు... ఎప్పటిలాగే చిన్న సందేశం. నెల రోజుల క్రితం లుధియానా లో ఒక ప్రమాదం జరిగింది. ప్రమాదాలకు మనమేం చేస్తామండి, అనుకోకండి. కాస్తంత ఓపిక పట్టి చదవండి... ఓ కుర్రాడు తన అక్కయ్య వచ్చిన సందర్భంగా పిజ్జా తెప్పించుకుని, కుటుంబ సభ్యులతో, సరదాగా కబుర్లు చెబుతూ తినసాగాడు. ఇంతలో అతని ముగ్గురు స్నేహితులు వచ్చి, అలా తిరిగి వద్దామంటూ, అతన్ని బలవంతంగా లాక్కు పోయారు. వాళ్ళ వద్ద ఉంది అత్యంత ఖరీదైన BMW కార్. చేతిలో బీర్ టిన్స్, లేక విదేశీ మద్యం సీసాలు తాగుతూ డ్రైవ్ చెయ్యటం ఇక్కడ అలవాటే ! ఇక ‘కిక్’ కోసం ప్రాణాలకు తెగించడం కూడా అలవాటే ! అలా కిక్ కోసం కార్ ను 200 km వేగంతో నడుపుతూ, అదుపు తప్పి, ముందుగా ఒక చెట్టును గుద్ది, దానిలోంచి కార్ చీల్చుకు వెళ్లి, మరొక చెట్టును గుద్దేశారు. ఆ గుద్దడం వాడి ఎలా ఉందంటే... అంత పెద్ద కార్ మధ్యలోంచి చీలి రెండు ముక్కలైంది. అందులోని నలుగురు కుర్రాళ్ళు మరణించారు. వారం క్రితం చండీగర్ లో మరొక సంఘటన జరిగింది. ఒక 15 ఏళ్ళ వయసున్న కుర్రాడు, ఉదయం 8 గం. లకు, తల్లిదండ్రులకు తెలియకుండా బైక్ తీసి, పక్కింట్లో ఉండే 13 ఏళ్ళ కుర్రాడినీ, 11 ఏళ్ళ కుర్రాడినీ ఎక్కించుకుని, ‘జాయ్ రైడ్’ కు వెళ్ళాడు. అమిత వేగంతో అదుపు తప్పి, డివైడర్ పై నుంచి, చెట్టును గుద్ది, అక్కడికక్కడే ఇద్దరు మరణించగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పిజ్జా తింటున్న పిల్లవాడి తల్లిదండ్రుల బాధ అంతా ఇంతా కాదు. ఇక అన్నెంపున్నెం ఎరుగని 11,13 ఏళ్ళ పిల్లల్ని ‘జాయ్ రైడ్ ‘ పేరుతో తీసుకెళ్ళి మృత్యువు పాలు చేసినప్పుడు ఆ తల్లిదండ్రులు అనుభవించే దుఃఖం చెప్పనలవి కాదు ! హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లో కూడా ఈ ‘స్పీడ్ ‘ ఇచ్చే థ్రిల్ కోసం బైక్, కార్ రేసింగ్ లు చేసి, రక్తపుటేరులు పారిన సంగతి మనకు విదితమే ! ఇదీ ‘కిక్’ , ‘జాయ్ రైడ్’ ఖరీదు... కొన్ని నిండు ప్రాణాలు. ఒక బిడ్డను కనేందుకు తన ప్రాణం పణంగా పెడుతుంది తల్లి. తన సత్తువనంతా ధారపోసి, ఆ బిడ్డ అచ్చటా ముచ్చటా తీర్చి, విద్యాబుద్ధులు చెప్పించేందుకు ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కుంటాడు తండ్రి. ఇంత కష్టపడే మనం, ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే... పిల్లల స్నేహితుల సర్కిల్ , వారి మనస్తత్వం గమనించడం కూడా ఇప్పుడు ఆవశ్యకం ! ధనవంతులైనా బిడ్డలకు ఎక్కువ డబ్బు, విలాసాలు ఇచ్చి చెడగొడితే... మీ గారం మరికొన్ని నిండు ప్రాణాలు తీసే స్థాయికి వారిని దిగజార్చవచ్చు. అందుకే పిల్లల్ని అప్రమత్తంగా గమనిస్తూ, వీలున్నంత వరకూ ఇటువంటి స్నేహితులను నమ్మి బయటకు పంపడాన్ని నిషేధించండి. ఆపండి !  కంటికి రెప్పలా పిల్లల్ని కాచే మనం, మరిన్ని జాగ్రత్తలు వహించక తప్పదేమో ! ఇక ఎప్పటిలానే ఈ నవంబర్ సంచిక నిత్యనూతనంగా ముస్తాబై మీ ముందుకు వచ్చేసింది ! శింజారవం లో ఎన్నో నృత్యరూపకాలు రాసిన గరిమెళ్ళ గోపాలకృష్ణ గారి పరిచయం, వంశీ గారి వెన్నెల్లో లాంచి ప్రయాణం 2 వ భాగం, బాలజ్యోతి, ఆంధ్రజ్యోతి లకు అనేక మంచి చిత్రాలు అందించిన ఆర్టిస్ట్ బాబు గారి పరిచయం, ఉయ్యలావాడ సూర్యచంద్రులు – నరసింహా రెడ్డి, వెంగళ రెడ్డి గురించి చెరుకు రామమోహనరావు గారి పరిచయం, వేణువుతో ఆబాలగోపాలాన్ని సమ్మోహన పరిచే నేటి కృష్ణుడు పండిట్ హరిప్రసాద్ చౌరాసియా గారిని గురించిన వివరం, సుప్రసిద్ద హాస్య నటుడు గుండు హన్మంతరావు  గారి తో ప్రత్యేక ముఖాముఖి ... వీటిలో కొన్ని. చక్కటి పంచవన్నెల ఐదు సీరియల్స్, కధలు, కవితలు, సాహితీ అంశాలు, కార్టూన్స్... మిమ్మల్ని అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మీ అమూల్యమైన అభిప్రాయాలతో, ఎప్పటిలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ...
‘అచ్చంగా తెలుగు ‘ తరఫున
భావరాజు పద్మిని.

No comments:

Post a Comment

Pages