కదిలే బొమ్మల బ్రహ్మ – ఆర్టిస్ట్ నాగేంద్రబాబు - అచ్చంగా తెలుగు

కదిలే బొమ్మల బ్రహ్మ – ఆర్టిస్ట్ నాగేంద్రబాబు

Share This

కదిలే బొమ్మల బ్రహ్మ – ఆర్టిస్ట్ నాగేంద్రబాబు

-      భావరాజు పద్మిని

థియేటర్ లోని తెరపై వాల్ట్ డిస్నీ వారి “ టామ్ అండ్ జెర్రీ “ సినిమా నడుస్తోంది.... Teenతనను తాను మరచి తదేక దీక్షతో సినిమా చూస్తున్నాడు ఒక బాలుడు. “యెంత మారం చేసాడు? పగలంతా పనిచేసి అలసి వస్తే, సెకండ్ షో సినిమాకు తీసుకు వెళ్తావా లేదా, అని ఒకటే గొడవ. ఇవే కాదు, లారెల్ హార్డీ వంటి ఏ ఇతర సినిమాలు వచ్చినా అవి చూసేదాకా తనను వదలడు కదా ! పోన్లే, వాడికి యెంత ఇష్టం లేకపోతే ఇంత సరదా పడతాడు,” పిల్లవాడినే చూస్తున్న తండ్రి ,కొడుకు ముచ్చట తీర్చినందుకు మనసులోనే మురిసిపోతున్నాడు. “నాన్నా ! ఈ తెరమీది బొమ్మలు ఎలా కదులుతాయి ?” అడిగాడు బాలుడు. “ఒక్క సెకనుకు 24 ఫ్రేమ్స్ అతి వేగంగా కదిలితే కాని, ఈ బొమ్మలు మనకు కదులుతున్నట్లుగా అనిపించదు. అంటే, ఈ బొమ్మ ఒక్క సెకను కదిలేందుకే 24 బొమ్మల్ని ఆ ఆర్టిస్ట్ వెయ్యాలి. అలా కొన్ని వేల బొమ్మల్ని చిత్రకారుడు అతి కష్టం మీద వేస్తే... ఒక్క ఆనిమేషన్ సినిమా రూపుదిద్దుకుంటుంది...” కొడుకు తల నిమురుతూ చెప్పాడు తండ్రి. “అయితే, నేనూ పెద్దయాకా ఆనిమేటర్ ఆర్టిస్ట్ అవుతా !సినిమాలకు బొమ్మలేస్తా !” ధృడంగా చెప్పిన కొడుకును ఆశ్చర్యంగా చూసాడు తండ్రి. కాని, ఆయన మనసులో ఎక్కడో “నాకు తెలుసు, నా కొడుకు ఏదో ఒకరోజు గొప్పవాడై, మా వంశానికే వన్నె తెస్తాడు...” అని బలంగా అనిపించింది. ఆ బాలుడు ఎవరో కాదు, మన “అచ్చంగా తెలుగు” అంతర్జాల మాస పత్రిక ఆర్టిస్ట్ నాగేంద్రబాబు గారు. తండ్రి బాపనయ్య బాబు(బాబూలాల్), సావిత్రి ల పెద్ద 5కుమారులుగా విజయవాడలో జన్మించిన నాగేంద్రబాబు గారికి దుర్గామల్లేశ్వరి, లక్ష్మీదేవి అనే చెల్లెళ్ళు ఉన్నారు. తండ్రి బాబూలాల్ గారు ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేసేవారు. చిన్నతనం నుంచే వడ్డాది పాపయ్య వంటి వారి బొమ్మలను అభిమానిస్తూ, ఏ మంచి బొమ్మ చూసినా వేసేవారు. చిత్రకళ పట్ల ఆయనకున్న అభిరుచిని గమనించిన తల్లిదండ్రులు ఆయన్ను ఎంతగానో ప్రోత్సహించేవారు. బొమ్మలంటే నాగేంద్ర గారికి యెంత ఇష్టమంటే, స్కూల్ కు వెళ్ళినా , పుస్తకాలలోని బొమ్మలు చూసి వేస్తూ, పాఠాలు వినకుండా తన్నులు తినేవారట ! అలా బాలమునిలా చిత్రకళా తపస్సు చేసిన ఆయన కృషికి ఫలితంగా, ఎవరివద్దా నేర్చుకోకుండా,  కేవలం నిశిత పరిశీలన ద్వారా అనేక చిత్ర కళారీతులు, కార్టూన్లు అలవోకగా గీసే ప్రతిభ ఆయన సొంతమయ్యింది. తన ఊహ, సృజనే గురువులుగా బొమ్మలు వెయ్యసాగారు. విజయవాడలోని శిశు విద్యా మందిర్ లో చదువుతుండగానే అనేక చిత్రలేఖన పోటీల్లో బహుమతులు గెల్చుకున్నారు. 14, 15 ఏళ్ళ ప్రాయంలోనే స్కూల్ మాగజైన్ కు కార్టూన్స్ , బొమ్మలు గీసేవారు. 10 వ తరగతి చదువుతుండగా కలిసిన కార్టూనిస్ట్ రాజు గారి పరిచయం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. రాజు గారు గీసే కార్టూన్లు, ఇల్లుస్త్రేషన్స్ శ్రద్ధగా పరిశీలించేవారు. రాజు గారు కూడా తగిన సూచనలు, సలహాలు ఇస్తూ, నాగేంద్ర గారిని ప్రోత్సహించేవారు. 2కాలేజీ స్థాయిలో కూడా కాలేజీ మగజైన్ కు బొమ్మలు, కార్టూన్లు అందిస్తూ అనేక మంది ప్రశంసలు అందుకున్నారు నాగేంద్ర గారు. బి.కాం పూర్తయ్యాకా, మెడికల్ రిప్రెసెంటేటివ్ గా ఉద్యోగం ప్రారంభించారు. అయినా చిత్రకళ పట్ల తన అభిరుచిని వదులుకోక, చక్కటి ప్రకృతి, జంతువులకు సంబంధించిన పెయింటింగ్స్ ను వేసి డాక్టర్ లకు, బహుకరించేవారు. చెరుకుపల్లిలో ప్రారంభించిన ఒక హాస్పిటల్ కు డా.నాయుడమ్మ పెయింటింగ్ వేసి ఇచ్చినప్పుడు, సజీవ చిత్రంలా ఉన్న ఆ పెయింటింగ్ ను చూసి ముగ్ధులై, ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు స్టేజి పై ఆయనను ఎంతగానో ప్రశంసించారు. ‘నగీన’ గారితో 98 లో నాగేంద్రబాబు గారికి వివాహం జరిగింది. ఒక వృత్తిలో స్థిరపడి అంతా సాఫీగా సాగిపోతున్న తరుణంలో, భారత్ లో ఆనిమేషన్ విప్లవం మొదలయ్యింది. హార్ట్ ఆనిమేషన్ అకాడమీ, జీటా ఇన్స్టిట్యూట్ వంటి ప్రముఖ కంపెనీలు ఇక్కడ వెలిసాయి. నాగేంద్రబాబు గారిలో నిద్రాణమై ఉన్న చిన్ననాటి స్వప్నం మేలుకోంది. “శ్రీ వేన్ మల్టీటెక్” అనే సంస్థ మంచి చిత్రకారులకు విదేశీయుల ద్వారా ఆనిమేషన్ లో శిక్షణ ఇస్తోందని తెలుసుకుని, వారిని సంప్రదించి, తన బొమ్మలను చూపారు. అద్భుతమైన ఆ బొమ్మలను చూసిన వారు, నాగేంద్ర గారికి కొంత కాలం శిక్షణ, ఆ పై ఉద్యోగం ఇచ్చేందుకు అంగీకరించడంతో, సతీసమేతంగా హైదరాబాద్ వచ్చేసారు నాగేంద్ర గారు. 6 నెలల శిక్షణా కాలంలో, అత్యంత శ్రద్ధతో తన కలను సాకారం చేసుకునేందుకు అహర్నిశలూ శ్రమించారు. తదుపరి టీవీ సీరియల్స్ కు కొన్నాళ్ళు ప్రీ –ప్రొడక్షన్ ఇన్చార్జి గా పని చేసారు. విదేశీ ప్రాజెక్ట్ లకు ఆయన చేసిన ఆనిమేషన్ లకు అంతర్జాతీయ ప్రశంసలు, గుర్తింపు, లభించాయి. తర్వాత 2009-2011 మధ్య 4కాలంలో ఏడాదిన్నర పాటు సాక్షిలో ఆయన చేసిన ఆనిమేషన్ లకు ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు మంచి పేరు వచ్చింది. తన కల సాకారం చేసుకున్నందుకు, అనుకున్నది సాధించి పలువురి మెప్పు పొందుతున్నందుకు, ఆయన మనసులో ఎంతో ఆనందం. అయితే... కాలం చాలా చిత్రమైనది. జీవితాల్ని మలుపు తిప్పి వినోదించడం దానికో వేడుక ! ఆనిమేషన్ రంగంలో ఉన్న క్రేజ్ ను అమ్ముకోవడానికి పలు సంస్థలు వెలిసాయి. గ్రామాల్లోని వారు సైతం భూములు అమ్ముకుని, 3,4 లక్షలు చేతబట్టుకుని, ఆ సంస్థల్లో చేరి, ఆనిమేషన్ నేర్చుకోసాగారు. వారు తక్కువ జీతాలకి పని చేస్తుండడంతో, ఆనిమేషన్ రంగంలో అనుభవజ్ఞులను కాలదన్ని, అవకాశాలు కొత్త వారికి ఇచ్చారు. దీనితో ఆనిమేషన్ లో నాణ్యత తగ్గింది. విదేశీయులు మన దేశానికి ప్రాజెక్ట్లు ఇవ్వటం మానుకున్నారు. యురోపియన్ అకాడమీ పడిపోవడం ఆనిమేషన్ కు మరో పెద్ద దెబ్బ అయ్యింది. ఆనిమేషన్ రంగానికి “స్వర్ణయుగం “ గా చెప్పే కాలం చూస్తుండగానే చేయిజారి కరిగిపోయింది... ఆనిమేటర్ లకు ఉపాధి కరువయ్యింది. నాగేంద్రబాబు గారి ప్రకారం “ఒక మంచి ఆర్టిస్ట్ మాత్రమే మంచి ఆనిమేటర్ అవ్వగాలుగుతాడు. అతనికి నిశితమైన పరిశీలనా శక్తి ఉండాలి. కను రెప్ప పాటు 3నుంచి, హావభావాలు, లిప్ మూమెంట్స్, అన్నీ సమతుల్యతలో ఉన్నప్పుడే ఆనిమేషన్ పండుతుంది. కాని ఇప్పుడు వచ్చిన ౩d ఆనిమేషన్ టెక్నాలజీ ని ఉపయోగించి, ప్రతీ వారు ఆనిమేషన్ చేస్తున్నారు. కాని పై మూడు సింక్ కాక, చూసేవారికి ఆనిమేషన్ ఎబ్బెట్టుగా అనిపిస్తుంది...” ప్రస్తుతం భార్య నగీన, కుమారుడు ఫణిరాం(9వ తరగతి ) తో హైదరాబాద్ లోని మియాపూర్ లో నివసిస్తున్నారు. వివాహమైన నాటి నుండి ఆయన కళను ప్రోత్సహిస్తూ ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటారు నగీన గారు. ఒక్కోసారి జీవితంలో ఒక కళాకారుడిగా ఆయన ఎదుర్కునే ఆటుపోట్లకు చలించిన కుటుంబ సభ్యులు, ‘ఎందుకీ ఫీల్డ్, చిన్న చిన్న వారు కూడా వేర్వేరు వృత్తుల్లో చేరి బాగా గడిస్తున్నారు, ఇన్ని ఒడిదుడుకులు ఎదురైనా మీరు ఈ రంగం ఎందుకు వదలరు ?’ అని అడుగుతారు. దానికి ఆయన ఇచ్చే సమాధానం... ‘ఎలాగోలా బ్రతకాలంటే, అనేక మార్గాలు ఉన్నాయి. కాని ఇది నా చిన్ననాటి స్వప్నం, నా కళ, నా జీవితం, నా సర్వస్వం. నా జీవితాన్ని కళకే అంకితం చెయ్యాలని నిర్ధారించుకున్నాను. అందుకే సుడిగుండాలున్నా, సునామీలు ఉన్నా చలించని సముద్రంలా, నేనూ పట్టు వదలను,’ అంటూ. వర్ధమాన చిత్రకారులకు నాగేంద్రబాబు గారిచ్చే సందేశం...” చిత్రకళను, కార్టూన్స్ ను, ఆనిమేషన్ రంగాన్ని ఒక ప్రవృత్తిగా మాత్రమే స్వీకరించండి. ఇదే వృత్తిగా 1బ్రతకాలి అనుకుంటే , ధృడ నిశ్చయంతో, ఆటుపోట్లకు ఎదురీదే గుండె నిబ్బరం అలవరచుకోండి.” ప్రస్తుతం ఆర్టిస్ట్ లకు ప్రింట్ మీడియా లో సహకారం లేదు, ఆదాయం లేదు. అయినా తన కళను , ఇల్లుస్త్రేషన్ లను, కొనసాగిస్తూ, ప్రస్తుతం 'ఎలిమెంట్ 6 ' అనే ఆనిమేషన్ సంస్థలో ప్రీ ప్రొడక్షన్ సీనియర్ స్టొరీ బోర్డు ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నారు. తన కార్టూన్లకు గాను అనేక బహుమతులు గెల్చుకున్న నాగేంద్ర గారు, ఈ మధ్యనే నది పత్రిక వారు నిర్వహించిన కార్టూన్ల పోటీలో కన్సొలేషన్ బహుమతి గెల్చుకున్నారు. కళనే నమ్ముకున్న ఈ అద్భుత కళాకారుడు మరిన్ని విజయాలను సాధిస్తూ, తన స్వప్నాలను సాకారం చేసుకోవాలని, మనసారా ఆశిద్దాం !    

No comments:

Post a Comment

Pages