Friday, September 26, 2014

thumbnail

ఆశ్వయుజం

ఆశ్వయుజం

- కొంపెల్ల శర్మ
కాలం దైవ స్వరూపం. కాలంలో ప్రత్యణువూ పవిత్రమే. అనుక్షణమూ అమూల్యమే. భూత, భవిష్యత్ కాలాలతో అనుబంధం కలిగి వర్తమానంతో సంచరించే కాలం నిత్యనూతనం, నిత్య చైతన్యశీలం. చాంద్రమాన కాలమానంలో తెలుగువారు పరిగణించే మాసాల్లో ఏడవది ఆశ్వయుజ మాసం. అశ్వనీ నక్షత్రంతో కూడిన పూర్ణిమ ఈ మాసంలో సంభవించిన మూలాన ఈ మాసాన్ని ‘ఆశ్వయుజ’మాసంగా పరిగణించారు. ఈ మాసం శుక్ల పాడ్యమి నుంచే ‘శ్రీ దేవీ నవరాత్రుల పర్వోత్సవాలకు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. పాడ్యమి నుంచి నవమి వరకూ ‘దేవీ నవరాత్రులు’గా జరుపుకొని, పదవరోజు దశమి రోజు ‘విజయదశమి’గా, ‘దసరా’గా పర్వదినోత్సాహాలతో సమాప్తమవడం ఓ విశేషం. ప్రకృతి రీత్యా వర్ష ఋతువు ముగియడం, శరదృతువు ప్రారంభమవడం, ప్రథమ కర్తవ్యంగా దేవీపూజల్ని నిర్వహించడం ప్రాధాన్యతని సంతరించుకొంది. ఆశ్వయుజ మాసం దేవీ నవరాత్రులతో ప్రారంభమై, దీపావళి పండుగతో పరిసమాప్తమవుతుంది. దేవీ నవరాత్రోత్సవాలు “ఆశ్వినే శుక్లపక్షే తు కర్తవ్య నవరాత్రకం – ప్రతిపదాది క్రమేనైవ యావద్ది నవమీ భవేత్” – ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ నవరాత్రోత్సవం జరుపాలని ధౌమ్యవచనములో ప్రస్తావించారు. దీనికి తార్కాణంగా తోమ్మిదిరాత్రులు జరుపుకోవాలనీ ‘దేవీయుత్పత్తి’ విభాగంలో మార్కండేయ పురాణంలోని దేవీమాహాత్మ్య వర్ణనలో ప్రస్తావన కనిపిస్తుంది. “ఆశ్వినే మాసి సంప్రాస్తే శుక్లపక్షే విదే స్తిధిం, - ప్రారభ్య నవరాత్రం స్యా ద్దుర్గా పూజ్యా తు తత్ర వై” – ఈ నవరాత్రకాలంలో దుర్గను పూజించాలని రుద్రయామళము, దేవీ పురాణంలో వివరించారు. “త్రిరాత్రం వాపి కర్తవ్యమ్ సప్తమ్యాది యథాక్రమం” – తొమ్మిది రోజులు జరుపుకోలేనివారు ఐడు,మూడు, కనీసం ఒక్కరాత్రిగానైనా జరుపుకోవాలని భవిష్యపురాణం ఘోషిస్తోందని పెద్దలు చెబుతారు. ఈ కాలంలోనే భద్రకాళి అష్టాదశభుజ మహిషాసురమర్దినిగా అవతారమెత్తడం, ఆదిశక్తి – మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాదుర్గలుగా అవతారమెత్తడం,  ఈ దేవతను హ్రీం, శ్రీం, క్లీం, సంకేతమూర్తిగా ఆరాధించడం ఆధ్యాత్మిక  సంప్రదాయ పరంపరగా కొనసాగుతోంది. ఆయురారోగ్య ఐశ్వర్యాలతోపాటు ప్రశాంతచిత్తాన్ని ప్రసాదించే త్రిభువన పోషిణి, శంకరతోషిణి, విష్ణువిలాసినిగా అమ్మలగమ్మ అమ్మ విరాజిల్లుతుంది. దేవి అవతారములు బహుముఖీనం కాగా, ఈ నవరాత్రుల సందర్భంగా –శుద్ధ పాడ్యమి - మహామాయ (మహాకాళి), విదియ - మహిషాసురమర్దిని (మహాలక్ష్మి), తదియ - మహా సరస్వతి (చాముండ), చవితి - నంద, పంచమి - రక్తదంతి, షష్టి - శాకంభరి, సప్తమి - దుర్గ, అష్టమి - మాతంగి, నవమి రోజున  - భ్రామరి అన్న తొమ్మిది అవతారాలతో  దేవీపూజలు జరుపుతారు. శ్రవణా నక్షత్రంతో కూడిన ‘దశమి’నాడే విజయసంకేతోత్సవం  జరిపే సంప్రదాయం ప్రబలినా, సాయంకాలం సూర్యాస్తమం తదుపరి  ఓ సుముహూర్త కాలాన ‘విజయకాలం’గా భావించే సమయంలో అమ్మని ‘అపరాజితాదేవి’గా పూజించడంతో భక్తులకు లక్ష్యసిద్ధి కలుగుతుందని విశ్వాసం. ఈ తొమ్మిది రోజులూ కన్యకా, సుమంగళీ పూజలు హోమాదులతో విశేష పూజలు కూడా చేస్తారు. సప్తమీ మూలా నక్షత్రంనాడు ‘సరస్వతీపూజ’ చేయడం కూడా పరిపాటి. దశమినాట దేవీప్రస్థానం జరుగుతుంది. వర్షఋతువులో సంభవించే మధుకీటక భ్రమరాది బాధలను జయించడానికి ప్రకృతిని ఆరాధించడంగా కూడా ఈ పూజావిధానాలు గోచరిస్తాయి. రోజుకో రూపం అందించే నవరాత్రి దేవతలు శుద్ధ పాడ్యమి నాడు నవరాత్రులు ప్రారంభంగా కలశ స్థాపనతో, నివేదన చెసే అమ్మవారు శైలపుత్రి రూపంలో, కనకదుర్గగా ప్రసంనదర్శనం అందిస్తుంది. విదియరోజున బ్రహ్మచారిణి రూపంలో మహాలక్ష్మి మాతలా సాక్షాత్కారం పొందుతుంది. తదియరోజు చంద్రఘటగా,గాయత్రీదేవి రూపంలో పూజింపబడి, కోటిసూర్య కాంతులతో దర్శనం యిస్తుంది. చవితినాడు కూష్మాండగా, అన్నపూర్ణగా భక్తుల మనోభీష్టాలు తీరుస్తుంది. పంచమినాడు స్కందమాత, లలిత పరమేశ్వరి అవతారంలో కనిపిస్తుంది. షష్టి రోజున కాత్యాయనిగా, బాలా త్రిపురసుందరిగా, ‘అమ్మ’గా దర్శనమిస్తుంది. సప్తమి రోజు కాళరాత్రిగా, సంగీత సాహిత్యాలతో కూడిన విద్యా విజ్ఞాన ప్రదాతగా, వీణా పుస్తకదారిణిగా దర్శనమివ్వడంతోపాటు, ఈ రోజున పిల్లలకు విద్యాభ్యాసం చేయించడం సదాచారంగా వస్తోంది. అష్టమి నాడు మహాగౌరీగా, దుర్గాదేవిగా అలంకరణతో దర్శనీయం అవుతూ భక్తులతో శ్రీమాత్రేనమ: అనే నామం కొన్ని కోట్లసార్లు భక్తులతో నామసంకీర్తనం చేయించే ఘనత ఈమేదే. నవరాత్రుల్లో చివరి మూడు రోజుల్లో మొదటి రోజు దుర్గాష్టమి రోజు ప్రారంభించే ‘దుర్గాసప్తశతి’ పారాయణానికి శ్రీకారం చుట్టబడుతుంది. మహానవమిగా పిలవబడే నవమి రోజు సిద్ధమాతగా, మహిషాసురమర్దినిగా అష్టోత్తర శతనామ, కుంకుమార్చనలు, భాగవత పారాయణలు కడు ప్రసిద్ధంగా ఆచరిస్తారు. దేవతలందరూ శక్తితో సమిష్టి శక్తిగా అవతరించి మహాశక్తి స్వరూపిణిగా దర్శమిస్తుంది. చెడు పై మంచి సాధించే విజయమే మహిషాసురమర్దినిగా దుర్గాదేవిని కొనియాడుతారు. దశమిరోజు రాజరాజేశ్వరిగా, శతృనాశనం చేసి మిత్రవృద్ధి చేకూర్చి ముక్తిప్రదాతగా దర్శనమిస్తుంది. నామ రూపాలు వేరుగా ఉన్నా, భావనతో ఒకే శక్తి రూపం యిన్ని విధాలుగా ఉందని భావిస్తూ, ఎవరికిష్టమైన వారి దేవతారూపాన్ని వారు భావించుకుంటూ పూజచేస్తే ఫలితం అనంతం అని విజ్ఞుల భావన. దేవీ నవరాత్రుల పూజోత్సవాలు పాడ్యమి నుంచి దశమి వరకూ జరుపుకునే దశలో భద్రకాళి అష్టాభుజ మహిషాసురమర్దనిగా అవతారమెత్తి ౦ ఆదిశక్తి, మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాడుర్గాలుగా అవతరించి, ఈ దేవతలను హ్రీం, శ్రీం, క్లీం, సంకేతమూర్తిగా ఆరాధిస్తారు. ఆయురారోగ్యైశ్వర్యాలతోపాటు ప్రశాంతమైన చితాన్ని ప్రసాదించే త్రిభువన, శంకరతోషిణి, విశ్నువిలాసినిగా ఈ అమ్మలగమ్మ అమ్మగా విరాజిల్లుతుంది. ఆశ్వయుజ మాస ప్రత్యేకతలు శుక్లపక్షం తదియ (మేఘపాలీయ తృతీయా వ్రతం), చవితి (దేవతలను, సువాసినులను పూజించడం, గణేశ చతుర్థి), పంచమి (ఉపాంగ లలితావ్రతం, శాంతి పంచమీవ్రతం), సప్తమి(శుభ సప్తమి, ద్వాదశ సప్తమి పూజ, పత్రికాప్రవేశం పూజ), అష్టమి (మాళవదేశపు ప్రత్యేక పర్వంగా చాగ్ హర అష్టమి, దుర్గా/మహా అష్టమి, దుర్గాపూజ, భద్రకాళీపూజ, శుక్రధ్వజోచ్చ్రాయవిది, కాలత్రిరాత్ర వ్రతం – చేయాలని చతుర్వర్గ చింతామణి ప్రస్తావించింది), నవమి (మాతృవ్రతం, నామనవమీ వ్రతం, దుర్గానవమీవ్రతం, శౌర్య వ్రతం, భద్రకాళీ వ్రతం, కోటిగుణకరందానం, మహాఫలవ్రతం, ప్రదీప్తనవమీ వ్రతం చెసే సంప్రదాయాలున్నాయి. మహాపూజా, బలిదానం, హోమం పారణ, జపహోమాధ్యాపోషణం, సువాసినీపూజ చేస్తారు. ఆశ్వయుజ శుద్ధ నవమి రోజు స్వారోచిన మన్వంతరాది దినంగా స్వారోచిషమనువుల్లో రెండవవాడు పుట్టాడు. మొదటి మనువు స్వాయంభువువలె స్వారోచిషు మనువు కూడా ధర్మాత్ముడు, వదాన్యుడుగా పేరుపొందాడు. దశమిరోజు – దసరాతోపాటు కూష్మాండ దశమి, మహారాష్ట్రలో జరుపుకునే నవరాత్రులు, బెంగాల్ లో దుర్గాపూజలు, ఆంధ్రదేశంలో ఉపాధ్యాయ-విద్యార్థుల అన్యోన్యతను వ్యక్తపరచే సందళ్ళతోపాటు, ‘గిలకలు పట్టడం’ అని పిలువబడే బడిపిల్లల విల్లంబుల వేషధారణలతో, ఇంటింటికీ తిరిగి గురుదక్షిణను కోరడం, విల్లంబులు ధరించిన బడిపిల్లలు భటులుగా, పంతుళ్ళు సేనానులుగా సంచరించే దృశ్యం విశ్వామిత్రుని వెంట వెళ్ళే రామలక్ష్మణుల జ్ఞప్తికి రావడం, ఆంద్ర తమిళనాట ఆడపిల్లల బొమ్మల కొలువులు, దశమిరోజు కనిపించే మరికొన్ని సంబరాలు. మనం ఏటికోసారి జరుపుకునే ‘ఉపాధ్యాయ దినోత్సవం’ ఆశయాలన్నీ దసరాకు గిలకలు పట్టే మన ప్రాచీనాచారంలో గర్భితమవ్వడం కానవస్తుంది. దసరా సందర్భంగా సారస్వతం ’దసరా పద్యాలు’, పాటలు మంజరి ద్విపద రూపంలో ఉండడం, ఈ పాట పద్యాలు పెద్దాపురపు ఏలిక వత్సవాయి తిమ్మజగపతికి అన్కితమవ్వడంతో ఆరాజు సారస్వతసృష్టికి కొంత దోహదకారి అని తోస్తోంది. చౌషష్టి విద్యలకు శార్వాణివమ్మ! బహుశాస్త్ర పుస్తక పాణి నీవమ్మ! గాన విద్యాల కెల్లా కళ్యాణివమ్మ! (సరస్వతీ ప్రార్థన), గురు దక్షిణ కోసం (అనయంబు మేము విద్యాభ్యాసంబునకు అయ్యవారిని చాలా ఆశ్రమించితిమి), పప్పు బెల్లాలు, గడుసుమాటలు, లోభి:రూకల పాటల పద్యాలు, ఎలుగెత్తి చాటి గిలకలు బద్ద కొట్టడంతో బుక్కా,బుగ్గి,పువ్వులు జల్లుతూ ‘బాలకుల దీవెనలు బ్రహ్మదీవెనలు’ అంటూ భారతవాక్యంగా గానం చేస్తారు. మధ్వాచార్య జయంతి – త్రిమతాచార్యులలో మూడవవాడు మధ్వాచార్యులు విళంబి క్రీ.శ. 1238, ఆశ్వయుజ శుద్ధ దశమి రోజునే జననంతో, జయంతి జరుపుతారు. వాసుదేవుడు అన్న సహజ నామంతో సర్వవిద్యాపారగుడవడం, ఉడిపి క్షేత్రంలో అచ్యుత ప్రేక్షులను యతివర్యులకు శిష్యుడవడం, పదకొండవ ఏటనే సన్యాసం స్వీకరించడంతో ‘పూర్ణబోధ’గా మారాడు. అనంతేశ్వరస్వామి ఆలయమ్లో గొప్ప పండితుని వేదాంత విషయాల్లో ఓడించుతచే ‘మధ్వ’, ‘పూర్ణ’ప్రజ్ఞ’ అను బిరుదులూ అందుకోవడంతో, వేదాంత విద్యారాజ్య పట్టాన్ని పొంది ఆనందతీర్తులు అనే నామాన్ని పొందాడు. మంచి వ్యాయామకాయుడుగా భీమసేనుని అపరావతారమని ప్రజల విశ్వాసం. వాయుదేవుని మూడవ అవతారంగా స్వయంగానే చెప్పుకొన్నారు. వైష్ణవమత బోధకుల్లో అగ్రగణ్యులు. విశ్వవిఖ్యాత ద్వైత సిద్దాంతాన్ని లోకానిని అందించి, భక్తి తత్త్వానికి నూతనోజ్జీవనాన్ని కల్గించడమే కాక, వీరి సందేశాల్ని శ్రీకృష్ణచైతన్యాది మహానుభావులు ప్రచారం చేశారు. శుక్ల ఏకాదశి (పాశాంకుశైకాదశి వ్రతం), ద్వాదశి (విశోక, గోవత్స వ్రతాలు, అఖండ ద్వాదశి పద్మనాభ వ్రతాలు, వాసుదేవపూజలు జరుపుతారు). పూర్ణిమ (కౌముద్యుత్సవం, అక్షక్రీడ, కోజావర్తివ్రతం, లక్ష్మీన్ద్రకుబెరాది పూజలు)ని మహాశ్వినిగా భావిస్తారు. ఆంధ్రదేశంలో గొంతెమ్మ పండుగ చేస్తారు. పూర్ణిమనాడు నారదపురాణం దానమిస్తే ఇష్టలోకప్రాప్తి లభిస్తుందంటారు.
ఆశ్వయుజ కృష్ణ(బహుళ) పక్షం
కృష్ణ పాడ్యమి (జయావాప్తి వ్రతం), విదియ (అశూన్యవ్రతం, అట్లతద్ది భోగి), తదియ (గణేశ లలితాగౌరీ చంద్రోదయ  వ్రతాలు). ముఖ్యంగా మన తెలుగువాళ్ళు జరుపుకునే అట్లతద్ది’ నోము నోచుకుంటే కన్యలకు ముసలి మగడు రాడని, పెళ్లి అయిన వాళ్లకు నిండు ఐదవతనం  లభిస్తాయని ఓ విశ్వాసం. అట్లతద్దోయ్ ఆరట్లోయ్, ముద్దపప్పోయ్ మూడట్లోయ్, సీమ పచ్చి మిరపకాయ చిర్రో చిర్రో, నీ మొగుడు కొడితే మొర్రో మొర్రో” లాంటి పాటలు చాలా ప్రసిద్ధం. అష్టాదశ వర్ణాలకు అట్లతద్ది అన్న పేరుంది. అట్లతద్దికి గోదావరీ నీళ్ళు అట్లులాగా విరిగిపోతాయట.   “బడిబడి నట్లతద్దె యను పండుగ వచ్చిన సంతసిల్లుచున్ వదిదెలవారు చుక్కబొడువం గని లేచి సమస్త బాలికల్ మడినిడి పొట్లకాయ పరమాన్నము నన్నము మెక్కి యాటలన్ బడిమరునాటనుయ్యెలలపై దగనూగుట జూడనొప్పదే! (దాసు శ్రీరాములు – తెలుగునాడు)   అలాగే, అట్లతద్ది – గోరింటాకు తప్పకుండా పెట్టుకొనే స్త్రీల మూడు పండుగల్లో అట్లతద్ది ఆఖరుది. ఈ గోరింటాకు నే నఖరంజని గా సంస్కృతంలో పిలవడం, అదే అర్థం గోరింటాకు అని బ్రౌన్ దొర ప్రస్తావించడం ఆనందం, ఆశ్చర్యం కలగక మానవు. కృష్ణ పంచమి (గదాధర పద్ధతిలో ఘోటక పంచమి), అష్టమి (జితాష్టమి, బహుళాష్టమిగా మంగలావ్రతం, మహాలక్ష్మీ వ్రతం)(జీవత్పుత్రికాష్టమి, కాలాష్టమిగా కూడా పిలుస్తారు). నవమి (రథనవమీ వ్రతం, దుర్గాపూజ), ఏకాదశి (రమైకాదశి) నాడు వాల్మీకి జననం గా కూడా కొందరు భావిస్తారు. ద్వాదశి (వైద్యవిద్యావేత్త, ధన్వంతరి జయంతి)(వ్యాఘ్ర ద్వాదశి – శిశువుల సంక్షేమార్ధం),  త్రయోదశి – దీపావళికి రెండు రోజులు ముందుగా ధనత్రయోదశి (గోత్రిరాత్రవ్రతం), చతుర్దశి (నరక చతుర్దశి), అమావాస్యతో దీపావళిని జరుపుకోవడంతో ఆశ్వయుజమాసం పరిసమాప్తమవుతుంది. ఆశ్వయుజమాసం ‘దేవీనవరాత్రి సహిత దసరా పండుగగా విజయదశమి, కన్యలకు అట్లతద్ది, అందరికీ మరొక పెద్ద పండుగగా  “దీపావళి” ముఖ్య పర్వాలుగా ప్రాశస్త్యం పొందింది.

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information