భావకవితా కల్పవల్లి - దేవులపల్లి - అచ్చంగా తెలుగు

భావకవితా కల్పవల్లి - దేవులపల్లి

Share This
 భావకవితా కల్పవల్లి - దేవులపల్లి
-   పరవస్తు నాగసాయి సూరి

తెలుగింటి పరువాల పడుచు పిల్ల ఎలా ఉంటుంది. ఈ ప్రశ్న అడగ్గానే... లంగా, ఓణీ దగ్గర్నుంచి.... కాళ్ల పట్టీల వరకూ ఓ పుత్తడి బొమ్మను ఊహించుకుంటారేమో. తెలుగమ్మాయి గురించి చెప్పాలంటే అవన్నీ ఎందుకండీ... కృష్ణశాస్త్రి కవితలా ఉంటుందని ఒక్కమాటలో చెబితే చాలదా. రాసిన ప్రతి వాక్యాన్నీ రసాత్మకం చేసి, కవితలకు కావ్య గౌరవాన్ని ఆపాదించిపెట్టిన మృదుపదాల మేస్త్రి... దేవులపల్లి కృష్ణశాస్త్రి. తెలుగు పదాలకు నగిషీలద్ది, భావకవితా యుగానికి కల్పవల్లిగా పేరు గాంచిన దేవులపల్లి కృష్ణశాస్త్రి...1897 నవంబర్1న తూర్పుగోదావరి జిల్లా చంద్రాయపాలెంలో జన్మించారు. సారస్వత వాతావరణంలో పెరిగిన ఆయన.... పదో ఏటనే ఆశువుగా పద్యాలు చెబుతూ ప్రతిభ చాటారు. కాకినాడ, పెద్దాపురం హైస్కూళ్లలో ఉపాధ్యాయుడిగా పని చేశారు. అనంతరం ఆంధ్రోపన్యాసకునిగా వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలోనే భారతమాతను స్తుతిస్తూ... " జయ.. జయ.. జయ... ప్రియభారతి'  అనే అక్షర లక్షల విలువైన గేయాన్ని రాశారు దేవులపల్లి. విఖ్యాత భావకవిగా తెలుగు సాహిత్యంలో అరుదైన గౌరవాన్ని పొందిన దేవులపల్లి... ఎన్నో భావకవితల్ని తెలుగు భాషకు అందించారు. ఆయన కవితలు తెలుగమ్మాయిలా ఒద్దికగా ఉంటాయి. అవసరమైనప్పుడు అల్లరిగా పరిగెత్తుతాయి. అందంలో వాటికవే సాటి. ఆంధ్రాషెల్లీగా పేరు గాంచిన కృష్ణశాస్త్రి... ప్రఖ్యాత దర్శకుడు బి.ఎన్.రెడ్డి ప్రోత్సాహంతో " మల్లీశ్వరి' చిత్రం ద్వారా సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. పల్లెపదాల దగ్గర్నుంచి, విరహగీతాల వరకూ ఎన్నో పాటల్ని రాసి... మల్లీశ్వరి గీతాల్ని తారస్థాయిలో నిలబెట్టారు. తెలుగు సినిమా పాటకు సాహిత్యపు పరిమళాల్ని అద్ది, తెలుగు సినీగీతాల ఖ్యాతిని ద్విగుణీకృతం చేసిన ఘనాపాటి దేవులపల్లి కృష్ణశాస్త్రి. పదాల్ని పంచామృతంలో అభిషేకించి, మధురమైన పాటగా తీర్చిదిద్దడంలో కృష్ణశాస్త్రి నేర్పరి. ఆయన పాటలో కూర్చే పదచిత్రాలు, భావరాగ రంజితాలై విరాజిల్లుతాయి. ఆధ్యాత్మిక చింతనతో ఆయన రాసిన గీతాలు భక్తిభావ వీచికలు. ప్రభాత వేళలో భగవంతుని పూజనైనా, చిన్నారి గణపయ్యకు బాల్యోపచారాలు చేస్తున్న పార్వతీదేవి అయినా, రామయ్యను రమ్మని పిలిచే శబరి అయినా, శ్రీనివాసుడి కోసం ఎదురు చూసే వకుళాదేవి అయినా... కృష్ణశాస్త్రి కలంలో జీవం పోసుకుంటారు.. అలతిఅలతి పదాలతో అనంతమైన భావజాలాన్ని పాటల్లో జొప్పించిన అద్వితీయ ప్రతిభామూర్తి కృష్ణశాస్త్రి. ప్రతీరాత్రి వసంతరాత్రి అంటూ మిత్రుల సాయంసంధ్యల పాటకు పరిమళాన్నద్దినా, రావమ్మా మహాలక్ష్మీ అంటూ ఒక్క పాటలోనే సంక్రాంతి లక్ష్మిని ఆవిష్కరించినా అది కృష్ణశాస్త్రి భావప్రతిభకు మెచ్చుతునక. తెలుగు సారస్వత రంగంలో భావకవితా పితామహునిగా, భావకవితాయుగ చక్రవర్తిగా కీర్తి ప్రతిష్టలు ఆర్జించిన ప్రజ్ఞాశాలి కృష్ణశాస్త్రి. భావకవిత్వానికి రూపురేఖలు దిద్ది, భావకవితా సౌధాన్ని ఉత్కృష్టంగా నిర్మించిన మృదుపదాల మేస్త్రి... కృష్ణశాస్త్రి. మనసున్న చోటే మజిలీ, కాదంటే చాలు బదిలీ... అంటూ బికారి జీవితాన్ని ఆవిష్కరించినా, వేళకాని వేళలో ఇంటికి రావద్దని ప్రియమైన అతిథిని వారించినా అది కృష్ణశాస్త్రి కలానికున్న చమత్కృతికి నిదర్శనం.  వాక్యం రసాత్మకం కావ్యం అన్నట్లు రసాత్మకమైన, కవితాత్మకమైన, సృజనాత్మకమైన వాక్యం కావ్యగౌరవాన్ని పొందుతుంది. ఎన్నో రసాత్మక వాక్యాలతో పాటలను కూర్చిన అసాధారణ సారస్వత నేర్పరి దేవులపల్లి కృష్ణశాస్త్రి. దేవులపల్లి కృష్ణశాస్త్రి అంటేనే భావకవిత్వానికి పెట్టింది పేరు. అలాంటి రచయిత ఓ కవిపాత్రకు పాటల రాయాలంటే... ఎంతటి భావావేశాన్ని ఆవిష్కరిస్తారో ఊహించవచ్చు. మేఘసందేశంలో ఆయన రాసిన ప్రతి పాటా... ఓ సాహితీసౌరభమే. రైల్లో వెళుతూ దాని లయకు, దాటి వెళుతున్న పొలాల పచ్చదనాలకు పరవశించి ఆయన రాసిన ఆకులో ఆకునై గీతాన్ని సైతం ఈ సినిమాలో తీసుకున్నారు. ఆ కవిత అటు తెలుగు సాహిత్యంలోనూ, సినీ పాటల పర్వత శ్రేణుల్లో గౌరీశంకర శిఖరంగా మన్ననలు అందుకుంది. ఆయన పేరు వినగానే ఎన్నో కమనీయ గీతికలు మదిలో కదలాడుతాయి. ఆయన పేరు స్ఫురణకు రాగానే మనసున మల్లెలు రాలతాయి. పాత్రల మనసుల్ని ఆవిష్కరించే ఎన్నో పాటలు కళ్లముందు మెదులుతాయి. ప్రేయసీ ప్రియుల మధ్య అనురాగాన్ని అమలిన శృంగారాన్ని వ్యక్తికరించడంలో కృష్ణశాస్త్రి దిట్ట. ప్రియుడిపై అనంతమైన అనురాగాన్ని పెంచుకున్న కథానాయిక అతడి కోసం ఏమైనా చేయగలదు. అవసరమైతే చిరుగాలిని సడి చేయవద్దంటూ వారించగలదు. ఇక వసంత కాలంతో కడగళ్లకు ముడిపెట్టిన భావవైచిత్రి కృష్ణశాస్త్రి కలంలో కనిపిస్తుంది. చెట్టు మీద ఎవరో... అంటూ  కృష్ణశాస్త్రి కవితలో ఇమిడిపోయే తెలుగు కథానాయిక మనసునీ ఆవిష్కరించడం ఆయనకు మాత్రమే ప్రత్యేకం.  సినిమా పాటల పట్ల అభిమానం, అంతకు మించి అభిరుచి ఉన్న రసజ్ఞులెవరైనా... దేవులపల్లి పాటల్ని ఇట్టే గుర్తుపడతారు. ఆ పదాల తీరుతెన్నులు, పాటల్లో తనదైన ముద్రలతో ఆయన శ్రోతల్ని ఆకట్టుకుంటారు. భావశిల్పంలో దేవులపల్లికి సాటిలేదనేది నిర్వివాదాంశం. ఆయన కవితల్లో అడుగడుగున ఆలయాలు కనిపిస్తాయి. చిన్నపిల్లల తోలుబొమ్మలాటలు కనిపిస్తాయి. ఇన్నెందుకు పాట ఏదైనా.... సందర్భమెలాంటిదైనా... అందులో కృష్ణశాస్త్రి కనిపిస్తారు గొప్ప వక్తగా, రచయితగా, భావకవుల ప్రతినిధిగా పేరు పొందిన కృష్ణశాస్త్రి గొంతు 1963లో ఆనారోగ్యంతో మూగబోయింది. కానీ ఆయన రచనా పరంపర మాత్రం తుదిశ్వాస వరకూ అప్రతిహతంగా, అనంతంగా కొనసాగింది. 1980 ఫిబ్రవరి 24న కృష్ణశాస్త్రి తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయారు. ఆ సందర్భంలో షెల్లీ మళ్లీ మరణించాడని మహాకవి శ్రీశ్రీ ఆవేదన వెలిబుచ్చారు. కృష్ణశాస్త్రి భౌతికంగా లేకపోయినా... ఆయన కవితాత్మ రవళిస్తూనే ఉంది. దేవులపల్లి పదసాహిత్యం నిరంతరం పరిమళిస్తూనే ఉంటుంది.  

No comments:

Post a Comment

Pages