శ్రీధర మాధురి – 7

(పరమపూజ్య శ్రీ వి.వి. శ్రీధర్ గురూజి అమృత వాక్కులు )

  శరీరం నశిస్తుంది... ఆత్మ నశించదు. మనిషి ఒక రకమైన దుస్తుల్ని విడిచి, మరొక రకమైన దుస్తులను ధరించినట్లు ఆత్మ ఆ జీవి సంచిత కర్మలను బట్టీ అనేక దేహాల్లోకి ప్రవేశిస్తుంది.... ఈ జననమరణాల చక్రం ఆ జీవి తదేక దీక్షతో ధ్యానం చేసి, పరమాత్మను చేరే మోక్ష పధాన్ని పొందే వరకూ కొనసాగుతూనే ఉంటుంది... ఆత్మతత్వాన్ని గురించి మా పరమ పూజ్య గురుదేవులు శ్రీ వి.వి.శ్రీధర్ గురూజి అమృత వాక్కులు...   దైవాన్ని ‘మార్గ బంధు ‘ అంటారు.మన ఆత్మ దేహాన్ని విడిచేటప్పుడు, ఆయనే మనకు తోడు... మిత్రుడు... మార్గదర్శి... ఆదిశంకరులు ఇలా అంటారు... ప్రాణ ప్రయాణ భవభీతి సమాకులస్య | శ్రీ లక్ష్మీ నృసింహ మామ దేహి కరావలంబం || ఓ దైవమా !నా ప్రాణం దేహాన్ని విడిచేటప్పుడు, నేను భయపడతానేమో, కాని నా దైవమైన లక్ష్మీ నృసింహుడు ఆ స్థితిని ఎక్కువసేపు ఉండనివ్వరని నాకు బాగా తెలుసు. ఆయన నా చేతిని పట్టుకుని, నన్ను నడిపిస్తారు. కాబట్టి నేను చావుకు భయపడాల్సిన అవసరం లేదు.   మరణం అన్నది కేవలం దేహానికే ఏర్పడుతుంది కాని, ఆత్మకు కాదు. ఆత్మ వేరొక శరీరాన్ని అన్వేషిస్తూ వెళ్తుంది. ఈ ప్రక్రియ ఆత్మకు ప్రకృతితో పరిపూర్ణ సామరస్యాన్ని పొందేవరకూ కొనసాగుతుంది. అనేకమార్లు దేహాలు పుడుతూ చస్తూ ఉంటే, ఆత్మ తనంతట తానే పరమాత్మలోకి ఐక్యమయ్యే స్థితిని పొందుతుంది.   ప్రజ్ఞానం బ్రహ్మ- - - ఋగ్వేదము... పరమ చైతన్యమే దైవం... ఆహం బ్రహ్మాస్మి - - - యజుర్వేదము... స్వచ్చమైన అంతరంగమే దైవం... తత్ త్వమసి - - - సామవేదము... వెలుపల ఉన్నదే లోపలా ఉంది ... అయమాత్మా బ్రహ్మ - - - అధర్వణవేదము... నీవు జీవిస్తున్న కొద్దీ దైవాన్ని తెలుసుకుంటావు...   ఆత్మ యొక్క సౌందర్యం ఏమిటంటే అది దేహం లోపల బంధించబడి ఉంది. బుద్ధి (మెదడు)యొక్క శోభ ఏమిటంటే, అది కూడా శరీరం లోపలే బంధించబడి ఉంది. అది అక్షరాలా నిర్బంధించబడి ఉంది. ఆత్మ అంత శక్తివంతమైనదే ఐతే, అది దాని ఇచ్చానుసారం దేహం నుంచి బయటకు రావాలి. కాని, అలా జరగట్లేదు. ఎక్కడో ఒకరు భీష్ముని వంటి వారే అలా చెయ్యగలిగారు. ఉత్తరాయణం వచ్చేదాకా వేచి ఉండి ప్రాణాలు వదిలారు. కాబట్టి మనమంతా ఈ చైతన్యం పట్ల అంత జ్ఞానం(జాగృతి) కలిగి ఉండలేదు. నెమ్మదిగా మన బుద్ధి, దేహమే మన నిజ స్థితి అని మనం భ్రమించేలా చేస్తుంది. ఆత్మ అసహాయంగా దీన్ని చూస్తూ ఉంటుంది, కాని ,ఇదే ఆత్మ మరింత మెరుగైన జ్ఞానం పొందేందుకు ఒక ప్రమాణంగా ఉపయోగిస్తుంది. మనం ఈ దేహమే మన నిజస్థితి అని భ్రమిస్తూ ఉంటాము. కాని నిస్వార్ధమైన ఆత్మ ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకసారి దేహం క్షీణించి, నశించగానే ఆత్మ బయల్పడి, మరల ప్రవేశించేందుకు వేరొక దేహానికై అన్వేషిస్తుంది. బహుశా ఆత్మ మరొక బుద్ధి, దేహం ఆడే నాటకానికి సాక్షీభూతంగా నిలవాలనుకుంటుందేమో ! ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది. తుదకు ఆత్మ ఉన్నత స్థాయి ప్రజ్ఞచే పరిపూర్ణమై, తన చివరి గమ్యమైన విశ్వ చైతన్యంతో ఐక్యమయ్యి శాశ్వతమైన పరమానంద స్థితిని పొందేందుకు నిశ్చయించుకుని, ప్రయాణం సాగిస్తుంది... ప్రజ్ఞానం బ్రహ్మ (ఋగ్వేదము ) ... అంతా దైవానుగ్రహం...   మీరు కేవలం విశ్వచైతన్యం యొక్క అతి చిన్న తునక లేక భాగం. ఒక హోలోగ్రాఫిక్ ప్లేట్ పై ఒక బొమ్మను తీసుకున్నట్లయితే , ఆ ప్లేటును పగలగొట్టినా, ప్రతీ ముక్కలో అసలు చిత్రం యొక్క ముక్క ఉంటుంది. అలాగే విశ్వచైతన్యం సర్వోత్క్రుష్టంగా దాని ఉనికిని నిలుపుకుంటూనే, అది సృష్టించిన వ్యవస్థలో దానంతటదే జీవ చైతన్యం గా వ్యాపించింది. అది ప్రతీ తునకలోనూ ప్రతిబింబిస్తుంది, ఆ తునక స్థూల చైతన్యానికి సూక్ష్మమైన నమూనా. ఆ స్థూల చైతన్యం ఈ సూక్ష్మ చైతన్యం మధ్యలో ఉంది, తన సృష్టిని , దాని చుట్టూ ఉన్న సౌందర్యాన్ని, తానే పర్యవేక్షిస్తూ ఉంటుంది. విశ్వచైతన్యం జీవచైతన్యం లోకి ప్రవేశించి, దేహాత్మల చర్యలకు సాక్షీభూతమవుతుంది. అది అలా జీవాత్మ మధ్యలో ఉంటూ, దేహాత్మల చర్యల్ని కేవలం ఒక సాక్షిగా, మౌనంగా పర్యవేక్షిస్తూ ఆనందిస్తుంటుంది. అది ప్రవేశించిన దేహమనే తొడుగులో ఆత్మగా కూర్చున్నా, తనకు మూలమైన తల్లి వంటి విశ్వచైతన్యంతో సంబంధాన్ని(స్పర్శను) కోల్పోలేదు. తుదకు అనేక శరీరపు తొడుగుల్ని అనుభూతి చెందాకా, ఆ సూక్ష్మ శరీరంలోని జ్ఞానం స్థూలమైన పరమ/విశ్వ చైతన్యం యొక్క జ్ఞానంతో సమానమవుతుంది. అహం బ్రహ్మస్మి ... యజుర్వేదం ...   విశ్వచైతన్యం ఒంటరిగా ఉంది... అప్పుడు అది ప్రకృతిని ఏర్పరచాలని అనుకుంది. ఆ ప్రక్రియలో జీవ చైతన్యం యొక్క పుట్టుక సంభవించింది. పరమాత్మ నుంచి జనించిన ,ఈ జీవాత్మ అనబడే ఈ జీవచైతన్యం, పరమాత్మ పర్యవేక్షణలో సృష్టిలోని ప్రతీ అంశలోనూ ప్రవేసించింది. నిజానికి జీవాత్మ అనేది పరమాత్మకు అతి సూక్ష్మ రూపం. పరమాత్మ సూచించినప్పుడల్లా, జీవాత్మ సృష్టి అనే వ్యవస్థలో తనను తాను మిళితం చేసుకుంది. అది ప్రకృతి/ సృష్టితో ఐక్యమయ్యింది. పరమాత్మ (విశ్వ చైతన్యం )దిశానిర్దేశం వల్ల జీవాత్మ తన జాగృతి స్థాయిని ,ఉనికి యొక్క మెరుగైన స్థితికి వృద్ధి పరచుకుంటుంది. జీవాత్మ ఉనికిలో పరిపూర్ణత ను పొందినకొద్దీ, అది పరమాత్మ లాగా అనిపిస్తుంది. ఒక స్థితిలో పరమాత్మ మరియు జీవాత్మ (జీవచైతన్యం, విశ్వచైతన్యం ) ఒకేలా కనిపిస్తాయి. అప్పుడు ఇదే అది... అదే ఇది... తత్త్వం అసి ... సామ వేదం ... అంతా దైవానుగ్రహం...   దేహం కాలానికి చెందుతుంది... మీరు శాశ్వతత్వానికి చెందుతారు. మీ దేహానికి ఒక కాల పరిమితి ఉంది. మీకు కాలపరిమితి లేదు. తాత్కాలికంగా మీరు కాలానికి కట్టుబడి ఉన్న ఈ దేహంలో నివసించేందుకు వచ్చారు. మీకు చావూ తెలీదు, పుట్టుక కూడా తెలీదు.. మీరు ఏ లోపాలు లేని, సంపూర్ణమైన ,కాలాతీతమైన స్వచ్చమైన చైతన్యమని , గుర్తించట్లేదు, అంతే ...   మీరు భూమిపై జీవిస్తూ ఉండగా, శరీరం అనేక విధాలుగా మిమ్మల్ని శాసిస్తుంటుంది.... మీరు ఈ నేలపై బ్రతుకుతూ ఉండగా బుద్ధి అనేక యుక్తులు పన్నుతుంది ... మీరు ఈ భూమిపై జీవనం సాగిస్తూ ఉండగా చాలా వరకూ బుద్ధి నుంచి జనించే ఆలోచనలు మిమ్మల్ని శాసిస్తాయి.... మీరు ఈ పుడమిపై జీవిస్తూ ఉండగా చాలా వరకూ ఆ ఆలోచనల ఫలితంగా జరిగే చర్యలు లేక ప్రతి చర్యలు అమలు జరుగుతూ ఉంటాయి.... కొన్ని ఆసాంతం మిమ్మల్ని నియంత్రిస్తూ ఉంటాయి... అలా నియంత్రించేవి అన్నీ చావుతో నశిస్తాయి .. అప్పుడు విముక్తి పొందిన ఆత్మ ప్రశాంతంగా ప్రయాణం సాగిస్తుంది... ఆ ఆత్మకు మా నమస్కారాలు... సాష్టాంగ ప్రణామాలు...   నిర్వచనం అనేది మెదడుచే ఇవ్వబడేది.. అనుభూతిని నిర్వచించలేము. అలా నిర్వచించగలిగితే దాన్ని అనుభూతిగా పరిగణించలేము. అనుభూతి అనేది హృదయానికి, ఆత్మకు సంబంధించినది. దైవం ఆ అనుభూతిలో నివసిస్తారు. మనసు నిండినప్పుడు, మీరు శాశ్వతమైన ‘దైవాన్ని’ దర్శించగలుగుతారు. దైవాన్ని నిర్వచించడం అసాధ్యం, అనుభూతి చెందడం సులువు. మీరు ఆయన్ను నిర్వచించి, చూడాలని అనుకుంటే, అది అర్ధరహితమైనది. మీరు ఆయన్ను అనుభూతి చెంది, దర్శించాలని అనుకుంటే, బుద్ధి/మెదడు అనే పరిధి నుంచి హృదయం/ఆత్మ అనే పరిధికి మారండి. మీరు ఖచ్చితంగా ఆయన్ను చూడగలుగుతారు, ఆనందమయ ధ్యానంలో ఉర్రూతలూగుతారు...   సాధువు – ఆత్మ ఎల్లప్పుడూ శక్తివంతమైనది... నేను అతన్ని చూసి నవ్వాను.... సాధువు – ఎందుకు నవ్వుతున్నావు ? నేను – ఓ పూజ్య గురువా ! మీరు చెప్పిన వ్యాక్యం నన్ను కాస్త ఆలోచింపచేసింది, అందుకే నవ్వాను.ఒకవేళ ఆత్మ అమిత శక్తివంతమైనదే ఐతే, దేహం లేక పదార్ధం అంతా ప్రాముఖ్యత లేనిదే ఐతే, ఆత్మ తన ఇచ్చానుసారం దేహం నుంచి ఎందుకు బయటపడలేక పోతోంది ? అది దేహంలో చిక్కుకుని, దేహం యొక్క దయపై ఆధారపడినట్లుగా ఎందుకు కనిపిస్తుంది . శరీరం క్షీణించే దాకా ఆత్మ బయల్పదేందుకు వేచి ఉండాలి. అందరూ భీష్ముడి వలె ఆత్మను ఇచ్చానుసారం విడిచేందుకు ఆశీర్వదించబడలేదు. ఆయన విషయంలో కూడా దేహం యుద్ధ గాయాల వల్ల బలహీనపడింది, అయినా ఆయన ఉత్తరాయణం వచ్చే వరకూ ఆత్మవిముక్తికై వేచి ఉన్నారని అనడంలో సందేహం లేదు. ఆత్మ దేవతలకు చెందితే, దేహం పితృదేవతలకు చెందుతుంది. గతంలో చేసిన కర్మఫలాన్ని పూర్తి చేసుకునేందుకు ఆత్మ దేహాన్ని అద్దెకు తీసుకుంటుంది.ఆత్మ గతజన్మ కర్మల (సంచిత కర్మలు)లను పూర్తి చేసుకునేందుకు వస్తే, బుద్ధి యొక్క ప్రభావం వల్ల ప్రస్తుత కర్మ (ప్రారబ్ధ కర్మ ) ప్రోగవుతూ ఉంటుంది. ప్రస్తుత జీవితంలో ముగియని ప్రారబ్ధ కర్మ, గత జన్మలోని సంచిత కర్మకు తోడవుతుంది. ఆత్మ మరలా మరలా ఈ కర్మను పూర్తి చేసుకునేందుకు, బలవంతంగా దేహం లోకి నెట్టబడుతుంది, కాని బుద్ధి, మనసు, అహంకారం అనేవి ఒక విషవలయంలా ఏర్పడి, ఆత్మ అనేక వేల తరాల పాటు దేహంలోనే బంధించబడుతుంది. పితృదేవతలు దేహాన్ని ఇచ్చి, ఆత్మ నిస్వార్ధంగా పని చేసి, ఈ కర్మల నుండి బయటపడేందుకు సహకరిస్తారు. ఈ కర్మలన్నీ స్వార్ధ రహిత చర్యల ద్వారా తొలగిపోతాయి, కాని దేహానికి ఒక కాలపరిమితి ఉంది. ఈ జన్మ అయిపోగానే, పితరులు దయతో ,ఆత్మకు మరొక కొత్త దేహాన్ని ఇచ్చి, ఈ కార్యకలాపాల చక్రం కొనసాగేలా చూస్తారు. ఒక విధంగా పితరులు ఇచ్చిన దేహం(మూలపదార్ధం ) కూడా శక్తివంతమైనదే ఎందుకంటే అది మానవులకు నిస్వార్ధ జీవనం ద్వారా కర్మను తొలగించుకునే అవకాశం ఇస్తోంది. అందుకే , ఓ పూజ్య గురువా, నేను మీతో ఏకీభవించట్లేదు. సాధువు నివ్వెరపోయాడు... నేను ఆయనకు గౌరవసూచకంగా నమస్కరించి, ఆయన ఆశ్రమం వదిలి వెళ్లాను... అంతా దైవేచ్చ... దయ, అనుగ్రహం...  

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top