బాపురమణల బడి - అచ్చంగా తెలుగు

బాపురమణల బడి

Share This

బాపూరమణల బడి

- బ్నిం

vlcsnap-2014-09-17-02h23m22s31బాపూరమణలు చలనచిత్రాల్లో బిజీబిజీగా వున్న టైములో ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు – పిల్లలు బడి పట్ల ఆకర్షితులవటానికి ఆడియో వీడియో పాఠాలు తీస్తే బాగుంటుందని అనుకున్నారు. సరదాగా బడికొచ్చి... కులాసాగా పాఠాలు విని... చలాకీగా ఇంటికెళ్ళి... చెల్లికీ తమ్ముడికీ కూడా చెప్పి వాళ్ళూ వస్తానని పేచీ పెట్టేలా పాఠాలు తీయడానికి బాపూరమణల కన్నా సమర్ధులు ఎవరు? అందుకే వారిద్దరినీ పిలిచి ‘అయ్యా ఇది నాకొచ్చిన ఐడియా, విలేజి స్కూళ్ళకి వీడియోలు ఇస్తాం, టీవీలు ఇస్తాం, విసిడి లు ఇస్తాం మీకు కావలసినంత డబ్బిస్తాం, చిన్నపిల్లలకి పాఠాలు తీసిస్తారా?’ అన్నారు. ‘బడ్జెట్ గురించి ఆలోచించద్దు.. నాలుగ్గోడల మధ్య పాఠాలు చెప్పాల్సిన పని లేదు.. మీకు నచ్చిన చోట తీయండి. మేం అన్నీ చూసుకుంటాం’ అని బ్లాంక్ చెక్ లాంటి మాట అనేసారు. ‘మీరు చెయ్యాలి చేస్తున్నారు దట్సాల్’ అని పంపేసారు. ఇంక బాపురమణలు అప్పటికున్న 3 క్లాసుల పుస్తకాల పాతాలన్నీ ఒకటికి పదిసార్లు చదివి అప్పజేప్పేసుకున్నారు. vlcsnap-2014-09-17-02h22m24s245ఇన్నాళ్ళు బుడుగ్గాయల్నీ, సీగానపెసూనాంబ టీజింగుల్నీపెంచి అల్లరి పెంచేస్తున్న బాపురమణల బుర్రలో బుద్ధిమంతుడ్లూ, బంగార్తల్లుల్లా మార్చేసి వాళ్ళని బళ్ళో పడెయ్యడం ఇష్టం ఉండదుగా... అందుకని వాళ్ళ స్కూల్ మారకుండా ఆ స్కూల్లోనే వీళ్ళ పాఠాలు నడిపారు. అదే బాపురమణల బడి పాఠాలు... ఇవి బట్టుగా.. బెంచీలు, గోడకి కొట్టిన బ్లాకుబోర్డు, టేబుల్, కుర్చీ, మాస్టారికే గాలితగిలేలా సీలింగ్ ఫానూ... అంతెందుకు పుస్తకాల బేగులూ, చల్లారిన టిఫెన్ బాక్స్ లూ ఏవీ లేకుండా పిల్లలకి పాతాలేలా చెప్పాలని భావించారో అలాగే ఓ కొన్ని పేజీలు వీడియో కేమెరాలో షూట్ చేసి ఎడిట్ చేసి మ్యూజిక్ వేసి మాకిలాగే వచ్చు అని NTR ముందుపెట్టి చేతులు కట్టుకు నించున్నారు. ‘శభాష్’ అని నూటికి నూటేభై మార్కులు వేసి మురిసిపోయారు ముఖ్యమంత్రి. ‘మీకెంత కావాలి అంత డబ్బు ఖర్చుపెట్టి అచ్చం ఇలాగే తీసిపెట్టండి. నేను మార్పులు చెప్పినా పట్టించుకోకండి’ అన్నారు. ‘ప్రొడక్షన్ ప్లాన్లు, లొకేషన్లూ, టెక్నిషియన్లూ మీరెవరిని పెట్టుకుంటే వాళ్ళే.. ఎవ్వరం వేలెట్టం.. వేలే కాదు మధ్యలో మీకేసి కళ్ళు కూడా ఎత్తం’ అనేసారు. vlcsnap-2014-09-17-02h24m00s142‘మీకెంత రెమ్యూనరేషన్ ఇమ్మంటారు?’ అన్నారు దర్పంగా NTR. ‘మాకు డబ్బులొద్దు’ అన్నారు బాపురమణలు దర్జాగా. ‘హేమి?’ రామారావు కనుబొమ్మల్తో ప్రశ్నించారు. ‘మాకు పిల్లలంటే ఇష్టం.. వాళ్లకి ఉపయోగించే పని చెయ్యటం మరీ ఇష్టం.. అందుకని డబ్బొద్దు...’ అన్నారు. ‘మీ ఇష్టం’ చల్లగా నవ్వారు NTR. అలా మొదలయింది... బాపూరమణల కొత్తసృష్టి... చర్చిస్తున్నారు రమణగారు చకచకా రాసేస్తున్నారు. వీడియో మీడియాలో అంతకుముందు బాపూ గారు వర్క్ చెయ్యలేదు. తనేం తీయాలో డిసైడైపోయింది. ఏ మీడియం అయితేనే? చెయ్యి తిరిగిన చిత్రకారుడికి నీలం రంగైనా పచ్చరంగైనా ఒకటే. కెమెరా మార్పు తప్ప, అంతా vlcsnap-2014-09-17-02h23m51s45సినిమాలానే కదా. గొప్ప ఆర్టిస్టులు ఉండరు ఎంచక్కా. పిల్లలే చెప్పింది చెప్పినట్లు చేస్తారు. గోల ఉంటుంది గానీ గొడవలు ఉండవు. బాపుగారు వాళ్ళతో హాయిగా అల్లరి చేస్తూ.. లొకేషన్లు మారుస్తూ.. పిక్నిక్ లా పిల్లల్ని ఆడుకోనిస్తూ... అప్పుడప్పుడు టీచర్లనీ మారుస్తూ (పిల్లలకి బోర్ కొట్టకుండా) మావిడి తోటల్లో, కాల ఒడ్డుల్లో, లాకుల అందాలలో, చెట్ల నీడల్లో, ఎండ వానల్లో ఆ పిల్లలకి పాటలు నేర్పినట్టు పాఠాలు నేర్పెస్తారు. మధ్యమధ్యలో ఆటలూ, కేరింతలూ పద్యాలూ, శ్లోకాలు, కధలు, పప్పుబెల్లాలు, పళ్ళు, తాయిలాలు అన్నీ వినియోగిస్తూ ఒక కమేడియన్ తో కలిపి 5, 6గురు పిల్లల్తో ఎంతో అద్భుతంగా షూటింగ్ పార్ట్ ని చేసారు. వీడియోగ్రఫీ లో లబ్ధప్రతిష్టులయిన పి.ఆర్.కె. రాజుగార్ని తన టీం లోకి కెమెరామెన్ గ చేర్చుకున్నారు. అప్పట్నుంచి బాపుగారు తీసిన సినిమాలూ, టివి సీరియల్స్ అన్నిటికి పి.ఆర్.కె. రాజుగార్నే కెమరామెన్ గా కోరుకున్నారు. ‘శ్రీనాధ కవి సార్వభౌముడు’ సినిమాకి మాత్రం NTR తనయుడు మోహనకృష్ణ ఛాయాగ్రహణ శాఖ నిర్వహించారు. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ లో గ్రాఫిక్స్ అభివృద్ధి చెందని ఆ రోజుల్లో వందలాది గ్రాఫిక్ కార్డులూ, అక్షరాలూ, అంకెలూ, ఏనిమేషన్ వర్కులూ అన్నీ మాన్యుయల్ గానే చెయ్యాల్సి వచ్చేది. ఈ పనిలో ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ జయదేవ్ బాపూ గారికి ఎంతో సహకరించారు. విఖ్యాత సంగీత దర్శకులు ఎ.ఆర్. రెహ్మాన్ ఈ పాఠాలకి సున్నితమైన నేపధ్య సంగీతం ఇచ్చారు (అప్పట్లో ఆయన పేరు దీపక్). vlcsnap-2014-09-17-02h24m09s230ఇంకా రమణ గారు ఈ పాఠాలకి ఇచ్చిన ప్రణాళికలో పూర్తిగా తెలుగుతనం, పల్లెటూరి వాతావరణం వాళ్ళ పలుకుబడిని వాడారు. పిల్లలకి ఇష్టమైన తీరులో, అర్ధమయే రీతిలో.. సరళంగా, వివరంగా, సరదాగా... ఒక్క మాటలో ‘రమణీ’యంగా పాఠాలు నడిపారు. అఆఇఈ లు పాటకట్టి వరస కట్టేలా ‘ఎ’ తో గమ్మత్తులు చేయించారు. మాతలాతలూ, తికమకలు, కిలకిలలు, తమాషాల మాటలూ, సందర్భోచితంగా రాశి నవ్వుతూ నడిపించారు. అంకెల పాటలు వింటే మర్చిపోలేము. ప్లస్సులో, మైనస్సులో, ఇంటూల్లో, డివిజన్స్లో, సులువుగా బుర్రలో కూర్చునే ట్రిక్కులు చెప్పారు. కేజీలు, లీటర్లు, మీటర్లు, డబ్బు, ఈ మెట్రిక్ లెక్కలు ఎంత బోరు కొట్టకుండా నేర్చేసుకోవచ్చో అంత చక్కగా చెప్పారు. మట్టి, నీరు, నిప్పు, గాలి, భూమితల్లి అని అచ్చ తెలుగులో పంచభూతాల సమస్తాన్ని బాపుగారి విజువలైజేషన్తో విడమర్చేలా చెప్పారు. పంచభూతాల నుంచి... మన ఇల్లు.. ఊరు.. పరిసరాల పరిశుభ్రత అక్కణ్నుంచి ఆరోగ్యం, పర్యావరణం, జంతు పక్షి సహజీవనం ఆవశ్యకత జంతు ప్రదర్సనసాలా ప్రదక్షిణం, జీవరాసులు వాటి నివాసాలూ... పంటలు, కొండలు, మైదానాలు, ఇలా అన్నీ సింపుల్ గా స్వీట్ గా సిన్సియర్ గా రూపొందించారు. ఎక్కడ వీలైతే అక్కడ తెలుగు పద్యాలు, బాల గీతాలూ (రైమ్స్ లాంటివి) చెప్తూ రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, ఏసుక్రీస్తూ, మహమద్ ల పరిచయాలూ, భారత, భాగవతాది భారతీయ సంస్కృతి, మన పండగలూ ఇలా 36 గంటల పాఠాల్లో మూడు తరగతుల పాఠ్యాంశాల్ని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగం చేస్తూ పిల్లలకి సిలబస్ పూర్తీ చేసి, పరీక్ష గట్టెక్కించేసే మాస్టార్లలా కాక... పునాదులు బలపరిచేలా మరింతగా ముందు క్లాసులకి కూడా పనికొచ్చేలా పెద్దబాలశిక్ష లా... తెలివైన అమ్మ చెప్పే పాఠంలా... అమ్మమ్మో, నానమ్మో చెప్పే మంచి కధల్లా.. రూపొందించి బాపూరమణ దృశ్యశ్రావ్య విద్యకి కూడా తమదైన మార్క్ వేసారు. ఆ రంగంలోనూ వాళ్లని ఎవరూ అనుసరించలేరనే మాట పచ్చి నిజం! ఆ తర్వాత పాఠాలకి బాపురమణలు సిలబస్ ని తయారు చేయబోతుండగానే ప్రభుత్వం మారి ఆ మంచి పని మూత పడింది. అప్పుడు చాలా ఏళ్ళకి మళ్ళీ బాపూరమణలు ‘పెళ్లి పుస్తకం’ తో మళ్ళీ సినిమా రంగంలో శ్రీరస్తూ... శుభమస్తు... అన్నారు... vlcsnap-2014-09-16-23h05m01s82 vlcsnap-2014-09-16-23h04m35s79 vlcsnap-2014-09-16-23h01m39s115 vlcsnap-2014-09-16-22h58m47s191 vlcsnap-2014-09-16-22h58m16s136 vlcsnap-2014-09-16-22h57m53s167 vlcsnap-2014-09-16-22h57m44s73 vlcsnap-2014-09-16-22h57m30s188 vlcsnap-2014-09-16-23h02m45s10 vlcsnap-2014-09-16-22h54m15s28 vlcsnap-2014-09-16-22h53m39s178 vlcsnap-2014-09-16-23h10m30s44 vlcsnap-2014-09-16-23h08m38s211 *** శుభం ***

No comments:

Post a Comment

Pages