చోటు తప్పిన పువ్వు
- డా. వారణాసి రామబ్రహ్మం
ఈ రోజుల్లో రచించడమే వృత్తిగా కల రచయితలు తక్కువ. ఎక్కువమందికి సాహితీ సృష్టి ఒక ప్రవృత్తి మాత్రమె. వృత్తి కాదు. ఆ రచనలవల్ల వారికి పైసా అదాయము రాదు. నాకు కూడా రచించడం ప్రవృత్తి మాత్రమే. నేను రచించిన కవితలు, కథలు సకృత్తుగా పత్రికలలో ప్రచురించ బడ్డాయి. నేనూ ఒక కవిని, కథా రచయితని అని  అనుకుంటూంటాను. నాలాంటి వాళ్ళం కథలు, నవలలు పోటీలలో పాల్గొనడానికి ఇష్టపడుతూంటాము. అదృష్టం ఉంటే అతి తక్కువ సమయంలో పేరుకి పేరు, డబ్బుకి డబ్బు వస్తుందని ఆశ.
ఒక ప్రముఖ వారపత్రిక కథల పోటీ ప్రకటించింది. దానికి పంపడానికి మంచి కథ రాయాలని సంకల్పించుకున్నాను. కథ రాయడం మొదలు పెట్టాను. నేను ముందుగా కథ మొదలు ఆలోచిస్తాను. రాయడం మొదలు పెట్టాక, కొన్నాళ్ళు మానసికంగా మథనపడ్డాక కథ నిశ్చిత రూపం మనసులో ఏర్పడుతుంది. అటుపిమ్మట కథ రాస్తాను. కథ పూర్తయ్యాక పేరు పెడతాను.
కానీ ఈ సారి కథారూపం మీద, కథనం మీద నాకు ఏర్పడ్డ పట్టువల్ల  ఆత్మవిశ్వాసంతో కథకి "ప్రథమ సమాగమం" అని పేరు ముందే పెట్టేసి కథారచన ఆరంభించాను.
*                    *                      *
విశాల్ ఎందుకో దిగులుగా ఉన్నాడు. నిరాశ, నిస్పృహ అతని మనసు నిండా నిండి ఉన్నాయి. హృదయమంతా శూన్యంగా ఉంది. ఏం చెయ్యాలో తెలియక విచారగ్రస్తుడై ఉన్నాడు.
విశాల్ ఆధునిక యువకుడు. సుఖసంతోషాలతో జీవితం గడపాలని కలలు కంటున్నవాడు. ఎందుకో విధి అతనిపై కోపించింది. అంచేతనే అతని జీవితములో ఇంత పెద్ద దెబ్బ తగిలింది.  ఆ దెబ్బ ఏమిటి? దాని పర్యవసానం ఏమిటి?
విశాల్ సాఫ్ట్ వేర్ నిపుణుడు. ఒక పేరున్న కంప్యూటర్ సంస్థలో పెద్ద జీతంతో పనిచేస్తున్నాడు. అందరు యువకుల వలె జీవితం గురించి సుందర స్వప్నాలు కంటున్నాడు. పెళ్లి చేసి కోవాలని, శృంగారాన్ని ఆనందించాలని మనసు ఉరకలు వేస్తోంది. సంబధాలు కూడా వస్తున్నాయి.
ఒక పెళ్ళిలో విశాల్ అమ్మగారు వినమ్రని చూసారు. వినమ్ర లలితమైన శరీరం, కళైన ముఖం, చారడేసి కళ్ళు, వయసు తెచ్చిన అందాలు, యవ్వనం ఇచ్చిన లావణ్యం, పేరుకి తగ్గట్టు నమ్రతా స్వభావం విశాల్ అమ్మగారిని కట్టిపడేసాయి. వినంరని కోడలుగా చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. మధ్యవర్తి ద్వారా వినమ్ర తల్లిదండ్రుల దగ్గర కదిపించారు. వాళ్ళు కూడా విశాల్ సంగతి విని ఏంటో ఉత్సాహంగా ఈ ప్రస్తావని అంగీకరించారు. ఒక శుభ ముహూర్తంలో విశాల్-వినమ్రల పెళ్లి జరిగిపోయింది.
అది నూతన దంపతుల తొలి రాత్రి. అందరు యువతీ యువకులూ ఉవ్విళ్ళూరుతూ ఎదురుచూసే రస రాత్రి. అగరొత్తుల సువాసనల మధ్య, మత్తెక్కిస్తూ అలంకరించబడిన ఉన్న పూల పాన్పు పై కూర్చుని వినమ్ర రాకకై ఎదురుచూస్తున్నాడు విశాల్. కొంతసేపటికి ముత్తైదువలు వినమ్రని గదిలోకి తీసుకు వచ్చి తతంగం పూర్తిచేసి, దంపతులకు ఏకాంతం కల్పిస్తూ అందరూ వెళ్ళిపోయారు.
తెల్లని వలువలతో అపర రతీదెవిలా ఉంది వినమ్ర. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. విశాల్ హృదయం కోటి రస వీణలు మ్రోగించింది. వినమ్ర మాత్రం చూపులు మరల్చుకుని వెంటనే ముఖాన్ని దించుకుని నిలబడింది.
ఆమె ముఖంలో ఏ భావమూ లేదు. విశాల్ నెమ్మదిగా వినమ్ర దగ్గరకు వెళ్ళాడు. ప్రీతితో ఆమెను ఆలింగనం చేసుకునేందుకు చేతులు సాచి మరింత వద్దకు వెళ్ళాడు. కాని వినమ్ర చూపుతోనే అతనిని వారించింది. తప్పించుకొని వెళ్లి కుర్చీలో కూర్చుంది. ఆశ్చర్య చకితుడై విశాల్ వెళ్లి ఆమె ప్రక్క కుర్చీలో కూర్చున్నాడు. పున్నమి వెన్నెల మనోహరంగా ఉంది. విశాల్ మనసు కోరికతో నిండి పోయింది. వినమ్రను తాకడానికి మళ్ళీ యత్నించాడు.
అతని హస్త స్పర్శ నుంచి తప్పించుకుంటూ వినమ్ర అంది.
"దయచేసి నన్ను ముట్టుకోకండి"
"ఎందుకని?"
ఈ పెళ్లి నా ఇష్టప్రకారం జరగలేదు. నా మనసుని మా బావకి అర్పించాను.
శరాఘాతాల వంటి ఆమె మాటలు విశాల్ హృదయాన్ని తుత్తునియలు చేసాయి. స్తబ్ధుడయాడు  రస శిఖరం నుంచి వేదనాభరితమైన లోయలోనికి నెట్టబడినట్టినిపించింది.
వినమ్ర చెప్పడం కొనసాగించింది.
"నేను మా బావ మనసులు పరస్పరం ఇచ్చి పుచ్చుకున్నాము."
"అటువంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసికున్నావు?"  కోపంగా, వేదనతో  అడిగాడు విశాల్.
"మా నాన్నగారి మనసు నొప్పించలేక."
తొలి కలయిక ఇచ్చే మాధుర్యాన్ని, ఆనందాన్ని రుచి చూచి జుర్రుకోవలసిన సమయంలో ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని విశాల్ కలలో కూడా అనుకోలేదు.
శ్రావ్య సంగీతాన్ని ఆస్వాదించాల్సిన వేళ అపశ్రుతులు చోటుచేసికున్నాయి."అంత ఇష్టం లేనిదానివి నన్నెందుకు పెళ్లాడావు?"
"చెప్పాను కదా, మా నాన్న గారి మనసు నొప్పించలేక."
"అఘోరించలేక పోయావు. బుద్ధి హీనంగా ప్రవర్తించి నా బ్రతుకు నాశనం చెసావు." నిష్ఠూరముగా అన్నాడు.
తీగ తెగిన వీణ నుంచి వెలువడిన స్వనంలా వినిపించినది విశాల్ స్వరం. ***********
ఇంతవరకు రాశాక కథ ముందికి సాగలేదు. ఎంత ప్రయత్నించినా ఒక్క అక్షరాన్ని కూడా కాగిరం మీద పెట్టలేకపోయాను. కథ గురించిన అన్ని ఆలోచనలు హఠాత్తుగా నిండుకున్నాయి. ఇంత వరకు
వెన్నెల్లో ఆడపిల్లలా నడయాడిన భావాలు మాయమై పోయాయి. మనసు నిండా శూన్యం నిండింది. సగం రాయబడ్డ కథ రోజూ నన్ను వెక్కిరిస్తూనే ఉంది. అలా కొన్ని రోజులు గడిచాయి.
ఒక రోజు సగం రాసిన ఆ కథని తీసికొని మళ్ళీ చదవడం మొదలు పెట్టాను. సగం చదివాక ఎక్కడైతే  నేను ఇంక రాయలేక కథని ఆపేశానో అక్కడి నుంచి వేరొక దస్తూరీ తో కథ కొనసాగించ బడింది. ఆశ్చర్యపోతూ చదవసాగాను. *   **      **
"మా నాన్నగారంటే నాకు చాలా ఇష్టం. ఆయనకి మీ సంబంధం బాగా నచ్చింది. ఆయన ఇష్టం తెలిసాక దానికి విరుద్ధంగా నడవలేక పోయాను."
"ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నావు?"
"మనసు కలవని శరీరాల కలయిక చెఱకుపిప్పిలా రసహీనంగా ఉంటుంది కాబట్టి.
కొంచెం ఆగి మళ్ళీ చెప్పింది వినమ్ర.
"మీరు నన్ను తిట్టండి, కొట్టండి, కోయండి, మీ ఇష్టం. నేనేమీ అనను. మౌనంగా భరిస్తాను. కాని నా నిర్ణయాన్ని మాత్రం మార్చుకోను. మీకు తెలుసు బలాత్కారంగా స్త్రీని అనుభవించడం సంస్కారం కాదని."
"నువ్వు మాత్రం ఇప్పుడు ఏమి సంస్కారము వెలగ బెట్టావు?" కోపంగా అన్నాడు విశాల్.
సంస్కారం చూబిస్తున్నాను కనకనే ఏదీ దాచకుండా అంతా చెప్పేసాను."
"ఈ మాత్రం సంస్కారం పెళ్ళికి ముందు ఏమయిపోయింది? కాకెత్తుకు పోయిందా? ముందే చూపించి ఉంటే పెళ్ళే జరిగేది కాదు కదా?"
"అందుకే చూపించలేదు. మా నాన్నగారు అభిమానధనులు. మా బావకి నన్నివ్వడం ఆయనకిష్టం లేదు. నేను అవివాహితగా ఉండిపోతే తట్టుకోలేరు. ఇప్పటికే రెండుసార్లు హార్ట్ ఎటాక్ వచ్చింది. ఇదంతా ఆలోచించి మన పెళ్ళికి ఒప్పుకున్నాను."
"చాలా గొప్ప పని చేసావు." బాధగా అన్నాడు వేసాల్. బాణం దెబ్బ తిన్న పక్షిలా విలవిలలాడిపోయాడు. పూల పాన్పు, వెన్నెల రాత్రి విశాల్ ని జాలిగా చూసాయి. వినమ్ర ఇంకా ఇలా అంది.
"నేను మీకు భారం కాను. ఉద్యోగంలో చేరి నా కాళ్ళ మీద నేను నిలబడతాను. మీ బాధను నేను అర్ధం చేసికోగలను. కాని నిజాన్ని దాచలేను. అసహాయురాలిని. విధి ఆడుతున్న చదరంగంలో పావులం అయ్యాము మనము."
ఆమె వేదాంతం విశాల్ కి చిరాకు తెప్పించింది. నన్ను మనసారా కోరుకోని స్త్రీని భార్య అయినా ముట్టుకోను నేను. కాని నేను వివాహ బంధాన్ని గౌరవిస్తాను నేను. మనం ఇప్పటినుంచీ ఇతరుల దృష్టిలో మాత్రమే భార్యాభర్తలం' అన్నాడు.
"అలాగే. శారీరిక సుఖం అందించడం తప్ప ఇతరత్రా నేను మీకు భార్యనే. అన్ని గృహిణీ ధర్మములను శ్రద్ధగా నిర్వహిస్తాను."
"నువ్వు కోరుకున్నట్టు ఉద్యోగంలో చేరవచ్చు."
"థాంక్స్" ఎంతో  సంతోషంగా అంది  వినమ్ర.
**         ***    **
చదవడం పూర్తి అయింది. కాని ఎవరు రాసారు ఇదంతా? దస్తూరీ పరిచయము అయినదే.
"కథ చదవడం పూర్తయిండా?" అన్న ప్రశ్నకు వెనుదిరిగి చూసాను.నా భార్య చిత్ర. నవ్వుతూ నిలుచుంది. అవును!! ఆ దస్తూరీ చిత్రది.
"స్త్రీల మనసు కోమలంగా ఉంటుంది. రచయితా ఆ మనసులను మృదువుగా దర్శించాలి. చిత్రించాలి. స్త్రీ హృదయం స్త్రీకే అర్ధం అవుతుంది. విడాకులిప్పించి కథ పూర్తిచేద్దామనుకున్నారు కదూ?"
"అవును" అన్నాను ఆశ్చర్యపోతూ!
"విడాకులు సమస్యలను  పరిష్కరించ లేవు. విడాకులు అభిలషనీయమూ కాదు. దాంపత్యం అంటే ఒక్క శరీరాల కలయిక మాత్రమే కాదు. వైవాహిక జీవితంలో తనువుల సంగమం ఒక అంగం మాత్రమే. శరీరాలు కలుపుకోక పోయినా సన్నిహితులై స్నేహితులుగా దంపతులు జీవించవచ్చు. అదీ వైవాహిక జీవనమే"
విస్మయుడనయ్యాను నేను. చిత్ర మాటలు  విన్న నాకు మూడు నెలల క్రితం జరిగిన సంఘటన మనసులో మెదిలింది.
అది మా తొలిరేయి. నన్ను ప్రీతితో తాకుతూ చిత్ర తీయని కంఠంతో ఇలా అంది.
"నాకు యూనివెర్సిటీ లో పి. జి. చెయ్యాలని ఉంది. నేను నెలతప్పి ఎత్తు పొట్టతో యూనివెర్శిటీకి వెళ్ళడానికి సిగ్గుగా ఉంటుంది. కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటిస్తే సహజానందాన్ని పొందలేము. అంచేత మనిన్ద్దరం కొంతకాలం పాటు కలుసుకోవద్దు. బ్రహ్మచర్యం పాటిద్దాము."
కొత్త పెళ్లి కూతురు, నవ వధువు అయిన చిత్ర తీయని కులుకులకు, తీపి పలుకులకు కరిగి పోయానో, లేక ప్రియమైన భార్య కోరికను కాదనలేక పోయానో, ఇప్పుడే కాదని చిన్నబుచ్చడం ఎందుకు, నెమ్మదిగా చూసుకుందాం అనుకున్నానో తెలియదు. సరేనన్నాను.
ఇప్పుడు ఈ కథ పూర్తీ చేయ్య్డంలో సహకరించి చిత్ర నాకేమైనా సందేశాన్నిచ్చిందా?
స్త్రీ హృదయం లోతైనది. పరిపక్వ చిత్తులే నారీ హృదయ దర్శనం చేయలేరు. నేనెంత? ఒక కథ ప్రచురింపబడితే పది కథలు  తిరుగు టపాలో వెనుకకు తిప్పికొట్ట బడే ఒక ఛోటా రచయితని. నాకేం తెలుస్తుంది?
నేను ఆలోచనలలో మునిగి పోయాను. బుర్ర వేడెక్కి పోయింది. వంటింట్లోకి వెడుతూ అంది చిత్ర,
"కథ పేరు మార్చాను చూసారా?" అని.
అప్పుడు చూసాను. కథ పేరు,
"చోటు తప్పిన పువ్వు" అని ఉంది.
(కథానిక)  -- సంస్కృత మూలం -- "అనాఘ్రాతమపి ఆఘ్రాతమ్ పుష్పమ్" (సంభాషణ సందేశః, మార్చి, 1999) మరియు తెనుగు సేత:  డా. వారణాసి రామబ్రహ్మం 

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top