అందెల ఆనందలాస్యం – “శింజారవం “
-      బ్నిం
  భావరాజు పద్మిని గారు "నాట్య కళ ప్రస్తావన అచ్చంగా తెలుగు మాసపత్రిక లో లేక పోవటం లోటుగా వుంది.. దాన్ని మీరే పూరించాలి అన్నారు... " నాట్యం నేను చేయడమేంటి అమ్మలూ" అని గొల్లున నవ్వాను.. మీకు చాలమంది నర్తకులు , నర్తకీమణులు తెల్సుకదా.. వాళ్ల గురించి వ్రాయండి - అన్నారు. నా పాయింటాఫ్వ్యూలో రాయాలంటే కష్టం అండీ.... ఫలానా ఆమెకి నేను ఫీగా రాసిచ్చాను, అయినా కృతజ్ఞతలు అభినయంలో కుడా చూపలేదు. ఫలానా వారు ఎక్స్ పెక్టేక్షన్ కన్న ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారు... ఫలానా  ఆవిడ తల్లీ కూతురూ జమిలిగ 4 బేలేలు రాయించుకుని డబ్బులెగ్గొట్టారూ.. ఇంకో ఆవిడ “దూరదర్శన్ లో ఇచ్చేడబ్బులు చాలవంటోయ్, మహా కావాలంటే స్టేజ్ మీదకు పిల్చి చీఫ్ గెస్టుతో షాలు కప్పిస్తాను(మీకంత చాల్లే) “అన్నారనీ చెప్పనా.. లైక్ దట్.. లైక్ దట్.. డిస్ లైకులన్నీ చెప్పాను...   ఆవిడ తేరుకుని నవ్వేసి.. మీకిష్టమైన డాన్సర్స్ గురించి రాద్దాం వారి గురించి మెటీరియల్ ఇవ్వండి – నేను  కూర్చుకుంటాను అన్నారు- రక్షించావు బంగర్తల్లీ అనుకున్నా!! ఇది మా మధ్య జరిగిన ఒప్పంద పదాంశం-   ఇప్పుడు పాఠక మహాశయుల్తో నేనీపాత్ర నొప్పుకోవడానికి ధైర్యం - అర్హత ఏమిటనే సంజాయిషీ ఇవ్వాలిగా .. నోడౌట్ అయాం  ఫిట్ ఫర్ ది జాబ్ - అఫ్ కోర్స్ వెరీమచ్! కారణం చెప్పబోతున్నాను- " అదే ఈ 'శింజా ధ్వానానికి  ( ఉష్ .. కొత్త గా వుందని .. శింజా ధ్వానం అన్నాను- శింజ అంటే మువ్వలు - ధ్వానం అంటే సవ్వడి - అంతే) తొలి జతి !!   ఇప్పుడు ఫ్లాష్ బ్రేకులు!!   ఇవ్విధముగా ఆత్మస్తుతి పరనింద జేసిన తదుపరి మదీయ నాట్యగీత, రూపక రచనా ప్రవేశంబును.. అందు ప్రసిద్ధ,వర్ధమాన, నర్తకుల పరిచయంబును తెల్పుచూ.. ప్రధమాంకమున నాయభిరుచి నెరింగిన ఒకానొక సుముహూర్తము నా మిత్ర ద్వయంబు నా చేత నృత్య రూపక రచన చేయించిన విధానం,బెట్టి దనిన... (దీన్ని..సంధివంచనం అంటార్లెండి!)   తెలుగులో చెప్పాలంటే ఆ ఇద్దరూ ఫ్రెండ్స్ ఎవరంటే.. ప్రముఖ కూచిపూడి భరతనాట్య గురువులు శ్రీ పసుమర్తి రామలింగ శాస్త్రి (సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ హైద్రాబాద్ ) శిష్యులు- ఇద్దరు డాన్స్ ఎమ్మేలు పూర్తిచేసి.. " న్యూ జనరేషన్ ని జనరేట్ చేయాల. లాభం లేదు లేకపోతే "  అని డిసైడై చిన్న పిల్లలకు డాన్స్ నేర్పించడానికి స్థిర పడ్డారు.   ఒకరు సుధాకర్ (ఇప్పుడు తెలుగు యూనివర్శిటీలో డాక్టరేట్నీ- అక్కడే రత్నం లాంటి భార్యని సంపాదించుకుని, అక్కడే ఇద్దరూ ఉద్యోగం  చేస్తున్నారు)   ఇంకో ఆయన శ్రీ పెద్దుల నరసింగరావు- చదువై .. గెంతితే హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్ లో  ఊపిరి కూడదీసుకున్నాడు..వాళ్లే తొలిసారి నన్ను వెతికి పట్టి తొలిసారి నా పెన్నులో ఇంకు పోయించారు.. -( అంతకు ముందు నా కీర్తి ప్రతిష్టలకి కారణమైన వివిధ రచనలూ, చిత్రాలూ , కార్టూన్స్ పత్రికల్లో వచ్చాయి. అవి అప్రస్తుతం!!) 'మధుర స్వప్నం' అని ఓ రూపకం రాయించారు. నాకు అప్పుడు బొత్తిగా డాన్సు బేలేలేవీ చూసిన అనుభవం లేదు.- దరువులేవిటి.. కందార్ధాలు ఏవిటీ, తిశ్రం- చతురస్రం, మిశ్రం ఈ నడకలేంటి 'తధిగిణతోం' అంటే ఏమిటీ అవి మనం రాయాలా.. వాటన్నిటినీ తెలుసుకోవడానికి నాట్యశాస్త్రం 'అభినయదర్పణం' చదివాను. శ్రీరాం భుజగరాయ శర్మ గారి బేలేలబుక్ చూసాను... సబ్జెక్ట్ కి స్క్రీన్ ప్లే వేసుకోవడం, సంభాషణాదరువులు, ప్రవేశదరువులు, వగైరా గ్రామర్ ని అభ్యసించాక, లక్కీగా  వెంపటి చిన సత్యం గారి నృత్యరూపక సప్తాహమో.. ఏదో జరిగింది- (నెక్లెస్ రోడ్ లో కాబోలు..) వాటన్నిటినీ చూశాను..   ఆ అతర్వాత నుంచి నా టీవీ నాటక రచన ప్రభావం బాపూ గారి సీతాకళ్యాణం పాటల పై ప్రేమ చలవ వల్ల .. తర్వాత రాసిన ప్రతిదీ సశాస్త్రీయ పండితులు సైతం, మెచ్చుకునేలా రాయటం.. ముడ్ కి అణుగుణంగా తాళాలు మార్చి, పద్యాలు రాయటంతో నాకు మంచి పేరొచ్చింది. కనకనే మనరాష్ట్రంలోనూ ఇండియాలోని కొన్ని ఇతర రాష్ట్రాలలోనూ, విదేశాలలోనూ నేను ఎందరో నాట్యకళాకారులకి, నాట్యాచార్యులకే నాట్యగురుకులాలకి నృత్యరూపకాలు 214 దాకా రాశాను- పౌరాణికాలు రిపీటెడ్గా పూర్తి పాటలూ, స్క్రీన్ ప్లే మార్చి రాశాను.- అంటే .. రామాయణం 4 సార్లు రాశాను(మళ్ళి దాంట్లో ఉప ఉజ్వల ఘట్టాలు ' 'సీతాకళ్యాణం '- 'శబరి ' ఇలా)   గౌరవనీయులు డా. జొన్నలగడ్డ. అనూరాధ, డా. మద్దాలి ఉషాగాయత్రి, డా. రమాదేవి, భారతీకృష్ణ, మాధవీమాల, రంగమణి, స్వాతీ సోమనాధ్, పద్మాకళ్యాణ్, కిరణ్మయి, శృతకీర్తి, దీపికారెడ్డి, పద్మజారెడ్డి, ఉషారాణి, ఉమాదేవులపల్లి, కృష్ణకుమారి, సరళాకుమారి, సర్వశ్రీ పసుమర్తి రామలింగ శాస్త్రి, నర్శీంగ్ రావు, శ్రీకాంత్ గౌడ్, శ్యాం, ఆచారి, వేదాంతం వెంకటాచలం (మృత్యుంజయ్) ఇలా ఎందరికో ఒకటి మించిన 15 బేలేలు దాకా రాసాను- ఇందులో పౌరాణికాలే ఎక్కువ శాతం.. సాంఘీక ప్రయోజనాలు..సామాజిక బాద్యత.. ప్రముఖుల జీవన గాధలు,వగైరాలు కొన్నున్నాయి. అన్నీ కూడా ఒకటికి మించి ఎక్కువ సార్లు ప్రదర్శించినవే.! నాకుగా నెనేదీ రాసిపెట్టుకోలేదు. స్క్రిప్టులు దాచి ఉంచలేదు.-ఈ మధ్య కొందరు అడిగితే... కొన్ని డిమాండ్ మేరకు కథని చర్చించి ...నాలుగైదు సిట్టింగ్ ల్లో పాటలు రాసిచ్చి....బేక్ గ్రౌండ్ ఏముండాలి? డ్రస్ చేంజి మధ్యలో గేప్ లేకుండా ఏం చేయచ్చు. సంధి వచనాల్లో దృశ్యం ఎక్కడ వదిలెయ్యచ్చు, వగైరాలు సుదీర్ఘంగా చర్చించి రాయడం వల్ల... పైగా టివి రైటింగ్ ఛాదస్తం వల్ల... లెఫ్ట్ రైట్ గా మూడ్స్ రాస్తూ... మూజ్యిక్(రికార్డింగ్)ఫైన రీహార్సల్ చూస్తూ హెల్ప్ చేయటం వల్ల వారితో స్నేహబంధాలు కలిగి నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారని ధైర్యంగా “అచ్చంగా తెలుగు" పద్మిని గారు అడిగిన ఈ జాబ్ కి ఒప్పేసుకున్నా-వచ్చే నెల నుంచి ఒక్కో డాన్సర్ ని ఇంటర్వ్యూ చేసి ...విషయాలు చెప్తాను-అందరూ గొప్ప పేరున్న వారివే కాదు- పేరు రాని గొప్ప వారి గురించీ వారు డాన్స్ రంగానికి చేసిన కృషి గురించీ...ఓ పేరా వారూ నేనూ...కల్సి పనిచేసిన ప్రాజెక్ట్ ల గురించీ కూడా చెప్పుకుంటా!

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top