భైరవ కోన (జానపద నవల) - అచ్చంగా తెలుగు

భైరవ కోన (జానపద నవల)

Share This

భైరవ కోన (జానపద నవల)

రచన :భావరాజు పద్మిని

 
ప్రకృతి ఒడిలో పరవశింపజేసే సువిశాల సామ్రాజ్యం, భైరవపురం.... కంచుకోట వంటి ఆ సామ్రాజ్యంలో ఆకాశాన్నంటే మూడు కొండల నడుమ ఉన్న అందమైన కొనలోని సుందర ఆశ్రమం ....
ఆ మూడు కొండల్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వర కొండలు అంటారు. భైరవుడు క్షేత్రపాలకుడిగా కల ఆ ప్రాంతాన్ని భైరవ కోన అంటారు. పచ్చటి కొండల నుంచి జలజలా జాలువారే జలపాతాలు, కొండ గుహలు, సుందర వనాలు, నిర్భయంగా సంచరించే లేళ్ళు, శుకపికాల కలరవాలు, పురివిప్పి ఆడే మయూరాలు ప్రకృతి అందాలు కనువిందు చేసే ప్రాంతం అది. అక్కడ క్రూర మృగాలు సైతం తమ జాతి వైరాలు మరచి సాధుభావంతో ఉంటాయి.
చక్కటి లతలు అల్లిన మునివాటికలో ఏకాంతంలో ధ్యానమగ్నమై ఉన్నారు సదానందమహర్షి.  ప్రశాంతంగా ఉన్న ఆయన వదనం నిశ్చల సరోవరాన్ని తలపిస్తోంది. నుదిటిపై  త్రిపుండాలతో ప్రత్యక్ష పరమేశ్వరుడిలా ఉన్నారు ఆయన. అలౌకికమైన ఆనందం ఆయన ముఖంలో ప్రస్ఫుటమౌతోంది. నెమ్మదిగా ఆయన్ను సమీపించాడు రాకుమారుడు విజయుడు.
విజయుడి రాకను తెలుసుకున్న మహర్షి, నెమ్మదిగా కనులు తెరిచి, ‘రా నాయనా! కూర్చో  ’ అంటూ వాత్సల్యంగా ఆహ్వానించారు. విజయుడు మహర్షికి వినమ్రంగా నమస్కరించి కూర్చున్నాడు. విజయుడి ముఖంలో సందేహ ఛాయలు గమనించిన ముని, ‘సంకోచిస్తావెందుకు, నీ మనసులోని సందేహం వెల్లడించు,’ అన్నారు.
విజయుడు కాస్త తటపటాయించి, ‘గురువర్యా! కొనలో ఉన్న గుహ్యమైన గుహలోని భైరవ, భైరవి విగ్రహాలను రేపు వెళ్లి పూజించి వద్దామని చెప్పారు. అసలు భైరవుడు ఎవరు ? భైరవ ఆరాధన ఎందుకు చెయ్యాలి ?దయుంచి తెలుపగలరు, ’ అని అడిగాడు.
సదానందమహర్షి పున్నమి వెన్నెల కాసినట్టు నవ్వి, ఇలా చెప్పసాగారు...
‘నాయనా! పూర్వం ఒకప్పుడు బ్రహ్మ ,విష్ణువులకు తమ ఆధిపత్యం గురించిన వివాదం చెలరేగింది. ‘తాను గొప్ప’ అన్నాడు బ్రహ్మ, ‘తానే గొప్ప’ అన్నాడు విష్ణువు. వారిలా కలహిస్తూ ఉండగా, వారి మధ్య ఒక జ్యోతిస్థంభం ఆవిర్భవించింది. ఆ జ్యోతి మొదలును తెలుసుకునేందుకు బ్రహ్మ, చివరను తెలుసుకునేందుకు విష్ణువు బయలుదేరారు. ఆద్యంతాలు లేని దివ్య జ్యోతిర్లింగం అది. ఆ జ్యోతి యొక్క అంతాన్ని తెలుసుకోలేని విష్ణువు, ఆదిని కనుగొనలేని బ్రహ్మ అసహాయంగా వెనుదిరిగి వచ్చారు. అప్పుడు పరమశివుడు నిజరూపంతో ప్రత్యక్షం అవ్వగా, విష్ణువు శివుడిని స్తుతించి శరణు కోరతాడు. బ్రహ్మ అహంకరించి, ‘’పూర్వం నువ్వు నా ఫాలభాగం నుండి పుట్టావు ,నన్ను శరణు వేడు నేను నిన్ను రక్షిస్తా‘’అని గర్వంగా అన్నాడు . అప్పుడు కోపంతో శివుడు తన నుంచి ఒక భైరవాకారాన్ని సృష్టించాడు.  భైరవుడు తన ఎడమ చేతి బొటన వ్రేలి తో బ్రహ్మ ఐదో తలను గిల్లి వేశాడు. బ్రహ్మకు వెంటనే అహం అణిగి, శతరుద్రీయం తో శివుని స్తుతించి ప్రసన్నం చేసుకున్నాడు.
అలా ఆవిర్భవించిన భైరవుడితో శివుడు, ‘‘’నువ్వు ఈ ప్రపంచాన్ని భరించే శక్తి కల వాడివి .నిన్ను ‘’పాప భక్షకుడు ‘’అని పిలుస్తారు. కాశీలోనే నీ ఉనికి; కాలమే నిన్ను చూసి భయపడే కాల భైరవుడివి నీవు, యజ్ఞాలలో మాన్యత్వాన్ని పొందుతావు” అన్నాడు.
కాబట్టి , కాలభైరవుడు పరమేశ్వరుని అపరాంశ. రౌద్రస్వరూపుడు. రక్షాదక్షుడు. దుష్టగ్రహబాధలు నివారించగల శక్తి మంతుడు. సాధారణంగా అంతా 'కాలభైరవ'లోని 'కాల' పదాన్ని నలుపుగా, 'కాలభైరవుని' నల్లటి భైరవునిగా లేదా భయంకరమైన రూపంగా భావిస్తారు. కాలభైరవుడు అంటే శక్తి భైరవునికి (శివునికి) ప్రతిరూపం, ఈ దేవుడు కాలాన్ని, దాని శక్తిని నియంత్రించగల్గుతాడు. కనుక కాలభైరవుడంటే కాలాన్ని అధీనంలో వుంచుకునే కాల చక్ర భైరవుడు అని అర్థం.
ఈయన కాలస్వరూపం ఎరిగిన వాడు. కాలంలాగే తిరుగులేనివాడు. ఎంత వ్యయమైనా తరిగిపోని వాడు. శాశ్వతుడు, నిత్యుడు. కాలభైరవుడు మన పురాణాల ప్రకారం అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోథ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీష్మ భైరవుడు, శంబర భైరవుడు అని 8 రకాలు.  నాలుగు చేతులలో పుర్రె, డమరుకం, శూలం, ఖడ్గం ఉంటాయి. ఈయన వాహనం శునకం. శునకం  అంటే విశ్వసనీయతకు మారుపేరు. రక్షణకు కూడా తిరుగులేని పేరు. సమయోచిత జ్ఞానానికి ప్రతీక.
ప్రజల బాగోగులు, యోగక్షేమాలు కనిపెట్టుకుని చూసే వాడు, తన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడమే కర్తవ్యమని భావించేవాడు కాలభైరవుడు. ఈయన ఆపడానికి వీల్లేనివిధంగా నిరంతరం పురోగమిస్తుంటాడు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ, పూర్తి భక్తిశ్రద్ధలతో కాల భైరవ స్వరూపుని వేడుకున్నట్లయితే ఆ దివ్య శక్తి నిరంతరం కనిపెట్టుకుని వుండి కాపాడుతుంది. అంతే కాదు, కాల భైరవుడు ఈ క్షేత్ర పాలకుడు, అంటే, ఈ ప్రాంతాన్ని రక్షించే కాపలాదారు.  గ్రామ నగర రక్షకుడిగా, మంత్ర శాస్త్ర వ్యాఖ్యాతగా, తంత్ర మూర్తిగా ఉంటాడు భైరవుడు. మంత్ర తంత్ర సాధనల్లో ఏం సాధించాలన్నా ముందు ఆయన అనుమతి తీసుకుంటారు. భైరవోపాసన రక్షాకరం, శీఘ్ర సిద్ధి ప్రదం. ఆయన సాధనతో అనేక మంత్రాలు సిద్దిస్తాయి.  దేశాన్ని, దేశప్రజలను కూడా రక్షించగల శక్తిసంపన్నుడు భైరవుడు. ఈ భైరవపురానికి కాబోయే రాజుగా నీవు ఆయన అనుగ్రహాన్ని సంపాదించుకోవాలి. అందుకే మనం రేపు ఆ గుప్తకోనలోని భైరవ ఆలయానికి వెళ్ళాలని ఆజ్ఞాపించాను” అంటూ ముగించారు మహర్షి.
‘తమరి ఆజ్ఞ శిరోధార్యం మహర్షీ! అంటూ నమస్కరించి నిష్క్రమించాడు విజయుడు.
మర్నాడు ఉదయం మహర్షితో కలిసి భైరవ ఆరాధనకై అడవిలో ప్రయాణించ సాగాడు విజయుడు. అందమైన జలపాతం... జలపాతం వెనుక ఒక అద్భుతమైన గుహ ఉంది ... ఆ గుహకు చేరుకోవాలంటే అర్ధ గంట సమయం మోకాలి లోతు నీటిలో పయనించాలి. అక్కడి ప్రకృతి రమణీయతనూ, పక్షుల కూజితాలనూ, జలపాత సౌందర్యాన్ని తిలకిస్తూ మైమరచిపోయి నడుస్తున్నాడు విజయుడు.
ఇంతలో దిక్కులు పిక్కటిల్లేలా వినిపించింది ఒక వికటాట్టహాసం...
ముందుకు నడిచే కొద్దీ.... మరింత బిగ్గరగా వినిపించసాగింది ,వికటాట్టహాసం ..
అంతలో వికృతంగా వినిపించిందొక స్వరం ...
 
‘సదానంద మహర్షీ ! నన్ను ఎదుర్కునేందుకు విజయుడిని సిద్ధం చేస్తున్నావా ? నీ అమాయకత్వం చూస్తే, నవ్వు పుట్టుకొస్తోంది. మంత్రతంత్రయంత్ర విద్యల్లో నిష్ణాతుడిని, సంకల్ప మాత్రం చేత ప్రపంచాన్ని గడగడ లాడించగల సమర్దుడిని ! ఈ కరాళ మాంత్రికుడిని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. అతి క్లిష్టమైన భైరవ కృప ఈ నూనూగు మీసాల యువకుడికి లభిస్తుందా? ఆలోచించు ! నేను తలచుకుంటే, ఇప్పుడే నిన్నూ, నీ శిష్యుడిని అంతం చెయ్యగలను.’  
‘కరాళా ! వచ్చావా, ఎన్ని యుగాలు గడిచినా, దుష్టశక్తులు దైవశక్తి ముందు నిలవలేవు. ప్రపంచాన్ని గుప్పిట పట్టి, చక్రవర్తివి కావాలన్న నీ స్వార్ధసంకల్పం ఎన్నటికీ నెరవేరదు. నీ వంటి కరాళుళ్ళు వేలకు వేలు పుట్టి, అనేక సిద్ధులు, శక్తులు పొంది, నిత్య యౌవనులు కాగలిగారే కాని, తమకు ప్రాప్తమైన శక్తులను మానవాళి శ్రేయస్సుకు ఉపయోగించి చరితార్ధులైనట్లు ఏ చరిత్రలోనూ లేదు. చివరికి వారంతా మట్టిగరిచారు. నీకూ అదే గతి పడుతుంది! సిద్ధంగా ఉండు !’ , పదునుగా జవాబిచ్చారు సదానందమహర్షి .
దాంతో చెలరేగిపోయిన కరాళుడు, వారు నడిచే నీటిలో మంటలు పుట్టించాడు. వెంటనే అతి శక్తివంతమైన నృసింహ మహా మంత్ర రాజ స్తోత్రాన్ని పఠించసాగారు సదానందమహర్షి ... ఆ మంత్రం ఎంతటి దుష్టశాక్తుల్నైనా క్షణాల్లో పారద్రోలుతుంది. ఆపత్కాలంలో సత్వరమే రక్షణ కల్పిస్తుంది.
“ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం !”
 
అంతే, అప్పుడు జరిగిందొక అద్భుతం ! సరిగ్గా సదానందమహర్షి , విజయుడు ఉన్న ప్రదేశానికి పైన, ఆకాశంలో సుదర్శన చక్రం  ఒక గొడుగులాగా ఏర్పడింది.  జోరుగా వాన కురిసింది, క్షణాల్లో మంటలు మాయమైపోయాయి. అంతులేని ప్రశాంతత నెలకొంది. ఆశ్చర్యంతో ఇదంతా గమనిస్తున్న విజయుడితో, “నాయనా ! తరువాత అన్నీ నీకు విశదపరుస్తాను. భైరవారాధనకు అమృత ఘడియలు మించిపోతున్నాయి. అదిగో, పూజకు కావలసిన సంభారాలు, అటు చూడు...” అంటూ నీటి ఒడ్డున ఉత్తర దిక్కుగా సూచించారు మహర్షి.
 
ఆశ్చర్యం! అటుగా ఒక పెద్ద ఏనుగుల గుంపు ఉంది. ఏనుగులు పూలమాలలు, బిల్వ పత్రాలు, సుగంధ ద్రవ్యాలు తీసుకువచ్చాయి. ఉడుతలు, కుందేళ్ళు కొన్ని పళ్ళను తీసుకు వచ్చాయి. వాటన్నింటినీ తను తెచ్చిన ఒక పెద్ద పళ్ళెరంలో చక్కగా సర్దింది ఓ వానరం. విజయుడికేసి చూసి, చెయ్యెత్తి వద్దకు రమ్మని సైగ చేసింది.
 
‘నాయనా, విజయా ! నా పయనం ఇంత వరకే. ఇకపై నీ చిత్తశుద్ధి, కార్యదీక్ష, భక్తి ప్రపత్తులే నీకు శ్రీరామ రక్ష !నీకు శక్తి భైరవ మహా మంత్రాన్ని ఉపదేశిస్తాను. గుహలోని భైరవ –భైరవి విగ్రహాలకు భక్తితో అర్ఘ్య పాద్యాది ఉపాచారాలతో పూజసల్పి, నైవేద్యం అర్పించి, కనులు మూసుకుని, ఈ మంత్ర జపం ఆరంభించు. నీకు ఆకలిదప్పులు కలుగకుండా ఈ మూలిక ప్రసాదిస్తున్నాను. బాహ్య చింతన వీడి, మనసు లగ్నం చేసి, ఆ దివ్య మూర్తుల్ని ఉపాసించు. ఎన్ని రోజులైనా, పట్టు వీడక, సంకల్ప బలంతో వారి కరుణ కలిగేదాకా మంత్ర జపం చెయ్యి. నీవు కారణ జన్ముడవు. ఆ భైరవ కృప నీకు తప్పక  లభిస్తుంది.
 
సమయం ఆసన్నమయ్యింది. ఇక బయల్దేరు, ఆ ఒడ్డున ఉన్న వానరం అందించే పళ్లెరాన్ని నెత్తిన పెట్టుకుని, మోకాలి లోతున్న ఈ నీటిలో నడుస్తూ, జలపాతం వరకూ వెళ్ళు. ఆ జలపాతం వెనుక వైపున ఉన్న గుహలోనికి ప్రవేశించు.... ఈ గురువు దీవెనలు నీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాయి,’ అంటూ కరుణా దృక్కులతో విజయుడ్ని చూసారు సదానంద మహర్షి.
 
గురుపాదుకలకు ఒంగి వందనం సమర్పించి, ఒడ్డున ఉన్న వానరం వద్దకు వెళ్ళాడు విజయుడు. అతని రాకను గమనించిన ఏనుగులు తొండం ఎత్తి ఘీంకారం చేసాయి. ఉడుతలు సందడిగా అటూ ఇటూ తిరుగుతూ కోలాహలం చెయ్యసాగాయి. కుందేళ్ళు వెనుక కాళ్ళపై నిల్చుని తమ ఆనందాన్ని తెలియచేసాయి. వానరం పిల్లిమొగ్గలు వేస్తూ విజయుడి వద్దకు చేరింది. ప్రేమగా దాని వీపు నిమిరాడు విజయుడు. ఆ స్పర్శలోని ఆత్మీయతకు పులకరించి, విజయుడి మెడను హత్తుకుని, పళ్లెరాన్ని అందుకోమన్నట్లుగా అతడికి  సైగ చేసింది వానరం. నెమ్మదిగా దాన్ని క్రిందకు దించి, ఆ పళ్లెరాన్ని అందుకుని, నెత్తిన పెట్టుకుని, పయనించసాగాడు విజయుడు. అతని మనసంతా శివమయం. శివశివానీ స్వరూపాలైన భైరవ- భైరవీ మూర్తుల కృపకు పాత్రుడవ్వాలన్న స్థిర చిత్తంతో బయలుదేరాడు.
 
గుహ మార్గం చీకటిగా ఉంది. కేవలం ఒక మనిషి పట్టే సందు మాత్రమే ఉంది. గబ్బిలాలు తిరుగుతున్నాయి, సర్పాలు ప్రాకుతున్నాయి. కీచురాళ్ళు అరుస్తున్నాయి. దారికి అడ్డంగా ఉన్న బూజును ఒక చేత్తో తీసేస్తూ, నెమ్మదిగా అడుగులు వేస్తూ వెళ్ళసాగాడు విజయుడు. పిశాచాలు అరుస్తున్నట్టు యేవో శబ్దాలు వినిపించసాగాయి. అదరక, బెదరక భైరవ మంత్రం జపిస్తూ పయనించసాగాడు విజయుడు. ఏదైనా సత్కార్యం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు దుష్టశక్తులు ఇలా అడ్డుపడతాయని అతనికి తెలుసు. అతని మనసు ఏదో కీడును శంకించసాగింది.....
 
విజయుడి దారికి అడ్డంగా నిలిచింది ఓ ఒంటికన్ను పిశాచం. దాని నెత్తిన చిత్రమైన కాంతి వెలిగిఆరుతోంది. కన్ను చింత నిప్పులా మండుతోంది. అది దాని ఎర్రటి నాలుకను ,పొడుగ్గా చాచింది . దాని నోట్లో నుంచి మంటలు పుడుతున్నాయి. విజయుడిని అడ్డుకోవాలని అట్టహాసంగా అరుస్తూ, వేగంగా అతని వద్దకు రాసాగింది. మహర్షి చెప్పిన నృసింహ మహామంత్రాన్ని జపిస్తూ, ఒరలో ఉన్న బాకును గురి చూసి విసిరాడు విజయుడు. ఆ బాకు తగలగానే, మంత్ర ప్రభావం వల్ల, కాలి బూడిదయ్యింది పిశాచం.
 
అలా అడ్డంకులను అధిగమిస్తూ, చాలా దూరం పయనించాకా, ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది.  గుహ విశాలమయింది.  గుహ పైభాగంలో ఉన్న రంధ్రం నుంచీ సూర్య కిరణాలు గుహలోనికి ప్రసరిస్తున్నాయి. ఏదో పరిమళం విజయుడి ముక్కుపుటాలను త్రాకింది.   దగ్గరలోనే విగ్రహాలు ఉన్నాయన్న సంగతిని , ఆ పరిమళం సూచిస్తోందని గుర్తించాడు విజయుడు. ఉత్సాహంగా అడుగులు ముందుకు వేసాడు.
 
మరో పదడుగులు వెయ్యగానే,  అందమైన  భైరవ భైరవీ విగ్రహాలు అతడికి దర్శనం ఇచ్చాయి. బంగారు కమల పీఠం పై, దశ భుజ భైరవుడి ఒడిలో ఒద్దికగా కూర్చుంది భైరవీ మాత. ఆ విగ్రహాల ముఖాల్లో ద్యోతకమయ్యే  దివ్యత్వానికి, అక్కడి ప్రశాంతతకు ముగ్దుడవుతూ తనకు తెలియకుండానే పళ్లెరాన్ని క్రింద ఉంచి, పూజకు ఉపక్రమించాడు విజయుడు.
 
“ యం యం యక్ష రూపం దశ దిశి విదితం భూమి కంపాయమానం
సం సం సంహార మూర్తిం శిరః మకుట జటా శేఖరం చంద్ర బింబం
దం దం దీర్ఘ కాయం వికృత నఖ ముఖం జోర్ధ్వరోమం కరాళం
పం పం పం పాప నాశం ప్రాణమత్ సతతం భైరవం క్షేత్రపాలం “
 
అంటూ ఆనందోత్సాహాలతో ఆరంభించి, సకల ఉపచారాలతో విగ్రహాలను పూజించి, పద్మాసనంలో ధ్యానమగ్నుడయ్యాడు విజయుడు. అతడికి ఒకటే ధ్యేయం , దుర్లభమైన భైరవ కృపను పొందాలి. సమస్త జనావళిని దుష్ట శక్తుల నుండి రక్షించాలి. తన ప్రాణ శక్తిని పూర్తిగా కేంద్రీకరించి, మహర్షి చెప్పిన మంత్రాన్ని పట్టు విడవకుండా జపించసాగాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. అయినా, విజయుడు పట్టు విడవలేదు. తన దేహంపై అనేక కీటకాలు ప్రాకుతున్నా, చీమలు పుట్టలు పెడుతున్నా, లెక్కచెయ్యలేదు. అతని తపస్సు తీవ్రతకు గుహ కంపించసాగింది.
 
అతడి కార్యదీక్షకు, సత్సంకల్పానికి , ఏకాగ్రతకు, భక్తితత్పరతకు తలవొగ్గిన దేవతల అనుగ్రహంలా అప్పుడు జరిగిందొక అద్భుతం !
కోటి దీపాల కాంతి గుహలోనికి ప్రవేశించింది. గుహలోని జేగంటలు వాటంతటవే మ్రోగసాగాయి. మధురమైన పరిమళం వ్యాపించింది. అమర గంధర్వ గానం వినిపించసాగింది. విజయుడిపై పూల వాన కురిసింది. మనసంతా చల్లని వెన్నెల పరుచుకున్న మధురానుభూతి... అప్పుడు మెల్లిగా కనులు తెరచి చూసాడు విజయుడు....
ఉజ్వల కాంతి వలయంలో, సుందర దరహాసంతో, కోటి తల్లుల మమతను కళ్ళలో చిందిస్తూ ప్రత్యక్షం అయ్యారు శివ-శక్తులైన, భైరవ-భైరవీ మూర్తులు. ఆ తేజస్సు, దివ్యత్వం, వారి కళ్ళలోని కరుణ చూసి అప్రతిభుడయ్యాడు విజయుడు. తామే సృష్టి, స్థితి, లయ కారకులైనా, ఆదిదంపతులు జీవుల పట్ల చూపే వాత్సల్యం అనిర్వచనీయం ! మధురాతిమధురం ! దైవానుగ్రహం, దైవం మనపట్ల చూపే దయ ఎంత గొప్పవో కదా!
 అప్పటివరకూ అదృశ్య రూపంతో ఉండి, ఆ గుహలోనే వారిని కొలుస్తున్న యక్ష, కిన్నెర, నాగ, గంధర్వ, కింపురుషులు, యోగులూ అంతా ప్రత్యక్షమై, ముక్త కంఠంతో తన్మయత్వంతో, భైరవుడిని ఇలా స్తుతించారు. ఆ దివ్యానుభూతికి ఆత్మ ఆనందతాండవం చేస్తుండగా, వారితో శృతి కలిపాడు విజయుడు.
“రక్తజ్వాలా జడధరం శశిధరం రక్తంగ తేజోమయం
హస్తేశూల కపాల పాశ డమరుం లోకస్య రక్షాకరం |
నిర్వాణం శూన వాహనం త్రినయనం ఆనంద కోలాహలం
వందే భూత పిశాచనాధ వటుకం శ్రీ క్షేత్రస్య బాలం శివం || “
కళ్ళ వెంట ఆనంద భాష్పాలు వర్షిస్తుండగా, అలౌకికమైన ఆనందంలో తెలిపోసాగాడు విజయుడు.
శక్తిభైరవుడు అభయహస్తంతో విజయుడిని దీవించి “రాకుమారా విజయా ! నీ అచంచల భక్తి మమ్మల్ని కరిగించివేసింది. నీ కోరిక ఏమిటో చెప్పు, తప్పక తీరుస్తాము ”, అన్నాడు.
‘స్వామీ ! సర్వంతార్యాములు మీరు. అయినా, నా కోరిక నా నోటి వెంట వినాలని అడుగుతున్నారు. కొండంత దేవుడైన మీరు ఈ దీనుడి పట్ల కరుణ చూపి, మీ దర్శన భాగ్యం కలిగించారు. మీ దర్శనంతో నా జన్మ ధన్యమయ్యింది. దుష్టశక్తులను సంహరించి సమస్త మానవ శ్రేయస్సును, లోకకల్యాణాన్ని కలిగించాలనే సత్సంకల్పంతో మీ గురించి తపస్సు చేసాను. దయ ఉంచి, ఎంతటి దుష్టశక్తులనైనా , అరాచాకాలనైనా  ఎదుర్కొనే శక్తిని నాకు అనుగ్రహించండి.  భైరవపురం ప్రజలు సుభిక్షంతో, సుఖశాంతులతో రామరాజ్యం లాగా వర్ధిల్లే అవకాశం కల్పించండి,’ వినయంగా మోకరిల్లి అడిగాడు విజయుడు.
‘తధాస్తు ! విజయా నీ సంకల్పం హర్షనీయం. మంచి పనులకు దైవ రక్ష, సహాయం ఎల్లప్పుడూ ఉంటుంది. నీకు తక్షణమే అష్టసిద్దులను, నవనిధులను అనుగ్రహిస్తున్నాను. అంతేకాదు, వశీకరణ శక్తిని, ఈ దివ్య ఖడ్గాన్ని కూడా ప్రసాదిస్తున్నాను. ఈ శక్తులను నీవు ఇతరుల మేలు కొరకే వాడాలి సుమా ! ఈ ఖడ్గం అత్యంత శక్తివంతమైనది. ఊహకు అందని దుష్టశక్తుల్ని సైతం సమూలంగా నాశనం చేస్తుంది. వీటితో మీ భైరవపురం నిత్యకళ్యాణం –పచ్చతోరణంగా పది కాలాల పాటు భాసిస్తుంది. ధర్మబద్ధంగా పరిపాలన చేసి, అంత్య కాలంలో నాలో లయం అయ్యే వరాన్ని కూడా నీకు కటాక్షిస్తున్నాను. సుఖీభవ !’ అంటూ దీవించాడు భైరవుడు.
తక్షణమే ఒక దివ్య శక్తి భైరవ- భైరవి మూర్తుల నుంచి విజయునిలోకి ప్రవేశించింది. ఆ శక్తి తరంగాల తాకిడికి మరింతగా ప్రకాశించాడు విజయుడు. అతని ఆహార్యం మారిపోయి సిసలైన రాకుమారుడి రాజసం ఉట్టి పడసాగింది. మణిరత్న ఖచితమైన ఒక దివ్య ఖడ్గాన్ని విజయుడికి అందించి, తన దేవేరితో సహా అదృశ్యమయ్యాడు భైరవుడు. గుహ మళ్ళీ మామూలు స్థితికి వచ్చింది.
పరమానందంతో ఈ శుభవార్త గురువుగారికి చెప్పాలని ఉత్సాహంగా బయలుదేరాడు విజయుడు. తను, తన వంశం తరించింది, తన ఆశయం నెరవేరబోతోంది. తన రాజ్యం రామరాజ్యంలా పేరొందడం తధ్యం ! మనోవేగంతో పరుగులు తీస్తున్నాడు విజయుడు. జలపాతం దాటి అడవిలో నడక సాగించాసాగాడు. ఇంతలో ఒక అనుకోని సంఘటన జరిగింది...
మెరుపు వేగంతో పరుగులు తీస్తూ వచ్చి, విజయుడిని గుద్దుకుని, అతని చేతుల్లో సొమ్మసిల్లిపోయింది ఓ లతాంగి. ఆమె వెనుక ఒక భయంకరమైన చిరుతపులి వేటాడుతూ వచ్చింది. వారిరువురి మీదకు దూకేందుకు సిద్ధంగా ఉన్న,ఆ క్రూర మృగంతో పోరాడే సమయం లేదు. ఆపద సమయాల్లో ఏ విధంగానైనా  ప్రాణ రక్షణ రాజధర్మం. తక్షణమే తన వశీకరణ శక్తిని దానిపై ప్రయోగించాడు విజయుడు. విజయుడి కళ్ళలోని తీక్షణతకు చప్పబడి, తోక ఊపుతూ వెనుదిరిగి వెళ్ళిపోయింది చిరుత.
తన చేతుల్లో ఉన్న కోమలిని, నెమ్మదిగా పొదువుకుని, ఒక పొగడ చెట్టు క్రిందకు చేర్చాడు విజయుడు. భయం వల్ల ఆమె నుదిటికి పట్టిన చెమటను తన ఉత్తరీయంతో తుడుస్తూ, ఒక్క క్షణం విస్మయానికి గురయ్యాడు.
అద్భుతమైన అందం ! ఆమె దారి తప్పిన వనదేవత లాగా ఉంది. కవుల వర్ణనల్లోని  కావ్యకన్యక లాగా ఉంది. విశాలనేత్రాలు,తీర్చిదిద్దినట్లున్న కనుముక్కు తీరు, కళ్ళుతిప్పుకోలేని అవయవ సౌష్టవం, ఆమె ఆహార్యం ఆమె రాజకన్య అని చెప్పకనే చెబుతోంది. ఆమె పూల రెక్కలు అద్దిన వెన్నెల శిల్పంలా, రాసి పోసిన సౌందర్యంలా ఉంది. పిల్లగాలికి ఆమె నీలాల కురులు ఎగురుతుంటే సర్దుతూ, “ఆహా, నీలి మబ్బుల్లో దోబూచులాడే చందమామ లాగా యెంత చక్కటి మోము !” అనుకున్నాడు విజయుడు. అతనికి తెలియకుండానే ఆమె పట్ల ఒక అవ్యక్తమైన అనురాగభావన కలిగింది. ఆమె తన కోసమే పుట్టిందని అతని మనసుకి అనిపించింది. రెప్ప వాల్చకుండా తన చేతుల్లో ఉన్న ఆమెను చూస్తూ, ఒక అపురూపమైన నిధి తనకు దొరికినట్లు పొంగిపోసాగాడు విజయుడు.
మరుక్షణమే తమాయించుకుని, ఇలా ఆలోచించసాగాడు... “ ఇంతటి సుమసుకుమారికి ఈ కీకారణ్యంలో ఏమి పని ? ఎందుకింత సాహసం చేసి, ఆపదలు కొని తెచ్చుకుంది ? ఈమె ఎవరో కనుక్కుని, తన వారి వద్దకు చేర్చాలి... ”అనుకున్నాడు. విజయుడి మనసులో ఎన్నో ప్రశ్నలు. ముందు ఆమెకు స్పృహ తెప్పించి, తరువాత వివరాలు రాబట్టాలి, అనుకున్నాడు . ఒక ఆకును దొన్నెగా చేసి, దగ్గరలో ఉన్న తటాకం నుంచి నీరు తెచ్చి ఆమె మోముపై చిలకరించాడు. నెమ్మదిగా కనులు తెరిచింది ఆమె....
నెమ్మదిగా కనులు తెరిచిన ఆమెకు, మళ్ళీ చిరుత తనను వేటాడడం గుర్తొచ్చింది. ఒక్కసారి భయంతో విజయుడిని హత్తుకుంది.  ఆమెకు స్వాంతన చేకూర్చేలా వీపు తట్టి ధైర్యం చెప్పాడు విజయుడు. ఆ స్పర్శలో ఆమెకు ‘నీకు మరేం భయం లేదు,  నేనున్నాను...’ అన్న భావన కలిగింది. కాస్తంత తేరుకుంది. హఠాత్తుగా ఆమెకు తాను పరపురుషుడి కౌగిలిలో ఉన్నానన్న విషయం జ్ఞాపకం వచ్చింది. ఒక్కసారి, విజయుడి నుండీ విడివడి, అతనికేసి తేరిపారా చూసింది.
ఇన్నాళ్ళు తన కలలో కనిపించి కవ్వించిన రూపం... తాను కొలిచే కనకదుర్గ అమ్మవారు, ‘ఇతడే నీ కాబోయే భర్త...’ అంటూ ధ్యానంలో చూపిన రూపం. ఆ అరవిందలోచనాల నుంచీ జాలువారే అనురాగ వర్షంలో తన కలల లోగిలిలో ఎన్ని సార్లు తడిసిందో ! స్ప్రురద్రూపం, రాజసం, తేజస్సు, అతని మోహంలో ఉట్టిపడుతోంది.  ఖచ్చితంగా ఇతనే, తన ప్రాణసఖుడు, సందేహం లేదు. ఆమె కలవరపాటును చూసి, చిరునవ్వు నవ్వాడు విజయుడు. ‘ఆహా, యెంత చక్కటి నవ్వు, సన్నజాజులు అరవిచ్చినట్లు ఉంది...’ అనుకుంటూ సమ్మోహనంగా చూడసాగింది ఆమె. ఎందుకో, స్త్రీ సహజమైన సిగ్గు కూడా ఆ క్షణంలో ఆమెకు గుర్తురాలేదు.
కళ్ళ వాకిళ్ళ నుండీ ఆత్మలు తమ అనుబంధాన్నిమరోసారి గుర్తుచేసుకున్నాయి. ఆమె ఏమీ చెప్పలేదు, విజయుడు ఏమీ అడగలేదు. విజయుడి నవ్వుకు బదులుగా సన్నగా నవ్వి,  ఇష్టసూచకంగా, మెల్లిగా అతని హృదయంపై వాలింది ఆమె. ఆమె ఆంతర్యాన్ని అర్ధం చేసుకున్న విజయుడు లాలనగా ఆమె తల నిమిరి, సుతారంగా ఆమె నుదుటిపై చుంబించాడు. తనూలత తొలకరిలో తడిసినట్లు పరవశంతో కంపించగా, ప్రేమ నింపుకున్న విప్పారిన నేత్రాలతో అతన్ని చూసింది ఆమె. ‘నువ్వు నా ప్రాణానివి, నిన్ను వదిలి వెళ్ళను, ‘ అన్నట్లుగా, అతన్ని మరింత గట్టిగా హత్తుకుంది. మనసులో తెలియని ఆనందం ఉప్పొంగింది విజయుడికి, అతనికీ ఆమెను వదలాలని లేదు. ‘ నువ్వు నా జన్మజన్మల సహచరివి, ఇన్నాళ్ళకు నా నిరీక్షణ ఫలించింది,’ అన్నట్లు ఆమెను అపురూపంగా పొదువుకున్నాడు.
ఒకరి పరిచయం ఒకరు అడగలేదు. ఒకరి  డబ్బు, అంతస్థు, గుణగణాలు మరొకరికి అక్కర్లేదు. తాము ఎక్కడ ఉన్నామో అన్న చింత లేదు. అందం, అర్హతలు, లోపాలు, సుగుణాలు ఎంచనిదేగా ప్రేమ ! భాష, వ్యక్తీకరణ అక్కర్లేకుండానే ఒక్కోసారి మౌనం కూడా మధురంగా పలుకుతుంది. కాలం వెంట పరుగులు తీస్తూ ఉంటాడు మనిషి. కాని కాలం మనిషి ముందు ఓడిపోయి, అసహాయంగా నిలబడే క్షణాలు ఉంటాయి. మనిషి తనను తాను మర్చిపోయే క్షణాలు ఉంటాయి. ప్రపంచంలోని నిధులు, ధనధాన్యాలు, హోదాలు, అన్నింటినీ తృణప్రాయంగా తిరస్కరించే క్షణాలు ఉంటాయి. అవే ,మనిషి అహాన్ని మరచి ప్రేమలో మమేకమయ్యే క్షణాలు. అప్పుడు యుగాలు క్షణాల్లా దొర్లిపోతాయి. ఒకరి కౌగిలిలో ఒకరు అలా చాలా సేపు ఉండిపోయారు ఇద్దరూ...
‘ప్రియంవదా ! రాకుమారి ప్రియంవదా ! ఎక్కడమ్మా... ఎక్కడున్నారు ?’ అన్న పిలుపుతో స్పృహలోకి వచ్చారు ఇద్దరూ. ఒకరి నుండి ఒకరు విడివడి ఆ పిలుపు వినవచ్చిన దిశగా చూసారు. ఆ పిలుపుకు అప్రమత్తమై నిల్చుంది ఆమె. ‘ప్రియంవద’ ప్రియమైన వదనానికి తగ్గ చక్కటి పేరు, అనుకున్నాడు విజయుడు. ఒక నలుగురైదుగురు స్త్రీలు వెనుక భటులు తోడురాగా, అటువైపే వస్తున్నారు. తాను వారితో వెళ్లక తప్పదన్నట్లు నిస్సహాయంగా విజయుడి వైపు చూసింది ప్రియంవద. ఆమె చెయ్యి పట్టుకుని, సుతారంగా నొక్కి, వారి వద్దకు తీసుకు వెళ్ళాడు విజయుడు.
వారిద్దరినీ చూసిన చెలులు ఆశ్చర్యంతో చూస్తుండగా, వారితో ఇలా అన్నాడు విజయుడు. ‘ ఓ కోమలులారా ! చూడబోతే మీరు ఈమె నెచ్చెలులని తెలుస్తోంది. నేను భైరవపురం రాకుమారుడను, విజయుడను. ఈమె ఎవరో నాకు తెలియదు కాని, ఆపద నుండీ ఈమెను రక్షించడం రాజధార్మంగా భావించాను. కాని, ఈమెను చూసాకా, తన పట్ల నాకు బలీయమైన అనురాగ భావన కలిగింది. తను కూడా నన్ను ఇష్టపడుతున్నట్లు తెలిసింది. ఈమెను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఈమె తల్లిదండ్రుల అనుమతితో వివాహమాడతాను. మీ పిలుపుతో ఆమె పేరు తెలిసింది. మీరు ఎవరు ?ఈ కారడవిలోకి ఎందుకొచ్చారు ?దయ ఉంచి  ఈ  వివరాలను కూడా తెలియచెయ్యండి,’ అన్నాడు.
అతని రూపంలోని రాజసం, స్త్రీలతో మాట్లాడేటప్పుడు పాటించే మన్నన, అన్నింటికీ సంతోషించి, వారిలో ప్రియంవద ఇష్టసఖి అయిన ఒకామె ముందుకొచ్చి, ‘ రాకుమారా విజయా !నా పేరు చంపకవల్లి. ప్రియంవద ఇష్టసఖిని. ఈమె భైరవకోనకు తూర్పున ఉన్న కుంతలదేశపు రాజు ధర్మవేదుడి కుమార్తె ప్రియంవద. రాజగురువు ఆదేశానుసారం ప్రతీ పున్నమికి భైరవకొన లోని దుర్గ అమ్మవారి ఆరాధనకు అడవికి వస్తుంది. అలా వస్తుండగా, ఒక చిరుతపులి మమ్మల్ని వెంటాడింది. మేము భయంతో పరుగులు తీసాము. మా ప్రానసఖిని రక్షించినందుకు మీకు ఋణపడి ఉంటాము. ఇక మీరు చెయ్యి విడిస్తే, మా రాకుమారిని మాతో తీసుకువెళ్తాం...,’ అంది కొంటెగా ప్రియంవద మొహంలోకి చూస్తూ...
సిగ్గుతో ప్రియంవద మొహం కందిపోయింది. ఆమె చేతిని చంపకవల్లి చేతిలో పెడుతూ, ‘మీరు ప్రియంవదను తీసుకువెళ్తుంటే, నా హృదయాన్ని బలవంతంగా పెకిలించి తీసుకువెళ్తున్న భావన కలుగుతోంది. ఈమెను భద్రంగా మీ దేశానికి తీసుకు వెళ్ళండి. ,’ అన్నాడు. కన్నీటితో వెళ్తున్న రాకుమారిని చూసి,  ‘చింతించకు ప్రియంవదా, త్వరలోనే మీ దేశం వచ్చి, మీ తల్లిదండ్రుల అనుమతితో నిన్ను పరిణయమాడతాను,’ అంటూ వీడ్కోలు పలికాడు విజయుడు.
సదానందమహర్షి పాదాలకు సాష్టాంగనమస్కారం చేసాడు విజయుడు. విజయుడిని లేవనెత్తి హృదయానికి హత్తుకున్నారు మహర్షి. అతడి మొహంలో కనిపించే దివ్య తేజస్సును, ఆనందాన్ని చూసి, తన దివ్యదృష్టితో జరిగింది తెలుసుకుని, ‘విజయోస్తు ! శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు !’ అంటూ దీవించారు. గురు- శిష్య సంబంధంలోని మాధుర్యం ఇదే ! శిష్యుడి స్థితిగతులు సదా ప్రేమతో పర్యవేక్షిస్తూ, వెన్నంటి ఉంటారు గురువు.
“ నాయనా విజయా ! అకుంఠిత దీక్షతో భైరవ ప్రసాదితమైన దివ్య ఖడ్గం సాధించావు. శభాష్. ఇక నీకు కర్తవ్యం బోధించాల్సి ఉంది. రా, ఇలా కూర్చో,” అంటూ ఒక రావి చెట్టు మొదట్లో విజయుడిని కూర్చోపెట్టారు మహర్షి. చెంగు చెంగున గెంతుకుంటూ స్వేచ్ఛగా ఆయన ఒడిలో తల పెట్టుకు కూర్చుంది హరిణి. అది ఆయన పెంపుడు లేడి. ప్రేమగా దాని తల నిమిరి, ఇలా చెప్పసాగారు మహర్షి.
“ విజయా ! అందరినీ సమాన హక్కులతో పుట్టించాడు భగవంతుడు. అందరూ సౌభ్రాతృత్వంతో అనుభవించాల్సిన తిండి, గుడ్డా, నీడ, కొందరి స్వార్ధం, లోభం వల్ల అందరికీ అందట్లేదు. యెంత విచిత్రమైనది మనిషి ప్రవృత్తి ? పట్టెడు మెతుకులు కరువైనప్పుడు కడుపు నిండితే చాలు, అనుకుంటాడు. కడుపు నిండగానే దేహాన్ని కప్పుకోడానికి ఒక్క గుడ్డ ముక్క చాలనుకుంటాడు. అదీ తీరాకా… ఆకలి, ఇతర అవసరాలకు తగినంత డబ్బు కావాలనుకుంటాడు. తర్వాత అధికారం, సమాజంలో బలీయమైన స్థానం, స్త్రీ సౌఖ్యం, చివరికి… ప్రపంచాన్నే ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించాలన్న దురాశ. అటువంటి దురాశాపరుడే మనకు గుహ వద్ద ఎదురైన మాంత్రికుడు కరాళుడు.
విశ్వ విజేత కావాలన్న వెర్రి ఆశతో అనేక క్షుద్రోపాసనలు చేసాడు. భేతాళుడి అనుగ్రహంతో దుష్టశక్తులు సంపాదించాడు. ఇప్పుడు వాడి గురి ‘చంద్రకాంత మణి’ !” అంటూ ఆపి అర్ధోక్తిలో విజయుడి ముఖంలోకి చూసారు మహర్షి.
‘గురువర్యా ! అది మాకు మా పూర్వీకుల వద్ద నుంచి సంక్రమించిందని ఒకసారి విన్నాను…’ అన్నాడు విజయుడు.
‘అవును నాయనా ! విను. పూర్వం మీ ముత్తాతల కాలంలో ధర్మబద్ధంగా పాలించే  వేద వర్మ అనే రాజు ఉండేవారు. అత్యంత నిష్టతో ఈ కొనలోని దుర్గమ్మను ఉపాసించేవారు. రాజు న్యాయ నిరతికి, భక్తికి ప్రసన్నురాలైన అమ్మవారు, ఆయనకు ప్రత్యక్షమై ఒక దివ్య మణిని ప్రసాదించింది. అదే చంద్రకాంత మణి.
ప్రతీ కార్తీక పున్నమికి, చంద్రుడి కిరణాలు భైరవకొన లోని అమ్మవారి ఎదుట ఉన్న కొలనులో ప్రతిబింబించి, అమ్మవారి నుదుటిపై సూటిగా పరావర్తనం చెందుతాయి. అప్పుడు అమ్మ, నుదుట వజ్రాన్ని కుంకుమగా ధరించినట్లు దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఆ సమయంలో ఈ చంద్రకాంత మణిని అమ్మ ఎదుట ఉంచితే, ఆమె నుదుట మెరిసే చంద్ర కిరణం మణి పై ప్రతిబింబించి, ఒక్క సారిగా ఆ ప్రదేశమంతా దివ్యకాంతులు వ్యాపిస్తాయి. అప్పుడు ఆ మణిలో అమ్మవారి శక్తి నిక్షిప్తమై, ఆ మణి ఉన్న దేశంలో సుభిక్షం, శాంతి సామరస్యాలు, వర్ధిల్లుతాయి. ఎంతటి వారినైనా అవలీలగా ఓడించే పరాక్రమం ఆ రాజుకు సొంతం అవుతుంది. అయితే, మీ వంశం వారు ఆ మణిని ప్రజల శ్రేయస్సు కొరకు తప్ప, స్వార్ధ ప్రయోజనాలకు వాడలేదు. ప్రాణప్రదంగా మణిని సంరక్షిస్తూ వచ్చారు.
ఇప్పుడు కరాళ మాంత్రికుడి దృష్టి ఆ మణి పై పడింది. ఒకానొక క్షుద్ర పూజలో, స్వాతి నక్షత్రంలో పుట్టిన ఆరు శుభ లక్షణాలు కల రాకుమారిని, అమావాస్య నాడు,  భేతాళుడికి బలి ఇచ్చి, ఈ మణిని ఆయనకు సమర్పిస్తే, విశ్వ విజేత అవుతాడని ప్రతీతి. అందుకే ఇప్పుడు కరాళుడు ఆ మణి కోసం, అటువంటి రాకుమారి కోసం అన్వేషిస్తున్నాడు. అతడి ఎత్తులు ఫలించాయా, ఇక ఈ ప్రపంచమే అతడి వశం అవుతుంది.
విజయా ! ఇక్కడ మరో విషయం. ఏ మనిషిలో అయినా క్షత్రియుడు సంహరించాల్సింది దుష్టత్వాన్ని కాని, దుష్టుడిని కాదు. ఒక దుష్టుడిలో మానసిక పరివర్తన తీసుకు వచ్చినప్పుడు, అతడు జీవితాంతం సమాజానికి ఉపయోగపడతాడు. అందుకే, తన ఆత్మ రక్షణ కోసం మరీ అవసరమైతే తప్ప, ఇతరుల ప్రాణాలు తియ్యకపోవడం క్షాత్ర ధర్మం. ఇది నీవు కాబోయే రాజుగా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం.
నీవు ఇక నీ రాజ్యానికి తిరిగివెళ్లు. నీ మాతాపితరులు నీ రాకకై నిరీక్షిస్తున్నారు. వెళ్లి, పట్టాభిషిక్తుడవై కుంతల రాకుమారిని చేపట్టు. ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ, ఈ కొనకు క్షేత్రపాలకుడైన భైరవుడిని, కోనలోని   అమ్మవారిని ఆరాధించు. కరాళుడి పాపం పండి, వాడి పీచమణచే రోజు కోసం  నిరీక్షిద్దాం ! నా ఆశీస్సులు సదా నీకు శ్రీరామరక్ష !” అన్నారు.
మరొక్కసారి గురువు పాదాలకు ప్రణమిల్లి, తన శ్వేతాశ్వంపై భైరవపురం దిశగా పయనం సాగించాడు విజయుడు….
****************
అది ఎత్తైన కొండ మీద ఉన్న ఒక సుందరమైన భవంతి. ఆ భవంతి రాజగురువు ‘ప్రజ్ఞాశర్మ’ ది. అక్కడ యెర్రని వస్త్రాలలో, నుదుట త్రిపుండం ధరించి,  ఏకాగ్ర చిత్తంతో ధ్యానం చేస్తోంది రాకుమారి చిత్రలేఖ. ఆమె అర్ధనిమీలిత నేత్రాలు అరవిచ్చిన కలువల్ని తలపిస్తున్నాయి. పద్మం వంటి ఆమె ముఖం నుంచీ జాలువారే నల్లని కురులు, పద్మంపై వాలిన తుమ్మెదల గుంపును తలపిస్తున్నాయి. ఆమె కేవలం రుద్రాక్షలను ఆభరణాలుగా ధరించింది. ఆమె వదనంలో దివ్య వర్చస్సు ప్రస్ఫుటం అవుతోంది. ఆమెను చూసిన వారు ఎవరికైనా, వెంటనే అమ్మవారు స్ఫురణకు వస్తుంది. ఆమె ముందున్న హోమగుండం గత 30 రోజులుగా వెలుగుతూనే ఉంది. ఆమె రాజగురువు ఆదేశానుసారం మండల దీక్షలో ఉంది.
ఆమె జాతకరీత్యా రాబోయే విపత్తును ఎదుర్కునేందుకు ఆమె చేత “ మహా చండీ హోమం “ చేయించసాగారు రాజగురువు. ఆయన ఆమెను గత నెల రోజులుగా గమనిస్తూనే ఉన్నారు. మణిమయమైన ఆభరణాలు ధరించే ఆమె, ఇప్పుడు కేవలం రుద్రాక్షలు ధరిస్తోంది, పట్టుపీతాంబరాలను వర్జించి, నార చీరలను ధరిస్తోంది, హంసతూలికా తల్పం పై పవళించే ఆమె, కటిక నేలపై శయనిస్తోంది. అతి సుకుమారమైన రాకుమారికి తన వారి కోసం, తన దేశ క్షేమం కోసం, ఎంతటి ఓర్పు, గుండె నిబ్బరం. అవును, రాజసం ఆమె రక్తంలోనే ఉంది కదా !
మంత్రజపం పూర్తి కావడంతో నెమ్మదిగా కన్నులు తెరచి, తన వంక ఆశ్చర్యంగా చూస్తున్న రాజగురువును గమనించి, ఆయన వద్దకు వెళ్లి పాదాభివందనం చేసింది చిత్రలేఖ !
“సుఖీభవ ! ఇష్టకామ్యార్ధ సిద్ధిరస్తు ! శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు !”అంటూ ఆమెను మనసారా దీవించారు రాజగురువు.
“ గురువర్యా ! మీరు నాకు పితృ సమానులు. చిన్నతనం నుంచి మీ వద్ద ఉన్న చనువు వల్ల నా మనసులో కలిగే సందేహాలను మీ ముందు వెలిబుచ్చుతున్నాను. ఈ ‘మహా చండీ యాగం’ ప్రాముఖ్యత ఏమిటి ? ‘నుదుటి రాత చెరగదు...’ అంటారు కదా ! అటువంటప్పుడు ఈ హోమాలు, జపాలు, దీక్షలు ఎందుకు ? దయచేసి తెలియచెయ్యగలరు ...”
తన దర్భాసనంపై ఆసీనులయ్యి, దయాదృక్కులతో చూస్తూ, రాకుమారిని ఎదురుగా కూర్చోమని సైగ చేసి, ఇలా చెప్పసాగారు ఆయన...
“శ్రీ చక్ర సంచారిణి యైన జగన్మాత జగత్తునంతయు పోషించుచూ చరాచర సృష్టికి మూల కారణమై అంతటా వ్యాపించి సర్వ ప్రాణులలో శక్తి స్వరూపం లో చిచ్ఛక్తి అయి, చైతన్యమై, పర బ్రహ్మ స్వరూపమై ప్రకాశిస్తూ వున్నది. ఆది తత్త్వమును స్త్రీ మూర్తిగా భావించి చేయు ఉపాసనల్లో చండీ ఉపాసన ఒకటి. గుణ త్రయములకు ప్రతీక అయిన మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతీ రూప కలయక  చండీ. జగన్మాత సాత్విక రూపం లలిత అయితే, తామస రూపం చండీ. "చండీసమదైవం నాస్తి" అన్ని పురాణాలు చెపుతున్నాయి. సమాజాన్ని దుష్టశక్తులు, ఆరోగ్య రుగ్మతలు, ఆర్థిక నష్టం తదితర సమస్యల నుంచి కాపాండేందుకు సర్వశక్తి స్వరూపిణి అయిన చండీ దేవిని ప్రసన్నార్థం చండీయాగం తలపెట్టడం హైందవ సనాతన ధర్మంలో అనాదిగా వస్తున్న ఆచారం.
చండీహోమము అనగా దుర్గా సప్తశతి అనే 700 శ్లోకాలచే హోమము చేయడము. ఇందు 700 శ్లోకమలు 3 చరిత్రలుగా విభజించి ఉన్నాయి. అమ్మవారి ప్రీతిపాత్రమైన పౌర్ణమి తిధియందు త్రిదేవిసహీత, త్రిశక్తి అయిన చండిపరాదేవతను ఆరాధించి చండిహోమము ఎవరైతే జరిపించుకుంటారో ఆ కుటుంబమంతా శత్రుభీతిపోవటంతోపాటు, పుత్ర పౌత్రాదులతో సుఖముగా జీవిస్తారని శ్రీ దేవి భాగవతమందు చెప్పబడినది.  ఈ యాగానికి అనుబంధంగా గణపతి హోమము,నవగ్రహ హోమములాంటి యాగాలు అనుసంధిస్తారు. యాగ సమయం లో అమ్మకు ప్రీతి పాత్రంగా పూజలు,నివేదనులు ,ఆహుతులు జరుపుతారు.  తల్లి కరుణవల్ల సమస్త దుష్కర్మలు నశించి,జయము సంపదలు,శుభాలు ప్రాప్తిస్తాయి. అందుకే నీచేత ఈ యాగం చేయించాలని సంకల్పించాను.
చేసిన కర్మలే ఫలాలను ఇస్తున్నాయి. కర్మఫలం తప్పనప్పుడు ఇంకా ఈ జపాలు, హోమాలు ఎందుకు అని నీ రెండవ సందేహం కదూ... నీకు సులువుగా అర్ధమయ్యేలా చెప్తాను.
మండుటెండలో మనం నడిచేటప్పుడు పాదరక్షలు ధరిస్తాము, వానలో గొడుగును వేసుకుంటాము. అంటే... ఎండ, వాన మనం అనుభవించాల్సిన కర్మలే అయినా, వాటి తీవ్రతను,ప్రభావాన్ని ఆయా వస్తువుల వాడకం ద్వారా తగ్గిస్తున్నాం. అలాగే మనకు రాబోయే కష్టాల తీవ్రతను తగ్గించేందుకు, ప్రాణ గండాలు తప్పించేందుకు, ఈ జపాలు, హోమాలు అన్నీ గురువుల, మునుల ద్వారా నిర్దేశింపబడ్డాయి. కష్టకాలం గడిస్తే, ఆ వ్యక్తి సుఖజీవనం గడుపుతాడు, సమాజానికి ఉపయోగపడతాడు. అందుకే దయామయులైన ఋషులు మనకు కర్మలకు ప్రాయశ్చితంగా ఇటువంటి పరిహారాలను చెప్పారు. చండీ మాత రక్ష ఒక కవచంలా నిన్ను కష్టకాలంలో ఆదుకుంటుంది తల్లీ. అవగతమయ్యిందా ? ఇక నీ సందేహాలు వీడి, పూర్ణ విశ్వాసంతో, భక్తితో నీ దీక్షను పూర్తి చెయ్యి. శుభం భూయాత్... “  అంటూ ముగించి సంధ్యానుష్టానం కోసం కదిలారు రాజగురువు. ఆయనకు వినమ్రంగా నమస్కరించి, తిరిగి దీక్షలో లీనమయ్యింది చిత్రలేఖ .
*********************
శ్వేతాశ్వంపై వాయువేగంతో పయనించసాగాడు విజయుడు. ఇంతలో ఎదురుగుండా ఏదో పొగ కమ్మినట్లు అయ్యింది. దూరంగా మంటలు చెలరేగసాగాయి . విజయుడు నిల్చున్న భూమి నెమ్మదిగా చీలసాగింది. శ్వేతాశ్వం బెదిరి సకిలించసాగింది .అది రాక్షస మాయ అని వెంటనే పసికట్టాడు విజయుడు. ఇంతలో ఒక విచిత్రమైన అరుపు వినవచ్చింది...
 
bhairava_kona
ఉన్నట్టుండి నల్లటి పొగ కమ్మి, భూమి రెండుగా చీలి, ఏవో విచిత్రమైన అరుపులు వినిపించడంతో బెదిరింది శ్వేతాశ్వం ! గిట్టలు బలంగా నేలకేసి కొడుతూ సకిలించసాగింది. అదంతా ఏదో రాక్షస మాయ అని గ్రహించాడు విజయుడు. ఇంతలో ఎదురుగుండా ఒక ఊడల మఱ్ఱి చెట్టు విజయుడి వైపే నడుస్తూ రాసాగింది... దాని నోటి నుండి మంటలు వెలువడుతున్నాయి. దాని కళ్ళు నిప్పు కణికె లా వెలుగుతున్నాయి... ఊడలు చాచి, దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ అది విజయుడిని సమీపిస్తోంది. భయపడవద్దు అన్నట్లు, శ్వేతాశ్వం భుజం తట్టి, వెనక్కు నెట్టి, ఊడల మఱ్ఱి పై తన కరవాలం ఝుళిపించాడు విజయుడు. ఒక్కో ఊడని నరికేస్తుంటే... అది మరింత వికటాట్ట హాసం చేస్తూ ఊడలతో అతన్ని చుట్టి, మింగెయ్యలని చూస్తోంది. ఎన్ని ఊడలు నరికినా, మళ్ళీ కొత్తవి పుట్టుకు వస్తున్నాయి దానికి... విజయుడు సందిగ్ధంలో ఉండగా... అది ఒడుపుగా ఒక ఊడతో విజయుడిని చుట్టి, మింగబోయింది. భైరవుడిని మనసులో స్మరించుకుని, దాని నోటిపై గట్టిగా వేటు వేసాడు విజయుడు... వెంటనే పెద్దగా ఆర్తనాదం చేస్తూ చెట్టు నేలకు ఒరగసాగింది. దాని కళ్ళలో పొడిచి, మరో వేటు వెయ్యగానే, ఊడల మఱ్ఱి మాయమయ్యింది. భూమి మామూలు స్థితికి వచ్చి, పొగ, మంటలు అదృశ్యమయ్యాయి. మనసులోనే భైరవుడికి వందనాలు సమర్పిస్తూ, తిరిగి శ్వేతాశ్వంపై పయనమై భైరవపురం చేరాడు విజయుడు.
విజయుడి రాక తెలిసి, నగరాన్ని పూలతో, తోరణాలతో, ముగ్గులతో అందంగా అలంకరించారు. కోటగుమ్మం వద్ద విజయుడిని హత్తుకుని స్వాగతించాడు మహారాజు మాణిక్య వర్మ. తల్లి అతడి నుదుట ముద్దాడి, ఇన్నాళ్ళకు కళ్ళబడిన కొడుకుని తనివితీరా చూడసాగింది. వారి పాదాలకు ప్రణమిల్లి, దీవెనలు అందుకున్నాడు విజయుడు. స్త్రీలు విజయుడికి యెర్ర నీళ్ళు దిష్టి తీసారు. పూలమాలలతో అలంకరించి, తిలకం దిద్ది, హారతి ఇచ్చారు. మంగళ వాద్యాలు మ్రోగాయి. ప్రజల జయజయ ధ్వానాలు మిన్నంటాయి...
ఇంతలో బాణంలా ముందుకు దూసుకు వచ్చాడు చంద్రసేనుడు. అతడు మంత్రి కుమారుడు, విజయుడి ప్రాణ మిత్రుడు. ఆనందంతో మిత్రుడిని హత్తుకున్నాడు విజయుడు. అంతా అంతఃపురం లోనికి ప్రవేశించారు.
“ అమ్మా ! చెల్లెలు ఎక్కడ ?” ఆతృతగా అడిగాడు విజయుడు...
“ఉదయమే తిరిగి వచ్చింది విజయా !బహుశా తన మందిరంలో ఉందేమో !వెళ్లి చూడండి...” అంది మహారాణి దేవసేన.
ఉత్సాహంగా చెల్లెల్ని కలవాలని ఆమె మందిరం వైపు పరుగు తీసాడు విజయుడు. అతడి వెనుకనే నెమ్మదిగా అనుసరించాడు చంద్రసేనుడు...
ఆంతరంగిక మందిరంలో తదేక ధ్యానంతో ఏదో బొమ్మ వేస్తోంది రాకుమారి చిత్రలేఖ. అన్న రాకను కూడా గమనించకుండా ఆమె వేస్తున్న చిత్రం ఏమై ఉంటుందా అని, చప్పుడు చెయ్యకుండా, ఆమె వెనుకకు చేరి చూసాడు విజయుడు. అద్భుతమైన ఆ చిత్రం చంద్రసేనుడిది ! ఒక్క క్షణం కళ్ళప్పగించి అప్రతిభుడై చూస్తూ, ఆమె చిత్రకళా నైపుణ్యానికి అచ్చెరువొందాడు ! ఆమెను ఆట పట్టించాలని, వెనుక నుంచి ఆమె కళ్ళుమూసాడు...
“అన్నయ్య ! వచ్చావా !” అంటూ విజయుడి చేతులను అడ్డు తీసి, ఉద్వేగంగా వెనుతిరిగింది చిత్రలేఖ .
“అవునమ్మా, బాగున్నావా ? అంటూ చెల్లిని ప్రేమగా దగ్గరకు తీసుకుని, “అయినా చంద్రసేనుడికి త్వరలో కాబోయే ఇల్లాలివి, ఇక ఈ అన్నయ్య ఎందుకు గుర్తుంటాడు లే !నన్ను స్వాగతించేందుకు కూడా రాలేదుగా !” అంటూ బుంగమూతి పెట్టి వెనుతిరిగాడు విజయుడు.
“అలా అనకు అన్నయ్యా ! రేపు మా కాబోయే అత్తగారు సువర్ణాదేవి పుట్టినరోజు. ఏ తల్లికైనా బిడ్డ చిత్తరువును మించిన గొప్ప బహుమతి ఏముంటుంది చెప్పు ? సమయం తక్కువ ఉండడం వల్ల, నా మనసులో కొలువున్న రూపాన్ని తలచుకుంటూ,వెంటనే చిత్రం వేస్తున్నాను. నాకు చంద్రసేనుడు అంటే యెంత ప్రాణమో నువ్వూ అంతే ! మీ ఇద్దరూ నా రెండు కళ్ళ వంటి వారు. మా మంచి అన్నయ్యవు కదూ ! ఇక అలక మాని నవ్వాలి...” అంది విజయుడి గడ్డం పట్టుకు బ్రతిమాలుతూ.
ఆమె దూరాలోచానకు, సహృదయానికి మురిసి, నిండుగా నవ్వాడు విజయుడు. ఇంతలో చంద్రసేనుడి రాకను గమనించి, “రావయ్యా మిత్రమా ! ఇదిగో నీ బొమ్మ గీస్తూ, అన్నను కూడా మర్చిపోయింది... చాలా కాలమైంది కదూ, మీరిద్దరూ మాట్లాడండి... నేను కాస్త బడలిక తీర్చుకుని, మరలా వస్తాను...” అంటూ అక్కడి నుంచి నిష్క్రమించాడు విజయుడు.
ఎందుకో సిగ్గు ముంచుకు వచ్చేసింది చిత్రలేఖకు. మనసు నిండా చంద్రసేనుడిని కళ్ళారా చూడాలని ఉన్నా, సిగ్గుతో బరువెక్కిన కనురెప్పలు వాలిపోతున్నాయి.
ఆమె స్థితిని అర్ధం చేసుకుని, నెమ్మదిగా ఆమెను పొదివి పట్టుకుని, ఆసనంపై కూర్చోపెట్టాడు చంద్రసేనుడు.”ఎలా ఉన్నావు చిత్రా ! నీ చిత్రకళా నైపుణ్యం అద్భుతం !” అన్నాడు.
“బాగున్నాను చంద్రా ! చండీయాగం ముగిసి, ఉదయమే ఇక్కడికి వచ్చాను... అంతా కుశలమా ?” నెమ్మదిగా అడిగింది చిత్రలేఖ.
“అంతా బాగున్నాము. ముఖ్యంగా చిత్రా దేవి దర్శన భాగ్యంతో మనసునిండుకుని, నేను మరింత బాగున్నాను...” అన్నాడు ఆమెనే చూస్తూ... ఆమెకు దగ్గరగా జరిగి...
నెమ్మదిగా అతని ఎదపై వాలి, “చంద్రా ! ఈ రోజు నీతో మనసు విప్పి మాట్లాడాలి... ఆపద ముంచుకు వస్తోందని రాజగురువు చెప్పారు... మళ్ళీ ఇటువంటి అవకాశం, మీతో ఏకాంతం దొరుకుతుందో లేదో...” అంటూ అర్ధోక్తిలో చూస్తూ ఆగిపోయింది...
“చెప్పు చిత్రా ! సందేహించకు...” అంటూ నెమ్మదిగా ఆమె కురులు సవరిస్తూ మౌనం వహించాడు చంద్రసేనుడు.
“చంద్రా ! ఒక స్త్రీకి ప్రపంచంలోనే అతి బలమైన, ప్రశాంతమైన స్థానం ఏమిటో తెలుసా ! తన పతి హృదయం...  ఈ కోటలు, బలమైన బురుజులు , ఇంత మంది సైన్యం ఇవ్వలేని ధైర్యం నాకు నీ వద్ద కలుగుతోంది. అందుకే అన్ని సంకోచాలు వీడి, ఇవాళ నా మనసును సముద్రంపై పున్నమి వెన్నెల పరచినట్లు... నీ ముందు పరుస్తున్నాను...” అంటూ ఇలా చెప్పసాగింది...
చిత్రలేఖ తన సంభాషణ కొనసాగించేందుకు అవకాశం ఇస్తూ మౌనం వహించాడు చంద్రసేనుడు.
“నేను పుట్టగానే చెప్పారు… అత్యంత శుభలక్షణాలు కల మహాజ్జాతకురాలిని అని. కాని, 18 వ ఏట నాకు పెద్ద గండం ఉంది… ఆ గండం గట్టెక్కితే, నిండు నూరేళ్ళూ ఆయురారోగ్యాలతో విలసిల్లి, పుట్టినింటికీ మెట్టినింటికీ ఖ్యాతి తెస్తానని చెప్పారు. ఇదిగో,  ఈ పున్నమికి నాకు 18 ఏళ్ళు నిండుతాయి. అప్పుడు ఎదురయ్యే ఆపద తప్పించేందుకే, రాజగురువు నాతో మహాచండీయాగం చేయించారు. దేవీకృపతో నేను ఈ మహాగండం దాటుతానో లేదో తెలీదు. కాని నేను జీవించినా, మరణించినా, మనసా, వాచా, కర్మణా నిన్నే భర్తగా భావించి ఉన్నాను. ఈ జన్మకే కాదు, జన్మజన్మలకు నువ్వే భర్తగా రావాలని ఆశిస్తున్నాను. అయితే… ఈ గండం గడవకపోతే, నీవు నా గురించి విచారించక మరొక వివాహం చేసుకుంటానని, నాకు మాట ఇవ్వాలి… “
మాట్లాడుతున్న చిత్రలేఖ నోటికి తన చేతిని అడ్డు పెడుతూ, “చిత్రా ! అంత మాట అనకు. రాకుమారివైన నీకు ఈ బేలతనం తగదు. నీకేమీ కాదు. నీ అన్న విజయుడు భైరవ కృపతో దివ్య శక్తులను సాధించాడు. నేను, గురుకులంలో శస్త్రాస్త్రాలలో అత్యంత ప్రావీణ్యం సంపాదించాను. నేను, విజయుడు ముల్లోకాలు ఏకమైనా సరే, కలిసి పోరాడి నిన్ను రక్షించుకుంటాము. అయినా, నా ప్రాణంలో ప్రాణమైన నీవు లేని క్షణం నేను జీవించి ఉంటానా ? ప్రేమంటే కలిసి బ్రతకడమే కాదు, విడిపోయి బ్రతకలేకపోవడం కూడా కదా ! అందుకే నీవు ఎటువంటి బెంగలూ పెట్టుకోకుండా, దేవిని ప్రార్ధిస్తూ ఆనందంగా ఉండు. ఈ కోన క్షేత్రపాలకుడు, మన రక్షకుడు భైరవుడు… సర్వసమర్ధుడు, ఘోరమైన ఆపదల నుంచైనా మనల్ని కాపాడతాడన్న నమ్మకం నాకుంది… ఇక నేను బయలుదేరతాను, నీవు ధైర్యంగా ఉండు ” అంటూ ఆమె వెన్ను తట్టి, గాఢంగా హత్తుకుని, సుతారంగా నుదుట ముద్దాడాడు చంద్రసేనుడు.
అశ్రునయనాలతో చంద్రసేనుడి వంక తృప్తిగా చూస్తూ, చాలా సేపు అలాగే ఉండిపోయింది చిత్రలేఖ !

********************

తన భూగృహంలో మాయాదర్పణం ముందు నిల్చుని ఉన్నాడు కరాళ మాంత్రికుడు. అక్కడి వాతావరణం ధీరులకు సైతం భీతి గొలిపేలా ఉంది. కదలాడే అస్థిపంజరాలు, జడల భూతాలు, వేళ్ళాడే గబ్బిలాలు, గుడ్లగూబలు, క్రూర సర్పాలు అక్కడ స్వేచ్చావిహారం చేస్తున్నాయి. పిశాచాల అరుపులతో అంతటా కంపిస్తోంది.
“చెప్పవే మాయాదర్పణమా ! స్వాతీ నక్షత్ర సంజాత , ఆరు శుభలక్షణాలు గల కోమలి, నా పాలిటి వరదాయిని, ఆ రాకుమారి ఎక్కడో చూపవే !” అంటూ బిగ్గరగా అరిచాడు కరాళుడు.
వెంటనే మాయాదర్పణంలో నల్లటి మబ్బులు వీడినట్టు కనిపించి, ఒక అందమైన ఏకాంత మందిరం గోచరించింది. అందులో ఉన్న హంసతూలికా తల్పంపై తన చెలికత్తెలు వీవెనలతో వీస్తుండగా నిద్రిస్తోంది నిరుపమాన సౌందర్య రాశి, రాకుమారి చిత్రలేఖ ! ఆమెను చూడగానే కరాళుడి కళ్ళు, ఆనందంతో మెరిసాయి.
“కరాళా ! ఈమె భైరవపురం రాకుమారి చిత్రలేఖ ! ఈమె సకల శుభ లక్షణాలు కలిగినది, స్వాతీ నక్షత్ర సంజాత. రెండు రోజుల్లో వచ్చే పున్నమికి ఆమెకు 18 సం. నిండుతున్నాయి. అప్పుడు నీవు ఆమెను మాయోపాయంతో ఇక్కడకు అపహరించుకుని రా ! అంతేకాదు, నీవు అన్వేషిస్తున్న చంద్రకాంత మణి కూడా వీరి వద్దనే ఉంది…” అంది మాయాదర్పణం. మళ్ళీ నల్లటి మబ్బులు కమ్మినట్టుగా అయ్యి, ఆ దర్పణం మామూలు అద్దంగా మారిపోయింది.
అప్పుడే విజయం సొంతమైనట్టు వికటాట్టహాసం చేసాడు కరాళుడు. ఎదురుగా ఉన్న ౩౦ అడుగుల బేతాళుడి విగ్రహానికి నమస్కరించి, “ సాహో దేవరా ! నీవు కోరే బలి నీది. ప్రపంచాన్ని గుప్పిట్లో బంధించే శక్తి నాది. ఇక కార్యార్ధినై బయల్దేరుతాను. దీవించు…” అని, రెండడుగులు వెనక్కు వేసి మాయమయ్యాడు.
 
వైభవంగా జరిగాయి చిత్రలేఖకు కాబోయే అత్తగారు సువర్ణాదేవి పుట్టినరోజు వేడుకలు. బీదలకు అన్న, వస్త్రదానం, బ్రాహ్మణుల చేత ప్రత్యేక పూజలు, రాజ్యమంతా అలంకరించి, వేడుకలు జరిపారు. అత్తగారికి తాను వేసిన చంద్రసేనుడి చిత్రపటం కానుకగా ఇచ్చి, ఆవిడ పాదాలకు నమస్కరించింది  చిత్రలేఖ !
“చిత్రా ! నీ వంటి సుగుణాల రాశి కోడలిగా లభించబోవడం మా అదృష్టం తల్లీ! రేపు నీ పుట్టినరోజు కదా ! అందుకే ముందుగా దీవిస్తున్నాను. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు ! ఇష్టకామ్యార్ధ సిద్ధిరస్తు !” అంటూ దీవించింది సువర్ణాదేవి.
మర్నాడు రాకుమారి పుట్టినరోజు వేడుకలు, ఆమెకు ఆపద ఉన్నందున రాజభవంతి లోనే నిరాడంబరంగా జరపాలని నిర్ణయించారు పెద్దలు. అందుకు ఏర్పాట్లు జరుగుతుండగా, విజయుడు తన తల్లిదండ్రులు, సోదరితో అడవిలో తాను కుంతల దేశపు రాకుమారి ప్రియంవదను కలిసిన వైనం చెప్పాడు. కుంతల రాజు ధర్మవేదుడు తమ మిత్రుడే కావడంతో, ఆ విషయాన్ని హర్షంతో ఆమోదించారు రాజు, రాణి.
“చాలా సంతోషం అన్నయ్యా ! మరి వదినమ్మను నాకు ఎప్పుడు చూపిస్తావు ? నువ్వు వర్ణిస్తూంటే, నాకూ చూడాలని చాలా ఆత్రంగా ఉంది…” అంది చిత్రలేఖ !
“తొందర ఏముంది చెల్లీ ! ముందు చంద్రుడితో నీ వివాహం కానీ ! అయినా, నువ్వు వేగిరపడుతున్నావు కనుక  త్వరలోనే మన వార్తాహరుడితో ఒక సందేశం పంపి, వారినీ నీ వివాహానికి ఆహ్వానిద్దాం, సరేనా ?” అన్నాడు విజయుడు.  ప్రియంవదను చూడాలని, అతని మనసు కూడా ఉవ్విళ్ళూరుతోంది.
మర్నాడు ప్రియంవద చేత ఆయుష్షు హోమం చేయించసాగారు ఋత్విక్కులు. ఇంతలో పెద్ద పెద్ద అంగలు వేస్తూ కోపంగా అక్కడకు వచ్చాడు రాజగురువు. “ఆపండి, ఏం చిత్రలేఖ ! నేను చెప్పింది ఏమిటి, నీవు చేస్తున్నది ఏమిటి ? నీ వలన మహాచండీ యాగంలో ఒక పెద్ద అపరాధం జరిగింది. వెంటనే ప్రాయశ్చితం చెయ్యకపోతే ఈ రాజ్యానికే ముప్పు, ఉన్నపళంగా బయల్దేరు ! మందీ మార్బలం సమకూర్చుకు తీరిగ్గా వచ్చే సమయం లేదు !” అన్నాడు.
తన వల్ల జరిగిన తప్పిదం ఏవిటో తెలియకపోయినా, రాజ్యానికి హాని అనగానే , మారు ఆలోచన లేకుండా, బయల్దేరింది చిత్రలేఖ ! ఆమెకు తెలియకుండా ,ఆమెను ఆకాశమార్గంలో అనుసరిస్తూ వెళ్ళసాగింది ఆమె మాట్లాడే చిలుక, సురస. దానికి చిత్రలేఖ అంటే పంచప్రాణాలు. ఇన్నాళ్ళ ఎడబాటు తర్వాత ఆమెను వెంటనే వదిలేందుకు దానికి మనస్కరించలేదు !
రాజగురువు రధం దట్టమైన అడవి గుండా ప్రయాణించసాగింది. అడవంతా పట్టపగలే చీకటిగా ఉంది. వందల అడుగుల ఎత్తున పెరిగిన చెట్లు సూర్యకాంతిని రానివ్వకుండా అడ్డుపడుతున్నాయి. ఎక్కడినుంచో క్రూర మృగాల అరుపులు వినవస్తున్నాయి. తాము దారి తప్పి, వేరే మార్గంలో వెళ్తున్నామని గమనించిన చిత్రలేఖ… నెమ్మదిగా ధైర్యం చేసి… “ స్వామీ ! ఇది మన ఆశ్రమానికి వేరొక దారా ! మనం దారి తప్పి, ఉత్తర దిశగా పయనిస్తున్నామని నాకు అనిపిస్తున్నది…” అంది.
“దారి తప్పలేదే భామినీ ! నిన్ను నా దారిలోకి తీసుకెళ్ళాలనే ఇంత నాటకం ఆడాను…” అంటూ వికటాట్టహాం చేస్తూ, అసలు రూపంతో ప్రత్యక్షమయ్యాడు కరాళుడు. అతడి వికృతాకారం చూసిన చిత్రలేఖ వెంటనే స్పృహ తప్పి, ఆ రధంలోనే పడిపోయింది…
ఇదంతా గగన మార్గంలో చూసిన సురస… విజయుడితో విషయం చెప్పాలని, వెనుదిరిగి పయనమయ్యింది….
యాగశాలలోకి ప్రవేశించారు రాజగురువు ప్రజ్ఞాశర్మ. “చిత్రలేఖ ఏదీ ఎక్కడా కనిపించదే...” అని అడిగారు అంతా నివ్వెరపోతుండగా... ఇంతలో వేగంగా వచ్చి వాలిన సురస... “స్వామీ ! పెద్ద ఘోరం జరిగిపోయింది. మన చిత్రలేఖను  కరాళుడు అనే మాంత్రికుడు మీ రూపంలో వచ్చి, మారువేషంతో అపహరించుకుని పోయాడు...” అంది.
వెంటనే అప్రమత్తం అయిన ప్రజ్ఞాశర్మ, ‘నాయనా విజయా ! చంద్రసేనా ! ఇక జాగు చెయ్యవద్దు. భైరవపురం రాకుమారి ఇప్పుడు ఆపదలో ఉంది.  మన రాజ్యం పరువూ, ప్రతిష్ట కాపాడవలసిన సమయం ఆసన్నమయ్యింది, ఆ దుర్గమ్మ తల్లి దీవెనలు మీకు రక్ష ! ఆ కరాళుడి గుహ 3 సముద్రాల ఆవల, మన రాజ్యానికి ఉత్తర దిశగా ఉందని విన్నాను.  వెంటనే ఉత్తర దిశగా బయలుదేరండి.’ అంటూ ఆజ్ఞాపించారు.
శ్వేతాశ్వంపై  విజయుడు, పంచకళ్యాణి పై చంద్రసేనుడు భైరవపురానికి ఉత్తర దిశగా పయనించసాగారు. కొండలు, గుట్టలు, సెలయేళ్ళు, దాటి రెండు రోజులు ప్రయాణించాకా, ఒక ప్రదేశానికి చేరుకొని, అక్కడి చెట్టుక్రింద విశ్రమించ సాగారు. అర్ధరాత్రి సమీపిస్తుండగా, వారికి వినవచ్చాయి “ వద్దు, ఇంక కొట్టకు, తట్టుకోలేను, ప్రాణాలు వదిలేస్తాను, చాలించు... ఎవరైనా కాపాడండి, రక్షించండి...” అన్న ఆర్తనాదాలు. వెంటనే వద్దనున్న కాగడా వెలిగించి , అరుపులు వినవచ్చిన దిశగా వెళ్తూ, తేరిపారా చూసారు. ఒక చెట్టుకు తల్లక్రిందులుగా వెళ్లాడ దీసిన ఇక మునిని, కొరడాతో చావగొడుతున్నాడు ఒక రాక్షసుడు. వెంటనే ముందుకు దూకిన చంద్రసేనుడు...” ఏవిటీ ఘోరం... సాధు జనులను హింసిస్తావా ? ఎందుకిలా చేస్తున్నావ్... అసలు నీకు ఏం కావాలి ?”  అని ఆడిగాడు ఆగ్రహంగా !
“మర్యాదగా నీ దారిన నువ్వు పో, లేకుంటే, నువ్వు కూడా ఇంతకు ముందు వచ్చిన వారిలాగే, ఆ చెట్టుకు గబ్బిలమై వెళ్ళాడతావ్... “ అన్నాడు చెట్టు పైకి చూపిస్తూ ! అక్కడి కొమ్మలకు అసాధారణంగా కనిపిస్తున్న కొన్ని గబ్బిలాలు ఉన్నాయి.
“ శరణు కోరిన వారిని ప్రాణాలకు తెగించైనా కాపాడడం క్షాత్ర ధర్మం. నీ బెదిరింపులకు భయపడను. చెప్పు, ఈ మునిని ఎందుకలా హింసిస్తున్నావ్ ? నీకు ఏం కావాలి ?”
“ అంతటి మొనగాడివా ? అయితే విను, ఈ ముని, సమీపంలో ఉన్న చెరువులో సంధ్యానుష్టానం చేసుకుంటూ ఉండగా, అందులో నివసించే జలకన్య ఈదుతూ, పొరపాటున ఈయన్ను తాకి, ధ్యానభంగం చేసింది. వెంటనే కోపించిన ఈ ముని, ఆమెను మరణించమని శపించాడు. ఆ జలకన్య, ఒక యక్షరాజు ఒక్కగానొక్క కూతురు. కూతురి మరణాన్ని తట్టుకోలేని యక్షరాజు, ‘పొరపాటున జరిగిన దానికి, నా కుమార్తెకు ఇంతటి కఠిన శాపమిచ్చావు. నా మనసు పడే హింస, నువ్వు కూడా రోజూ రాత్రి బ్రహ్మరాక్షసుడి చేతిలో దెబ్బలు తింటూ శారీరకంగా పడు. ఇదే నా శాపం!’ అన్నాడు. వెంటనే తన తప్పును తెలుసుకున్న ముని, యక్షరాజును శాపవిముక్తికై వేడుకున్నాడు. అప్పుడు యక్షుడు ఇలా అన్నాడు, ‘ స్వార్ధరహితంగా, ఏ యువకుడైనా నీ క్షేమం కోరి, భయరహితుడై ,ఈ చెరువు వద్ద తన శిరస్సు ఖండించి, చెరువు గట్టున ఉన్న అమ్మవారికి సమర్పిస్తే, వెంటనే ఆమె ప్రసన్నమై, నీకు విముక్తి కలిగిస్తుంది.’ అని, తన కుమార్తె శవాన్ని తీసుకుని, అదృశ్యమయ్యాడు. ఆ రోజు నుంచి వచ్చిన యువకులంతా, బలిచ్చే ముందు వణికి, ఇలా గబ్బిలాలుగా మారారు. నువ్వా పని చెయ్యగలిగితే, వాళ్లకు, ఈ మునికి శాపవిమోచనం అవుతుంది. నాకు ఈయన్ను కొట్టే బాధ తప్పుతుంది. ఏం నీకంత దమ్ముందా ? “ అన్నాడు సవాలు విసురుతూ.
వెంటనే ముందుకు దూకబోయిన చంద్రసేనుడిని వారిస్తూ, విజయుడు, ‘మిత్రమా, నువ్వాగు, నేను ఈ ముని కోసం బలి అవుతాను, ‘అన్నాడు.
చంద్రుడు సన్నగా నవ్వి, ‘మిత్రమా! ఇంత మందికి విముక్తి కలిగించే అవకాశం నాకు ఇవ్వు. నువ్వు కాబోయే రాజువి, నువ్వు లేకపోతే రాజ్య ప్రజలు అనాధలు అవుతారు. అదే నేను లేకపోతే, పెద్దగా వచ్చే నష్టం లేదు. పైగా చిత్రలేఖను కాపాడవలసిన బాధ్యత కూడా నీపై ఉంది. నన్ను వీరమరణం పొందనీ !’ అన్నాడు.
కన్నీటితో కడసారిగా మిత్రుడిని హత్తుకుని, వీడ్కోలు పలికి, అక్కడే అసహాయంగా కూలబడ్డాడు విజయుడు. చంద్రుడు శరవేగంతో ముందుకు దూసుకువెళ్ళి, ఆ చెరువులో స్నానం చేసి, జంకకుండా కరవాలం దూసి, అమ్మవారి ముందు తన శిరస్సు ఖండించుకున్నాడు. వెంటనే ప్రసన్నమైన అమ్మవారు మునికి, మిగిలిన వారికి విముక్తి కలిగించడమే కాక, చంద్రుడిని మరలా బ్రతికించింది. ‘నాయనా చంద్రా ! నిస్వార్ధ బుద్ధితో నీవు చేసిన త్యాగం నా మనసు కరిగించింది. నీకు దివ్యదృష్టిని, శక్తి స్వరూపమైన ఈ దివ్యఖడ్గాన్ని ప్రసాదిస్తున్నాను. అఖండ కీర్తిమంతుడివై వర్ధిల్లు,’ అంటూ దీవించి అంతర్ధానమయ్యింది.
 చేజారిన పెన్నిధి తిరిగి లభించినట్టు, అమితానందంతో మిత్రుడిని ఆలింగనం చేసుకున్నాడు విజయుడు.
“చిరంజీవులారా ! నాకు గొప్ప ఉపకారం చేసారు. ప్రతిగా నా తపః శక్తితో మీరు బయలుదేరిన కార్యానికి, నేనూ సాయం చేస్తాను. నిర్జన కీకీరణ్యం దాటి, మూడు సముద్రాలకు ఆవల ఉన్న కరాళ మాంత్రికుడి గుహను మానవమాత్రులు చేరుకోవడం అత్యంత దుర్లభం ! ఇక్కడి నుంచి మీరు వంద యోజనాల దూరం ప్రయాణిస్తే, అక్కడ భాగమతి నది వస్తుంది. ఆ నదీ తీరంలోని పెద్ద వృక్షంపై , నా అధీనంలో ఉండే రెండు గండభేరుండ పక్షులు నివసిస్తుంటాయి. మీరు అక్కడికి వెళ్లి, మనసులో నన్ను స్మరించండి. ఆ పక్షులు మిమ్మల్ని తమ వీపుపై ఎక్కించుకుని, కరాళుడు ఉండే ద్వీపం ఒడ్డుకు చేరుస్తాయి. ఇక అక్కడి నుంచి ఎదురయ్యే క్షణక్షణ గండాలను ఎదుర్కోవాలంటే... మీకు ఆ భైరవుడే రక్ష ! క్షేమంగా వెళ్ళిరండి...”, అన్నాడు ముని.
మిత్రులిద్దరూ మునికి సాష్టాంగనమస్కారం చేసి, తమ గుర్రాల మీద వాయువేగంతో బయలుదేరారు...

శ్వేతాశ్వంపై వేగంగా పయనిస్తున్న విజయుడు, పంచకళ్యాణి పై స్వారీ చేస్తున్న చంద్రుడు తమ గుర్రాలకు విశ్రాంతిని ఇచ్చేందుకై చెట్టు క్రింద ఆగారు. కాసిన్ని ఫలాలు తిని, సేద తీరాకా చంద్రుడిని ఇలా అడిగాడు విజయుడు...

“ మిత్రమా ! అమ్మవారి దయతో నీకు దివ్యదృష్టి అనుగ్రహించబడింది కదా ! ఆ మాంత్రికుడి చెరలో చిత్ర ఎలా ఉందో ఏమో, ఒకసారి చూసి చెప్పు...”

“అవశ్యం మిత్రమా !” అంటూ కన్నులు మూసుకుని దేవిని ధ్యానించాడు చంద్రుడు. అతని మనోనేత్రం ముందు కరాళుడి స్థావరం లీలగా కదిలింది ...

“ హ హ హ హ ... సాధించాను, కింకరా ! ఇదిగో చంద్రకాంత మణి ! “ అంటూ తన సేవకుడైన కింకరుడి చేతిలో మణిని ఉంచాడు కరాళుడు.

“ భళా దేవరా ! అది సరేగాని, దుర్భేద్యమైన ఆ కోట లోకి మీరు ఎలా ప్రవేశించారు ? పూజామందిరంలోని ఆ మణిని ఎలా కైవసం చేసుకున్నారు ?” సందేహంగా అడిగాడు కింకరుడు.

“ ఏమున్నదిరా ! ఈ మనుషులు అనుబంధాల కోసం ప్రాణాలైనా ఇస్తారు కదా ! నిద్రిస్తున్న రాజును కాలసర్పమై చుట్టాను. మణిని ఇవ్వకపోతే, రాజును చంపుతానని బెదిరించాను... వెంటనే రాణి మణిని చేతికి ఇవ్వగానే , మాయమయ్యాను...” అన్నాడు వికటాట్టహాసం చేస్తూ.

“ అయితే మనకు అమావాస్య బలికి చిత్రలేఖ, మణి, సిద్ధమయ్యాయి. ఇక అమావాస్యకి రెండు రోజుల గడువు మాత్రమే ఉంది. ఇక మీరు విశ్వవిజేత కావడం తధ్యం ! అటుపై ఇన్నాళ్ళూ మిమ్మల్ని నమ్మి కొలిచిన ఈ కింకరుడిని కూడా గుర్తు పెట్టుకుంటారుగా దొరా ! “ నక్కవినయం అడిగాడు కింకరుడు.

“ ఆహా !కరాళుడు చక్రవర్తి అయితే... కరాళ కింకరుడు సామ్రాట్టు కాడూ ! ఈ దివ్య మణిని అంతవరకూ, భేతాలుడి ముందు భద్రంగా ఉంచు. చిత్రలేఖ ఎక్కడా ?” అడిగాడు కరాళుడు.

“ అదిగో దొరా ! మీ మాయతో ఇంకా నిశ్చలంగా ఆ రాతి దిమ్మెపై పరుండి ఉంది. కాపలాగా రెండు భూతాలు ఉన్నాయి...” అంటూ గుహ మూలకు చూపాడు కింకరుడు. అక్కడ భీభత్సమైన పుర్రెల మధ్య, స్పృహ లేకుండా ఉన్న చిత్రలేఖను చూసి, కలవరంగా కళ్ళు తెరిచాడు చంద్రుడు.

“ఏమైంది మిత్రమా ! ఎందుకా కలవరం ?” అని అడుగుతున్న విజయుడికి, తాను చూసింది అంతా చెప్పాడు చంద్రుడు. “ అంతేకాదు మిత్రమా ! గుహ బయట రాక్షస బల్లుల్ని, విష సర్పాలని, గుహ ద్వారం వద్ద ఒక బ్రహ్మ రాక్షసుడిని కాపలా ఉంచాడు కరాళుడు. మనకు ఆట్టే సమయం లేదు, సత్వరమే పయనం కావాలి...” అన్నాడు.

తమ శాస్త్రాస్త్రాలను సర్దుకుని బయలుదేరబోతున్న మిత్రులకు ఎదురు వచ్చాడు ఒక  జటాధారి. ఒళ్ళంతా విభూతి అలముకుని, కేవలం కౌపీనం మాత్రమే ధరించిన ఆయన మొహంలో  అంతులేని దివ్య తేజస్సు. అలా సమ్మోహితులై చూస్తున్న మిత్రులతో ఆయన, “ నాయనలారా ! బడలిక వల్ల డస్సి ఉన్నాను, మీ వద్ద ఆహారం ఏదైనా ఉంటే ఇచ్చి పుణ్యం కట్టుకోండి...” అన్నారు.

వెంటనే తన మొలకు ఉన్న మూటలోని మధుర ఫలాలను అందించాడు విజయుడు. తన వద్ద ఉన్న చిన్ని సీసా లోని తేనె ను దొన్నెలో ఒంపి ఇచ్చాడు చంద్రుడు. అవన్నీ తిన్న ఆయన, “ విజయోస్తు నాయనలారా !  భైరవపురం పరువుప్రతిష్టలు ఇప్పుడు మీ చేతుల్లో ఉన్నాయి. మీకు నా అండ ఎప్పుడూ ఉంటుంది...” అని దీవించారు.

“స్వామీ ! ఇంతకూ మీరు...” అని వారు అడుగుతుండగానే, అక్కడ ఆయన రూపం అదృశ్యమై భైరవుడు ప్రత్యక్షం అయ్యాడు. వెంటనే వారు స్వామి పాదాలకు నమస్కరించి,  లేచేలోపే, ఆయన అంతర్ధానమయ్యారు.

రెట్టించిన ఉత్సాహంతో బయలుదేరిన మిత్రులు ఇద్దరూ, భాగమతి తీరానికి చేరి, తమ అశ్వాలను ఒక చెట్టుకు కట్టివేసి, అరణ్యంలోని మునిని స్మరించారు.

మెరుపు వేగంతో విశాలమైన రెక్కలు అల్లారుస్తూ, శ్వేత వర్ణంలో ఆకాశంలో విరిసిన వేయి రేకుల తామరలను మరిపిస్తూ ప్రత్యక్షం అయ్యాయి రెండు గండ భేరుండ పక్షులు.

వాటికి వినమ్రంగా నమస్కరించి, వాటి వీపుపై కూర్చుని, పయనమయ్యారు ఇద్దరు మిత్రులూ ... కొండలూ, గుట్టలు, సముద్రాలు దాటుతూ సాగుతోంది వారి పయనం. పక్షులు ఎగిరే వేగానికి పడిపోకుండా, వాటి వీపుకు గట్టిగా కరుచుకుని, మబ్బుల ఆకాశంపై నుంచి, చీమల బారుల్లా కనిపిస్తున్న చేట్టుచేమల్ని, జీవరాశుల్ని ఆశ్చర్యంగా చూడసాగారు వారు. రెండు జాములు గడిచాకా, రెండు సముద్రాల నడుమ ఉన్న ద్వీపానికి చేరుకున్నారు. అక్కడి పెద్ద కొండపై దిగిన గండ భేరుండ పక్షులలో ఒకటి ఇలా మాట్లాడసాగింది...

“ఇక్కడి నుంచి మీకు అడుగడుగునా గండాలే !  ఆ కనిపించే కొండ దిగువనే ఉంది కరాళుడి మాయా స్థావరం. ఈ లోయలో ఎవరు అడుగు పెట్టినా, ప్రాణాలతో తిరిగి వెళ్ళకుండా కట్టుదిట్టమైన కాపలా పెట్టాడు కరాళుడు.  తొందరపడి దూసుకు పోకుండా ఆలోచించి అడుగు వెయ్యండి. ఇక్కడ శక్తి కాదు, యుక్తి ముఖ్యం . మరి మాకు సెలవిప్పిస్తే, మేము బయలుదేరతాం...” అంది. గగన మార్గాన దూసుకుపోతున్న తమ నేస్తాలకు చెయ్యి ఊపుతూ వీడ్కోలు పలికి, కత్తులు దూసి బయలుదేరారు ఇద్దరూ...

“వాసన... నరవాసన...” అంటూ వారి ముందుకు వచ్చింది ఒక జడల భూతం ... దాని నాలుక చాచి, వీరి వైపు ఆశగా చూస్తూ రాసాగింది.

తల నుంచి పాదాల దాకా వేళ్ళాడుతున్న జడలతో, వికృతంగా నాలుక చాస్తూ, ‘నరవాసన...’ అంటూ, విజయుడిని, చంద్రుడిని మింగేందుకు రాసాగింది జడల భూతం. దాని జడలు నేలకు రాసుకున్న చోటల్లా, నిప్పులు పుడుతున్నాయి. తాత్సారం చెయ్యకుండా తమ ఖడ్గాలతో, చెరోవైపు నుండి, దాని జడలు ఖండించారు మిత్రులు. వెంటనే, ఆర్తనాదం చేస్తూ, నేలకొరిగింది భూతం. దాన్ని దాటుకుని, పది అడుగులు ముందుకు వేసారో లేదో, ఉన్నట్టుండి, మిత్రులు ఇరువురూ, పెద్ద అగాధంలోకి జారిపోసాగారు. అదేదో, లోతైన గుహలా ఉంది. గుహ మార్గం అంతా కటిక చీకటి, బురద... అలా జారుకుని, జారుకుని, ఒక ఊబిలో పడ్డారు మిత్రులు. నెమ్మదిగా, పాదాల నుంచి, ఊబిలో కూరుకుపోసాగారు. వెంటనే, భైరవుడు తనకు ప్రసాదించిన అష్టసిద్దులలోని ప్రాకామ్య సిద్ధిని చంద్రుడికి బోధించి, అతడితోసహా, ఆకాశామార్గంలోకి మాయమయ్యాడు విజయుడు.

‘చంద్రా !  గండ భేరుండ పక్షులు చెప్పినట్లు, ఇక్కడ శక్తి కాదు, యుక్తి ముఖ్యం. నీవు మునుపు చెప్పినట్లుగా రాక్షస బల్లులు, విష సర్పాలు, బ్రహ్మరాక్షసుడు , ఎన్నో దుష్టగ్రహాలు కరాళుడి గుహకు కాపలా ఉన్నాయి. ప్రతి దుష్టశక్తితో పోరాడే సమయం మనకిక లేదు. త్వరగా నీవు దివ్యదృష్టితో మార్గం చూసి చెప్తే, మనం ‘అణిమా సిద్ధి’ తో సూక్ష్మ రూపం ధరించి కరాళుడి గుహలోకి  ప్రవేశిద్దాం...’ అన్నాడు విజయుడు. వెంటనే చంద్రుడు దివ్యదృష్టి తో మార్గం తెలిపాడు. మిత్రులు సూక్ష్మ రూపంతో గుహలోకి వెళ్లి, జరిగేది చూడసాగారు.

“మరో గంటలో అమావాస్య ఘడియలు రానున్నాయి, లే రాకుమారీ, నీకు కుడివైపున ఉన్న త్రోవలో పయనించి, అక్కడి వాగులో స్నానం చేసి, ఈ నలుపు బట్టల్ని ధరించి, పూర్ణ మనసుతో బలికి సిద్ధమై రా !” ఆజ్ఞాపించాడు కరాళుడు.

రాతిపలక పైనుంచి, మంత్రముగ్ధలా లేచి, అక్కడున్న వస్త్రాల్ని తీసుకుని, నడవసాగింది చిత్రలేఖ. ఆమె అలా వెళ్తుండగా, సూక్ష్మ రూపంలో ఉన్న విజయుడు, ఆమె ఎదుటకు చేరి, తన వశీకరణ శక్తిని ఆమెపై ప్రయోగించాడు. అరవద్దు, అలాగే నడవమంటూ సైగ చేసి, ఆమె చెవిలో ఒక ఉపాయం చెప్పి, మాయమయ్యాడు.

నల్లటి చీరతో సిద్ధమై, అక్కడి భేతాళుడి విగ్రహం ముందుకు వచ్చింది, చిత్రలేఖ ! విగ్రహం ముందు హోమగుండం మండుతోంది. క్షుద్ర పూజలకు వాడే అనేక వస్తువులు అక్కడ పేర్చబడి ఉన్నాయి. విగ్రహం పాదాల వద్ద ఉన్న దంతపు పెట్టెలో మెరుస్తోంది, చంద్రకాంతమణి.

‘రాకుమారీ ! నీవిక ఆ మణిని చేతిలోకి తీసుకుని, ఆ విగ్రహం ముందు మనస్పూర్తిగా మోకరిల్లు. సాష్టాంగనమస్కారం చెయ్యి!’ , ఆజ్ఞాపించాడు కరాళుడు.

‘కరాళా ! నేను రాకుమారిని. నాకు వంగి దణ్ణం పెట్టే వాళ్ళే కాని, నేను వంగి నమస్కరించింది లేదు. అది ఎలాగో చూపితే, నీవు కోరిన విధంగానే చేస్తాను, ‘ అంది చిత్రలేఖ.

‘ఇదిగో ఇలా చెయ్యాలి, ‘ అంటూ కరాళుడు సాష్టాంగనమస్కారం చెయ్యగానే, స్వస్వరూపాన్ని పొంది, భైరవుడు ఇచ్చిన దివ్యఖడ్గంతో, కరాళుడి తల ఖండించాడు విజయుడు. అది నేరుగా వెళ్లి, హోమగుండంలో పడింది. కరాళుడి మరణంతో అతనికి వశమై ఉన్న దుష్టశక్తులు అన్నీ బిగ్గరగా అరవసాగాయి. విజయుడు, చంద్రుడి మీదకు దాడికి రాబోయాయి. ఇంతలో గుహ భయంకరంగా కంపించసాగింది. భేతాళుడి విగ్రహం విరిగి ముక్కలై పడసాగింది. అడ్డొచ్చిన దుష్ట జీవాల్ని తమ ఖడ్గంతో ఖండిస్తూ, దివ్య మణిని,  చిత్రలేఖను చేతబట్టి, శరవేగంతో గుహ వెలుపలికి పరుగులు తీసారు మిత్రులు. ఒక గుట్టపైకి చేరి, తిరిగి గండ భేరుండ పక్షుల్ని ధ్యానించారు. అవి రాగానే, వాటి వీపుపై ఎక్కి కూర్చున్నారు. అవి గగన మార్గానికి ఎగురుతుండగానే, జరిగిందొక విచిత్రం !

కరాళుడి గుహ ఉన్న ప్రాంతమంతా భూకంపం కలిగి, చూస్తుండగానే ఆ దీవి మొత్తం సముద్రంలో మునిగిపోయింది. ఆశ్చర్యంతో చూస్తూ, తమను సమయానికి కాపాడిన భైరవుడికి మనసులోనే వందనాలు సమర్పించారు అంతా. తమ అశ్వాల వద్దకు చేరుకొని, వాటిపై పయనించి, అక్కడి నుంచి, క్షేమంగా భైరవపురం చేరుకున్నారు.

*************

కార్తీక పున్నమి. జలపాతపు సోయగాలు పున్నమి వెలుగులో స్పష్టంగా ద్యోతకమవుతున్నాయి. వెన్నెల చలువ, పవిత్రమైన వాతావరణం, మనసుల్ని ఆహ్లాదపరుస్తూ, సేద తీరుస్తోంది. యధాలాపంగా పున్నమినాడు దుర్గా పూజకు, తన పరివారంతో వచ్చింది కుంతల రాకుమారి ప్రియంవద. అక్కడికి  భైరవపురం ఆనవాయితీ ప్రకారం చంద్రకాంత మణితో సహా చేరుకున్నారు విజయుడు, రాజు మాణిక్య వర్మ, మహారాణి దేవ సేన, రాజగురువు ప్రజ్ఞాశర్మ, సదానందమహర్షి, చిత్రలేఖ, చంద్రుడు మిగతా కుటుంబ సభ్యులు. చిరునవ్వుతో ఆలింగనం చేసుకున్నారు ఇద్దరు రాజులు, రాణులు. తన వదిన వద్దకు వెళ్లి, ఆప్యాయంగా హత్తుకుంది చిత్రలేఖ ! వారి వివాహాలకి శుభ ముహూర్తం నిర్ణయించారు సదానందమహర్షి. ఇంతలో పున్నమి ఘడియలు సమీపించాయి.

చల్లని వెన్నెల కిరణాలు దుర్గ అమ్మవారి ఎదుట ఉన్న కొలనులో పడి, అమ్మ నుదుటి కుంకుమ పైకి పరావర్తనం చెందాయి. అవి అమ్మవారి ఎదుట ఉన్న చంద్రకాంత మణి పై ప్రతిబింబించి, దివ్యమైన వెలుగు ఆ పరిసరాల్లో వ్యాపించింది. ఇంతలో అమ్మవారి విగ్రహం వద్దనుంచి, ఒక దివ్యవాణి వినిపించింది...

‘ నాయనా విజయా ! మీ పూర్వీకుల లాగానే స్వార్ధం వీడి, లోకకల్యాణం కోసం దీక్షబూని, రాజధర్మం నెరవేర్చావు. నీకు , మీ వంశానికి, ఇక్కడున్న అందరికీ నా ఆశీస్సులు ఎప్పుడూ తోడుగా ఉంటాయి. ఆచంద్రతారార్కం రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించి అంత్య కాలంలో నన్ను చేరతావు ! విజయోస్తు !’

అమ్మ దీవెనలకు మురిసిపోతూ, అమ్మ ఎదుట ప్రతిష్ట చెయ్యబడ్డ భైరవుడిని భక్తితో ఆరాధించి, పెళ్లి ఏర్పాట్లకు  తమ తమ రాజ్యాలకు పయనమయ్యారు అంతా. విజయుడు – ప్రియంవద, చిత్రలేఖ – చంద్రసేనుల వివాహాలు వైభవంగా జరిగాయి. భైరవపురం ప్రజలు , భైరవకోన లోని అమ్మవారి ఆరాధన చేస్తూ, ఆ చల్లనితల్లి దీవెనలతో, ప్రజల్ని కన్నబిడ్డల్లా కాపాడే విజయుడి పాలనలో , కలకాలం సుఖంగా జీవించారు.

- సమాప్తం -

 

No comments:

Post a Comment

Pages