బాపు చేసిన మాయ - అచ్చంగా తెలుగు

బాపు చేసిన మాయ

Share This

బాపు చేసిన మాయ

– డా.బి.వి.పట్టాభిరాం.

అప్పట్లో ఒక మేజిక్ పుస్తకం రాస్తున్నాను. సీతారాముడు (మా అన్నయ్య, బాపురమణ ల ప్రాణమిత్రుడు) ముఖచిత్రం బాపు కు ఇవ్వమన్నారు. అప్పుడు రమణగారు కూడా మాతోనే ఉన్నారు. మెల్లిగా నా మనసులో ఉన్న సందేహం వెల్లడించాను... “ఏవో కధలు, నవలలు అంటే చదివి వెయ్యటం ఆయనకు అలవాటు. కాని, ఇది మేజిక్ కు సంబంధించిన పుస్తకం కదా, వెయ్యలేరేమో... “ అన్నాను. “అవన్నీ నీకు ఎందుకయ్యా ? నీ వద్ద ఉన్న 4,5 ఇంటర్నేషనల్ మేజిక్ పుస్తకాల కవర్ ఫోటోలు, నా పుస్తకం ప్రూఫ్ పంపాను. ఆయన వేసి పంపిన బొమ్మ చూసి ఆశ్చర్యపోయాను. బాపు క్రియేటివిటీ ని ఏమని పొగడను ? మామూలుగా మెజీషియన్ లు తన టోపీ లోంచి ఒక కుందేలును తీస్తున్నట్టుగా వేస్తారు. కాని బాపు, ఒక పెద్ద కుందేలు మేజిక్ చేస్తూ, తన టోపీ లోంచి నా తలకాయను బయటికి తీస్తున్నట్టుగా వేసారు. ఈ బొమ్మ ను అంతర్జాతీయంగా అనేకమంది తమ మేజిక్ పుస్తకాలకు వాడుకున్నారు. ఈ పుస్తకం అత్యంత ప్రజాదరణను పొంది ,నవోదయ వారిచే 5 మార్లు( 5 editions ) ముద్రితమయ్యింది. ఆ పుస్తకం పేరు “మాయావినోదం .” ఆ బొమ్మలో వినోదం ఉంది, మేజిక్ ఉంది, గమ్మత్తైన ఒక సందేశం ఉంది, అన్నింటినీ మించి బాపు టచ్ ఉంది. ఆ ముఖచిత్రమే ఒక మేజిక్ !ఒకసారి బాపురమణ మా వద్దకు వచ్చినప్పుడు ఒరిజినల్ బొమ్మను తెచ్చి ఇచ్చారు. వారి సంతకం చేసి ఇమ్మని, వారు ఇచ్చిన బొమ్మను ఇప్పటికీ పదిలంగా దాచుకున్నాను. బాపు గారు ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు, మా అబ్బాయి ప్రశాంత్ ఆయన్ను కలిసి, ఒక అద్భుతమైన పాత పెయింటింగ్స్ ఉన్న పుస్తకం బహుమతిగా ఇచ్చాడు. ఆ సాయంత్రం ఆయన మా అబ్బాయి ఇంటికి వెళ్తూ, బుడుగూ- సీజ్ఞాన పెసూనాంబ చెయ్యిమీద చెయ్యి వేసుకున్న పెద్ద బొమ్మను గీసి, మా అబ్బాయికి, కోడలికి బహుమతిగా ఇచ్చారు. ఆ బొమ్మ చాలా పాపులర్ అయ్యి, ఇప్పుడు అన్ని చోట్లా వాడబడుతోంది. బాపు గారు ఏ బొమ్మ గీసినా అదొక అద్భుతం ! చూసేవారి కళ్లపై, మనసుపై చేసే మేజిక్ ! మాయావినోదం !  

No comments:

Post a Comment

Pages