ముక్తిమార్గమును అరసి డాయరా
 పెయ్యేటి రంగారావు
 
అరసి డాయరా - అరసి డాయరా
ముక్తి మార్గమును అరసి డాయరా ||

వేసెడు ప్రతి అడుగు
ఎటు పడుతున్నదో
అంతరాత్మను అడుగు, అడుగు
చేసెడు ప్రతి పనిలో
స్వార్థమెంత అని
నిన్ను నీవు అడుగు, అడుగు ||

వేకువ జామున లేవగలిగినా
సుషుప్త తాపసి మేలుకొనేనా?
చీకటివేళలో కనులు మూసినా
అరిషడ్వర్గమ్ములు నిదురనొందునా?

ధర్మక్షేత్రముల యాత్రలు చేసిన
అధర్మమునకు అంతము అగునా?
పుణ్యకార్యముల నాచరించినా
పాపచింతనలు పోవకుండునా?

దేవుని ధ్యానము చేయుచుండినా
ఇహవ్యామోహము వీడకుండునా?
సంపదలెన్నో సంక్రమించినా
అన్నార్తులకు దానమందునా?

కోరికలన్నీ తీరుచుండినా
తక్కిన కోర్కెలు వీడకుండునా?
అంతిమ ఘడియలు అరుదెంచినను
వైరాగ్యమ్మది కరుణించేనా?

ఎంచి చూడరా, యోచించి నడువరా
ఎటకు ఏగుటో ఎదలో తలుపరా
వ్యధ కథలన్నీ ముగియనీయరా
ముక్తిమార్గమును అరసి డాయరా ||
______________________________

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top