స్నేహాంజలి - అచ్చంగా తెలుగు

స్నేహాంజలి

Share This

స్నేహాంజలి

- డా . నీరజ అమరవాది .

 అక్షరానికి శబ్దం , రూపం ఉన్నట్లుగా , సాహిత్యానికి అక్షర రూపం ముళ్లపూడివారు ఇస్తే , శబ్దాన్ని ( సినిమా రూపంలో ) బాపుగారు ఇచ్చారు . వీరివురు వాగ్దేవికి తమ కుంచెను , కలాన్ని కర్ణాభరణాలుగా మలచారు . శబ్దార్థాల కలయికే బాపురమణలు . కవి కలానికి , చిత్రకారుని కుంచెకు అందని స్నేహాన్ని మనకు పరిచయం చేశారు . అచ్చమైన స్నేహానికి ఉదాహరణగా నిలిచారు . ఆబాలగోపాలానికి చిన్ని కృష్ణుని చిలిపి చేష్టలు ఎంత విన్నా , ఎన్ని చూసినా తనివి తీరదు . అందుకే మన కోసం రమణ బుడుగుని సృష్టించాడు . బాపు వాడికి నిక్కరు , చొక్కా వేసి ప్రాణం పోశాడు . బుడుగుకి తోడుగా శీగానపెసూనాంబను కూడా తీసుకొచ్చారు . వారి అమాయకపు మాటలు , కోతికొమ్మచ్చి ఆటలు ,కోపతాపాలలో బాపురమణల బాల్యం కనిపించకమానదు . తెలుగు అమ్మాయిని బాపు బొమ్మ గా మార్చి ,అందానికి సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చి , ప్రపంచ సుందరీమణులకు ఎదురులేని పోటీని ఇచ్చారు . తెలుగు అక్షరానికి బాపు తన గీతతో ప్రపంచ ఖ్యాతి తీసుకొచ్చారు . (అంతర్జాతీయ అందమైన లిపి పోటీలలో ‘ తెలుగు లిపి ‘ రెండవ అందమైన లిపిగా స్థానం సంపాదించుకొంది . ) రమణ తన సాహిత్యానికి విలువ బాపు బొమ్మ వల్ల వచ్చిందంటే , బాపు తన బొమ్మకి వన్నె రమణ అక్షరం తో వచ్చిందని వాదులాడుకుంటూ , ఒకరి గొప్పతనాన్ని మరొకరు వినమ్రంగా ఆవిష్కరించు కున్నారు. సుమారు డెభ్బై సంవత్సరాలుగా రమణ రచనగాని , బాపు కార్టూన్ కాని లేని ‘ దిన , వార , మాస పత్రిక ‘ లేదంటే అతిశయాక్తి కాదు . వారిని చదువుకోని , అనుకరించని , తెలియని తెలుగువారు / భారతీయులు కూడా లేరనవచ్చు . ‘ ఏకలవ్యశిష్యులకు ‘ కొదవలేదు . ఆయన ‘ స్కూల్ ‘ విద్యార్థులమని చెప్పుకునే దర్శకులెందరో . రమణ రాత బాపు కుంచెతో నడిచే బొమ్మగా మారింది . తెలుగు ముంగిట ‘ ముత్యాల ముగ్గుగా ‘ మారింది . వారి రామభక్తి సామ్రాజ్యాన్ని ఎల్లలు దాటించి , ప్రపంచ సినీరంగానికి ‘ సంపూర్ణ రామాయణం’రూపంలో తెలుగు సంప్రదాయాలను , అందచందాలను తెలియజేశారు . అది అంతర్జాతీయ సినీనిర్మాణ రంగానికి వల్లె వేసే పాఠం అయింది . ‘ గోరంతదీపం ‘ లా ఉన్న తెలుగువారి దర్శకత్వ ప్రతిభని కొండంతగా చేశారు . జీవితంలోని కష్టనష్టాలను సరైన విధంగా పరిష్కరించుకుంటే అవి కూడా అందంగా ఉంటాయని , జీవనపోరాటాన్ని హాస్యరసంతో రంగరించి తీపిగుళికలుగా బాపురమణలు తమ చిత్రాలను మనకు అందించారు . ఒక విధంగా ‘సాహితీ వైద్యం ‘ చేశారు . నిరాడంబరంగా ఉంటూ ఉన్నతంగా ఎలా ఆలోచించాలో మనకు చూపించి ఆదర్శనీయులైనారు . రంభాది అప్సరసలు , ప్రబంధాలలోని అష్టవిధనాయికలు బాపు కుంచెలో బొమ్మ ఒదగాలని ఎంతో ప్రయత్నం చేసి కుదరక , నటీమణులు ‘ విజయనిర్మల , సంగీత , వాణిశ్రీ , జయప్రద , దివ్యవాణి , ఆమని , ఛార్మి ,నయనతారలుగా ‘ జీవంపోసుకొని వచ్చి , ఆయన చిత్రాలలో నాయికలైనారు . బాపు బొమ్మలైనారు . ఈ విషయాలన్నీ నాకెలా తెలుసు అనుకుంటున్నారా ? స్వయంగా బుడుగు శీగానపెసూనాంబకు చెబుతుంటే విని మీ కోసం మరొక్కమారు గఠ్ఠిగా చెబుతున్నాను .

No comments:

Post a Comment

Pages