బాపు -- రమణ -- స్నేహం - అచ్చంగా తెలుగు

బాపు -- రమణ -- స్నేహం

Share This

బాపు -- రమణ -- స్నేహం

- చెరుకు రామమోహనరావు

 వారిని ఏకవచనముతో సంబోధించి నందుకు, నా క్షమాపణలు వారికి అందుతాయని ఆశిస్తున్నాను. ఈ రాతకు చేయూత నాకు చి.కుం. పద్మిని పెట్టిన మేత. అదేపనిమీద కాకపోతే మనము మనవద్ద కొలబద్ద వుంచుకోము( దర్జీలము కాకుంటే తప్ప). అనుకోకుండా ఏదయినా కొలువవలసి వస్తే అప్పుడు ముఖ్యముగా చేతులను ఉపయోగించవలసి వస్తుంది. బొటనవ్రేలు కాకుండా నాలుగు వ్రేళ్ళు కలిపి యుంచిన కొలతను బెత్తె అంటారు. అదే సాచిన బొటనవ్రేలు చూపుడువేలు మొనల మధ్య దూరాన్ని జిట్టే అంటారు. సాచిన చిటికెన వ్రేలు బొటన వ్రేలుకు మధ్య దూరాన్ని జాన అంటారు.మోచేతినుంది ఉంగరపు వ్రేలు కొనవరకు గల దూరాన్ని మూర అంటారు. ఈ కొలమానము లో అతి పెద్దది 'బార'.చేతులు భూమికి సమాంతరముగా సాచితే ఎడమ మధ్య వ్రేలు మొన నుండి కుడి మధ్య వ్రేలు మొన వరకు గల దూరము 'బార'. మానవ శరీర కొలమానములో ఇంతకన్నా పెద్దది లేదు. వీడేదో పైత్యకారునివలె బాపు-రమణల గూర్చి చెప్పకుండా మూర బార అంటాడేమిటి అనుకొంటున్నారేమో. మన స్పందనలను తెలిపేది ఈ కొలమానాలే. ఇప్పుడు స్నేహాన్ని కొలవాలంటే అతి పెద్దది 'బార' కాబట్టి ,చేతులు సాచి ఇంత గొప్ప స్నేహము అనవలె. దానిని మనము అనంతము వరకు ఊహించుకోవచ్చును. ఆ బారను సాకారము చేసిన స్నేహము (బా) బాపు (ర) రమణల స్నేహము. అసలు మైత్రి (సంస్కృతము),స్నేహం (తెలుగు),దోస్త్ (ఉర్దూ) మిత్ర(hindi) నట్పు (తమిళము) స్నేహ (కన్నడము) సుహృత్(మలయాళము),తెలుగులో వ్రాస్తే, ఫ్రెండు(ఇంగ్లీషు) ఇన్ని భాషలలో ఇన్ని సమానార్థక పదాలుంచుటకంటే అన్ని భాషలలోనూ ' బా ర' అంటే వారి స్నేహానికి 'భారత రత్న'బిరుదునిచ్చినంత ఘనత నాపాదించినట్లవుతుందేమోనని నా ఆలోచన. కవనము చిత్రలేఖనము నాటకము(నాట్యము అంటే నాటకము అనే) (మన సందర్భములో సినిమా) అన్నే కళలే. ఈ కళారంగానికి అంతకన్నా తెలుగు భాషకు, తెలుగు అక్షమాలకు telugu జాతికి చేసిన సేవ అపారము అనితర సాధ్యము. నేను ఉదహరించ నక్కరలేదు.నాకన్నా, ఈ వ్యాసము చదివే మీకే విదితము. బాపు బొమ్మ వేస్తే ముళ్లపూడి రమణ అక్షరాలద్దినట్టు ఉంటుంది. ముళ్ళపూడి రమణ ఏదైనా రాస్తే-అది అచ్చంగా బాపు బొమ్మ గీసినట్టు ఉంటుంది. అదీ -వాళ్ల స్నేహం. వారి అంతఃకరణ ఎటువంటిదంటే బాపు తన కొడుకుల్లో ఒకరికి వెంకట రమణ అని పేరు పెట్టినాడు. పాలు చక్కెరొక్క పర్యాయమొకటైన వేరు చేయలేడు విధియు గూడ నిలుతురిట్లు జగతి నిజమైన స్నేహితుల్ రామమోహ నుక్తి రమ్య సూక్తి ఈ మాట వారి విషయములో అక్షర సత్యము కదా. 1942లో బాపు ముళ్ళపూడిని తొలిసారి కలిశారు. చెన్నైలోని పి.ఎస్‌. హైస్కూలులో అయిదు ఆరు తరగతులు కలిసి చదివారు. అక్కడినుంచి కేసరి స్కూలుకు మారి విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. మద్రాస్‌లోని పిఎస్ హైస్కూల్లో బాపు, ముళ్లపూడి చదువుకుంటున్న రోజులు. ‘అమ్మ మాట వినకపోతే’ అంటూ ముళ్లపూడి రమణ పొట్టి కథరాస్తే, అది రేడియో అన్నయ్యగా ప్రాచుర్యం పొందిన న్యాయపతి రాఘవరావు సారథ్యంలో నడిచే పిల్లల మాసపత్రిక ‘బాల’లో ప్రచురితమైంది. ఆ పొట్టి కథకు కురచ బొమ్మ వేసింది బాపు. అలా బొమ్మా బొరుసుగా ప్రారంభమైన స్నేహం -దిగ్దిగంతాలకు విస్తరించింది. స్నేహానికి ‘బాపు రమణ’ల మార్క్ పడింది. రమణది తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం. బాపు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం (కంతేరు). ఆ రెండు పట్టాలూ చెట్టాపట్టాలేసుకుని నడవడం పరుగెత్తడం మొదలై 66 ఏళ్ళయింది. తూర్పు పడమరలనేకము చేసిన ఘనత వారిది. ఆలుమగలయినా ఆప్తమిత్రులయినా అన్నదమ్ములయినా చిరకాల బాంధవ్యాన్ని నిలబెట్టి నడిపేదే సూత్రం.అది తెలుసుకొన్నారు వారు మాత్రం. అందుకే వారి స్నేహం నిరంతర చైత్రం. ఒకరి సుగుణాలు నచ్చినప్పుడు ప్రేమించడం సహజం, మామూలే. కాని నచ్చని గుణాలు కనిపించినప్పుడు వాటిని సహించడం, భరించడం అదే ప్రత్యేకత. అందుకే పెద్దలన్నారు "సర్వదా సూకరం మిత్రం దుష్కరం పరిపాలనం--అనిత్యత్వాచ్చ చిత్తానాం ప్రీతిరల్పేపి భిద్యతే "అని . ఈ శ్లోకార్ధాన్ని ఆకళింపు చేసుకొన్నారు కావుననే అజరామర స్నేహాన్ని ఆలింగనం చేసుకోగలిగినారు. రమణ గారి మాటల్లో "అతనికి ప్రథమ కోపం. తిక్క దూకుడు. ముందర అపార్థం చేసుకుని ఆనక అర్థం చేసుకోవడం. అతను అపార్థసారథి అయితే నేను అప్పార్థసారథిని. అంటే అప్పులతో – ఋణానుబంధాలతో బంధాలను గట్టిపరచుకునేవాడిని. నిజానికి ఎవడి సొమ్ము వాడు ఖర్చుపెట్టుకుని అప్పు చేయకుండా బతికేస్తూ వుంటే జీవితం డల్‌గా, చెరువులో నీరులా కదలకుండా పడివుంటుంది. అదే అప్పులుచేస్తూ, మస్కాలిస్తూ తీరుస్తూవుంటే – తిట్లూ, కొట్లాటలూ సందడితో బతుకు సెలయేరులా పరుగులు పెడుతుంది. జలపాతంలా ఉరుకుతుంది. బాపుకి అప్పులివ్వడం తప్ప అడగడం తెలీదు. నాకు అప్పు చేయడం తప్ప ఇవ్వడం తెలీదు. ఈ మధ్య కొంచెం డబ్బుచేశాక… వద్దులెండి. బాపు రోజుకి 16-18 గంటలు పనిచేస్తాడు. నేను 16-18 గంటలు పడుకుంటాను. అదేమిటి అంటే ఆలోచిస్తున్నాను అంటాను." "1942లో మేము మెడ్రాసు పిఎస్ హైస్కూలులో, అయిదు ఆరు క్లాసులు కలిసి చదువుకున్నాం. హైకోర్టు జడ్జి చేసిన చింతగుంట రాఘవరావు గారి అబ్బాయి – మల్లికార్జున్ (ఇతనూ హైకోర్టు రిజిస్ట్రారు చేశాడు) – పుట్టు జీనియస్ అల్లాడి నరేంద్ర, కర్రావారి అబ్బాయి రమణి, హైకోర్టు జడ్జిగా చేసిన పెనుమెత్స శ్రీరామరాజూలాంటివాళ్ళు క్లాసుమేట్లు. టిన్‌టిన్ కథలలో కెప్టెన్ హడాక్ వుంటాడు. బ్లిస్టరింగ్ బార్నకిల్స్ అంటూ మొదలుపెట్టి తిట్లదండకం చదువుతుంటాడు. తెలుగు టీచరు దొండపండు రామ్మూర్తి గారు కూడా – అలాగే – ఆనాడే – అలాంటి తిట్లు చదివేవారు. ఇడ్డియట్ – బఫూన్ – స్కౌండ్రల్ – దున్నపోతు – పందికొక్కు – రికామీ గొడ్డు అంటూ గొణుగుతూనే వుండేవాడు. సత్తిరాజువారి( బాపు గారి) సత్రంలాంటి ఇంటిలో ఒక రాజూ రాణీ – అయిదుగురు పిల్లలూ (అందులో ఒక్క ఆడపిల్ల) ఏడుగురు అత్తగార్లు – అయిదుగురు పిల్లలు స్నేహితులు, నాలాంటి ఆస్థాన ఫ్రెండ్సు – వీళ్ళుకాక ఇద్దరు ముగ్గురు కోర్టుపక్షులూ వుండేవాళ్ళు. కలవారి కూతురు, మరో కలవారి కోడలూ అయిన సూర్యకాంతమ్మగారు అంత సంపద వుండి కూడా అందరికీ సేవచేస్తూ చారన్నమే పరమాన్నంగా, గడపే తలగడగా, తిన్నవాళ్ల త్రేనుపులే తన ఊపిరిగా సంసారం నడిపేవారు. బాపు తండ్రి వేణుగోపాలరావుగారు నిజానికి కోపాలరావుగారు. కాని చాలా మంచివారు. ఆయనకి ఆస్తమా బాధ. ఒక డాక్టరు-ఆర్సెనిక్ గోల్డ్ ఇంజక్షన్ ఇవ్వడంతో-అది వికటించి బాధ వ్రతరమయిపోయింది. ఆ బాధ పిల్లలు చూడటం ఇష్టంలేక వారిని కోపంతో తిట్లతో భయపెట్టి దూరంగా వుంచేవారు. అయినా బాపూ నేనూ రాత్రివేళ మేడమీద గదిలో నేలమీద పడుకుని చెవులు నేలకి ఆన్చి, ఆయన మూలుగులు విని బాధపడుతుండేవాళ్లం. క్యాలెండరు దేవుడికి దండాలు పెట్టేవాళ్లం. అంత బాధలోనూ సిగరెట్లు కాల్చి అగరొత్తులు వెలిగించేవాళ్లం…." అదే కోతి కొమ్మచ్చి …అంటే! (కోతి కొమ్మచ్చి బాపూరమణీయం మొదటి భాగంనుంచి) 1945లో అమ్మ మాట వినక పోతే అనే శీర్షకన రాసిన చిన్న కథ 1945లో బాల అనే పిల్లల పత్రిక లో ప్రచురితమైంది. ఈ పత్రికను రేడియో అన్నయ్యగా సుపరిచితు లన న్యాయపతి రాఘవరావు నడిపేవారు. ఈ కథ రాసే సమయాని కి ముళ్ళపూడి వయసు 14. బాపు దీనికి బొమ్మలు గీశారు. అలా బాపు-రమణల జంట ప్రస్థానం ప్రారంభమైంది. ఓ రచయితగా, నిర్మాతగా, చిత్రకారునిగా, సినిమా రూపకర్తగా వీరి ప్రయాణానికి నాంది పలికింది. రమణ రాసిన కథలకు చిత్రాలు సమకూర్చే బాపు అనతి కాలంలోనే ఎనలేని పేరు ప్రఖ్యాతులు గడించారు. వారు అక్కడికే పరిమితం కాకుండా చిత్ర సీమలో కాలుమోపారు. తెలుగు కళాత్మక చిత్రాలకు వారి భాగస్వామ్యం ఎల్లలెరుగని కీర్తిని గడించి పెట్టింది. చిత్ర పరిశ్రమకు వన్నెలద్దింది. ఏదైనా సందర్భం లో ఒక వ్యక్తి బాపు గురించి ప్రస్తావిస్తే మరొకరు రమణ గురించి మాట్లాడాల్సిందే. బాపు, రమణ అంటే ఒకరే వేరు వేరు కాదనేంతగా వారి స్నేహం బలపడింది. చిత్రకారుడిగా-రచయిత గా ఈ ద్వయం ప్రారంభించిన ప్రయాణం సినిమా పరిశ్రమలో సంచలనాలను నమోదుచేసింది. తెలుగు సంప్రదాయాన్ని వారిద్దరూ ఆపోశనము పట్టి వెండి తెరకు జిలుగులద్దినారు. వీరిద్దరూ కలిసి ఓ ప్రాజెక్టును చేపడితే ప్రేక్షకులు అత్యద్భుతమైన చిత్ర కావ్యాన్ని అనుభవించబోతున్నామని ఊహించేవారు. చక్కని కథనంతో సంప్రదాయబద్ధ పాత్రలతో ఓ చిత్రాన్ని చూడబోతున్నా మని ప్రేక్షకులు ఉవ్విళ్లూరే వారు. వారిద్దరు కలిసి తీసినమొదటి చలచిత్రము సాక్షి (1967). చివరిది శ్రీరామరాజ్యం (2011). సంపూర్ణ రామాయణం, రామాం జనేయ యుద్ధం, సీతా కల్యాణం చిత్రాలు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మైలు రాళ్ళు. త్యాగయ్య, భక్త కన్నప్ప, శ్రీనాథ కవిసార్వభౌమ చిత్రాలు ప్రతిష్ఠాత్మకమైనవి. పెద్ద తెరపై బాపు- రమణ ద్వయం అద్భుతాన్ని సృ ష్టించాయి. సాక్షి, ముత్యాలముగ్గు, మిస్టర్‌ పెళ్ళాం, భార్యాభర్తలు, వెలుగు నీడలు, భోగి మంట, పెళ్ళి పుస్తకం, మనవూరి పాండవులు చిత్రాలు వారి ప్రతిభకు తార్కాణాలుగా నిలిచాయి. కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, రావు గోపాలరావు, వంటి నటులు బాపు చిత్రాల ద్వారానే సుప్రసిద్ధులైనారు. స్నేహానికి వన్నెల ద్దిన బుడుగు 1953లో ఆంధ్ర పత్రికలో పనిచేసిన సమయంలో రమణ రచన బుడుగుకు బాపు వేసిన కార్టూన్లు మరింత వన్నె తెచ్చాయి. 1942లో ప్రారంభమైన వీరి అనుబంధం షష్టిపూర్తి చేసుకుంది. రమణ తన కలంతో పాత్రలను మాట్లాడిస్తే.. బాపు తన కుంచెతో ఆ పాత్రలకు జీవం పోసేవారు. చదువరులకు ఆ పాత్రలు తమ కట్టెదుట ప్రత్యక్షమయ్యేవి. అది వారిద్దరి ప్రతిభకు నిలువుటద్దం. ప్రపంచంలోని వివిధ వ్యక్తిత్వాలను రమణ తన రచనలో వర్ణిస్తే బాపు తన బొమ్మలతో దానిని సజీవంగా నిలిపేవారు. చలన చిత్ర పరిశ్రమలోనూ.. కథ రమణ.. దర్శకత్వం బాపు.. ఇలా సాగింది వీరి స్నేహ ప్రస్థానం. ముత్యాల ముగ్గు చిత్రంలో కంట్రాక్టర్‌ పాత్రను ఎంత అద్భుతంగా రమణ మలిచారో.. వెండి తెరపై "రమణీయమైన" బాపు రమణీయంగా తీర్చిదిద్దినారు. ఎంతగా అంటే ఆ పాత్రలో రావుగోపాలరావు డైలాగులు ఇప్పటికీ అప్పటి తరం నాలుకలపై ఆడుతూనే ఉన్నాయి. కొన్ని సినిమాలను కొందరే చూస్తారు. బాపు-రమణల సినిమాలను అందరూ చూస్తారనే పేరు తెచ్చుకు న్నాయి. సూక్ష్మంగానూ, సూటిగానూ చెప్పాలంటే వారిద్దరిదీ ఓ స్కూలు. ఆ స్కూలులో వారిద్దరే అన్నీనూ. అక్కడి కృషితో వెలువడే అంశాలు.. అందరికీ ఆమోదయోగ్యాలే. అవార్డులూ, రివార్డులూ పట్టని బాపు తన కెరీర్‌ మొత్తంలో ఒకే ఒక పద్మశ్రీ అవార్డును అందుకోవడం దీనికి నిదర్శనం. మిథునం.. బాపు చేతి రాతలో.. బాపు చేతిరాత నమూనాగా ఒక సాఫ్ట్‌వేర్‌ రూపొందడం దాని గొప్పతనానికి నిదర్శనం. సాధారణ రంగులు ఉపయోగించి, పెన్సిల్‌ స్ట్రోక్స్‌తో చిత్రాలకు అందాలద్దడం బాపు విశిష్టత. నవరసాలు, గంగావతరణం, బ్రహ్మ కడిగిన పాదం, దశావతారా లు.. ఇలా ఎన్నో ఆయన కుంచె నుంచి జాలువారి తెలుగు జాతిని సమ్మోహితుల్ని చేశాయి. తనకు నచ్చితే ఏం చేస్తారనేదానికి ఇదో ఉదాహరణ... ప్రముఖ పేరడీ రచయిత శ్రీరమణ తాను రాసిన మిధునం కథను చిత్రాల కోసం బాపు గారికి పంపారట. బాపు గారికి ఆ కథ విపరీతంగా నచ్చిందట. ఆ విషయాన్ని ఆయన నేరుగా తెలియజేయకుండా మిథునం కథనం బాపు స్వహస్తాలతో రాసి, శ్రీరమణకు పంపారట. ఈ సంఘటనను శ్రీరమణ తన సన్నిహితుల వద్ద ఎంతో గర్వంగా చెప్పుకుంటారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాపు రమణల ద్వయానికి ఓ కీలక బాధ్యతను అప్పగించారు. విద్యా సంబంధ వీడియోల చిత్రీకరణ ఆ బాధ్యత. 1985-90 సంవత్సరాల మధ్య వారు నిర్వర్తించిన బాధ్యత ఇప్పటికీ బడి పిల్లలకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంది. పాఠాలు ఇంత సులువుగా బోధించవచ్చా అని ఉపాధ్యాయులు సైతం అచ్చెరువొందేలా వాటిని చిత్రీకరించా రు బాపు. దూరదర్శన్‌ కేంద్రంలో ఇవి ప్రసారమయ్యాయి. వీటినే జాతీయ దూరదర్శన్‌లో కూడా డబ్బింగ్‌ చేయించి ప్రసారం చేశారు. ఆ పాఠ్యాంశాలకు ప్రస్తుత మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఎ.ఆర్‌. రెహ్మాన్‌ సంగీతాన్ని సమకూర్చారు. ఈ మిలినీయంలో వారు ఓ తెలుగు చానెల్‌కు నిర్మించిన శ్రీభాగవతం ఓ హైలైట్‌. రమణ రచనకు బాపు గీత ఉండాల్సిందే. 2011 ఫిబ్రవరి 23న రమణ తనువు చాలించిన అనంతరం, బాపు ఒంటరయ్యారు. మృత్యువు కూడా తమను వేరు చేయలేదనేంతగా విలసిల్లిన వారి స్నేహమూ కన్నీరు పెట్టుకుంది. ఇప్పుడు తన ప్రియ మిత్రునితో పునస్స మాగమం కోసం.. ఈ రెండేళ్ళలో తన అనుభవాలూ.. విశేషాలూ మూటగట్టుకుని రమణ చెంతకు చేరారు బాపు. ఇక్కడో చిత్రం ఉంది.. శ్రీరామ రాజ్యం సినిమాకి కథ రాసి ముళ్ళపూడి తనువు చాలించారు. బాపూగారికి కూడా అదే చివరి చిత్రం. దాని తరవాత ఆయన వేరే ఏ చిత్రానికీ పనిచేయకుండా రామసాయుజ్యానికి చేరారు. ఈ మూడేళ్ళు కూడా తిరిగి రమణ రాక పోతాడా అని ఎదురుచూసి రాదనీ నిస్చయంచుకొన్న తరువాతే తనువూ చాలించినాదేమో బాపు,అనిపిస్తుంది. 1967లో రమణ రాసిన- సాక్షి- కథను అదే పేరుతో బాపు దర్శకత్వంలో సినిమాగా తీశారు. నిజానికి బాపు అంతకు ముందు ఏ సినిమా దర్శకుని దగ్గర పని చేయలేదు. సినిమా సాంకేతిక నైపుణ్యం గురించి అవగాహన తప్ప అనుభవం లేదు. అయినా మోగా ఫోన్‌ పట్టారు. అప్పటి వరకు ఫిలిమ్‌ స్టూడియోస్‌లోనే సినిమాలను ఎక్కువగా తీసేవారు. అలాంటి బాపు తన తొలి సినిమా- సాక్షిని సహజమైన లొకేషన్లలో తీశారు. స్వతహాగా చిత్రకారుడైన బాపు చలన చిత్ర కారుడుగా తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలందుకున్నారు. దృశాన్ని తీసే విధానం, పాత్రల రూప కల్పన, డైలాగ్‌ చెప్పే విధానం- అన్నింటిలోనూ తనదైన ముద్ర వేశారు బాపు. తెలుగు సినిమాలో- సాక్షినామ సంవత్సరం ప్రారంభమైంది. తెలుగు, తమిళ, హిందీ భాషలలో 51 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఏ సినిమాకు ఆ సినిమాయే కళాఖండం. ఆయన సినిమాను మలచే పద్ధతి చాలా విలక్షణంగా ఉండేది. బాపు ప్రతి సినిమాకు రచన- ముళ్లపూడి వెంకట రమణే. చిన్ననాడే ప్రారంభమైన వారి స్నేహం దినదిన ప్రవర్ధమానమైంది. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండేవారు. ఒకే మాటపై నిలబడేవారు. రమణ అనగానే బాపు గుర్తుకొచ్చేవారు. అలాగే బాపు పేరు వినగానే రమణ పేరు స్ఫురించేది. ఇద్దరిదీ జన్మ జన్మల బంధం.తెలుగు సినిమాను నవ్యపథంలో నడిపించిన వైతాళికులు వీరు. తరతరాలుగా వినే రామాయణాన్ని రసవత్తరంగా వెండి తెరపైన మలచిన సృజనాత్మత శిల్పులు. రమణ రాసే మాటలకు బాపు దృశ్య రూపం ఇచ్చేవారు. ఆయా పాత్రలను సజీవంగా మన ముందు నిలబెట్టేవారు. పురాణాలపై తమకున్న మక్కువను చాటేవారు. మన మనసులపై చెరగని ముద్ర వేసేవారు. బుద్దిమంతుడు- సినిమా నాస్తికత్వం, ఆస్తికత్వం మీద తీసిన విలక్షణమైన సినిమా. స్వతహాగా దేవునిపై అపారమైన నమ్మకం ఉన్న బాపు, ఈ రెండు పాత్రను మలచిన తీరు అమోఘం, అనితర సాధ్యం. ఏ పాత్రను తక్కువ చేయకుండా సహజంగా తీర్చిదిద్దారు. అలాగే ముత్యాల ముగ్గు- సినిమా ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఇంకా ప్రేక్షకుల మనస్సుల్లో ఉండిపోయింది. నేటికీ ఆ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. పాత్రలను మలచిన తీరు, ఆయా పాత్రలతో పలికించిన సంభాషణలు- ఒక కొత్త ఒరవడికి బాటలు వేసినాయి. ముఖ్యంగా రావుగోపాలరావు పాత్ర చిత్రరణ అనిర్వచనీయం. ఆ కాలం నాటి రామాయణాన్ని ఈ కాలాన్ని దృష్టిలో పెట్టుకొని అద్భుతంగా తీసినారు ఆ ఆదర్శ స్నేహితులు.ఒకసారి బాపు రామణల బంధం పై తనికెళ్ళ లేఖ సీతా కళ్యాణం- తెరపై ఓ రసవత్తర దృశ్య కావ్యం. ఈ సినిమా చూసి తెలుగు వారే కాదు, ప్రపంచ సినిమా ప్రముఖులు కూడా అచ్చెరువొందారు. చిత్రకారుడైన బాపు- సినిమాను కూడా ఓ అద్బుత చిత్రంగా రూపుదిద్దేవారు. ఆయనలోని సృజనాత్మక కళాకారుడు ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపించేవాడు. వంశ వృక్షం- సినిమా బాపు విశాల హృదయానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ కథాంశాన్ని- ఏ సనాతన వ్యక్తి, సంప్రదాయం, కులం, జాతిని అమితంగా గౌరవించే ఏ దర్శకుడూ- సినిమాగా తీయడానికి ఇష్టపడడు. కానీ బాపు మనస్సు ఎంత విశాలమైందో, ఆయన ఆలోచనలు, అభిప్రాయలు ఎంత ఉన్నతంగా ఉంటాయో చెప్పడానికి వంశవృక్షం నిదర్శనం. ఈ సందర్భములో చెప్పవలసినది ఏమిటంటే అనిల్ కపూర్ వంశ వృక్షం లో బాపు గారు తనకు మొట్టమొదట హీరో గా అవకాశము ఇవ్వకుంటే తానూ ఈ స్థితికి చేరే వాడే కాదని బాపు గారి నిధనమునకు వచ్చినపుడు స్వయంగా చెప్పిన మాట. ప్రేక్షకులను ఆలోచింపజేయడమే కాదు, ఆత్మ విమర్శ చేసుకొనేలా ఈ సినిమాను మలవటంజరిగింది. అర్ధం లేని సంప్రదాలు, అనాలోచితమైన ఆచారాలతో యువతీ యవకులల్ని బలి చేయవద్దని, కాలంతో పాటు మారి ముసుగులు తీసి చూడమని బోధించటము జరిగింది.. ఇక- రాముడన్నా, రామాయణం అన్నా ఆయనకు అమితమైన ఇష్టం, రాముడు బొమ్మ గీసినా, సినిమా తీసినా ఆయన శైలి విలక్షణంగా ఉంటుంది. ఆయన రామాయణంపై ఐదు చిత్రాలు తీశారు. దేనికదే భిన్నమైనది. ప్రతి చిత్రంలోనూ ఆయనలోని అపారమైన భక్తి ఉట్టి పడేది. రామాయణంపై ప్రతి తరం ఇష్టపడేలా ఆయన ఆ చిత్రాలను మలచేవారు. బాపు రెండు సంవత్సరాల క్రితం తీసిన శ్రీరామరాజ్యం తెలుగు తెరపై రసమయ సుందర కావ్యం. సాంకేతికంగా అద్భుతంగా తీశారు. తన డెబ్బయ్‌ ఎనిమిది సంవత్సరాల వయసులో ఈ సినిమాను- ఆ శ్రీరామ చంద్రుడే తీయించాడని అంటారు. ఈ సినిమా నిర్మాణ సమయంలోనే తన నేస్తం, బహిః ప్రాణం అయిన ముళ్లపూడి వెంకట రమణ మరణించాడు. అది ఆయనకు ఊహించని షాకు. మనసు మొద్దుబారి పోయింది. అప్పటి నుంచి ఆయన ఒంటరివాడై పోయాడు. తనదైన ప్రపంచంలో ఉండిపోయాడు. బాపును నంది అవార్డులు, ఫిలిఫేర్‌ అవార్డులు, జాతీయ అవార్డులు, సన్మానాలు, సత్కారాలు ఎన్నో వరించాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆయన్ని రఘపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీని ప్రదానం చేసింది. ఇవి అన్నీ రమణ స్నేహానికి సాటి రాలేదు.రమణ వస్తాడేమో అనుకొన్నాడు కానీ ఆయన రాక పోవటం మూలాన ఈయనే వెళ్లి పోయినాడు.ఈ సందర్భములో నేను వ్రాసిన ఒక పద్యాన్ని పొందుపరుస్తూ శెలవు తీసుకొంటాను.

No comments:

Post a Comment

Pages