గుండెల్లో మ్రోగే సంగీతం – మాండలిన్ శ్రీనివాస్
-భావరాజు పద్మిని

ఆయన ప్రపంచ దేశాలన్నింటికీ 'ఆనరబుల్ సిటిజెన్'.  రాజీవ్‌గాంధీ నుంచి నేటి మన ప్రధాని  నరేంద్రమోడీ వరకూ  అందరూ ఆయన అభిమానులే. సద్గురువు అంటే ఆయనే… ‘విద్యను డబ్బుతో కొలవడం ఏంటి?’ అంటూ ఆయన దగ్గర విద్య నేర్చుకున్న వందలాది మంది దగ్గరా నయా పైసా తీసుకోకుండా సంగీతం నేర్పారు. ఆయనే 'మాండలిన్' వాయిద్య నైపుణ్యంతో ఆ పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న మాండలిన్ జీనియస్ - ఉప్పలపు శ్రీనివాస్. 
 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పాలకొల్లులో 1969 సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన జన్మించారు.  శ్రీనివాస్ తన తండ్రి సత్యనారాయణ కూడా మాండలిన్ వాద్యకారుడే. ఆయన వద్ద ఉన్న మాండలిన్‌పై తన ఆరవయేటనే శ్రీనివాస్ సరాగాలు పలికించారు. తండ్రి ఆయనకు తొలి గురువయ్యారు. ఆరేళ్ల ప్రాయం నుంచే శ్రీనివాస్ కు మాండలిన్‌‌ వాయిద్యంపై ఉన్న ఆసక్తిని గమనించి తండ్రి,  సంగీతాభ్యాసానికై శ్రీనివాస్ ను తన గురువైన రుద్రరాజు సుబ్బరాజు గారి వద్ద చేర్పించారు. శ్రీనివాస్ సోదరుడు రాజేశ్ కూడా మాండలిన్ విద్వాంసుడే. ఈయన తొలి మాండలిన్ కచ్చేరి ఆంధ్రప్రదేశ్‌, గుడివాడలో జరిగిన త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాల్లో జరిగింది. 1978 ప్రాంతంలో ఓ బాల కళాకారుడిగా అపార సంగీత ప్రతిభతో సంచలనరీతిలో వెలుగులోకి వచ్చిన మాండలిన్‌ శ్రీనివాస్‌ మాండలిన్‌ వాయిద్యంతో అద్బుతాలు సృష్టించారు. మూడేండ్ల తర్వాత ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ నిర్వహించిన మద్రాస్ మ్యూజిక్ సీజన్‌లో ప్రదర్శన ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన ప్రపంచంలోని అన్ని దేశాలు చుట్టారు. 
 అలా సంగీతంలో బాలమేధావిగా ఎదిగిన శ్రీనివాస్‌ 15 ఏళ్ల వయసులోనే
తమిళనాడు రాష్ట్ర ఆస్థాన విద్వాంసుడయ్యారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్యాంసురాలు ఎంఎస్‌.సుబ్బలక్ష్మి చేతుల మీదుగా సంగీత బాలభాస్కర అవార్డు అందుకున్నారు. 19 ఏళ్ల వయసులో 'పద్మశ్రీ' అవార్డు లభించింది. సంగీతరత్న, సనాతన సంగీత పురస్కార్‌, రాజలక్ష్మీ ఫౌండేషన్‌ అవార్డు (1985), నేషనల్‌ సిటిజన్‌ అవార్డు, రాజీవ్‌ గాంధీ నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ అవార్డు తదితరాలు..శ్రీనివాస్‌ ప్రతిభను గుర్తించి, గౌరవించిన సందర్భాలు. మాండలిన్‌ వాయిద్యానికి, సంగీత సృష్టికి హద్దులు లేవనే విషయాన్ని శ్రీనివాస్‌ నిరూపించారు. అనతికాలంలోనే అశేష సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న శ్రీనివాస్.. ఎలక్ట్రిక్ మాండలిన్‌ను ఉపయోగించేవారు. భారతదేశంలో హిందూస్థానీ క్లాసికల్ సంగీత విద్వాంసులైన హరిప్రసాద్ చౌరాసియా, జాకీర్‌హుస్సేన్‌లతో కలిసి ప్రదర్శనలు ఇచ్చారు. జాన్ మెక్‌లాఫ్‌లిన్, మైఖేల్ నైమన్ వంటి ప్రపంచస్థాయి కళాకారులతో కలిసి ప్రదర్శనలు ఇచ్చారు. 
సత్యసాయిబాబాకు భక్తుడైన శ్రీనివాస్ ఆయన ముందు అనేక సందర్భాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. జాజ్ ఫెస్టివల్ (1983) సందర్భంగా తొలిసారిగా ఆయన బెర్లిన్‌లో ప్రదర్శన ఇచ్చారు. ఆయన ప్రదర్శనకు ముగ్ధులైన ప్రేక్షకులు మరోసారి ప్రదర్శించాలని ఆయనను కోరారు. అనంతరం కెనడా నుంచి ఆస్ట్రేలియా వరకూ అనేక దేశాల్లో పర్యటించి, మాండలిన్ గొప్పతనాన్ని
చాటారు.  పలు కర్నాటక సంగీత ఆల్బమ్‌లు రూపొందించారు. ప్రముఖ సినీ సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ ఈయన శిష్యులే ! తన గురువు గురించి ఆయన మాటలు... “ఆయన దగ్గరున్న పదేళ్లలో ఏనాడూ ఆయన కోప్పడటం చూడలేదు నేను. శ్రుతి శుద్ధంగా వాయించకపోతే... ఏ గురువైనా కోప్పడతారు. కానీ.. అన్నయ్య అస్సలు కోప్పడేవారు కారు. ‘భలే వాయించావే.. అలా ఎలా వాయించావ్. నాక్కూడా నేర్పవా’ అనేవారు. ఆయన అలా అంటుంటే పకపకా నవ్వేవాళ్లం. అలా నవ్విస్తూ విద్య నేర్పేవారు.  
మీకు పద్మభూషణ్ రానందుకు బాధగా లేదా ? అని ఒకసారి అడిగితే ఆయన - ‘శ్రోతలకు ఆనందాన్నిచ్చేంత సంగీతం నాకు వచ్చింది. ఇక పద్మభూషణ్ రాకపోయినా ఫర్లేదు’ అన్నారు. నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాకా, నా బాణీలు అన్నీ విని ఎంతగానో మెచ్చుకునేవారు. నన్ను తన శిష్యుడిగా కాక, ఒక సొంత తమ్ముడిలా అభిమానించేవారు. అంత గొప్ప సద్గురువు లభించడం నా పూర్వజన్మ సుకృతం.” ఈయన వయస్సు 29 యేళ్ళుగా ఉన్న సమయంలో అంటే 1998లో పద్మ శ్రీ అవార్డును కేంద్రం ప్రదానం చేసింది. 2010లో సంగీత నాటక అకాడెమీ అవార్డును అందుకున్నారు. సనాతన సంగీత పురస్కార్‌, రాజాలక్ష్మి ఫౌండేషన్‌ అవార్డు, నేషనల్‌ సిటిజన్‌ అవార్డు, రాజీవ్‌గాంధీ నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ అవార్డు వంటి పలు అవార్డులు శ్రీనివాస్‌కు అలంకారం అయ్యాయి. కాలేయ వ్యాధితో బాధపడుతున్న శ్రీనివాస్ , 45 ఏళ్ళ పిన్నవయసు లోనే, సెప్టెంబర్ 19, 2014 న దైవసన్నిధికి చేరుకున్నారు. ఆయన లేకపోయినా ఆయన సంగీతం అజరామరంగా మన గుండెల్లో మ్రోగుతూనే ఉంటుంది... ఆయన మాండలిన్ సంగీతాన్ని క్రింది లింక్ లలో
వినండి.

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top