Friday, September 26, 2014

thumbnail

"అన్నమయ్య అన్నమాట"కు బాపు బొమ్మ

"అన్నమయ్య అన్నమాట"కు బాపు బొమ్మ

- డా.తాడేపల్లి పతంజలి

వేంకటేశుడన్నమయ్యగ వేషమూని ముద్దుగారే యశోద చిన్ముద్ర చూపి భావయామి యనుచు పాడుచుండ పరవశించుచుండెను బాపు బాలకృష్ణ బాపుగారు అన్నమయ్య అన్నమాటకి వేసిన ముఖ చిత్రం మొట్ట మొదటి సారి చూసినప్పుడు అయిదు నిమిషాలు మాట రాలేదు. తెలియని అలౌకికానందం కలిగింది.ఆ సమయంలో స్వామి నా ఊహలో మెదిలించిన పద్యము పైది. పద్య వివరణ వేంకటేశ్వర స్వామి అన్నమయ్యగా తన రూపము మార్చుకొన్నాడు. చిన్ముద్ర ను చూపిస్తున్నాడు. చిన్ముద్ర అంటే జ్ఞాన ముద్ర. చూపుడు వ్రేలి కొనను బొటన వ్రేలి కొనతో చేర్చి మిగతా మూడు వ్రేళ్ళను చాచి ఉంచిన ముద్ర. చూపుడు వేలు జీవునికి . బొటనవేలు పరమాత్మకి ప్రతీక. చూపుడు వేలు అనే జీవుడిని వాడి మానాన వాడిని వదిలివేయ కూడదు. అలాచేస్తే సత్వ రజస్తమోగుణాల లో కూడిన కర్మలు చేస్తుంటాడు. చూపుడు వేలు అను జీవుడిని బొటనవేలనే దైవముతో కలపాలి. అలాచేస్తేనే జీవునికి సార్థకత అని అన్నమయ్య వేంకటేశుడు ముద్దుగారే యశోద చిన్ముద్ర చూపిస్తున్నాడు.. అన్నమయ్య రచించిన ముద్దుగారే యశోద , భావయామి –అను రెండు కీర్తనలు కృష్ణునికి సంబంధించినవి.ఈ రెండు కీర్తనలు మధుర భావ తాదాత్మ్యాన్ని కలిగించేవి. అద్భుతమైన భావ సంపద కలిగినవి. (ఈ రెండు కీర్తనలకు నేను రచించిన అర్థ తాత్పర్య విశేషాలు చదవాలనుకొనేవారు ఈలంకెలను దర్శించండి) http://www.scribd.com/doc/239109473/MUDDUGARE-YASODA http://www.scribd.com/doc/239109674/Bhavayaami-Gopala-Balam ముద్దుగారే యశోద కీర్తనలో ‘ముద్దుగారే’ అను విశేషణము కృష్ణునికి సంబంధించినది. బాపుగారి చిత్రంలో చిన్ముద్ర చూపుతున్న అన్నమయ్య వేంకటేశుడు ముద్దుగారేటట్లు ఉన్నాడు కనుక ‘ముద్దుగారే యశోద చిన్ముద్ర చూపి’అని రచించుట జరిగింది. బాపుగారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే శిష్యునిగా కూర్చున్న బాల కృష్ణుడు చిన్ముద్రను అనుకరిస్తున్నట్లుగా కనబడుతుంది.బొటన వేలిని, చూపుడు వేలును పూర్తిగా కలుపలేదు. గురువుగారు చెప్పినది అనుకరించే ప్రయత్నము చేస్తున్నట్లుగా కనిపిస్తుంది.భగవంతుని ఉత్తమ శిష్యునిగా బాపుగారు చిత్రీకరించారు. స్వామి వారు భక్త జన లోలుడు. భిక్షులు వచ్చెద రేడ్చిన భిక్షాపాత్రమున వైచి బెగడించి నినున్ శిక్షించెదరని చెప్పిన భిక్షులగని తల్లి నొదిగి భీతిల్లు నృపా! (భాగవతము . దశమస్కంధము . పూ. 421 ప.) ఒరేయ్! నువ్వుగనుక ఏడ్చావంటే భిక్షగాండ్రు వస్తారు. నిన్ను వాళ్ళ భిక్షాపాత్రలో వేసుకుని పోయి నీకు శిక్ష వేస్తారు సుమా! అని అమ్మ యశోదమ్మ భయపెట్టింది. ఒకసారి నిజంగానే ఒక భిక్షువు వచ్చాడు., కృష్ణమూర్తి భయపడుతూ తనను ఎక్కడ ఎత్తుకు వెళతాడో అని తల్లి చాటున దాక్కున్నాడుట. ఆయనకు భయమేమిటి?!. ఇది భక్తురాలైన అమ్మను సంతోష పెట్టే చర్య. అలాగే బాపుగారి చిత్రములో కూడా జగద్గురువు అయిన ఆ కృష్ణ మూర్తి శిష్యునిగా ఉండటమేమిటి ? అంటే – భక్తుడైన అన్నమయ్యను, మనలను ఆనందపరచటానికి. వేంకటేశుడు అన్నమయ్య కీర్తనలు విని’ ప్రాయంపువాడనైతి’ అని మెచ్చుకొన్నాడు. పరవశించాడు. అన్నమయ్య కీర్తనలువింటున్న బాపు బాల కృష్ణునిలో కూడా దీక్షగా చూస్తే ఆ పరవశత్వము కనబడుతుంది. అందుకే పరవశించుచుండెను బాపు బాలకృష్ణ అని నాలుగో పాదము రచించుట జరిగింది. ఎంతో భక్తి, పరిణతి ఉంటేనే కాని, ఇటువంటి అద్భుతమైన చిత్రము రాదు. నేను పూర్వ జన్మలో ఏదో ఒక లవలేశము పుణ్యము చేసుకొని ఉంటాను. అందుకే నా పుస్తకాన్ని ప్రచురించిన సుజనరంజని సీతారామ శర్మ గారికి , శాంతా బయొటిక్స్ అధినేత పద్మ భూషణ్ శ్రీ వరప్రసాద్ రెడ్డిగారికి -బాపుగారిచేత ఈ అన్నమయ్య అన్నమాటకి పుస్తకానికి ముఖ చిత్రము వేయించాలనే ఆలోచన కలిగింది.ఇంత అందమైన ముఖచిత్రము రావటానికి కారకులయిన వారికి , బాపుగారితో పాటు ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను. నాపుస్తకంలో ఈ పద్యము చివర వ్రాసిన వాక్యాలను మరొక సారి స్మరించి సెలవు తీసుకొంటాను. లక్షలాదిమంది పరవశించే వెన్నెలమ్మ చల్లదనాన్ని , బాపుగారి చిత్ర ప్రతిభని నేను ఈ రోజు ప్రత్యేకంగా అభినందించనక్కరలేదు కాని, మనస్సు ఊరుకోక ఆ కళాసరస్వతి పాదాలను కళ్లకద్దుకొంటున్నాను. స్వస్తి. *------*

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information