కోరికలు కొనసాగె గోవిందరాజా - అచ్చంగా తెలుగు

కోరికలు కొనసాగె గోవిందరాజా

Share This
232. కోరికలు కొనసాగె గోవిందరాజా
-డా.తాడేపల్లి పతంజలి
(దిగువతిరుపతిలో నెలకొన్న వేంకటేశ్వరస్వామిని గోవిందరాజ స్వామి అంటారు. ఆస్వామిపై అన్నమయ్య రచించిన  కీర్తన ఇది.


ఒక చెలికత్తె గోవిందరాజ స్వామిని ప్రశ్నల రూపములో ఈ కీర్తనలో ఆట పట్టిస్తోంది.(సంపుటము  25-285)
పల్లవికోరికలు కొనసాగె గోవిందరాజామేరమీరి ఇట్లానే మెరసితివా ||  ఓ గోవిందరాజా! నీ కోరికలు ఆగకుండా నెరవేరుతున్నాయి.నియమాలను అతిక్రమించి  ఇలాగే ఆ కోరికలు తీర్చుకొనే సమయములో ప్రకాశించావా !  
1.బాలుడవై రేపల్లెలో బాలుదాగేవేళయీలీలనే పవళించి యిరవైతివా గోలవై తొట్టెలలోన గొల్లత లూచిపాడగా ఆలకించి విని పాట లవధరించితివా ||  ఆనాడు రేపల్లెలో కృష్ణావతారములో పాలను తాగే సమయములోఇలాగే , ఈ పద్ధతిలోనే పడుకొని ఉన్నావా? (=ఇరవైతివా) అందమైనవాడివై(= గోలవై)  గోపికలు ఉయ్యాల ఊచి జోలపాటలు పాడుతుండగా శ్రద్ధతో విని (= ఆలకించి విని) ఆ పాటలను  మళ్లీ మళ్లీ తలుచుకొన్నావా !(=అవధరించు)  
2.కొంచక మధురలోన గుబ్జయింట నీలాగులమంచాలపై బవళించి మరిగితివా చంచుల ద్వారకలోన సత్యభామ తొడమీద ముంచి యీరీతి నొరగి ముచ్చటలాడితివా ||  ఆనాడు మధురా నగరములో కుబ్జ ఇంట్లో సందేహించక(= కొంచక) ఈ రకంగానేమంచాలమీద పడుకొని సుఖాన్ని మరిగావా! సుప్రసిద్ధమైన(=చంచుల)ద్వారకా నగరములో  సత్యభామ తొడ మీద హద్దులు అతిక్రమించి(= ముంచి) ఈ విధముగానే సంభాషించావా!  
3.పదియారువేల ఇంతుల పాలిండ్లు తలగడలైపొదల నిటువలెనే భోగించితివా యెదుట శ్రీ వేంకటేశ ఇట్టె తిరుపతిలోన నిదిరించక శ్రీభూమి నీళల గూడితివా ||  పదహారు వేలమంది స్త్రీల స్తనాలు తలగడలు అవుతుండగావిజృంభించి(= పొదల) ఈ రకముగానే భోగించావా! ఎదురుగా శ్రీ వేంకటేశ్వరుని రూపములో ఉన్నవాడా! క్షణం పాటు (= ఇట్టె)తిరుపతిలో నిదుర పోకుండా, ఆ లక్ష్మీ, భూదేవి, నీళలతో సుఖాలలో తేలుతున్నావా!  
    విశేషాలు : గోవిందరాజా  గోవిందరాజస్వామిని  శ్రీవేంకటేశ్వరునికి అన్న అని కొంతమంది అంటారు. తమ్ముడు వేంకటేశ్వర స్వామి  పెళ్లికి  కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని ఈయనే కొలిచాడట.  అన్నమయ్య దృష్టిలో ఇద్దరూ ఒకటే.  మంచాలపై బవళించి మరిగితివా  వేంకటేశునితో అన్నమయ్యకు ఉన్న చనువుకు నిదర్శనము ఈ కీర్తన. మంచాలపై మరగటం లాంటి ఆంతరంగిక (పర్సనల్) విషయాలను అత్యంత సన్నిహితులు మాత్రమే ప్రస్తావించగలరు. అన్నమయ్యకు స్వామితో ఉన్న తీవ్రమైన ఆత్మీయత ఈ కీర్తనలోని ప్రతి పాదంలో కనబడుతుంది.      దేవుని కడప రథోత్సవం గురించి వ్రాస్తూ "కన్నుల పండుగ లాయే కడప రాయని తేరు/మిన్ను నేల శృంగారము మితిమీరినట్లు" అన్నాడు అన్నమయ్య.(03-93) అయితే ఇక్కడ మనమొక విషయము గమనించాలి.  అన్నమయ్య శృంగారము భౌతిక శృంగారము కాదు.      
అన్నమయ్య శృంగార వర్ణన ’ మధుర భక్తి సంప్రదాయము’ అనే పాదులోనుంచి లేచిన ఆకర్షించే పారిజాతపు చెట్టు. “మధురభక్తి” సంప్రదాయంలో జీవాత్మ స్త్రీ. పరమాత్మ పురుషుడు. “అసంప్రదాయవిత్‌ సర్వశాస్త్రవిదపి మూర్ఖవదుపేక్షణీయ:” .(అన్నీ తెలిసినప్పటికీ సంప్రదాయము తెలియనివానిని మూర్ఖునిలా వదిలేయాలి )అన్నారు శంకర భగవత్పాదులు గీతా భాష్యంలో. కనుక మధుర భక్తి సంప్రదాయము తెలుసుకొని, ప్రతి అన్నమయ్య శృంగార వర్ణనలో జీవాత్మ , పరమాత్మ -నాయికా నాయకులుగా చిత్రింపబడుతుంటారని గ్రహించాలి. (పలుకుతేనెల తల్లి కీర్తనకు ఈ వ్యాఖ్యాత చేసిన వ్యాఖ్యానమునుండి)   

ఇట్లానే  ఈ కీర్తనలో ఇట్లానే,, ఈలీలనే, ఈలాగుల, ఇటువలెనే  మొదలైన పదాలు ఎదుట ఉన్న స్వామిని చెలికత్తె చూపిస్తున్నట్లు అర్థానిస్తున్నాయి.స్వామిని ప్రత్యక్షము చేసుకొన్న యోగాను భూతిలోనే ఇటువంటి పదాలు దొర్లుతాయి.   పదియారువేల ఇంతుల రాసక్రీడ జరిపేనాటికి శ్రీ కృష్ణుని వయస్సు కేవలం ఎనిమిది సంవత్సరాలు. . ఈ వయస్సులోనే  అతడు గోవర్దన పర్వతాన్ని తన వ్రేలుతో ఎత్తాడు.             అమునా అని సంస్కృతములో ఒక మాట. అమునా అంటే అతనినుండి అని అర్థము. అమునా  యమునా గామారింది. స్నానము చేసేటప్పుడు మన శరీరములో  కుడివైపుగా  గంగను, , ఎడమవైపుగా  యమునను, హృదయంలో సింధునదిని భావించాలని  ఒక సంప్రదాయము. యమున ఉన్న ఎడమవైపు హృదయముంది. యమునా తీరమంటే ఈ హృదయభాగమే. స్త్రీ ప్రాయమితరం జగత్. అంటే లోకములో భగవంతుడొక్కడే పురుషుడు. తక్కిన జీవులందరూ స్త్రీలే. అని ఒక సిద్ధాంతము. కనుక హృదయములో  భక్తులు స్త్రీ భావన చేసి, పురుష స్వభావుడైన పరమాత్మతో చేసే అనంద భావనా క్రీడ  రాసక్రీడ.             
మరి అన్నమయ్య స్తనాలు మొదలైన అవయవ వాచకాలు, భోగాలు ఇవన్నీ ఎందుకు ఈ కీర్తనలో  వాడాడంటే, భగవంతునికి  భక్తులను సన్నిహితము చేసేటందుకు. 
శృంగారము ఎవరినైనా ఆకర్షించే రసరాజము. దాని ద్వారా భక్తులను ఆకర్షించి,పెరుమాళ్లకు ఎరుక అయిన లోగుట్టును తెలియ చేయాలని అన్నమయ్య తాపత్రయము. అందుకే అన్నమయ్య కీర్తనలలో అత్య్ధధిక భాగము శృంగార కీర్తనలే. అన్నమయ్య శృంగార కీర్తనలను ఈ దృష్టితో చదవాలి. స్వస్తి..  

No comments:

Post a Comment

Pages