బుడుగు గీతాయణం - అచ్చంగా తెలుగు

బుడుగు గీతాయణం

Share This

బుడుగు గీతాయణం

- యనమండ్ర శ్రీనివాస్

“హబ్బా…ఈ హైదరాబాదు ట్రాఫిక్ కాదు కానీ, భలే చిరాకొస్తోంది రోజు రోజూ” అన్నారు గోపాళం నాన్న ఇంటికి రాగానే. అమ్మ ఇచ్చిన మజ్జిగా గ్లాసు దించకుండా తాగేస్తూ సోఫాలో కూలబడ్డారు. “మినిస్టరు గారేవో కొత్త ఫ్లై ఓవర్లు అంటున్నారు. నీకుపయోగపడతాయేమో చూడు” బాబాయి సలహా టి వి చూస్తూ. “ఎంత ఎత్తుకి తీసుకెళ్ళినా కొన్ని జీవితాలంతేరా వంకరి టింకరి గీతలు. ఈ జన్మకి బాగుపడవు” అన్నారు నాన్న అదోలా. బాబాయి ఖోపంగా టి వి కట్టేసి తన రూమ్ లోకి వెళ్ళీపోయాడు. నాన్నని అలా చూసి భయమేసి నేను కూడ బాబాయి వెనకాల పరిగెత్తా. “ఎందుకు బాబాయి? నాన్నకి హంత ఖోపమొచ్చింది. వంకర టింకర అంటున్నారూ?” అన్నాను. భగవద్గీతలో కృష్ణభగవానునిలాగా ఓ చెయ్యి పైకెత్తి బాబాయి అందుకున్నాడు. “ఒరేయ్ బుడుగూ. నీకో సీక్రెట్టూ చెప్తాను. ఎవరికీ చెప్పకే” అన్నాడు. “మన నుదుటిన, అంటే ఫోర్ హెడ్డు మీద, బ్రహ్మ ముందరే ఒక గీత గీసి పంపుతాడు, మన లైఫుది. ఆ గీత కొందరిది చక్కగా స్ట్రెయిటుగా ఉంటే, కొంతమందిది హనుమంతుని తోకలాగా వంకర టింకరగా వుంటుంది. కానీ, ఏ గీత ఎలా వుందో మనకి తెలుసుకునే ఉపాయం ఇవ్వలేదు దేవుడు” “అందుకేనా నాన్న వంకర టింకర గీతలాంటి తన జీవితం బాగుపడదు అంటున్నారా?” ఇదేదో మా సైన్సు మాస్టారు పాఠంలాగా చెప్తుంటే కాస్త, బొమ్మ గీసి చెప్తే ఇంకాస్త అర్దమయ్యే టాపిక్కులాగా అనిపించింది నాకు. “అది కరక్టే గానీ సీక్రెట్టు ఏమిటంటే, మన నుదుట గీత బాగుపడాలంటే ఇంకో గీత పెదాల మీద రావాలిరా ఎప్పుడూ” “అదేం గీత బాబాయి? పెదాల మీద గీత? ఎడ్వరటయిజుమెంటులో చూపిస్తారు. అలానా?” అడిగాను అర్ధంకాక. “నీ బొంద. ఆ గీతలు కాదు. చక్కటి నవ్వు అనే గీతని మన మొహాన మనమే గీసుకుంటే, ఆ గీత నుదుటిన ఉన్న అన్ని గీతలకీ “నో చెవిలో పువ్వెట్టీంగ్” అని చక్కగా చెప్తుంది. కాబట్టి, ఎపుడూ అలా ఆ నవ్వు గీత చెరగనివ్వకే” అని ముగించపోయాడు. “కానీ బాబాయి. అందరూ నాలా పెయింటర్స్ కాదుగా. అందరికీ నాలా గీతలు అలా మొహాన గీస్కోటం రాదుగా. మరి అప్పుడూ?” నా సందేహం నాది. వైజాగు మాస్టారి మొహాన ఆ నవ్వు గీత గీసే దమ్మెవడికి ఉంది? “అలాంటప్పుడే ఇంకొన్ని గీతలు చూడాలి మనం” అన్నాడు బాబాయి. ఓరిదేవుడోయి. ఈ గీతల గొడవేదో మమ్మీ సినిమాలో పురుగుల్లాగా గబ గబా ఒచ్చేస్తున్నాయి బాబాయి నోటి వెంబడి. అందుకే హాచ్చర్యపడకుండా, మళ్ళా అడిగా. “బాబాయి. ఈ కొత్త గీతలేమిటి?” “ఇవి, మనకోసం ఓ పెద్దాయిన - బాపు ఆల్రెడీ గీసేశాడు. ఎన్నెన్ని గీతలో. నీ ఇష్టం ఒచ్చిన గీత చూసుకో. నీ పెదాల మీద నవ్వు గీత వెంఠనే పెచ్చ్యస్యమవుతుంది” అన్నాడు. “బాపు. అంటే గాంధీ తాత కదా?” వాట్సప్పులో మెసెజీ చూసినట్టు నా ఫేసు వెలిగిపోయింది బాబాయి చెప్పింది తెలుసన్నట్టు. “మరలా నీ బొంద. ఆ బాపు కర్ర పెట్టి బ్రిటీషు జనాలని పో పో అని తరిమేశాడు. ఈ బాపు కర్ర పుల్ల పట్టి తెలుగు జనాలని రా రా అని ఆయన గీతల వైపు లాగేశాడు.” “అబ్బో అన్ని గీతలే?” హాచ్యర్యం కాదూ? “అవును. అందరికీ కావాల్సినట్టుగా ఎన్నో గీతలు. ఇపుడు నాన్నకి గవర్నమెంటోళ్ళ మీద ఖోపం. ఆయనకోసం గవర్నమెంటుని ఆటపట్టిస్తూ కొన్ని గీతలు. మీ అమ్మకి బాలాజీ ఇష్టం. ఆయనకి మొక్కుతూ ఇంకొన్ని గీతలు. అలాగే రాధకి అత్తగార్లంటే భయం. వాళ్ళని ఏడిపిస్తూ కొన్ని గీతలు. పక్కింటి పిన్నిగారికి ఓణీలంగా వేసుకున్న అమ్మాయిలంటే ఇష్టం. అందుకని అలాంటి గీతలు. ఇలా ఎన్నో గీతలు గీసేశాడాయన.” “మరీ, మరీ నీకు ఇంకాస్త సరదాగా ఉండే ఆడపిల్లలు ఇష్టం కదా బాబాయ్” హమ్మో ధైర్యమ్ ఒచ్చేస్తోంది బాబాయితో మాట్లాడేస్తుంటే. ప్రవేటు చెప్పడనే నమ్మకంతో. “ఆ బొమ్మలూ ఉన్నాయిరా అబ్బీ. బిందె పట్టుకున్న ఆడపిల్ల. జడ వేసుకున్న ఆడపిల్ల. కాటుక పెట్టుకున్న ఆడపిల్ల. ముగ్గేస్తున్న ఆడపిల్ల. దొరసానిలా తయారయిన ఆడపిల్ల. సాయంత్రం వాళ్ళాయన కోసం ఎదురు చూస్తున్న ఆడపిల్ల. అబ్బ, ఆడపిల్ల గీతలంటే ఆయనే మాస్టారురా…..మనమంటామే “ఫిగరు” అని అచ్చు అలా వుండే అమ్మాయిల గీతలు భలే గీస్తాడులే ఆయన. ఇలా గీస్తే కనుబొమ. అలా గీస్తే నుదురు. పైకి గీకితే పాపిట. అటూఇటూ సాగదీస్తూ గీకితే బుగ్గసిగ్గులు. నిండుగా గీకితే హబ్బా…ఇంక చెప్పలేనురా అబ్బీ….కొన్ని పెద్దవాళ్ళ గీతలనుకో” బాబాయి ఇంక ఏదో లోకంలోకి వెళ్ళిపోతున్నాడు. అందుకే, “బాబాయి. ఇంతమంది అమ్మాయిలు ఎలా తెలుసు ఆయనకి. ఆయన గరల్స్ హాస్టల్ ప్రిన్సిపాలా?” బాబాయి ఈ మాత్రం ఆల్రెడీ ఆలోచించేసి ఉండాలి నా లెఖ్ఖ ప్రకారం. “కాదురా బుడుగూ. ఆయన ఆడపిల్లలను చూడటం కాదు. ఆయన బొమ్మేసి సినిమా తీస్తున్నాం అంటే, ఆడపిల్లల్లే లైన్లొ నిల్చునే వాళ్ళు, బాపు గీసిన బొమ్మగా వేషం వేస్తాం అంటూ.” బాబాయి చెప్పాడు. “హమ్మో. అంత గొప్పాయనకు దణ్ణం పెట్టుకోవాలి కదా బాబాయి?” కాళ్ళ చెప్పులు విప్పేశా వెంటనే నేను. “కాదేమిటి మరి. ఆయన గీతల గురించి, ఆయన ఫ్రెండే ఏమన్నాడో తెలుసా (రమణ అని);   “అటు కన్నులు, ఇటు పెదిమలు ఎటు చూస్తే అటు వెలుగులు ఎటు చూడను చెప్మా అని నడుమనున్న ముక్కొక్కటి తికమక తికపడగా ఈ మకతిక చూసి చూసి పక పక నవ్వేసి వేసి చెంప మీద సొట్ట తేలె సం-పెంగ మొగ్గ వోలె కావ్యమంటి ఈ కన్నెను కళ్ళారా చూసి చూసి కల్లో నెమరు వేసి వేసి బాపెన్నో బొమ్మలేసి గుండెల్లో గుడిని కట్టె….” అని…కాబట్టి, బుడుగూ. దేవుడు నుదుటున గీతలు గీశాడు అని ఏడిచే కన్నా, ఈ బాపుగుడిలోని కొన్ని గీతలు చూసి మన మొహాన కొన్ని కొత్త గీతలు దిద్దుకుని ముందుకు నడిచే వాడేరా తెలుగోడు” అన్నాడు బాబాయి. అబ్బా. బాబాయి. భలే లెక్చరిచ్చాడు. నాకైతే చాలా నచ్చింది. మీకూ నచ్చుతుందని చెప్తున్నా. ఎందుకో చెప్పనా, బాపు గీత లాగా కనపడే నా ఈడు చిన్నది ఎవరా అని చూస్తే సీగానపెసూనాంబ కనపడింది నాకు. ఇంకేముంది. డౌటొచ్చి నా ఫేసు కూడా అద్దంలో చూసుకున్నా. నేను కూడా బాపు గీసిన గడుగ్గాయిలా ఉంటా కదా. అందుకే, అప్పుడప్పుడూ నా ఫేసు చూసినా బోలేడు గీతల పుణ్యము మీకు……బాబాయి చెప్పాడు సుమీ !!!!!

No comments:

Post a Comment

Pages