దేవీ తత్త్వము
 - వారణాసి రామబ్రహ్మం

"దేవి" పదమే ఆనందదాయకమైనది. ఆ మాట దివ్యమైనది. వెలుగు, కాంతి, తేజస్సు, జ్ఞానము లకు పర్యాయపదము దివ్య పదము. శాంతి, ఆనంద, మౌన స్వరూపిణి అయిన దేవి శక్తిరూపిణి. మన మానసిక శక్తి తో సహా అన్ని శక్తులలో  వసించి అన్ని కార్యకలాపములను నిర్వహించే చిదాంశ సంభూత. జ్ఞాన వైరాగ్య ప్రదాయిని. ముగురమ్మల మూలపుటమ్మ. వరములనిచ్చి మన్ని సంతోషపరచేది, కాచేది, పెద్దమ్మ అయిన దేవి మాయా స్వరూపిణి. తటిల్లత (మెరుపు తీగ) శరీరముగా కల "శచీ" నామముతో వేదకాలమందు సన్నుతింపబడిన శక్తీ రూపము దేవి. మహాకాళీ, మహాలక్ష్మి, మహాసరస్వతీ అంశల సమాహారమైన దేవీ తత్త్వము వేదకాలమునుంచి పురాణకాలము వరకు పరిణమించి పూజార్హము, ఉపాసనాగమ్యము అయినది.  బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు అతీతంగా తనంతతాను మన క్షేమసమాచారములను చూడగలిగిన, చూసే స్వతంత్రురాలు. శివ యువతి, నారాయణ మనోల్లాసిని, తుర్ముఖుని రాజ్ఞి ఈమెయే. మాయా నామముతో విరాజిల్లే దేవి, పార్వతి, లక్ష్మి, సరస్వతులుగా త్రిమూర్తుల సగభాగములై వారి వారి శరీరము, (అర్థ నారీశ్వరి),వక్షస్థలము(విష్ణు వక్షస్థలవాసిని), వాక్కు (వాగీశ్వరి), గీర్వాణి) లలో పరిఢవిల్లుతూ మనలని సంతానముగా సాకే మాతృమూర్తి దేవి. దేవి ఉపాసన, నామపారాయణము పూజ, ధ్యానము, సకలార్ధ సాధకములు.శ్రీ లలిత శక్తి స్వరూప ప్రతిక. దేవిని మనము సగుణగాను, నిర్గుణగాను అర్చించవచ్చు. మన మానసిక ప్రవృత్తి, ప్రజ్ఞలను బట్టీ అర్చనా విధానాన్ని ఎంచుకోవచ్చు. సకల చరాచర ప్రపంచము నందు మాతృశక్తిగా నివసించే దేవి, ప్రేమ, అనురాగము, వాత్సల్యము, కరుణ,భక్తి, జ్ఞానములకు ప్రతిరూపము. శ్యామలా నామముతో యవ్వనాన్ని, పచ్చదనాన్ని, రూపుగా గొని, మన సృష్టి , ప్రజ్ఞా పాటవములు అనే సస్యములను అందించేది దేవియే. దుర్గ అయ్యి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తుంది. సృష్టి, స్థితి. లయ రూపిణి. ఇ చ్ఛా- జ్ఞాన- క్రియాశక్తి స్వరూపిణి. అట్టి సర్వేశ్వరి మనలను కాచుగాక! బ్రహ్మవిష్ణుమహేశ్వరులు ఆమె అనుంగు పుత్రులు. పార్వతి, లక్ష్మి, సరస్వతి ఆమెకు ప్రియమైన కోడళ్ళు. మనము అందరమూ ముద్దుల మనుమలము, మనుమరా ళ్ళము. ఆ పెద్ద సంసారిణి మనలను ఎల్లప్పుడూ బ్రోచుగాక! శ్రీర్భూయాత్!

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top