బాపు గారికి హృదయాంజలి - అచ్చంగా తెలుగు

బాపు గారికి హృదయాంజలి

Share This

నమస్కారం ! “అచ్చంగా తెలుగు” కుటుంబం తరఫున సాదర స్వాగతం !   
బాపు గారి గురించి అనేక దినపత్రికలు, వార పత్రికలూ రాస్తున్నాయి కదా ! మరి మీరు కొత్తగా రాసేది ఏముంది ? అని అడిగారు ఒకరు. తెలుగు సాహితీ సంద్రంలో సాహితీదిగ్గజాలైన అనేక పెద్ద చేపలు ఉన్నాయి. నువ్వో పిల్ల చేపవి, నీ తలా పండలేదు, లోతులూ చూడలేదు, మరెందుకు ఇంత తపన ? నిజమే కదా ! నిజానికి ఒక గుళ్ళో ఒక్క దేవుడే ఉండాలి. కాని తెలుగు గుండె గుడిలో ఇద్దరు దేవుళ్ళు కలిసి వెలిసారు... వారే బాపురమణలు. దేవుడిని పూజించడానికి రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి నలుగురితో నారాయణ అనడం. మరొకటి భక్తితో, మనసు నిండా ఆర్ద్రతతో పూజించడం... ఆ భక్తి ఒక్కటీ ఉంటే దేవుడే దిగి వస్తాడు... కదా... మా “అచ్చంగా తెలుగు” కుటుంబానికి ఉన్నది గుండెల నిండా ఆ జంట దేవుళ్ళ మీద భక్తి, గౌరవం. కోరి కోదండపాణి పదే పదే సినిమాలు, సీరియల్స్ తీయించుకున్న ఆ ‘రాం’ బంటులకు బంటులం మేము. అందుకే... కొందరు హాస్పిటల్ బెడ్ మీద నుంచి ఆర్టికల్ రాసి పంపారు. కొందరు అమ్మవారు పోసి, ఒళ్ళంతా మంటతో అల్లాడుతున్నా, బాధ మరచి, బాపురమణల పట్ల భక్తిని గుర్తుకు తెచ్చుకుని, గొప్పగా రాసి ఇచ్చారు. కొందరు జ్వరంతో ఒళ్ళు కాలిపోతున్నా, లెక్కచెయ్యక ,రాసి పంపారు... ఇదంతా భావరాజు పద్మిని మాటకు ఇచ్చిన విలువ కాదు. మనసులో తాము గుడి కట్టుకున్న జంట దేవుళ్ళకు, ప్రేమతో ఒక్క తులసీదళం సమర్పించాలనే ఆర్తితో చేసినది... అందుకే ఈ సంచికకు రచనలు పంపిన అచ్చంగా తెలుగు కుటుంబ సభ్యులు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ సంచికలో వాడే శీర్షికలు(బటన్స్) ప్రత్యేకంగా ఉండాలని భావించాను. అందుకై బాపు గారు తరచుగా వాడే పదాలు, వారిద్దరూ కలిసి పూయించిన కొత్త పదాలు ఎంచుకున్నాను. బొమ్మ అద్భుతంగా వేసినప్పుడు బాపు గారు ‘ఆహా, గొప్పగా వేసాను,’ అనుకోకుండా... కేవలం ‘బొమ్మ బాగా కుదిరింది...’ అనేవారుట ! ‘నెవెర్ పాట్ యువర్ బ్యాక్...’ అన్నది వారి సూత్రం ! అందుకే ‘బొమ్మ బాగా కుదిరింది...’ అన్న పదాన్ని ఎంచుకుని, అందులో వారి బొమ్మలకు సంబంధించిన అంశాలు ఉంచాను. అలాగే నటీనటులు ఆయన అనుకున్నట్లుగా నటించకపోతే... ‘వన్ మోర్ వితౌట్ ఆక్టింగ్...’ అనేవారుట ! నటన నటిస్తున్నట్లుగా కాక, సహజంగా ఉండాలనేది వారి భావన . అందుకే ఆ పదాన్ని ఎంచుకుని, బాపు గారి సినిమాలకు సంబంధించిన విశేషాలన్నీ. ఇక వారిద్దరి స్నేహానికి ప్రతీకగా నిలిచిన పదం ‘కోతికొమ్మచ్చి’ , అందుకే వారి స్నేహం గురించిన సంగతులన్నీ ఇందులో... బాపు గారి ముఖచిత్రం (కవర్ ఫోటో) కి బహు ముఖాలు... వేసింది ఒక్క బొమ్మే అయినా... ఎన్నో అర్ధాలను తనలో ఇముడ్చుకుని ఉంటుంది... అందుకే ‘బహు’ ముఖ చిత్రాలు... ఆ చిత్రాల గురించి పెద్దలు చెప్పిన తమ మనోభావాలు ఇందులో ఉన్నాయి... బాపు గారి పట్ల తనకున్న ఆరాధనను టెలిఫోన్ ద్వారా మాతో పంచుకున్న తనికెళ్ళ భరణి గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు. పెద్దలు, మాన్యులు, శ్రీ తాడేపల్లి పతంజలి గారికి, కార్టూనిస్ట్ శంఖు గారికి, మా మావయ్య గార్లైన బి.వి.ఎస్.రామారావు గారికి, బి,వి.సత్యమూర్తి గారికి, బి.వి.పట్టాభిరాం గారికి కృతజ్ఞతాభివందనాలు. ఆత్మీయులు బ్నిం గారికి, సుధామ గారికి, ఎం.వి.అప్పారావు గారికి, నమస్సులు. ఇక అనేక శీర్షికలు వ్రాసి పంపిన మా కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరునా కృతఙ్ఞతలు. మా ఆర్టిస్ట్ నాగేంద్రబాబు గారు, సంపాదక వర్గ సభ్యులు, పెద్దలు, చెరుకు రామమోహనరావు బాబాయ్ గారు, పరవస్తు నాగసాయి సూరి, కళ్యాణ్ కృష్ణ కుమార్ గారు, సహృదయంతో టెక్నికల్ సాయం అందిస్తున్న తమ్ముడు శ్రీకాంత్ ,వీరందరూ ఈ సంచిక కోసం విశేషంగా సేవలు అందించారు. వీరందరికీ ధన్యవాదాలు. బాపురమణ దేవుళ్ళూ... మనసు ముత్యాలన్నీ ఏరి తెచ్చి, అక్షరాలతో మీకోసం ముగ్గు పెట్టాము. కలానికి ఒక రంగు చప్పున తెచ్చి, మా ఆర్టిస్ట్ మనసు రంగుతో మేళవించి, రంగవల్లులు దిద్దాము. కార్టూన్లు, బొమ్మలతో తోరణాలు కట్టాము... మీ కళా మత్తకోకిలలమై , మీకు స్వాగత గీతాలు పలుకుతున్నాము. ఎప్పుడో మీకు కళకు దాసులమై ఆత్మనివేదన చేసుకున్నాం. కొండంత దేవుళ్లైన మీరు, ఆ రాముడి ఆరామం నుంచి, ఈ తెలుగు మనసులు ప్రేమతో సమర్పించే ఈ హృదయ కుసుమాలు... అందుకుంటారు కదూ ! ఈ ప్రత్యేక సంచిక బాపురమణలకు భక్తితో అంకితం... “అచ్చంగా తెలుగు” సంపాదక వర్గం అందరి తరఫున ... మీ భావరాజు పద్మిని  

No comments:

Post a Comment

Pages