భాద్రపదం – భాగ్యప్రదం

-         కొంపెల్ల శర్మ

“సర్వదినాలూ పర్వదినాలే” – అని సాక్షాత్తూ లలితా స్వరూపిణి జిల్లెళ్ళమూడి అమ్మ అనేవారట. కాలం దైవస్వరూపం కనుక కాలంలో ప్రత్యణువూ పవిత్రమే; అనుక్షణమూ అమూల్యమే. కాలంలో వచ్చే మార్పులన్నీ విశేషప్రదాలే. అనంతమైన కాల ప్రవాహం ఒక సజీవ పుణ్యనదీ ప్రవాహం. ఈ అనంతఝరిలో మనకు సానుకూలంగా తారసపడే అందమైన రేవులే పండుగలు, పర్వాలు, ఉత్సవాలు.  పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రాలతో కూడిన పూర్ణిమ సంభవించే మాసం మూలాన ‘భాద్రప్రదం’ అని ఆరో తెలుగు మాసంగా అవతరించింది. ఈ మాసంలో ఉత్తరేణి పూలతో శివార్చన చేస్తే ధ్వజసహిత విమానయానంలో పుణ్యప్రదం చేరుకుంటారన్న విశ్వాసం. ఈ నేలంతా ఒకేరకమైన ఆహారాన్ని ఒక నియమ నిబద్ధతతో భుజిస్తే ఆరోగ్యధనప్రాప్తి కలుగుతాయన్నది పలువురి నమ్మకం. శైవమౌన వ్రతంతో ప్రారంభించే శుక్ల పాడ్యమినాడు ఆడపడుచుల పండుగగా జరుపుకోవడం, ఆరోజు నిద్రకి ఉపక్రమించేలోగా జోన్నకంకి గింజలు, దోసకాయ ముక్కలు తినాలన్నదీ సంప్రదాయమంటారు. యిలా ప్రారంభమైన భాద్రప్రద శుక్ల పక్షం – శ్రావణ పూర్ణిమ నాడు చేయవలసిన ‘ఉపాకర్మ’ (యజ్ఞోపవీతాన్ని మార్చుకోవడం) ఏ కారణాలవల్లనైనా కుదరని పక్షంలో – భాద్రప్రద పూర్ణమి నాడు జరుపుకోవడం సదాచారం. బహుళ పక్షకాలంలో ‘మహాలయ’ పక్షాలుగా పేరుపొందిన బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకూ కాలాన్ని మహాలయం గా పిలుస్తారు. ఉత్తరాయణం దేవతాకాలం కనుక ఉత్తమకాలంగా భావించడం, కటక సంక్రమణం నుండి ప్రారంభమయ్యే దక్షిణాయనంలో వానలు, బురద, చిమ్మచీకట్లతో చికాకుగా అనిపించే కాలం అశుభకాలంగాను, మహాలయపక్షంగా అనిపించే కాలం కష్టకాలంగా, పితృదేవతల శ్రాద్ధ తర్పాణాది ప్రక్రియల ద్వారా సంతోషపరిచే పరంపరతో కష్టకాలం గడిచిపోతుందన్న భావన క్రమేపీ ఆచారంగా తిష్ఠ వేసిందనే చెప్పాలి.

శుక్ల పక్ష – చతుర్థి నాడు ప్రారంభమయ్యే “వినాయక చతుర్థి”, “గణపతి నవరాత్రి” ఉత్సవాలు.

భాద్రప్రద శుక్ల చతుర్థి రోజున  గణపతి స్థాపన జరుగుతుంది. గణేశుని బుద్ధి దేవతగా ప్రసిద్ధి వహించినా, గణేశుని ముఖం గజవదనం. ఏనుగు బుద్ధిజీవి అయినా మానవునికంటే అధికం మాత్రం కాదు. గణేశుని స్వరూపం “ఓం”కార స్వరూపంగా ఓం లోని దీర్ఘం గణేశుని ముఖమందు తొండం, ఓంకారాన అర్ధచంద్రం ఒక దంతం, ఆర్ధచంద్రం పైని బిందువు రెండవదైన విరిగిన దంతం, గణేశుని ఉదరం విశాలమైన ఓంకారంగా భావిస్తారు. గణేశుని ద్వారానే మనకు ‘ఓం’కార సాకారం జరిగిందని చెబుతారు.

ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన:

కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమ:

గణేశచతుర్థి రోజున గణేశమాహాత్మ్యాన్ని వివరిస్తూ అధర్వశీర్షాన – “త్వం చత్వారి వాకర పదాణి, చతుర్ధ్యా మన స్నంజపతి” గా వివరించడం జరిగింది.

“కలువ పువ్వుల నెల్లెడ కలియ గట్టి – దళముగా పచ్చాతోరణము గట్టి

వెలగకాయల నందందు వ్రేలవేసి – బాగుగా గట్టు కొన్నాను పాలవెల్లి”

అని వేంకట పార్వతీశ కవులు వర్ణించిన విధాన “పాలవెల్లి” గణేశ పూజా మందిరంలో జరుపుకునే వినాయక చతుర్థి పూజలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈ పక్షంలో చవితినాడు ఘనంగా జరుపుకునే ‘వినాయక చతుర్థి’ వరద చతుర్థి, గణేశ చతుర్థి గా పిలవబడే వినాయకుడు విశిష్టమైన నాయకుడు, దేవతలా కోరిక మేరకు గజాసురిని భాద్రపద శుద్ధ చతుర్థినాడు విష్ణుప్రేరితుడైన నందీశ్వరుడు సంహరించిన సందర్భంగా కూడా ప్రాశస్త్యం వహించింది. గణేశోత్పత్తి, గణాధిపత్యం, నవగ్రహదోష నివారణార్ధం – వినాయకుడిని పూజించడం ప్రత్యేకమైన పెద్దపండుగగా విరాజిల్లుతోంది. మానవ నిత్యజీవితంలో అనుక్షణం సహకరించే గణపతి మన శరీరంలో మూలాధార చక్రంలో భాసిల్లుతూ, శ్రీ చక్రపూజలో, షట్చక్రారాదనగా  గణపతిపూజలో భాగంగా “సింహ: ప్రసేన మనదీత్ సింహో జాంబవతా హత: - సుకుమారిక మారోదో: తవ హేష శ్స్యమంతక:” అన్న శ్లోకాన్ని పున:స్మరణం చేసుకోవడం జరుగుతుంది.

చతుర చతుర్థులు

గణేశపరంగా చతుర చతుర్థి వ్రతాలు – సంకష్ట, దూర్వస, కపర్ది, శిద్ధి వినాయక చతుర్థి పండుగలు ప్రాదాన్యతల్ని సంతరించుకున్నాయి.

 

“తొలుదినమే వినాయక చతుర్థికి ముందర రాల్ పాలేరుగా

యలు గడియించి పండుగ మహాగణనాథుని మంచి మంచి పూ

వుల బలు ప్రతులం గరికిబూజలు  జేసుక ప్రోద్దుగ్రుంకగా

నల పొరుగిండ్లు జల్లుకొను చాడిక జెందు దురర్భకావళుల్.”

అని తెలుగునాడు లో వినాయకపూజల్ని తెలుగుదనం ఉట్టిపడేలా జరుపుకునే విధానాన్ని ప్రముఖ కవులు, వాగ్గేయకారులు దాసు శ్రీరాములు వివరించారు.

గణపతి పత్ర పూజ

పూలతో చెసే పూజలు మనకు సర్వసాధారణాలైతే, గణేశపూజ మాత్రం ఓషధీ గుణాలున్న యిరవై ఒక్కటి పత్రాలతో వినాయకుని  పూజచేయడం ప్రత్యేకతని సంతరించుకుంది.

అవి – మాచీ, బృహతీ, బిల్వ, గరిక, దుత్తూర, బదరీ, అపామార్గ, తులసీ, చూత, కరవీర, విష్ణుక్రాంత, దాడిమీ, దేవదారు, మరువక, సింధూర, జాజి, గండకీ, శమీ, అశ్వత్థ, అర్జున, అర్క పత్రాలతో పూజచేయడం పరిపాటి. ఈ పత్రాలతో పూజచేసి, పూజానంతరం -చెరువులు, బావులు, నదులు, వర్షాధార నీటి వనరులు తప్ప అధునాతన జల సౌకర్యాలు నేటి మాదిరి నాడు లేకపోయిన కారణంగా - జలాశయ, నదీపరీవాహక ప్రాంతాల్లో జరిపే నిమజ్జనం ద్వారా నీటిని శుభ్రపరచుకొని, ఉపయోగపరచుకొనే విధంగా ఈ ఓషధీ పత్రాలను నిర్ణయించినట్లు తెలుస్తోంది.

వినాయక ప్రతిష్ఠ నిమజ్జనాలు – జీవన మరణాల సంకేతాలు

సర్వ శుభకార్యాల్లోనూ ప్రదానశక్తి కేంద్రంగా శుభకరుడైన వినాయకుని మట్టితో నిర్మాణం గణేశ విసర్జనం చేయడం, సాధ్యాసాధ్యాలని బట్టి నియమావధి వరకూ పూజని చేసిన తర్వాత విగ్రహ విసర్జన చేయడం వైదిక పరంపరలోని అంతర్భాగంగా మారిన వైనంగా విరాజిల్లుతోంది. ప్రతిష్ట చేసిన వినాయక ప్రతిమని పదిరోజులు పూజ చేసిన సహవాసంతో వియోగాత్మక భావనతో విసర్జనకు సంకల్పిస్తూ – తొందరలో తర్వాత సంవత్సరానికి రమ్మనమనీ ఆహ్వానించడం కూడా జరిగిపోతుంది. ఈ ప్రాణ ప్రతిష్ట, విసర్జనలకు మృత్యు సమానంగానే భావించే సామానార్ధం మనకు కాళిదాసు రఘువంశంలో ప్రస్తావన కనిపిస్తుంది. “మరణం ప్రకృతి: శరీరిణాం వికృతి: - జీవిత్ ముచ్చతే బుధై:” – అంటూ “మరణం సహజం; జీవించి ఉండడం అసహజం; పండుగలు కేవలం ఉల్లాసం కోసం కాక వాటినుంచి జీవమరణ సంస్కారాలను గ్రహించి మాయారహితమైన అమృతత్త్వాన్ని ప్రాప్తించుకోవాలన్న సందేశం మనకు ఈ పండుగ ద్వారా గోచరిస్తుంది. శ్రీ గణేశుని ప్రతిష్ఠ, విసర్జనల ద్వారా మానవ జీవిత రహస్యాలను గ్రహించి తదనుసారంగా జీవన వ్యవహారాలను నిర్వహించుకొనే ప్రయత్నాలు సార్ధకం చేసుకోవడమే ఈ పండుగల పరమార్ధంగా గ్రహించాలి.

యితర ‘శుక్ల పక్ష’ పర్వోత్సవాలు

వినాయక చవితి కాకుండా – భాద్రపద శుక్లపక్షంలో వచ్చే ప్రముఖ పర్వదినాల్లో భాగంగా – బలరామజయంతి, వారాహ జయంతి, ఋషిపంచమి వ్రతం, సూర్యషష్టి వ్రతం, జ్యేష్టాష్టమి నందాదేవి పూజ, శ్రీభాగవత జయంతి, గజలక్ష్మీవ్రతం, పరివర్తన ఏకాదశి, కల్కి ద్వాదశి, ఆనంత పద్మనాభ వ్రతం, పౌర్ణమినాడు జరుపుకునే ఉమామహేశ్వర వ్రతంతో శుక్లపక్షం పూర్తవుతుంది. ప్రత్యేకంగా ఈ పూర్ణిమ నాడు – ఉమామహేశ్వర వ్రతం, ఉపాంగ లలితా గౌరీవ్రతం, లోకపాలకపూజ, వంధ్యత్వ హారిలింగార్చనావ్రతం, పుత్రవ్రతం, వరుణవ్రతం, బ్రహ్మసావిత్రీవ్రతం, అశోకత్రిరాత్రి వ్రతం – చెసే ఆచారాలన్నట్లు చతుర్వర్గ చింతామణి ప్రస్తావిస్తున్నట్లు పెద్దలు చెబుతారు. అంతేకాదు, భాద్రప్రద పూర్ణమినాడు ‘భాగవతపురాణా’న్ని దానం చెసే పరమపదప్రాప్తి అని కూడా భావిస్తారు. ఇంద్రపౌర్ణమాసీ అనే దిక్పాలపూజ గదాధరపద్ధతిలో చేయాలని (నీలమాట పురాణం), శుక్ల త్రయోదశి రోజున ప్రారంభించిన అగస్త్యార్ధదానాన్ని పూర్ణిమతో ముగించాలని (తిథితత్త్వం), మహాభాద్రీ గా బదర్యాశ్రమంలో గడపడంతో విశిష్ఠ ఫలప్రదాయకమని గదాధరపద్దతి ఘోషిస్తోందని చెబుతారు. పరమనిష్టాత్ములకు పౌర్ణమాస కృత్యాలుగా నాందీ పితృ శ్రాద్ధ కర్మలు ఆచరించాలని కూడా ప్రస్తావిస్తారు.

బహుళ పక్షమి

మహాలయ పక్ష పితృ తర్పణాలు

భాద్రప్రద బహుళ పాడ్యమినుంచి ప్రారంభమయ్యేది పితృపక్షాలుగా పిలవబడే   ‘మహాలయ పక్షం’ అని స్మృతికౌస్తుభం వివరించే విధానం వేదకాలంనుంచీ ఆచరణీయంగా కొనసాగుతోందనీ చెబుతారు.    పూర్ణిమ నుంచి అమావాస్య వరకూ కొనసాగే ఈ పక్షం మహాలయ అమావాస్యతో ముగుస్తుంది. ఒక మనిషి జీవితకాలంలో ఈ మహాలయ పక్షంలో గంగ, యమునా, ఫల్గుణి నదుల సంగమంలో గయలో శ్రాద్ధకర్మ చేయడం మహాత్కార్యంగా కూడా భావిస్తారు. ఈ రోజు ఈ కర్మ చేయడానికి వీలుకానివారు తర్పణం వదలడం కూడా పరిపాటి.

బహుళ తదియను ఉండ్రాళ్ళ తద్ది గా తెలుగువారు వ్యవహరించడం, చవితి నాడు దిక్పాల పూజ, పంచమి నాడు నాగపూజ, అష్టమి రోజున చీనాబ్ నదీ లోయల్లో నాగరాజు వాసుకికి ఉండే ఆలయాల్లో నెలకొన్న జీమూత వాహనుని పూజలు చేయడం,, అవిదానవమి గా పిలవబడే ఈ రోజున వైదిక పరంపరలో భర్తని కలిగియుండే స్త్రీలు దుర్గ, గౌరీపూజలు జరుపుకోవడం పలుచోట్ల ఆచారాలు కనిపిస్తున్నాయి. ఈ బహుళ ఏకాదశి ఇందిరైకాదశిగాగా ఇంద్రసేనుడు యమలోకంలో యాతనలు పడుతూండడం భూలోకంలో ఆయన కొడుకు ఈరోజే ఏకాదశి వర్గం చేసిన ఫలితంగా యమలోకంనుంచి ఇంద్రసేనుడు స్వర్గలోకానికి తరలించబడినట్లు ఐతిహ్యం. బహుళ త్రయోదశి కలియుగాదిగా, ద్వాపర యుగాదిగా భావించడం జరుగుతోంది. మాస శివరాత్రిగా భావించే బహుళ చతుర్దశి రోజున ఉపవాసం ఉంటే శివలోకప్రాప్తి పొందుతారన్న విశ్వాసం పబలం. బహుళ పక్షం ముగిసే అమావాస్య రోజు గదాధర పద్ధతిలో సప్తపితృకామావాస్యగా భావిస్తారు. ఇదేరోజు ఆశ్వశిరోదేవపూజ ఉపవాసంతో చేస్తే సత్ఫలితం కలుగుతుందని  హేమాద్రి వివరించాడని చెబుతారు.  కొన్ని నక్షత్రాలున్న మండల గజవీధిలో నున్న చంద్రసూర్యచాయలను సంవత్సరానికి ఒకసారిగా ఈ నెలలో త్రయోదశి నుంచి అమావాస్య వరకూ సంభవించే ‘గజచాయలుగా పిలిచే ఈ రోజుల్లో చిమ్మచీకటి గా పూర్వులు భావిస్తారు. హస్తా నక్షత్రయుక్త అమావాస్యని  గజచ్చాయా అమావాస్యగా, దీనినే మహాలయ అమావ్యసగా కూడా పిలవడం మరో విశేషం. పితృదేవతల కోసం, పితాళ్ళను పూజించేది కాబాట్టి పితాళ్ళ అమావాస్యగా కూడా పిలుస్తారు.

సర్వభాగ్యప్రదంగా పిలవబడే ఈ భాద్రప్రద మాసంలో – ఆ  ‘వినాయకచవితి’తోనే మాసం సార్ధక్యతను సాధించుకొనడంతో పాటు బలరామ జయంతి, ఋషిపంచమి, సూర్యషష్టి, శ్రీ మద్భాగవత జయంతి, సర్వపరివర్తన ఏకాదశి, అనంతపద్మనాభ వ్రతం, ఉమామహేశ్వర వ్రతంతోపాటు మాధవ తీర్థం పున్యదినంగా మహాలయ పక్షాలు సంభవించే భాద్రప్రద మాసం  సత్య శివ సుందర సర్వభాగ్యప్రదమాసంగా భావిస్తారు.

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top