‘ బాపు’ గారు ఒక లెజెండ్ - అచ్చంగా తెలుగు
‘ బాపు’ గారు ఒక లెజెండ్
- బి.వి. సత్యమూర్తి (ప్రముఖ కార్టూనిస్ట్, చిత్రకారులు )

నాకు ఇన్స్పిరేషన్ బాపు గారే !చిన్నప్పుడు మా నాన్నగారు కొంతకాలం మద్రాస్ లో పని చేసారు. అప్పుడు నాకు నాలుగేళ్ళు. మా అన్నయ్యలు
సత్యనారాయణ, సీతారాముడు కు ఫస్ట్ ఫారం లో బాపు క్లాస్ మేట్. తరచుగా ఇంటికి వస్తూ ఉండేవారు. ఆ తర్వాత నేను విద్యాభ్యాసం ముగించుకుని, హైదరాబాద్ వచ్చినప్పుడు అన్నయ్య మళ్ళీ బాపు గారిని పరిచయం చేసారు. బాపు గారు ఆల్ రౌండర్. చిన్నప్పుడు మౌత్ ఆర్గాన్, అకార్డియన్
వాయించేవారు. మంచి ఫోటోగ్రాఫర్ కూడా ! ఫోర్డ్ ఫౌండేషన్ వారు ఇండియా లోని ముఖ్యమైన ప్రదేశాలను ఫోటో తీయించాలని, తమిళనాడు ప్రభుత్వాన్ని సలహా అడిగింది. వారు బాపు గారి పేరు చెప్పారు. బాపు వారితో వెళ్లి, ఫోటోలు తీసి ఇచ్చారు. సినిమాలకు ఆడ్స్ డిజైన్ చేసి ఇచ్చేవారు. వాల్టర్ థామ్సన్ ఆడ్ ఏజెన్సీ లో ఏడాది పని చేసి బైటికి వచ్చారు. వారు ఆయన్ను
బ్రతిమాలి రోజుకు కనీసం ఒక గంటైనా రమ్మని వేడుకునేవారు. బాపు మంచి సంగీతాభిమాని, పుస్తక ప్రేమికుడు కూడా ! అప్పట్లో (1958-1960 )లలో ఆయన ఇల్లుస్త్రేషన్ లేని పత్రిక ఉండేది కాదు. ఎంతో తపస్సుతో, సాధనతో ఆయన ఆ స్థాయికి చేరుకున్నారు. విజయవాడ లో రాఘవయ్య గారు ఎడిటర్ గా వీరు జ్యోతి పత్రిక ప్రారంభించారు. బాపురమణలు ఇద్దరూ కలిసి ఆ పత్రికను ఒక స్థాయికి తీసుకువెళ్ళారు. తర్వాత ఏవో కారణాల వల్ల బయటికి వచ్చేసారు. విజయవాడలో ఒక 50,000 అప్పు తీసుకుని, సాక్షి సినిమా తీసారు. మొదటి సినిమానే పెద్ద హిట్. ఆ తర్వాత వరుసగా బంగారు పిచుక, బుద్ధిమంతుడు, బాలరాజు కధ వంటి సినిమాలు తీసారు. రమణ గారు కధ, స్క్రిప్ట్, డైలాగ్ లు రాసిన సినిమాలు అన్నింటికీ ఈయన దర్శకత్వం వహించారు. ఆడ్స్ డిజైన్ చేసారు. ఆయన సినిమా తీసే పధ్ధతి కూడా విలక్షణంగా ఉండేది. స్క్రిప్ట్ కి డైలాగ్ లు విభజించి, తగిన ఇల్లుస్త్రేషన్ లు ఎడమ వైపు, డైలాగ్ లు, సౌండ్ ట్రాక్ వంటివి కుడి వైపు రాసుకునేవారు. అలా మొత్తం సినిమాకు స్టొరీ బోర్డు తయారు చేసేవారు. ఇలా గీసేవారు
తెలుగులో ఇంతవరకూ ఎవరూ లేరు. ఆ ఆర్ట్ అందరికీ రావద్దూ... స్టొరీ బోర్డు ప్రకారం సీన్, ఆంగిల్ సెట్ చేసుకోవడం కెమెరా మెన్ కి చాలా సులభం అయిపోయేది. దీనివల్ల సినిమా రీల్ కూడా బాగా ఆదా అయ్యేది, బడ్జెట్ తగ్గేది. నేను మొదట్లో చదువుల్రావ్ కార్టూన్లు వేస్తూ ఉండగా, బాపు కూడా ఆంధ్రపత్రికలో బొమ్మలు వేస్తుండేవారు. ఆయన నా బొమ్మలు, కార్టూన్లు చూసి, నన్ను బాగా ప్రోత్సహించేవారు. అప్పట్లో నేను హైదరాబాద్ కెమికల్స్ లో పబ్లిసిటీ డిపార్ట్మెంట్ లో పని చేసేవాడిని. 3 సం. తర్వాత శ్రీ సత్యసాయిబాబా దీవెనలతో బైటికి వచ్చి, ‘సత్యసాయి డిసైనింగ్ స్టూడియో’ అనే సంస్థ నెలకొల్పాను. నాకు ఆ వృత్తి, అందులోని మెళకువలు కొత్త ! ఆ విషయంలో బాపు గారికి మునుపే అనుభవం ఉంది. ఆయన్ను అడ్వర్టై సింగ్, గ్రాఫిక్స్ డిజైన్ గురించి సలహాలు అడుగుతూ ఉత్తరం రాసినప్పుడు, ఆయన నీ ప్రొఫెషన్ కు కొన్ని పుస్తకాలు పనికొస్తాయి అంటూ, ఒక లిస్టు ఇచ్చి, దిశానిర్దేశం చేసారు. వ్యక్తిగత విషయాల్లో కూడా చాలా అమూల్యమైన సలహాలు ఇచ్చేవారు. ఆయన అప్పుడప్పుడు లక్డి కా ఫూల్ లోని మా ఆఫీస్ కు వచ్చేవారు. ఎంతో నిరాడంబరులు. ఒక జీన్స్, దానిపై ఒక లాల్చి వేసుకుని, రబ్బరు చెప్పులతో వచ్చేసేవారు. ఆయన సింప్లిసిటీ కి పెట్టింది పేరు ! ఆయనకు టెక్నికల్ (కంప్యూటర్ )గా పెద్ద పరిజ్ఞానం లేదు. బొమ్మలకు రంగులు వెయ్యాలన్నా, పెద్ద బొమ్మల్లో చిన్న చిన్న సవరణలు ఉన్నా, మా అబ్బాయి వద్దకు వచ్చేవారు. అలా దిద్దుతుంటే చూసి, చిన్న పిల్లాడిలా సంబరపడేవారు. అప్పటి అరుదైన బొమ్మలు కొన్ని ఇక్కడ మీరు చూడవచ్చు. 


ఒకసారి నేను ‘మీరు భాగవతం సీరియల్ గొప్పగా ప్లాన్ చేసారు, స్టొరీ బోర్డు ఇవ్వమంటే...’ నాకు 3 ఫైల్స్ పంపారు. నాకు చాలా ఆనందం కలిగింది. 5 ఏళ్ళ క్రితం నాకు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వారు ఒక మీటింగ్ లో నాకు సన్మానం చేసారు. అప్పుడు వారిచ్చిన బహుమతిని బాపు గారి చేతుల మీదుగా అందుకున్నాను. అది నేను ఎప్పటికీ మరువలేను. బాపు గారితో నేను గడిపినవన్నీ అమూల్య క్షణాలు. మధుర జ్ఞాపకాలు. బాపు గారి వ్యక్తిత్వం, పనిపట్ల రాజీపడని అంకితభావం, సాధన ఆయన్ను తెలుగు చిత్రకారుల్లోనే ఒక లెజెండ్ గా మలిచాయి. మళ్ళీ అంతటి వారు ఈ గడ్డపై పుట్టరు. బాపు గారు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ నా వంటి చిత్రకారులకు ఒక మార్గదర్శి !  

No comments:

Post a Comment

Pages