కవికుల దళపతి – కవిదళ కులపతి ఆచార్య ఆత్రేయ - అచ్చంగా తెలుగు

కవికుల దళపతి – కవిదళ కులపతి ఆచార్య ఆత్రేయ

Share This

కవికుల దళపతి – కవిదళ కులపతి ఆచార్య ఆత్రేయ

-      పరవస్తు నాగసాయి సూరి

  ఆయన అక్షరాలు... బీజాక్షరాలు... మనసును హత్తుకునే పాటలు... మనిషిని గెలుచుకునే మాటలు... సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కథలు... ప్రపంచాన్ని శాసించిన నాటకాలు... ఇలా ఒకటేమిటి... అన్నింటా ఆయన పున్నమి చంద్రుడే... ఓ వ్యక్తి జీవితంలో ఎన్ని దశలుంటాయో... ఎన్ని సందర్భాలుంటాయో... మధురిమలు, విషాదాలు, బాధలు, సంతోషాలు, ఆశలు, స్వప్నాలు, విశేషాలు, ఉద్వేగాలు... ఇలా అన్నింటిని తన పాటల్లో పలికించిన పాటల రేడు. తెలుగు సినీ సాహితీ క్షేత్రాన్ని సుసంపన్నం చేసిన మనసు కవి..... మన సుకవి " ఆత్రేయ"  అంటూ అందరూ కలంపేరుతో  పిలుచుకునే " కిళాంబి వెంకట నరసింహాచార్యులు" . ఆత్రేయ గొంతెత్తి పాడలేదు.... గుండెత్తి పాడారు అంటుంటారు పలువురు కవులు. ఆయన అక్షరాల్ని ముత్యాలు, రత్నాలు అనడానికి వీల్లేదు. వాటికెంత విలువ ఉన్నా... ఆయన పాటల్లో ఉండే జీవలక్షణం వాటికి లేదు. ఆయన అక్షరాలు బీజాక్షరాలు. వాటి విలువ శాశ్వతం. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఆత్రేయను అపర శ్రీనాధుడనేవారూ ఉన్నారు. తన జీవితంలో ఎదురైన ఎన్నో సందర్భాలను పాటల రూపంలో పొదివి... గుండె బరువు దింపుకున్నారాయన. 1921 మే 7న శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, సూళ్లూరు పేట మండలంలోని మంగళంపాడు గ్రామంలో కృష్ణమాచార్యులు, సీతమ్మ దంపతులకు జన్మించారు ఆత్రేయ. చిన్న తనం నుంచే నాటకాల్లోని పద్యాలను, రాగయుక్తంగా చదివే ఆత్రేయకు అప్పటి నుంచే... సంగీత, సాహిత్యాల పట్ల ఆసక్తి పెరిగింది. ఆయన సినీ పాటల రచయితగానే అందరికీ సుపరిచితులు. నాటక రచయితగానూ ఆత్రేయ చరిత్ర సృష్టించారనే విషయం కొద్ది మందికే తెలుసు. రాయల సీమలోని క్షామ పరిస్థితుల్ని కళ్లకు కడుతూ ఆయన రచించిన నాటకాలు ఎందరినో ఆలోచింపజేశాయి. ప్రవర్తన, ఎన్.జీ.వో, కప్పలు, మాయ, ఈనాడు, విశ్వశాంతి, సామ్రాట్ అశోకా, గౌతమ బుద్ధ, భయం... ఇలా ఎన్నో నాటికలు ఆయన కలం బలాన్ని తెలియజేశాయి. ఇక ఆత్రేయ అనగానే తెలుగు సినీ పాటల పూదోట గుభాళించిన ఎన్నో పరిమళాలు మన మదిలో మెదులుతాయి. వీరి పాటల్లో ఎక్కువగా మనసుకు సంబంధించిన ప్రస్తావనలే ఉంటాయి. అందుకే ఆయన మనసు కవి... మన సుకవి అయ్యారు. మనసు పాటలు రాయాలంటే ఆత్రేయకే సాధ్యం. బాధలు, కన్నీళ్లు, కడగళ్లు... ఆయన పాటలో ఏరులై ప్రవహిస్తాయి. ఆయన్ను " ఆంధ్రాఇబ్బన్"  అని కూడా పిలుస్తుంటారు. ఎన్నో భగ్నహృదయాల్ని తన పాటల ద్వారా ఆవిష్కరించిన మనసుకవి సైతం ప్రేమలో విఫలమైన వారేనట. మనసును పిండే విషాదగీతాలతో ఆత్రేయ కలం పెనవేసుకు పోయింది. ఆత్రేయ రాసి ప్రేక్షకుల్ని, రాయక నిర్మాతల్ని ఏడిపిస్తుంటారనే అభియోగమూ ఉంది. కానీ తనలో తాను ఎంత ఏడుస్తారో ఎవరికి తెలిదని సమాధానమిస్తుంటారాయన. పాట ప్రారంభం తట్టే వరకూ ఎంతో ఆలోచించే వారు. దానికి ఎంత కాలమైనా పట్టేది. ఆత్రేయ పాట రాస్తే చాలు... ఆ సినిమా విజయం సాధిస్తుందనే పేరు కూడా ఉండేది. కేవలం పాటలే కాదు... మనసుకు తాకే మాటలు రాయడంలోనూ ఆత్రేయది అందెవేసిన చెయ్యి. దీక్ష సినిమాకు తొలిసారి గీతరచన చేసిన ఆయన అదే ఏడాది వచ్చిన సంసారం చిత్రానికి కథా రచన చేశారు. 1961లో వాగ్దానం అనే చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించారు. ఆయన పాటలతో పాటు మాటలు సైతం ప్రేక్షక హృదయాల్ని తాకాయి. భావాన్ని ప్రేక్షకుడి మనసుకి సూటిగా తాకేట్టు చేయడంలో ఆత్రేయ స్థానం అనితర సాధ్యం. భాషతో... భావాలతో... ఆయన ఎప్పుడూ వెట్టి చాకిరీ చేయించుకోలేదు. పదాలు ఆయన చేతిలో అందగా అమరిపోయేవి. మనసు లోతుల్లోకి తొంగి చూసి... మనసును ఎవరూ చెప్పలేనంత లోతుకి చెప్పిన మహాకవి ఆత్రేయ. అంతటి అద్భుత పాటల్ని, మాటల్ని అందించిన ఆత్రేయని అంబేద్కర్ విశ్వవిద్యాలయం డాక్టరేట్ తో గౌరవించింది. కేవలం తెర వెనుక నుంచి పాటలు రాయడమే కాదు... తెరపైనా నటుడిగా తానేంటో నిరూపించారు ఆత్రేయ. తెలుగు సినీ సాహితీ వనంలో దాదాపు 14 వందలకు పైగా గీత మాలికలకు ప్రాణప్రతిష్ట చేసిన ఆత్రేయ... 1989 సెప్టెంబరు 13న మద్రాసులో తుదిశ్వాస విడిచారు. పోయినోళ్లందరూ మంచోళ్లు... ఉన్నోళ్లు పోయినోళ్ల తీపిగురుతులు అన్న ఆత్రేయ... ఆదర్శాలతో జీవించారు. సంపాదించిందంతా అడిగిన వారికి లేదనకుండా ఖర్చు చేశారు. కవికులానికి దళపతిగా, కవిదళానికి కులపతిగా కీర్తినార్జించిన ఆత్రేయ... తెలుగు పాట ఉన్నంతకాల చిరస్మరణీయులు, స్వరస్మరణీయులు, తెరస్మరణీయులు.   ఆత్రేయ పాటల్లో ఇది బాగుంది, ఇది లేదని చెప్పడం సాధ్యం కాదు. ఆయన కలం నుంచి జాలువారిన ఆణిముత్యాల్లో మచ్చుకు కొన్ని... మనసుగతి ఇంతే, మనిషి బ్రతుకింతే (ప్రేమనగర్‌) మౌనమె నీ భాష ఓ మూగ మనసా ( గుప్పెడు మనసు) మనసు లేని బ్రతుకు ఓ నరకం, మరపు లేని మనసొక నరకం ( సెక్రటరీ ) తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా ( ప్రేమ నగర్ ) నేనొక ప్రేమ పిపాసిని ( ఇంద్ర ధనుసు ) – ఆత్రేయకు ఎంతో ఇష్టమైన పాట పులకించని మది పులకించు ( పెళ్ళి కానుక చక్కనయ్య చందమామా ఎక్కడున్నావూ  ( భార్యా బిడ్డలు ) మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదెగా (దాగుడు మూతలు ) నీవు లేక వీణ పలుకలేనన్నది ( డాక్టర్ చక్రవర్తి ) ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులో ( మూగ మనసులు ) ఏ తీగ పువ్వును ఏ కొమ్మ తేటెనో ( మరో చరిత్ర ) భారత మాతకు జేజేలు ( బడి పంతులు ) శిలలపై శిల్పాలు చెక్కినారు ( మంచి మనసులు) కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదానా( తోడి కోడళ్ళు) అందమైన లోకమని, రంగురంగులుంటాయని ( తొలి కోడి కూసింది)

No comments:

Post a Comment

Pages