సంసార రధం సాఫీగా సాగాలంటే...
-      పోడూరి శ్రీనివాస రావు

సంసారం ఒడిదుడుకులు లేకుండా ,సాఫీగా సాగాలంటే భార్యా భార్తలిరువురి మధ్యా అవగాహన ఎంతో అవసరం. ప్రేమాభిమానాలు ,ఒకరంటే ఒకరికి గౌరవం కలిగి ఉండటం ఎంతో ముఖ్యం. భార్యా భర్తల సంబంధాన్ని ఎన్నో సామెతల్లో  చెప్పుకొచ్చారు. సంసారం అనే బండికి భార్యా భర్త లిరువురు రెండు చక్రాలాంటి వారన్నారు. మొగుడు పెళ్ళాలిద్దరూ బండిని సక్రమం గా నడిపించాలి గాని, ఒకరు ఎండలోకి ఒకరు నీడలోకి లాగకూడదన్నారు. పూర్వం జరిగే పెళ్లిళ్లు అన్నీ కూడా ఎక్కువగా పెద్దలు కుదిర్చిన వివాహాలే ఉండేవి .ఇప్పుడు ప్రస్తుత కాలం లో కొంత వరకు అలాగే ఉంటున్నా కాలనుగుణ్యమైన మార్పులవల్ల,చాలా వరకు ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి.ఏమైనా అభిప్రాయభేదాలు వచ్చి భార్యా భర్తల మధ్య కీచులాటలు పెరిగి ,విడిపోయే పరిస్థితి వస్తే ,ఒక  వేళ ఆ వివాహం పెద్దలు కుదిర్చినది అయితే తప్పు పెద్దలదే అయినట్లు నేరారోపణ చేస్తారు . “చూశారా ! ఎంచక్కా రమేష్ ,రజని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అందుకనే వాళ్ళ కాపురం హాయి గా ఉంది .మీరు చేసారు .. మామయ్య కూతురంటూ నాకో తద్దినాన్ని అంటగట్టారు, ఓ ముద్దు మురిపెం ఏమీ లేదు. ఒట్టి పల్లెటూరి భైతు లాగ అంటూ “ తప్పంతా ఆ వివాహం చేసిన పెద్దలదే అంటారు. అదే ప్రేమించి పెళ్లి చేసుకున్న పెళ్లి విఫలమైతే ఛీ ఛీ ప్రేమా ప్రేమా అంటూ నేరకపోయి నీ ఉచ్చు లో పడిపోయాను. హాయిగా మా అమ్మా నాన్నలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటే ,వాళ్ళని ఎదిరించవలసిన పని ఉండకపోవును .ఇప్పుడు నీతో ఈ చావు రాకపోను. హాయిగా పెద్ద వాళ్ళు కుదిర్చిన పెళ్లి  చేసుకొని,మా వర్ధనం శర్మ ఎంత ఆనందంగా కాపురం చేసుకుంటున్నారో “ అంటూ తప్పంతా ఎదుటి వాళ్ళదే అయినట్లు ప్రవర్తిస్తారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా ,పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నా, ఒకళ్ళ నొకళ్ళు అర్ధం చేసుకున్నపుడు ఒకళ్ళ మనసు ఒకళ్ళు తెలుసుకున్నపుడు,  ఒకళ్ళ అభిప్రాయాల్ని ఒకళ్ళు  గౌరవించినపుడు వాళ్ళ జీవితాల్లో ఏ పొరపొచ్చాలు ఉండవు. అభిప్రాయ భేదాలు రావు. ప్రస్తుత పరిస్థితులలో ఎక్కువ భాగం ప్రేమ వివాహాలు జరిగిన సందర్భాలలో చాలా వరకు అర్ధం చేసుకోని పరిస్థితులు ఏర్పడి ,వివాహ వ్యవస్థ విచ్చిన్నమవడానికి కారణాలు అవుతున్నాయి . ఈ విధంగా సంసారాలు ఛిద్రమౌతున్న  కాపరాల వివరాల్లోకి వెళితే ప్రస్పుటంగా కనిపించే కారణాలు... 1)అటు అమ్మాయి,ఇటు అబ్బాయి సమానంగా చదువుకోవటం-కొన్ని సందర్భాలలో అమ్మాయి అబ్బాయికన్నా ఎక్కువ చదువుకోవటం, లేకపోతే  అబ్బాయికన్నా అమ్మాయి ఎక్కువ సంపాదనా పరురాలవటం –దాంతో తన కాళ్ళ మీద తను నిలబడగలను, భర్త సంపాదన పై ఆధారపడవలసిన అవసరం లేదన్న ఇగో! ఆ ‘ఇగో’ వల్ల భర్త మీద గౌరవం, ప్రేమ, అభిమానం, అనురాగం, ఇటువంటి సెంటిమెంట్లు ఏమి లేక, వివాహం రద్దు చేసుకోని ,విడాకులకు సిద్దం అవుతుంది ,నేటి యువతి. 2)కుల వ్యవస్థ అమ్మాయి ,అబ్బాయి వేరు వేరు కులాలకు చెందిన వారైతే ,కొంతవరకు వారి మద్యలో విభేదాలు పొడచూపుతాయి(ప్రేమ వేడి తగ్గిపోయాక)మరి కొంత కారణం –ఇంకా కుల వ్యవస్థను పట్టుకొని ఉండే తల్లి దండ్రుల తీరు, ఈ కారణాలవల్ల భార్యా భర్తల మధ్య కుల వ్యవస్థ ప్రాతిపదికను విభేదాలు పొడచూపటం ,లేక వాళ్ళ తల్లి తండ్రుల కారణంగానైనా సంసారం చెడిపోవటం, ఫలితంగా విడాకులకు దారితీయటం . 3) ప్రేమ పేరు తో చిన్న తనం లోనే వివాహం జరిగిన తరువాత వారిలో తగిన మానసిక పరిపక్వత లేక ,చిన్న విషయాలను కూడా సీరియస్ గా తీసుకొని,బలవంతంగా  జీవితాల్ని ముగించుకోవటం, ఆత్మహత్యలకు పాల్పడటం ఈ మధ్య పేపర్లలో తరచుగా చూస్తూనే ఉన్నాము .ఎన్నో విషయాలలో భార్యను కడతేర్చిన భర్త, ప్రియుని సాయంతో భర్తను తుదముట్టించిన భార్య ఇలా ఎన్నో వార్తలు .అక్రమ సంబంధాలో కారణం, ఇలాంటి పరిస్థితులకు కాని ఇలా జరగటం వల్ల ఈ పాపం ఎరుగని వాళ్ళ పిల్లలు అనాధలుగా మిగిలిపోతారన్న ఆలోచన ఆత్మహత్యలు లేదా హత్యలకు పాల్పడే భార్యా భర్తలలో ఏ కోశానాఉండటంలేదు .అటువంటి ఆలోచన ఏ మాత్రం ఉన్నా, పిల్లలు అనాధలుగా మిగిలిపోతారన్నఆలోచన ఏమైనా వాళ్ళ మదిలో మెదిలితే, తమ సంసారం విచ్చిన్నమవుతోందన్న ఆలోచన ఉంటే, తమ జీవితాల్ని అంతం చేసుకొనే ఆలోచనే చేయరు .కొందరు తల్లి గాని ,తండ్రి గాని ,వారు చావటం అటుంచి ఇటు పసిమొగ్గల్ని కడతెరుస్తున్నారు. ఎంత దారుణమైన ఆలోచనో కదా ! తల్లి మాతృ మూర్తి అన్నారు .భూదేవి కన్నా ఓరిమి గలది...అన్నారు. అమృత మూర్తి అన్నారు .అటువంటి తల్లి తన పిల్లల్ని ఎలా చంపుకోగలదు? అయినా అటువంటి వార్తలు వింటున్నాము అంటే, ఆ తల్లి ఎంతటి కర్కశ హృదయురాలో కదా: భార్యా భర్తలిరువురు విడాకులు తీసుకుందామని నిర్ణయించుకున్నపుడు, వారికి పిల్లలంటే వారి భవిత్యం ఏమిటన్నది ఆలోచించటం లేదు .ఆ పసి హృదయాలెంత గాయపడతాయో, వారే ప్రేమను కోల్పోతున్నారో ఆలోచించటం లేదు.ఆ తల్లి దండ్రులకు ,ఈ పసి వారి భవిష్యత్తుతో ఆడుకొనే అధికారం,వాళ్ళ జీవితాలను చీకటి మయం చేసే ఆలోచన ఎవరిచ్చారు? ఇక ‘ఇగో’ అన్నది కేన్సర్ కన్నా బలమైన జాడ్యం . మందుల వల్ల బాగా ముదిరిపోయిన కేన్సర్ నైనా నయం చేయవచ్చేమో కాని ,భగవంతుని కృప, అదృష్టం, ఆయుర్దాయం ఉంటే ,కాని దీన్ని నివారించలేము. ఇగో అన్నది – ఎలాంటి జాడ్యం అంటే ఏ విధమైన ప్రక్రియ కూడా దాన్ని నయం చేయలేదు. ఎలాంటి కౌన్సిలింగ్ పనికిరాదు.ఈ ఇగో అన్నది ముఖ్యం గా మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళలో నే ఎక్కువగా కనపడుతుంది.విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న అమ్మాయిలు సైతం ఏ మాత్రం సహించలేకపోయినా, భర్తను ,పిల్లలను సైతం విడిచిపెట్టి ,చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఇంచక్కా ప్లైట్ ఎక్కి ఇండియా వచ్చేస్తున్నారు. ఇది వరకు వీధి గడప దాటని భారత మహిళకు ఖండాంతరాలు దాటి భర్తవెనకాల ,అరణ్య వాసానికి రాముని వెనకాల ముఖం దించుకు వెళ్ళిన సీత లాంటి భారత మహిళకు ఈనాడీ స్వతంత్రత ,తెగింపు వచ్చాయి. దీనికి కారణం ఏమిటి అన్నది  విశ్లేషించుకోవాలి. భర్త తప్పు ఉండకుండా భార్య ఇంత తెగించి నిక్షేపం లాంటి కాపురానికి నీళ్ళోదులు కొని, భర్తతో  తెగ తెంపులు చేసుకోవడానికి సిద్దపడుతుందా! నిజంగా ఇది ఆలోచించవలసిన విషయమే! కాని  ,ఆవేశాలకుపోక ,స్థిర చిత్తంతో ఆలోచించుకొని ,భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ఒక్క క్షణం దృష్టిపెడితే సామరస్యంగా పరిష్కరించుకొనే ఎన్నో సమస్యలు ,సఖ్యత తో  చక్కబడతాయి. విడాకుల వరకు  వెళ్ళకుండా యువత ఈ విషయం లో దృష్టి సారిస్తే బాగుంటుందేమో! ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు,  సాధారణంగా భార్యా భర్తలిరువురు సమాన స్థాయిలో చదువుకున్న వాళ్ళయి ఉంటారు. కొన్ని సందర్భాలలో ప్రేమ మరీ ముదిరిపోయి ,పాకాన పడినపుడు భర్త కన్నా భార్య ఎక్కువ చదువుకున్నది కూడా అయి ఉంటుంది . చదువులో తమ యొక్క ఎక్కువ తక్కువ సమానత్వాన్ని ఒక ఆయుధంగా అవతల వాళ్ళ బలహీనతగా తీసుకోకూడదు. ఏనాడైతే దాన్ని ఎదుటి వాళ్ళ బలహీనతగా తీసుకున్నారో, ఆనాడు అవతలి వాళ్ళంటే ఒక విధమైన నూన్యతా భావం ఏర్పడుతుంది. భార్యాభర్తలిరువురి మధ్యా ఏ విధమైన రహస్యాలు ఉండకూడదు. రహస్యమన్నది కొన్నాళ్ళ పాటేరహస్యంగా ఉండగలుగుతుంది, కాని ఎల్ల కాలం దాగలేదు. అనుకోని పరిస్థితులలో, ఆ రహస్యం బట్టబయలైనపుడు, వాళ్ళ మధ్య  ఏర్పడే అగాధాలు పూడ్చలేనివి. అందువల్ల రహస్యమే లేకుంటే చిక్కన్నదే లేదు కదా. కనీసం పది ,పదిహేను రోజులకి ఒకసారైనా భార్యాభర్తలిద్దరూ, మనసుల్ని  విప్పి ,తమ తమ మనోభావాల్ని వ్యక్తపరుచుకోవటం ఎంతైనా అవసరం.  వాళ్ళిద్దరూ వీలయినప్పుడల్లా: తప్పనిసరైతే సెలవురోజుల్లో ప్రశాంతంగా జాలీగా గడపటం అలవాటు చేసుకోవాలి. కొన్ని కొన్ని ఇళ్ళలో చూస్తుంటాం!మాములుగా ఆఫీస్ ఉండే రోజుల్లో సరే సరి .ఉదయం పోతే ఎప్పుడో రాత్రికి గాని ఇల్లు చేరరు. సెలవురోజుల్లో అయితే కొందరు భర్తలు బయట స్నేహితులతో తిరగటానికి పోవటమో, లేక వాళ్ళతో పేకాటకో ,సినిమాకో ,లేక బార్ కో పోవటం చేస్తారు కాని, భార్యలతో కాస్త సమయం గడుపుదామని అనుకోరు. అదే విధంగా ఉద్యోగినులయితే-సెలవు రోజుల్లో తమ తమ గృహ కృత్యాలతో బిజీగా ఉంటారు .కొందరు మహిళలైతే మహిళా మండలి అని  క్లబ్ లని వీధుల్లోనే కాలం గడిపేస్తుంటారు. వీరికి ఇదో స్టేటస్ సింబల్. వీరికి భర్త అనే వాడోకడున్నాడని గుర్తుకు రాదు. సెలవు రోజుల్లో భార్య వంట చేస్తున్నపుడు భర్త ఆమె ఎదురుగా కూర్చొని నాలుగు కబుర్లు చెబుతూ జోకులేస్తుంటే తాము చేస్తున్న శ్రమ నంతా మర్చిపోయి రెట్టింపు ఉత్చాహంతో పనిచేయగలుగుతుంది స్త్రీ. ‘ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది... అంటూ ఇంతకు మునుపెన్నడో ఓ సినీ కవి సెలవిచ్చారు కదా ! అదే విధంగా ,పిల్లల్ని ముందేసుకు కూర్చొని ,వాళ్ళ యొక్క చదువు సంధ్యల్ని పట్టించుకుంటూ ,వాళ్ళకు పాటాలు చెప్తూ తెలియని విషయాలు బోధపరుస్తూ, కాస్త ఆ ఇంటి పట్టునే ఉంటే –ఇంక ఆ ఇల్లు స్వర్గ సీమే కదా ! పిల్లల్ని వెంటేసుకొని ,సాయంత్రాలు సరదాగా బీచ్ కో ,పార్క్ కో ,షికారుగా వెళ్ళే భార్యాభర్తలు  ఈ రోజుల్లో ఎందరున్నారు.? సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఎపుడో ఉదయమే ఆఫీసులకు వెళ్లి ఏ అర్ధరాత్రో ఇల్లు చేరతారు. పేరుకు శని,ఆది వారాలు శెలవులంటారు గాని, మిగిలిన అయిదు రోజులు, ఒక ప్రణాళిక ,టైము ,సమయం లేని పని భారంతో ఆ రెండ్రోజుల సెలవులని సక్రమంగా ఆనందిచలేకపోతున్నారు. పైగా ఏ విధమైన వ్యాయామం లేక ,సీట్లకు అంటుకొని పనిచేయటంతో విపరీతంగా ఒళ్ళు, పొట్ట, బరువు పెరగటమే కాకుండా, డిస్క్ కి సంభందించిన వ్యాధులు, దానికి తోడు ,విపరీతం అయిన కోపం, చిరాకు, ఇంక సెలవులను ఎలా ఎంజాయ్ చేయగలుగుతారు? సాధారణంగా ఎప్పుడూ రొటీన్ లైఫ్ కి అలవాటు పడిన భార్యా భర్తలకు, చదువు సంధ్యల్లో మునిగిపోయిన పిల్లలకు, ఈ సాయంత్రపు షికార్లు ,ఆదివారం శెలవు హాయిగా గడపటం ,ఒక ఆట విడుపు లాంటిది. శరీరం,మనస్సు తేలికపడి,ఓ నూతనోత్సాహం కలిగి ,మరుసటి దినం ఎంతో హుషారుగా తమ తమ కార్యక్రమాలను నిర్వర్తించగలుగుతారు. అలాగే భార్య చేసే పనులను అప్పుడప్పుడు భర్త మెచ్చుకోవటం ,భర్త చేసే  పనులను భార్య మెచ్చుకోవటం  తగిన సలహాలు ప్రోత్సహం ఇస్తూ ఉండటం కూడా భార్యా భర్త లిద్దరిని ఉత్తేజితుల్ని చేస్తుంది వీలుంటే ఒకరికి ఒకరు సర్ ప్రైజింగ్ గిఫ్ట్ లిచ్చుకుంటే వారివురు మధ్య  ఉండే దూరం క్రమక్రమంగా తగ్గుతుంది. మరి ఎక్కువ డబ్బుతో ఆ బహుమతులు కొనక్కర్లేదు. ప్రేమకు కొలమానం ధనం ఎప్పుడు కాదు. అనే విషయాన్నీ గుర్తుంచుకోవాలి. ’మందాకిని’నవల లో శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు చెప్పినట్లు కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ చాలు . మనసు ఆనందం గా ఉండటానికి. ధనం ఎల్లపుడు మనుషుల్ని ముఖ్యంగా భార్యా భర్తల మద్య ముఖ్యమైన విషయం కాకూడదు. ఎప్పుడైతే డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వటం మొదలు పెట్టామో ,మనుషులమధ్య ఆత్మీయతలు తగ్గుతాయి. దూరాలు అపోహలు ,విభేదాలు పెరుగుతాయి. సాధారణంగా ఇవన్నీ అందరికీ తెలిసినవే కాని ,మనలో చాలా మంది వాటిని ఎనలటికల్ గా తీసుకోము, ఒకరినొకరు అర్ధం చేసుకోని ,ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవించుకొని ,’ఇగో’లు తగ్గించుకొని ఒకరిపై ఒకరు ప్రేమను పెంచుకొని ,జీవితాన్ని సాఫీగా గడపటం భార్యాభర్తలందరూ తప్పక నేర్చుకోవలసిన ,ఆచరించవలసిన విషయం. అదే జరిగిన నాడు , భార్యా భర్తల సంసార రధానికి ఎటువంటి రిపేర్లు రావు. వాళ్ళ సంసారం ఇంక నందనవనమే కదా ! వారి జీవితం ఇంక స్వర్గమే కదా!! మన జీవితాల్ని స్వర్గమయం చేసుకోవటం,సంసార రధం సాఫీగా నడుపుకోవడం మన చేతుల్లోనే ,మనందరి చేతుల్లోనే..... ఉంది. .................  

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top