Thursday, October 23, 2014

thumbnail

ప్రతి ఒక్కరు చదవాల్సిన నవల - మునెమ్మ

ప్రతి ఒక్కరు చదవాల్సిన నవల - మునెమ్మ
- మొక్కపాటి పద్మావతి

మిత్రులకు వందనం ....నిన్న ఒక మంచి పుస్తకం కొని చదివాను. నవల పేరు "మునెమ్మ". రచయిత శ్రీ టి . కేశవరెడ్డి గారు. ఈ నవల 2007 లో "చతుర" మాస పత్రికలో ప్రచురితమైంది. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు దీనిని నవలగా ముద్రించారు. ప్రతి ఒక్కరూ చదవ వలసిన నవల ఇది.
రచయిత ఈ కధను ఎక్కడా అనవసర మలుపులు లేకుండా, సూటిగా, స్పష్టంగా తన మనసులో ఉన్న కధాంశాన్ని ఎంతో చక్కటి నడకతో కూర్చారు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చదువుతున్నట్టుగా  పాఠకుడు ఊపిరి బిగించి విడువకుండా చదువుతాడు. కథ లో బిగి అల్లా ఉంది.
ఈ కథ స్వాతంత్ర్యం రాకముందు కాలానికి చెందినది. ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నానంటే, కధానాయిక మునెమ్మ కు వచ్చిన సమస్య, దానికి ఆమె వెతికినా పరిష్కారం, అందుకు కావలసిన ధైర్యం , రాయలసీమ లోని ఒక పల్లెటూరు లో సాధారణ కూలి వనితా అయిన మునెమ్మ ఎలా సంపాదించుకున్నదీ తెలియచెప్పడానికే.
కథ అంతా మునేమ్మకు మరిది వరస అయిన సినబ్బ కథనం తో జరుగుతుంది. ఒక గ్రామంలో ఎద్దుల బండి బాడుగకు తిప్పి జీవనం సాగించే జయరాముడు, అతని భార్య మునెమ్మ, తల్లి సాయమ్మత్త ప్రధాన పాత్రధారులు. జయరాముడు, మునేమ్మల పెండ్లి జరిగి, కోడలు కాపురానికి వచ్చిన రోజునే పుట్టిన బొల్లి గిత్త ( మచ్చల గిత్త) అంటే జయరాముడికి ప్రాణం. ఊర్లో జరిగిన జాతరలో, భార్యా భర్తలు ఇద్దరూ తమ రెండు చేతుల్లో, ఒక చేతిమీద భాగస్వామి పేరు, మరో చేతి మిద బొల్లిగిత్త బొమ్మను పచ్చ పోదిపించుకుంటారు. గిత్త మీద అంత ప్రాణం పెట్టె జయరాముడు దాని మిద కోపంతో చచ్చేట్టు కొట్టి, కారణం కూడా చెప్పకుండా ఆ గిత్తను సంత లో అమ్మడానికి నిశ్చయించుకుంటాడు.
సంతకు పోయి మూడురోజులైనా రాని భర్త కోసం వేదన పడిన మునెమ్మ ఒక కల గంటుంది. ఆ కలను నిజం అని ఆమె తన అంతర్నేత్రం తో నమ్మి, భర్త హత్యకు కారణమైన వారిని వెతికి పట్టుకుని వారి మీద పగ తీర్చుకోవడం ఈ కధాంశం. ఇందులో మునెమ్మ, సాయమ్మత్త నోటి నుంచి రచయిత ఎన్నో ఆణిముత్యాలను మనకు అందించారు. పల్లెటూరి పిల్ల అయనప్పటికీ, తను నమ్మిన సిద్ధాంతం కోసం మైళ్ళకు మైళ్ళు నడిచి వెళ్ళడం, ఎవరి మీదా ఆధారపడకుండా తనే పని పూర్తీ చేసుకు రావడం, మాటల్లో  ఒక అధికారం, చేతల్లో ఒక నిబ్బరం, తన నిజాయితీ మిద నమ్మకం, ధైర్యం, ధర్మానికి అనుగుణంగా ఆమె వ్యవహరించిన తీరు, ఒక రహస్యాన్ని చేదించిన వైనం, మునేమ్మపై పాఠకులకు గౌరవాన్ని పెంచుతాయి. తరుగులోడి (commision agent ) మాటలు,  పూటకూళ్ళ వాళ్ళ మాటలు, నుంచి ఆమె గ్రహించిన వాస్తవం,  పశువుల వైద్యుడి కొడుకును మాటలతో దిగ్బంధనం చేసిన తీరు అద్భుతం.
పూటకూళ్ళమ్మ, సాయమ్మత్త , మునెమ్మ నోటి వెంట రచయిత చెప్పించిన మాటలు నవల చదువుతున్న వారికీ కూడా ఎంతో ధైర్యన్నిస్తాయి. నిబ్బరాన్నిస్తాయి. పేజి పేజి కి రచయిత చెప్పిన ఉపమానాలు భాష మిద ఆయనకు ఉన్న పట్టును, భాషనూ అయన వాడుకునీ తీరును తెలియచేస్తాయి.
ఉదాహరణకు. "రక్తమోడుతూ వస్తూన్న బొల్లిగిత్త మోదుగ కొమ్మలు నడిచోస్తున్నట్టు ఉంది."
"తన లో తప్పు లేకపోతె చేసే పని దాచుకోవాలనే తలపు ఎందుకొస్తుంది?" , జయరాముడు ఎవరి వైపూ చూడకుండా ఆకాశం లోకి చూస్తూ, అక్కడేదో పుస్తకం ఉన్నట్టు, అది చూసి చదువుతున్నట్టు చెప్పాడు"
ఇటువంటి వాక్యాలు ఈ నవలలో కోకొల్లలు. ఈ నవల చదివిన వారికీ కూడా భాష మీద వ్యామోహం పుట్టుకొస్తుంది. రాయలసీమ మాండలికం లో వ్రాసినా, కధ బిగి వల్ల మన సొంత యాసలోనే చదువుతున్నట్టు పాఠకుడికి అనిపిస్తుంది.
ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవవలసిన పుస్తకం ఇది. వేల కేవలం 40 రూపాయలు మాత్రమే. కొని చదివి ఇంట్లో లైబ్రరీలో ఉంచుకోదగ్గ హోదా ఈ పుస్తకానికి ఉంది.
ఇప్పటికే చదివిన వారు ఉంటె మీ అభిప్రాయాలూ కూడా చెప్పండి....
ఈ చక్కటి పుస్తకాన్ని పొందేందుకు క్రింది లింక్ ను దర్శించండి...
http://www.supatha.in/index.php/categories/novels/munemma.html


Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information