Friday, August 22, 2014

thumbnail

ప్రయాణంలో పదనిసలు బై వసుంధర

ప్రయాణంలో పదనిసలు బై వసుంధర

- విసురజ

 

నిత్య జీవితంలో ఎన్నో భావోద్వేగాలను మనం రుచి చూస్తుంటాం...ప్రేమ, పగ, మోసం, డబ్బుపై వ్యామోహం, పల్లెటూరి బ్యాక్ గ్రౌండ్ తో వచ్చే కధలు, అక్కడ అనుభంధాలు గట్రా... ఊహ తెలిసిన దగ్గరనుంచి ఎంతోమంది రచయత/త్రుల పుస్తకాలు చదివాను..కొమ్మూరి వేణుగోపాలరావు గారి హౌసర్జన్, ప్రేమనక్షత్రం, యండమూరి గారి డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు, తులసిదళం, అభిలాష, మల్లాది గారి మందాకిని, ఈ గంట గడిస్తే చాలు, సావిరహే, పెద్దలకు మాత్రమే, హోతా పద్మినిదేవి గారి అపార్ట్మెంట్, మాదిరెడ్డి గారివి, యద్దనపూడి వారివి ఎన్ని చదివానో చెపితే ఇక్కడ కాగితం కరువవుతుంది.. అలాగే విజయార్కే గారివి చదివాను, కొమ్మూరి సాంబశివరావు గారి షాడో కధలెన్నో చదివాను.. రావూరి గారి పాకుడురాళ్ళు చదివాను.. ఇవన్నీ అద్భుతంగా రాసినవే..కాకపోతే ఇవన్నీ ఏదో ఒక పాయింట్..అబ్బాయి అమ్మాయిని కలవడం, సస్పెన్స్, తిరుగుబోతు మొగుడుని దారికి తేవడం లాంటివి..

పోతే నా అభిమాన రచయత వసుంధర గారిచే వ్రాయబడిన ప్రయాణంలో పదనిసలు అనే నవలను పరిచయం చేస్తున్నాను..మరి నేను పరిచయం చేస్తున్న కధ వీటన్నిటికి అతీతంగా ప్రయాణంలో మొదలై ప్రయాణం పూర్తవ్వడంతోనే అంతమవుతుంది..ఈ ప్రయాణంలో మనుష్యుల నైజాలు, వారి పద్దతులు, లాలూచీ పడే తత్వం, అవసరార్ధం స్నేహం, తన దాకా వస్తే చూపే అవకాశవాదం, మరొకరి పట్ల వ్యతిరేకత మొదలవడం ఇత్యాదివి...

ముఖ్యంగా ఈ నవల రాసిన వసుంధర గారి శైలి అద్భుతం చెప్పవచ్చు..ఇది ఒక మధ్యతరగతి మానవుడి పీడ, ఆనందం, విసుగు యివన్నీ ద్యోతకం చేసే అచ్చ తెలుగు కధ...ముఖ్యంగా రాజారావు, ఈశ్వరరావు గార్లు చుట్టూ తిరుగుతూ వుంటుంది.. అందులో వీరు ఇరువురు సంస్థ పని మీద వారుండే భువనేశ్వర్ నుంచి బరోడా వెళ్ళాలి... అదీ రైలులో.. వయా వాల్తేర్, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్, పూణే, ముంబై మీదుగా బరోడా చేరడం..

ఈ నవల ఆద్యంతం మనుష్యుల మనస్తత్వాల విశ్లేషణ చేస్తూ సాగుతుంది, అలాగే ట్రైన్ ప్రయాణంలో కనబడే వాస్తవాలు, రైలు ఉద్యోగుల్లో కానవచ్చే రాముడు/రావణుడు, ప్రయాణంలో ఎదురుపడే మనుషుల మనస్తత్వాలు, వున్న ఊరులో స్కూల్ సరియనవి లేక పక్క వూరులోకి స్కూల్ కి రైలులో వెళ్ళే ఆడపిల్లల వ్యవహారశైలి, వారి తెగువ...స్టేషన్ లో పోర్టర్ల చేసే తువ్వాలు/ రుమాలుతో సీట్లను అపడాలు ఆపై వాటిని అమ్ముకోడాలు, టి.సి. దగ్గర సీట్ పొందేటందుకు అప్పటి దాక వున్నా మిత్రులులా కలిసున్నవారు కసురుకునేవారు అవ్వడం ఆపై కుళ్లుకునేవారు కావడం... ఇది కాకుండా రైలులోని వసతుల్లోను వుండే తేడాపాడాలు, పిండి కొద్ది రొట్టి, డబ్బు కొద్ది మద్దతు లాంటి వాస్తవ కఠోర నిజాల దర్సనం జరుగుతుంది.

ఈ కధలో కసురుకోడాలు, టిసిలు విస్సుక్కోవడాలు, రాజాకీయాలు మాట్లాడుకోవడాలు, బూట్లు పోవడాలు, అమ్మాయలను చూసే కుర్రాళ్ళ కోర చూపులు, ప్లాటుఫారం తిళ్ళు, బాతురూముల్లో కిక్కిరిసి ప్రయాణాలు ఒకటేమిటి చాలా విషయాలు వున్నాయి..ఈ నవల చదివితే మనుషుల మనస్తత్వంపై రీసెర్చ్ చేసి రాసినట్టుగా వుంటుంది..పర రాష్ట్ర ప్రయాణంలో బాష పరమైన ఇబ్బందులు ఇటువంటివి చాలా చాలా వున్నాయి.. .........

( P.S.జొన్నలగడ్డ రాజగోపాలరావు - రామలక్ష్మి దంపతులు "వసుంధర" కలం పేరుతో వ్రాస్తున్న జంట రచయితలు. రాజగోపాలరావు రసాయన శాస్త్రవేత్తగా పనిచేసి రిటైరయ్యారు. వసుంధర తో బాటు బాబి, కమల, సైరంధ్రి, రాజా, రాజకుమారి, శ్రీరామకమల్, యశస్వి, కైవల్య, మనోహర్ వారి కలం పేర్లు)

ఈ చక్కటి పుస్తకాన్ని క్రింది లింక్ లో చదవగలరు...

http://www.teluguone.com/grandalayam/novels/%E0%B0%8E%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8B%E0%B0%A1%E0%B1%8D-1-1123-27663.html  

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information