సకళకళా భారతి - భానుమతి - అచ్చంగా తెలుగు

సకళకళా భారతి - భానుమతి

Share This

సకళకళా భారతి - భానుమతి

                      - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్



ఎనిమిది కళలతో అలరించిన మహిళా ధీశాలి ఎవరు..? నటీగా అత్యున్నత శిఖరాలధిరోహించినా.. రచయితగా అత్యున్నత పురస్కారం అందుకున్న దెవరు? సత్తె కాలపు సంప్రదాయకుటుంబంలోని అన్నీ కళలతో పాటు నటన అదనపు హారం గా కలిగిన దెవరు..? నటాగ్రేసరులను సైతం తన నటనకు దాసోహం అనిపించిన దెవరు..? ఎవరా మహీళాధీరతి,   ఎవరా బహుముఖ ప్రజ్ఞాశాలి..??   ఆమే భానుమతీ రామకృష్ణ. 60 వసంతాలు సినీ వినీలాకాశం లో ధృవతారగా వెలిగిన కథానాయకి. భానుమతి.. సకళకళా భారతి భారత సినీ జగతి కళామతల్లికి హారతి సంగీతంలో సరస్వతి పారిశ్రామిక  ప్రగతిగీతి   నాట్యానికి  రవళి రచనలో ఆరావళి నటనలో  మరాళి   గానంలో  కోయిల దర్శకత్వంలో  వెన్నెల నిర్మాతగ భళాభళ   అష్టకళల అభినేత్రి స్టూడియో అధినేత్రి సహనానికి ధరిత్రి మణికట్టు రచయిత్రి   వనితలమానికమా..! మగువలకీర్తికిరీటమా..! కలకంఠి ధైర్యరూపమా..! అబల అంతర్నేత్రమా..! మహిళా ప్రగతిగీతమా..!   ఓ భానుమతీ.. సకళకళా భారతీ నీవే పరిపూర్ణ స్త్రీ మహిళలకు మార్గదర్శి.. 
ఆమె గురించి  :   'కొందరు పుట్టుకతో వృద్ధులు ' అన్నారు ఓ కవి.. కానీ పుట్టిన నాటి నుండి చివరి క్షణం వరకూ తనలోని గుణగణాలను పెంచుకుంటూ ముందడుగు వేసిన మహిళా శిరోమణి భానుమతి మాత్రం నిత్య యవ్వని. భానుమతి గురించి ఎంత చెప్పినా తక్కువే...! సంగీత దర్శకురాలిగా, రచయిత్రిగా, స్క్రీన్ ప్లే రచయిత్రిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, నటిగా,చిత్రకారిణిగా, ఉత్తమ పారిశ్రామిక వేత్తగా.. రాణించడం  అనేది .. అదికూడా సత్తెకాలపు మహిళ సాధించిన చైతన్యపు గుర్తులని,  తెలిస్తే మనసు పులకరించకమానదు.. అంతటి ఘనకార్యం సాధించని భానుమతిని అందరూ 'అష్టావధాని'గా పిలిచే వారు.. అంతే కాదు అదే బిరుదుతో ఆమెను సత్కరించి ఆమె అభిమానులు సంతోషపడ్డారు కూడా..!    
చిరుప్రాయం: చిన్నతనం : వీరనరసింహాపురం అని అద్దంకి రాజుల కాలంలో పిలువబడ్డ నేటి ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలం దొడ్డవరం లో 1925 సెప్టెంబర్ 7 న బొమ్మరాజు వెంకట సుబ్బయ్య, సరస్వతమ్మ లకు జన్మించారు భానుమతి.   చిన్ననాటి నుండి సంగీత నృత్యాభినయాల పట్ల మిక్కిలి మక్కువతో.. శ్రద్ధాసక్తులతో నేర్చుకున్న, భానుమతి తన పదమూడవ ఏట సినీవినీలాకాశపు ధృవతారగా అడుగెట్టింది. ఆమె 1939 లో 'వర విక్రయం' సినిమా ద్వారా అమె సినీమాలలోకి అడుగెట్టింది.   అరవై ఏళ్ళపాటు సినీ కళామతల్లికి సేవలందించినా..చివరిక్షణాల వరకూ చిత్ర సీమను ప్రేమించి.. ప్రేమను పంచిన ఘనత భానుమతిది.   సంప్రదాయ కుటుంబంలో జన్మించి.. సంగీత కళానిధి త్యాగరాజు పరంపరను కొనసాగిస్తూ.. సంగీత సాహిత్యాభిలాషతో తులతూగుతూ కట్టుబాట్ల మధ్య పెరిగిన భానుమతి అప్పట్లో అనేక అనుమానాలున్న సినిమాలలోకి ఎలా వచ్చారనేది అనేకమందికి శంక.
సినీ ప్రవేశం : భానుమతి తండ్రి గారైన వెంకట సుబ్బయ్యకు మంచి మిత్రుడు అప్పట్లో పెద్ద దర్శకులైన సి.పుల్లయ్య చిన్నపిల్లలతో సినిమా చేయడానికి సంకల్పించి, కొద్దిగా యవ్వనం ఉట్టిపడే చిన్నారి కోసం వెదుకుతూ.. వెంకట సుబ్బయ్య కుమార్తె భానుమతికోసం వచ్చి ఆమె తండ్రిని ఒప్పించి.. ఎవరూ ఆమెను ఎవరూ తాకరాదన్న సుబ్బయ్య ఆంక్షలు పాటించేందుకు హామీ ఇచ్చి నటింపజేశారు. అదే ఆమె వెండితెరపై తొలిగా వెలిగిన 'వరవిక్రయం' చిత్రం... ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ ఈ చిత్రాన్ని నిర్మించింది.   ఆనాటి నుండి అప్రతిహతంగా తన నటనా పటిమను పెంపొందించుకుంటూ తన పాత్రకు తానే పాటలుపాడుకుంటూ, పద్యాలు సైతం ఆమె పాత్రలకు ఆమె పాడుకుంటూ చిత్ర సీమ గర్వపడే కధానాయికగా ఎదిగారు.. కధానాయికగా ఉన్నత స్థానంలో ఉండి కుడా పాత్ర ఔచిత్యం తెలిసి.. పల్నాటియుద్ధంలో నాయకురాలు నాగమ్మగా ప్తతినాయకి పాత్ర పోషించారు.. అయినా పాత్ర ఆమె చుట్టునే ఎక్కువ తిరగడం ఆమె నటనా శేముషికి తార్కాణం.
ప్రేమ వివాహం : తండ్రి పెద్ద సంబంధం ధనవంతుల సంబంధం చేద్దామనుకుంటున్న సమయంలో  అందరికీ తలలో
నాలుకలా ఉండే అసిస్టెంట్ డైరెక్టర్  పి.ఎస్ కృష్ణారావు ను ప్రేమీంచింది భానుమతి.. తన ప్రేమను లవ్ ఎట్ ఫ్స్ట్ సైట్ అని చెప్పుకుండే వారు బానుమతి. తన తండ్రికి ఇష్టం లేకున్న పేదవాడైన రామకృష్ణను పెళ్ళి చేసుకునేందుకు నిర్ణయించుకుని, తన సోదరికి ముందు తెలిపి తొలి సారి తన తండ్రి మాతను జవదాటి ప్రేమ వివాహం చేసుకున్నారు భానుమతి. 1943, ఆగష్టు 8 న తమిళ , తెలుగు చిత్ర నిర్మాత, డైరెక్టరు, ఎడిటరు అయిన శ్రీ పి.యస్. రామకృష్ణారావు ను ప్రేమ వివాహమాడినది భానుమతి. ఆనాటి నుండి భానుమతీ రామకృష్ణగా పిలువబడుతున్నారు.   వీరి ఏకైక సంతానం భరణి. ఈ భరణి పేరుమీదనే భరణీ స్టూడియో నిర్మించి, అనేక చిత్రాలు ఈ దంపతులు నిర్మించారు.
వినీలాకాశపు వెండి వెన్నెల: భానుమతి సినీషష్టిపూర్తి చేసుకున్నప్పటికీ, భానుమతి నటించిన చిత్రాలు సుమారు వంద మాత్రమే. ఆమె సినిమాలలో మల్లీశ్వరి, పల్నాటి యుద్దం, మంగమ్మగారి మనవడు, పెద్దరికం  వంటి ఆణిముత్యాలు ఎన్నో ఉన్నాయి. విజయా వారి మిస్సమ్మ సినిమాలో ప్రధాన పాత్రకు మొదట భానుమతినే తీసుకున్నారు. అయితే షూటింగు మొదలైన తర్వాత చక్రపాణికి ఆమె వ్యవహార శైలి నచ్చక ఆమె స్థానంలో సావిత్రి ని తీసుకున్నారు. ఈ సంగతి గురించి ప్రస్తావిస్తూ భానుమతి  ఆ సినిమా విడుదలై, ఘన విజయం సాధించాక భానుమతి నేను మిస్సమ్మలో నటించక పోవడం వల్ల సావిత్రిలాంటి గొప్పనటి వెలుగులోకి వచ్చింది, అని సంతోషించిందంటే సహనంలొ ఆమె ధరిత్రి అని చెప్పకనే అర్ధమౌతోంది. ఆమె స్పోర్ట్ స్పిరిట్ ఈ నాటి వర్ధమాన నటీమణులకు మార్గదర్శకంగా నిలిచిపొతుంది.   భానుమతి కేవలము నటిగా అడుగిడి,అంతటితో తన ప్రస్థానన్ని ఆపక తనలోని జిజ్ఞాసతో.. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎదిగి  పలువురి మన్ననలు అందుకున్నది. ఓ గాయనిగా, సంగీత దర్శకురాలిగా, స్టూడియో యజమానిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, రచయిత్రిగా పలు పాత్రలు సమర్ధవంతంగా ఒంటి చేత్తో నిర్వర్తించి విమర్శకులచే శభాష్ అనిపించుకున్నది.
నటిగా :  వరవిక్రయం (1939) తో మొదలై-పెళ్ళికానుక (1998) వరకూ కొనసాగీంది.  ఏ.ఎన్.ఆర్, ఎన్.టి.ఆర్ వంటి మాహనటుల సరసన నటించడమే గాక వారిని ధిక్కరించే ప్రతినాయకి పాత్రలలో ధీటైన నటన ప్రదర్శించారు. అన్నీ చిత్రాలలో తిరు నామం  పెట్టుకుని పెద్ద పాత్రలలో కనబడ్డ భానుమతి  బామ్మ మాట బంగారు బాట (1990) లో చంద్రబింబం వంటి తిలకంతో అలరీంచారు.. అబ్బురపరిచారు.
గాయనిగా : వరవిక్రయం నుంచి, పెళ్ళికానుక వరకూ తాను నటించిన అనేక సినిమాలలో పాటలు పాడారు భానుమతి.   కనీసం ఆమె పాత్రకు ఒక్క పాటనై ఉండేలా దర్శక నిర్మాతలు జాగ్రత్త పడేవారు..ఆమెచే పాట పాడించడం కుదా ఒక సెంటిమెంట్ గా కొనసాగటం విశేషం.
దర్శకురాలిగా : తన దర్శకత్వ ప్రతిభను 1951లోనే చూపి చండీరాణి అనే చితానికి దర్శకత్వం వహించి పలువురి మన్ననలు పొందారు. పదకొండు తెలుగు చిత్రాలకు, మూడు తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించారు భానుమతి రామకృష్ణ. 
నిర్మాతగా : 1947 లో రత్నమాల చిత్రాన్ని నిర్మించారు భానుమతి. అనంతరం 1961 వరకూ వరుసగా పది విజయవంతమైన చిత్రాలు నిర్మీంచారు ఆమె. వాటిలో విప్రనారాయణ లైలామజ్ఞు వంటి ఆల్ టైం హిట్స్ కూడ వున్నాయి.
సంగీత దర్శకురాలిగా కుడా తన ప్రతిభను నిరూపించుకున్నారు భానుమతి. 1954 లోని చక్రపాణి చిత్రానికి, 1956 లో స్వీయ నిర్మాణం లోని చింతామణి చిత్రానికి సంగీత సారధ్యం వహించారు.
రచయిత్రి గా : ఇక ప్రత్యేకంగా చెప్పుకోవలసినది ఆమెలోని రచయిత్రి కోణాన్ని.. సినీ చరిత్రలో ఎందరికో 'పద్మశ్రీ'లు వరించాయి.. అందరికీ నటనలో ఈ ఖ్యాతి వరించింది.. కానీ  రచనలకు పద్మశ్రీ అందుకున్న సినీ నటి, కథానాయిక మాత్రం  భానుమతే అని చెప్పాలి..! ఆమె రచనలలో ముఖ్యమైనవి ప్రేమ  అనే కథ(1952 ) 'అత్తగారి కథలు' అనే హాస్య సంపుటి.. ఇదే హాస్యకథల సంపుటి ఆమెకు పద్మశ్రీ బిరుదును తెచ్చిపెట్టింది.   అంతా తనకే తెలుసునన్న ధీమా ఉన్న సత్తెకాలపు అత్త, విద్యాధికురాలైన కోడలు మధ్య జరిగే సంభాషణల లోంచి పుట్టిన హాస్యవల్లరే అత్తగారి కథలు. సగటు కుటుంబాలలో నిత్యం గోచరించే వాటిలోంచి పుట్టినవే అని ఇట్టే అర్ధమయ్యే రీతిన ఈ కథలు అలరిస్తాయి.
అవార్డులు- రివార్డులు :   భానుమతి సినీ కళామతల్లి సేవల గుర్తింపుగా అమెను అనేక అవార్డులు వరించడమే గాక అనేక బిరుదులూ ఆమెను అలంకరించాయి.   1956 లో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గౌరవ పురస్కారము జాతీయ అవార్డులు..మూడు సార్లు  (అన్నై అను తమిళ సినిమాకు, అంతస్తులు , పల్నాటి యుద్ధం అను తెలుగు సినిమాలకు)   నడిప్పుకు ఇళక్కనం అనే తమిళ చిత్రంలో ని నటనకు అన్నాదురై  అంతటి నటుడు ఆమెకు వ్యాకరణం అనే బిరుదు  ఇచ్చి గౌరవించాడు.   'అష్టావధాని' అని తమిళ అభిమానులు ఈమె బహుముఖ ప్రజ్ఞకు సముచిత బిరుదు ప్రదానం చేశారు..   1966 లో ఆమె వ్రాసిన 'అత్తగారి కథలు' అను హాస్యకథల సంపుటికిగాను పద్మశ్రీ బిరుదు ఇచ్చి, భారత ప్రభుత్వము ఈమెను సత్కరించింది.   ఇదే సంపుటికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డు కూడా వచ్చింది.   1975 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు 'కళా ప్రపూర్ణ' ఇచ్చి సత్కరించింది.   'కలైమామణి' : 1984 లో కలైమామణి బిరుదుతో తమిళనాడు నందలి ఐయ్యల్ నాటక మన్రము సత్కరించింది.   బహుకళా ధీరతి శ్రీమతి :  1984 ననే లయన్స్ క్లబ్బు  బహుకళా ధీరతి  శ్రీమతి అను బిరుదుతో సత్కరించింది. 1984 లో తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటుతో సత్కరించింది. 1986 లో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డును ఇచ్చింది. 1986 లో ఉత్తమ దర్శకురాలిగా అవార్డును ఆంధ్ర ప్రభుత్వము నుండి అందుకుంది. 2013 లో భారత సినీ పరిశ్రమ వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలయిన 50 ప్రముఖ చలనచిత్ర కళాకారుల తపాలాబిళ్ళలలో ఒకటి భానుమతి ది.
చివరి క్షణాలు :  2005 డిసెంబర్ 24 న చెన్నై లోని తన స్వగృహంలో భానుమతీ రామకృష్ణ పరమపదించారు .. తన బహుముఖ ప్రజ్ఞా విశేషాలతో ఎన్నో సాధించి, ఎందరికో ఆదర్శంగా నిలిచిన భానుమతి మృతికి పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు.  మిలమిల మెరిసిన తార నేలకొరిగింది. ఎందరో మరెందరో చిత్రసీమలో అడుగెట్టినా.. తనకంటూ బాణి, వాణి తో చిరంజీవిగా నిలచిన సినీజీవి భానుమతి.

 ***

No comments:

Post a Comment

Pages