పట్టుబడని భాషలు! 

(చిత్రం : చిత్రకారుడు ఉదయ్ కుమార్ మార్లపుడి )

 - వారణాసి రామబ్రహ్మం

పిందెలు దోరలయ్యినట్టు

బాలికలు కన్యలవుతారు;

విరిసీ విరియని మొగ్గలు

వికసితకుసుమాలయినట్లు

యువతులు ముదితలవుతారు

స్త్రీలకి పూలకి జట్టు

ఇద్దరూ మృదు శరీరులు

అందముల ప్రోవులు

ఆకర్షణకు నెలవులు

గలగల పారేటి నీటి జాలులు

వేగముగా జారిపోయే శక్తీ ప్రవాహాలు

తెలిసీ తెలియని  లోతుల్లో

హాయి నిండిన హాయిలో

ఈదులాడించి

సేదదీర్చు చల్లని జలాశయములు

వారి మధుర శ్వనము

మృదు స్పర్శ

పులకలు కలింగించి

ఆనందాబ్ధిలో ముంచి తేలుస్తాయి

 అమ్మలై అందిస్తారు

కొడుకులను కూతుళ్ళను

పుట్టునిల్లులు వారు

దివ్యానురాగములకు;

శాంతి సౌఖ్యములను

సమకూర్చు పూర్ణ మమతలు సమతలు

పై భావములను చదివి

స్త్రీల గురించి నాకు

తెలుసునని పొరబడవద్దు

ఎందుకంటే

స్త్రీలు

ఎంత నేర్చినా

పట్టుబడని పరాయి భాషలు

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top