ముక్తి నిచ్చును నీకు ముక్కంటి శివుడు
- పూర్ణిమ సుధ 

నిక్కముగ నే నమ్మి
మొక్కితి త్రికరణముగ
ముక్కంటి శంకరుని, నా
దిక్కింక నీవని...
వెండికొండలవాడు జగదీశ్వరుడు
చండ ప్రచండముగ ముక్కంటియై
బ్రహ్మాండమును లయమొనర్చు విష
భండారమును దాచుకున్న వాడు
ఉద్దండ పండితుల వేద మంత్రములేల
ఉద్ధరిణితోడ పోయు నీరు చాలు
అభిషేకమని మురియు అల్ప సంతోషి
ముక్తి నిచ్చును నీకు ముక్కంటి శివుడు
గెలుపు ఓటములందు
పొంగి కృంగుట కంటె
మరుపు లేకుండ ఆ
హరుని గొల్చుట మేలు
పంతములకు బోని పరమ భోళానితడు
ఇంతని వర్ణింప జాలని మహిమ జూపు
చింతలు బాపి సాయుజ్యమీయమనిన
అంత్యమున శివనామ స్మరణ జాలనును
ఆది మధ్యాంత్యమ్ముల వాదనములదేల ?
నీది నాది యను వ్యర్థవాదములేల
మోదమైనను గాని ఖేదమైనను గాని
ఎదలోన శివనామ స్మరణ సల్పుట మేలు
జనన మరణముల మధ్య
ప్రణయ లంపటములొద్దు
ప్రణవ నాదము వంటి
పంచాక్షరియె చాలు
ఆద్యమంతము వద్దు ఆధిపత్యము వద్దు
అర్ఘ్య పాద్యములొద్దు ఆచారమొద్దు
విద్యలేవియు వద్దు మంత్రమొద్దు
చోద్యము జూడక, హరునికి సర్వస్య
శరణమ్ము జాలు... చాలును...
ముక్తినిచ్చును నీకు నిక్కముగను

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top