Friday, September 26, 2014

thumbnail

అక్షరాల గవాక్షాలు

అక్షరాల గవాక్షాలు

-శంకు

తెలుగు దస్తూరి ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొందరి దస్తూరి నారికేళ పాకంలా ఎంతకీ కొరుకున పడనిడైతే, కొందరి దస్తూరి నల్లేరు నడకలా సులభగ్రాహ్యమయే విధంగా సాగుతుంది. ఫలానా వాడిది ‘బ్రహ్మరాత’ అనో, ఫలానా ఆసామీది ‘గొలుసుకట్టు’ అనో మనవాళ్ళు అనుకున్నట్టే ప్రతి భాషలోనూ లిపి విషయంలో వివిధ రకాల శైలికి రకరకాల పేర్లున్నాయి. అయితే, కేవలం ఒక చిత్రకారుడి పేరుతో బహుళ ప్రాచుర్యం పొందిన దస్తూరిగానీ, శైలి గానీ అక్షరాల గవాక్షాలు - అచ్చంగా తెలుగు తెలుగులో తప్ప మరే ఇతర ప్రపంచ భాషలోనూ వున్నట్టు కనబడదు. తెలుగు పత్రికలతో పరిచయం వున్న పాఠకులు, చూడగానే యిట్టె పోల్చేసి అనుకునే ‘బాపు లెటరింగ్’ అనే మాట దాదాపు ఊతపదంలా ఈ రోజు తయారైంది. అందుక్కారణం ఆ శైలికి ఓ ప్రత్యేకత, ఆ దస్తూరికి ఓ ప్రత్యేక ఆకర్షణ ఉండడమే. బాపు తన బొమ్మలకు కాప్షన్ రాస్తున్న కొత్తల్లో అక్షరాలూ గుండ్రంగా లేవని కొందరు విమర్శించారు. ‘గుండ్రటి అక్షరాలు కావాలంటే కంపోజిటర్ చేత టైపు సెటింగ్ చేయించుకుంటే చాలదూ! దానికి వేరే ఆర్టిస్టు ఎందుకూ?’ అని ఆయన అడిగేవారు. తను ఏ పని చేసినా తన ప్రత్యేకత చూపగలగాలని కృషి చేసే బాపు విమర్శలకు వెరవలేదు. వెక్కిరించబడిన తన ఒరవడినే వేలాది తెలుగు పాఠకులు, వందలాది యువ చిత్రకారులు మెచ్చుకుని, ఫాలో అయేటంత పాప్యులర్ చేయగలిగారు. ఒక కథకి పేరు రాసినా, ఓ కార్టూనుకి వ్యాఖ్య రాసినా, ఓ వ్యాపార ప్రకటనకి అక్షరాలతో డిజైను కట్టినా బాపు తన ప్రత్యేక శైలిని కనబరుస్తారు. తన అక్షరాలతో తెలుగు లిపిలో తెలుగుదనం చూపించగలరు బాపు. తన దస్తూరితో తెలుగు సాహిత్యానికి తెలుగు అందాలు దిద్దగలరు బాపు. వ్యాపార ప్రకటనల్లో సాధారణంగా సుదీర్ఘమయిన వ్యాఖ్యలుండవు. క్లుప్తంగా చెప్పినపుడే ఖాతాదారు కన్ను తన ప్రకటన మీద పడుతుందనే నమ్మకం చాలా sankuమందికి వుంది. కానీ కొన్ని సందర్భాల్లో సుదీర్ఘమైన ప్రకటనలు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి సందర్భాల్లో కూడా పాఠకుణ్ణి ఆకర్షించి, యెంత పెద్దదయినా ఆద్యంతం ప్రతి అక్షరాన్ని చదివించే విధంగా అలంకరించి ఆ ప్రకటనను మలచడంలో బాపు సిద్ధహస్తులు.   ఎమెస్కో పాకెట్ బుక్స్ వారి ప్రచురణలకు అనేక సందర్భాల్లో బాపు రచించి అందజేసిన ఫుల్ పేజీ ప్రకటనలు ఇందుకు సాక్ష్యాలు. కార్టూన్ వ్యాఖ్యలు రాసినపుడు బాపు తన బొమ్మలతోనే కాక, అక్షరాలతో కూడా పాథకులను కవ్వించి, నవ్విస్తారు. ఒక కార్టూన్లో మందకొడిగా పడుకున్న మొగుణ్ని చూసి మదనకామరాజు కథలు చదువుకుంటున్న ఇల్లాలు ‘వెవెవ్వే’ అని వెక్కిరిస్తుంది. ఈ కార్టూన్ లో ‘వెవెవ్వే’ అన్న అక్షరాలే కితకితలు పెడతాయి. కొన్ని సందర్భాల్లో కేవలం నోటితోనే సాధ్యపడి, లిపికి అందని శబ్దాలను బాపు తన కార్టూను అక్షరాల్లో తమాషాగా చూపించారు. మచ్చుకి ప్రక్క పేజీలో వున్నా కార్టూను చూడండి.   తన్మయత్వంతో మెలికలు తిరిగిపోతూ గొణుక్కుంటున్నప్పుడు వచ్చే శబ్దం, వణుకుతున్న కూనిరాగంలా ఉంటుంది. ఆ శబ్దాన్ని లిపిలో చూపడం కష్టం అనుకునే వారికి పై కార్టూన్ లో బాపు రాసిన ‘హూ’ అనే అక్షరం ఓ చక్కటి సమాధానం. sanku1తన అక్షరాలూ అంత ప్రత్యేక ఆకర్షణ పొందేందుకు బాపు చాలా శ్రమపడి ఒకటికి పదిసార్లు రాస్తుంటారని కొంతమంది అనకుంటే, అక్షరాల రాసేందుకు ఆయన దగ్గర ఓ ప్రత్యేక సాధనం ఏదో వుందని, దాని సాయంతోనే ఆయన అలా రాయగలుగుతుంటారని ఇంకొందరు అనుకుంటూ వుంటారు. వారి సందేహాలకు ఇటీవల జరిగిన ఓ చిన్న సంఘటన చక్కటి సమాధానం కాగలదేమో. క్రిందటేడు ఆయన అమెరికా వెళ్ళినప్పుడు, అక్కడ ‘తెలుగు అమెరికా’ పత్రికను నిర్వహిస్తున్న శ్రీ డి మోహనరావు గారు ‘వున్న పళంగా మీరు మా ‘తెలుగు అమెరికా’ కి ఓ అడ్వర్టయిజ్మెంట్ రాసిమ్మంటే ఎలా రాసిస్తారో చూడాలని వుందండి!’ అనే చిన్న సందేహం లాంటి కోర్కెను వెలిబుచ్చారు. దానికి బాపు చిరునవ్వుతో ‘అదేం పెద్ద ఘనకార్యం, ఓ తెల్ల కాయితం స్కెచ్ పెన్ను వుంటే ఇలా ఇవ్వండి’ అని వాటిని అందజేయగానే పైపు వెలిగించి, ఓ క్షణం ఆలోచించి, పది నిమిషాల్లో ఈ ప్రక్కనున్న అడ్వర్టయిజ్మెంట్ తయారు చేసిచ్చారు. ఆశువుగా వేసినా, ఆలోచించి గీసినా భాషలో, భావంలో, దస్తూరిలో తన ప్రత్యేకతను చూపడంలో బాపుగారికున్న నైపుణ్యానికి ఈ సంఘటన ఓ చిన్న sanku2మచ్చుతునక మాత్రమే. బాపు అక్షరాల తెలుగు వారిని ఇంతగా ఆకర్షించడం విదేశీ ప్రచురణా సంస్థలను ఆశ్చర్య పరచింది. వారు శ్రీ బాపును విశిష్ట నైపుణ్యం గల ‘కాలిగ్రఫిస్ట్’ గ లెక్కించారు. మాస్కో లో ప్రముఖంగా ఎంచాబడే ప్రోస్వెషేనియే ప్రచురణాలయం వారు ఇటీవల శ్రీ బాపును తెలుగు అక్షరాల పుస్తకం ఒకటి డిజైన్ చేసి ఇమ్మని కోరడం జరిగింది. వారి కోరికపై ‘అందాల అఆ లు’ అనే పేరుతో, రంగుల్లో శ్రీ బాపు రచించి అందజేసిన పుస్తకం ప్రస్తుతం రష్యా లో అచ్చవుతోంది.  

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information