అంతర్యామి(నవలిక)

- పెయ్యేటి రంగారావు


అంతా విపరీతమైన కోలాహలం!
ఎవరికి వారే హడావిడిగా తిరుగుతున్నారు.
ఎవరికి వారే పక్కవాళ్ళకి ఏవో పురమాయింపులు చేస్తున్నారు.
మరి కొద్దిసేపట్లో ఆ చిన్న ఇంట్లోకి ‘ అంతర్యామి ‘ గారు విచ్చేయబోతున్నారు.
          అహం బ్రహ్మోస్మి అని సాధికారికంగా ప్రకటించుకో గలిగిన తపస్సంపన్నుడాయన.  ఆయన జీవితమే ఒక అద్భుతం!ఒక అతి సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టి, సామాన్యమైన చదువు చదువుకుని, సాధారణమైన ఉద్యోగంతో ఇహలోకంలో జీవనయాత్ర మొదలుపెట్టిన ఆయనకు———-ఉన్నట్లుండి పరమాత్మ సాక్షాత్కారం లభించింది!
అదిన్నీ————
ఊరికి దూరంగా బీడుప్రదేశాలలో, గజం ఏభయి రూపాయలకి దొరుకుతూంటే, చవకగా వుంది కదా అని రెండు వందల గజాల స్థలం కొని అందులో పాక వేసుకున్నారు.
అప్పుడే జరిగింది అద్భుతం!!
                                                                                                                   *********************
          రామదాసుగారు దైవాధీనం బస్సు ఎక్కి ఐహికాముష్మికాలను సాధించడానికి బయలుదేరిన వ్యక్తి.రెండు విపరీతాలు కలవడంలో హేతువాదముందో, ఆధ్యాత్మిక తత్వముందో తెలియదు కాని, రామదాసు గారికి, వెంకట నాగ మల్లేశ్వర సత్యసాయీ త్రినాథ వరప్రసాద లక్ష్మీనరసింహ మూర్తి అనబడే, ‘ లావా ‘ అనబడే హేతువాదికి స్నేహం కలిసింది.  కొద్దికాలంలోనే వాళ్ళిద్దరూ చాలా ఆప్తమిత్రులయ్యారు.ముక్కోటి దేవతల వరప్రసాదం వలన పుట్టిన బిడ్డడికి అందరు దేవతల పేర్లు తెలియని అతడి తలిదండ్రులు వెంకట నాగమల్లేశ్వర సత్యసాయీ త్రినాథ వరప్రసాద లక్ష్మీనరసింహ మూర్తి అని నామకరణం జరిపించగా, వ్యక్తావ్యక్తతలు తెలిసే వయసు వచ్చాక ఆ బిడ్డడు తన పేరును లావా గా మార్చుకున్నాడు.రామదాసుగారు నరసాపురం వై.ఎన్.కాలేజిలో లెక్చరరుగా పని చేస్తున్నారు.లావాగారు స్థానికి హేతువాద సంఘానికి అద్యక్షులు.రామదాసుగారికి దైవభక్తి చాలా ఎక్కువ.  నిరంతరం భగవధ్ధ్యానంలో బ్రతుకు వెళ్ళదీస్తుంటారాయన.  సర్వ కర్మలను భగవదర్పణం చేసి, తామరాకు మీద నీటిబిందువు లాగ జీవిస్తుంటారాయన.  ఆయన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలున్నాయి.  మంచి జరుగుతే భగవంతుడి అనుగ్రహమని, చెడు జరుగుతే అది తన పూర్వజన్మ తాలూకు సంచిత పాప ఫలమని భావిస్తుంటారాయన.  సుఖ దుఖాలని సమదృష్టితో అనుభవించే వీతరాగి ఆయన.లావా ఆయనకు పూర్తిగా వ్యతిరేకం.దేవుడు, పునర్జన్మలు, అతీంద్రియ శక్తులు – ఇవన్నీ ఉత్తి దగా – ‘ ట్రాష్ ‘ అని గట్టిగా వాదించే వ్యక్తి లావా.అతడికి మంచి జరుగుతే అదంతా తన స్వశక్తి వల్లనేనని, చెడు జరుగుతే, ఈ దుష్ట సమాజం, ఈ అస్తవ్యస్త వ్యవస్థ వల్లనేనని భావిస్తూ, సుఖాలకి బాగా పొంగిపోతూ, కష్టాలు వచ్చినప్పుడు ప్రభుత్వంతో సహా యావత్తు సమాజాన్ని వాటికి బాధ్యులుగా చేసి, ఉద్రేకంతో శాపనార్థాలు పెడుతూంటాడు.వారి భావాలలో వైరుధ్యమున్నప్పటికీ, వారి మైత్రికి ఏవిధమైన అవరోధమూ కలగలేదు.
                                                                                                                  *************************
          ‘ ఏమండీ!  అన్ని నదుల జలాలు ఉన్న కలశం ఇక్కడే పెట్టాను.  కనిపించి చావదేం?” అయ్యా!  ఆ కలశం ఇక్కడ పెడితే ఎల్లాగండీ?  పురోహితులవారు తమతో తీసికెళ్ళారు.” ఎక్కడికండీ?’‘ ఎక్కదికేమిటండీ, నా శ్రాధ్ధం!  ఊరు మొదట్లోనే అంతర్యామిగారికి పూర్ణకుంభంతో స్వాగతం పలకద్దూ?’‘ అయ్యా!  మంగళవాయిద్యాలు వచ్చాయి.  వాళ్ళు తమతో మనవి చేసి కాఫీలు పోయించమని అడుగుతున్నారు.’‘ వాళ్ళ శ్రాధ్ధమండీ!  ఇప్పుడా తగలడ్డం?  అవతల అంతర్యామిగారు ఇప్పుడో, మరుక్షణాన్నో అవతరించబోతుంటేనూ?  కాఫీ లేదు, నా పిండాకూడూ లేదు గాని, ముందు వాళ్ళని ఊరు మొదట్లోకి తగలడమనండి.  స్వామివారు రాగానే మంగళ వాయిద్యాలు మోగద్దూ?  లేకపోతే ఇంక వీళ్ళు వచ్చిన ఉపయోగమేముంటుందండీ?’‘ అవునండీ.  బాగా శలవిచ్చారు.  ముందు వాళ్ళని అక్కడికి తోల్తాను.  కావాలంటే తిరిగి వచ్చాక కుడితిలా కాఫీ తాగమని చెబుతాను.’మంగళవాయిద్యాల వాళ్ళు తిట్టుకుంటూ ఊరు మొదట్లోకి పరిగెట్టారు.‘ ఏమైనా భగవంతుడి లీలలు అతివిచిత్రమైనవండీ.  కాకపోతే ఊళ్ళో ఇందరు ధనికులుండగా, అందరినీ కాదని కేవలం ఒక బడిపంతులు ఐన రామదాసుగారింట్లోనే బస చెయ్యాలని అంతర్యామిగారు నిశ్చయించుకున్నారంటే, వారిదెంత ఉదాత్తమైన స్వభావమండీ?’‘ కాదుటండీ మరీ?  భగవంతుడి దృష్టిలో అందరూ సమానమని చెప్పడమే వారి ముఖ్యోద్ద్యేశ్యమై వుంటుంది.’‘ సరి, సరి!  మనం ఇక్కడ ఇలా తాపీగా ముచ్చట్లాడుకుంటూ కూర్చుంటే, అవతల అంతర్యామిగారు రావడం, వారికి హారతివ్వడం లాంటి కార్యక్రమాలన్నీ పూర్తయిపోతాయి. పదండి, పదండి.  వారి దర్శనం చేసుకుని పాదాభివందనాలు చేసుకుందాం.’ ‘ అయ్యా రామదాసుగారూ!  మీరేమిటి, ఇంకా ఇలాగే బైఠాయించారూ?  అంతర్యామిగారికి ఆహ్వానం పలకవలసిన ముఖ్యవ్యక్తి మీరే కదా?’ ‘ సర్లేవయ్యా, ఆయన కూడా మనతో వస్తే ఇక్కడ ఏర్పాట్లెవరు చూస్తారూ?  ఇప్పటికే వారిని రిసీవ్ చేసుకోడానికి ఊరిపెద్దలంతా అక్కడకెళ్ళారు.  అయ్యా రామదాసుగారూ!  మీరింటిదగ్గరే వుండండి.  మేమక్కడికి తగలడి నిర్వాకం చేసుకొస్తాం.’
                                                                                                                       ************************
          ఈ రోజుకి రెండు రోజులు వెనక్కి వెళ్తే……..లావాకి, రామదాసుకీ మధ్య మళ్ళీ వాగ్యుధ్ధం మొదలైంది.’ ఒరేయ్ దాసూ!  అన్నీ తెలిసినవాడివి.  స్వశక్తిమీద పైకి వచ్చినవాడివి.  ఎంతో చదువుకున్న వాడివి.  నువ్వు కూడా దేవుళ్ళని, దయ్యాలని, స్వాములని, బాబాలని, మంత్రాలని, మహిమలని నమ్ముకుంటూ బ్రతకడం, అల్లా వ్యర్థంగా బ్రతుకుతూ నీ వ్యక్తిత్వాన్ని చంపుకోవడం–ఛ, ఛ, నాకిదేం నచ్చలేదురా.’‘ ఒరేయ్ లావా!  నీ నమ్మకాలు నీవి.  వాటిని నేనేం ఖండించడానికి ప్రయత్నం చెయ్యటల్లేదే?  నీ స్వేఛ్ఛ నీది.  దానికి నేనేం భంగం కలిగించటం లేదే?  మరి నా దారి మళ్ళించడానికి నువ్వెందుకురా ఇంత తాపత్రయపడతావు?’లావా ఉద్రేకంగా అన్నాడు, ‘ పడతాను.  నీ దారే కాదు.  ఈ సకల చరాచర జగత్తులోని మూర్ఖమానవులందరినీ మార్చడం కోసం ఎంతన్నా కృషి చేస్తాను.  వాళ్ళ మూఢనమ్మకాలని పటాపంచలు చేయడం కోసం నన్ను నేను నాశనం చేసుకోమన్నా చేసుకుంటాను.  నా జీవితానికి ఒక్కటే ధ్యేయం!  హేతువాదం, తార్కిక శక్తి మనిషి  మనిషికి అలవాటు చెయ్యడం.  ఇది మహాయజ్ఞంరా.  ఈ మహాయజ్ఞంలో నేను సమిధనై పోయినా సరే, నేననుకున్నది సాధించి తీరతాను.’‘ ఏమిటో పడికట్టు మాటలు విసురుతున్నావు!’‘ పడికట్టు మాటలు కాదురా.  ఇవి నా హృదయపు అట్టడుగు పొరల్లోంచి ఉబికి వస్తున్న, ఆవేదనతో కూడిన పదాలు!’‘ నీ ఉద్రేకం బాగుందిరా లావా!  కాని దాన్ని సరైన దారిలోకి మళ్ళిస్తే ఈ సమాజానికి ఏ కొంచెమైనా ప్రయోజనం కలుగుతుందేమో సీరియస్ గా ఆలోచించు.’‘ లేదు.  నాకు మరే ధ్యేయమూ లేదు.  నా ఆశ, ఆశయం సమస్త మానవాళిని సక్రమమైన మార్గంలోకి మళ్ళించడమే.’రామదాసు నిశ్చలంగా అన్నాడు, ‘ నీ అనుభవాలు నీకు నేర్పిన పాఠాల్ని బట్టి దేవుడు లేడంటావు నువ్వు.  కాని నా అనుభవాలు నాకు ప్రత్యక్షంగా దేవుడున్నాడని నిరూపించాయిరా.’‘ ఓ.కె.  ఎన్ని సార్లడిగినా తప్పించుకుంటున్నావు.  పోనీ ఇవాళైనా నీ అనుభవాలు చెప్పిన పాఠాలు నాక్కూడా నేర్పకూడదా?  ఒకవేళ అవి హేతుబధ్ధంగా వుంటే నేనూ నీ దారిలోకి రావచ్చేమో కదా?’ ‘ భగవంతుడున్నాడని నమ్మేవాడికి ఏ నిదర్శనమూ అవసరం లేదు.  లేడనేవాడిని ఏ నిదర్శనమూ మార్చలేదు.’ ‘ అల్లా అనకు.  మహా మహిమాన్వితుడని ప్రపంచమంతా పాదాభివందనాలు చేస్తున్న అంతర్యామి గారు రెండు రోజుల్లో నీ ఇంటికి కావాలని వస్తున్నాడు.  అందులో వున్న రహస్యం తెలుసుకోడానికి, ఆయన బండారం బట్టబయలు చెయ్యడానికి, నేను నీ ఇంట్లోనే తిష్ట వెయ్యబోతున్నాను.  ఈ సమయంలో నీ వాదన నాకు నచ్చిందనుకో, నేను కూడా ఆయన తలమీద ఒక కొబ్బరికాయ కొడతాను.’ ‘ అదుగో, ఆ హేళన చేసే మనస్తత్వం నీకున్నంతవరకు నేను చెప్పేది నీ తలకెక్కదు.’ ‘ కాదురా, ప్లీజ్!’ ‘ ఐతే చెబుతా విను.  ఆరుగురు ఆడపిల్లల తర్వాత పుట్టిన నన్ను అతి కష్టం మీద మా నాన్నగారు సెకండరీ గ్రేడు దాకా చదివించారు.  ఆ తర్వాత ఉద్యోగం కోసం నేను చెయ్యని ప్రయత్నం లేదు.  చివరికి నాకు ఉద్యోగం ఖచ్చితంగా రాదని అర్థమైపోయింది.  ఐనా వసుదేవుణ్నయ్యాను.  ఒకసారి కాదు, వందల కొద్దీసార్లు అడ్డమైన వాళ్ళ కాళ్ళూ పట్టుకున్నాను.  ఐనా ఫలితం లేకపోయింది. ఇల్లు చూస్తే నరకం!  నా బతుకు చూస్తే వ్యర్థం!  ఆ దరిద్రం, ఆ నరకం అనుభవించిన వాళ్ళకే గాని, బైటివారికి అర్థం కాదు.  ఆకలి బాధతో ఇంటిల్లిపాదీ రోజులు రోజులు మంచినీళ్ళు తాగి గడిపేవాళ్ళం.  ఆ రోజులు తలుచుకుంటే ఇప్పటికీ నా గుండె తరుక్కుపోతూ వుంటుంది. నా ఓపిక పూర్తిగా చచ్చిపోయేదాకా అల్లాగే ఉద్యోగం కోసం నిరీక్షించాను. కాని నాకు ఉద్యోగం రాలేదు. మా కుటుంబానికి నేనొక అదనపు భారాన్ని మాత్రమే అని నిక్కచ్చిగా ఋజువైపోయాక–ఆత్మహత్య చేసుకోవాలన్న కోరిక మనసులో ఏమూలో ఉద్భవించి, నా అంతరాత్మను పీడించడం మొదలుపెట్టింది.  ఆ కోరిక దినదినానికీ మరీ బలపడసాగింది. ఒక రాత్రి ఊరికి దూరంగా పోయి ఎత్తుగా వున్న రైలు పట్టాల దాకా వెళ్ళాను. నన్ను అర్థరహితంగా పుట్టించినందుకు, ఇంతవరకు వ్యర్థంగా బతికించినందుకు భగవంతుడిని తిట్టుకున్నాను.  మరుజన్మలోనైనా పదిమందికీ ఉపయోగపడే బతుకునిమ్మని మనసారా ప్రార్థించుకుని రైలు పట్టాలమీద తల పెట్టుకుని పడుకున్నాను. దూరాన్నుంచి రైలుకూత వినిపించింది. రాను రాను రైలు దగ్గరవుతున్న చప్పుడు! నేను నిశ్చలంగా అలాగే పడుకున్నాను. మరికొద్ది క్షణాల్లో నా జీవితం అంతం కాబోతోంది. కాని—– ఉన్నట్లుండి నా కాళ్ళమీద నుంచి ఒక పాము జర జరా పాకుతోందని గమనించాను. చచ్చిపోవాలనుకుంటున్నప్పటికీ, అసంకల్పితంగా కలిగిన ఉద్వేగంలో కాళ్ళు విదిలించి దిగ్గున లేవబోయాను.  కాని కాలు జారి నేను దొర్లుకుంటూ పట్టాల మీదనుండి ముళ్ళకంపల్లోకి వెళ్ళి పడిపోయాను.  నా ఒళ్ళు చీరుకుపోయింది.  భరించలేని బాధతో కాలు మెదపలేక పోతున్నాను.  చావు రాలేదు సరికదా, అవిటివాడినైపోయానని దుఖం ముంచుకొచ్చింది.  జీవితమంతా అవిటివాడిగా బతకాలేమో అని ఏడిచేసాను.  ఎంత ప్రయత్నం చేసినా లేవలేకపోయాను.  కాలు అస్సలు స్వాధీనంలో లేదు.  భరించలేని నరకయాతన! ఆ బాధలో నాకు స్పృహ తప్పింది. మళ్ళీ నాకు తెలివి వచ్చేసరికి, నా ఇంట్లో మంచం మీద నేనున్నాను.  చుట్టూ నా తల్లి, తండ్రి, అక్కయ్యలు ఆదుర్దాగా నా మొహంలోకి చూస్తున్నారు.  నేను చెయ్యబోయిన అఘాయిత్యం తలుచుకునేసరికి సిగ్గేసింది.  వెక్కి వెక్కి ఏడుస్తూండగానే నాకు మళ్ళీ స్పృహ తప్పింది. కాని ఆరోజు సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర్ఫస్వామే నన్ను చావునించి తప్పించాడు!’ లావా పక్కున నవ్వాడు. రామదాసు వారించాడు.  ‘ అల్లా నవ్వకు.  నా కాలు పోయిందనీ, అవిటివాడినైపోయాననీ ఆ రోజున ఏడిచాను. కాని నా కాలు మడతపడడమే గాని, ఏ ప్రమాదమూ జరగలేదు. రెండు రోజుల్లో మామూలుగా లేచి తిరిగేసాను. మూడవరోజున నాకు టీచరు ఉద్యోగం వచ్చినట్లుగా పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి! తలుచుకుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది.  నాలుగురోజుల వ్యవధిలో నా జీవితంలో ఎన్ని మార్పులు!  ఇదంతా నా ప్రయత్నం వల్లే జరిగిందని ఎల్లా అనుకోను?  చచ్చిపోవలసిన వాడిని, గమ్మత్తుగా బతికి బట్ట కట్టడం, ఎన్నేళ్ళుగానో ఎదురు చూసినా రాని ఉద్యోగం అకస్మాత్తుగా రావడం–ఇదంతా భగవంతుడి అనుగ్రహం కాక మరేమిటి? ఆ తర్వాత బి.ఏ. ప్రైవేటుగా చేసాను.  తర్వాత ఎమ్.ఏ. పాసయ్యాను.  తర్వాత డబుల్ ఎమ్.ఏ. కూడా చేసాను.  ఈ రోజున ఈ నరసాపురంలో లెక్చరరుగా స్థిరపడ్డాను.  ఇదంతా నా మానవ ప్రయత్నం అంటే ఒప్పుకుంటాను.  కాని ఆరోజున రావలసిన మరణం రాకపోవడంలో నా ప్రయత్నం ఏముంది?  ఇప్పటికైనా నువ్వు భగవంతుడు వున్నాడని నమ్మి తీరాలిరా లావా1′ లావా గంభీరంగా అన్నాడు, ‘ దాసూ!  అల్లాగే నేను కూడా ఒక కథ చెబుతాను విను.’ రామదాసు లోపలికి వెళ్ళి పొయ్యి మీద కాగుతున్న పాలు రెండు గ్లాసులలో పోసి, కాఫీ తయారు చేసి, ఒక గ్లాసు లావాకిచ్చి, మరో గ్లాసులోని కాఫీ తను తాగుతూ లావా చెప్పేది వినసాగాడు. లావా కాఫీ తాగుతూ కొనసాగించాడు. ‘ నా స్నేహితుడొకడున్నాడు.  లుఛ్ఛా డాక్టరు!  డబ్బు సంపాదనే వాడి ధ్యేయం.  అందుకోసం ఎంత నైచ్యానికైనా ఒడిగడతాడు. ఒక కుర్రవాడికి మలేరియా వస్తే వాడి నర్సింగ్ హోమ్ లో చేర్చారు.  వాడు వారం రోజుల పాటు ఆ కుర్రాడికి ఇంజక్షన్లు పొడిచాడు.  వాడికి తగ్గలేదు సరికదా, మరింత ఎక్కువైంది. ఆ డాక్టరు కూడా పెదవి విరిచేసాడు. ఆ కుర్రాడి తలిదండ్రులు ఏడుస్తూ శివాలయానికి వెళ్ళి, మహామృత్యుంజయ జపం చేయించి, ఆ విభూతి తీసుకు వచ్చి వాడి ఒంటినిండా పులిమారు.  రెండోరోజు నించే వాడి జ్వరం తగ్గుముఖం పట్టింది!  మరో ఐదురోజులలో వాడికి పూర్తిగా నయమైపోయింది. ఈరోజుకీ వాళ్ళు ప్రతి సోమవారం విధిగా శివాలయానికి వెళ్ళి, శివుడికి అభిషేకం, అమ్మవారికి అర్చన చేయించి వస్తూ వుంటారు.’ రామదాసు ఆనందంగా అన్నాడు, ‘ చూసావా మరి?’ లావా అన్నాడు, ‘ ఆగు, నేను చెప్పేది పూర్తిగా విను.  అసలు జరిగిందేమిటో తెలుసా?  ఆ డాక్టరు వాడికి నాలుగు రోజులు ఉత్తుత్తి ఇంజక్షన్లిచ్చాడు.  కావాలనే ఆ కుర్రాడింక బతకడని గాబరా పెట్టేసాడు.  ఐదోరోజున క్వినైను మాత్రలు మింగించాడు.  పదిరోజులు ఆస్పత్రిలో ఉన్నందుకు గది అద్దె ఐదువేలు, రకరకాల పరీక్షలకైన ఖర్చు నాలుగు వేలు, మందుల ఖర్చు మూడు వేలు, వాడి ఫీజు కింద కేవలం ఐదువందలు, వెరసి మొత్తం పన్నెండు వేల ఐదు వందల రూపాయలకి బిల్లు చేసాడు. ఆ కుర్రాడి తలిదండ్రులు మృత్యుముఖం లోంచి తమ కొడుకుని బలవంతంగా లాక్కు వచ్చినందుకు, ఆ ఫీజుతో బాటు మరో ఐదువేల నూట పదహార్లు, బట్టలు చదివించుకుని, ఆ డాక్టరుకి పాదాభివందనం చేసుకుని ఇంటికి పోయారు.’ ‘ ఒరేయి లావా!  నా అనుభవాలకి, ఆ డాక్టరు డబ్బు వ్యామోహంలో పడి చేసిన పనికి ఏ విధమైన సంబంధం లేదు.  నాది అలౌకికమైన అనుభవం.  నువ్వు చెప్పినది ఇహలోకంలో జరుగుతున్న మోసాలలో ఒకటి.  సమాజంలో జరిగే మోసాలకి, అన్యాయాలకి భగవంతుడ్ని బాధ్యుడిగా చేయడం సబబు కాదు కదా?’ ‘ దాసూ!  నేను చెప్పినది నువ్వు సరిగ్గా అనలైజ్ చెయ్యలేదు.  నేను మాట్లాడేది ఆ డాక్టరు చేసిన మోసం గురించి కాదు.  కేవలం శివాలయంలో అర్చన చేయించి, ఆ విభూతి తీసుకువచ్చి తమ కుర్రాడికి పులమగానే అతడి రోగం నయమైపోయిందని నమ్మిన ఆ అమాయకపు తలిదండ్రుల గురించి.  హోరుగాలిలో దీపం పెట్టి, ‘ దేముడా!  నీ మహత్యం చూపించు.’  అన్నంత మాత్రాన ఆ దీపం ఆరిపోకుండా వుండదు.  అలాగే రోగం వస్తే గుళ్ళచుట్టూ ప్రదక్షిణలు చేసినంత మాత్రాన ఆ రోగం నయమైపోదు.  వైద్యపరమైన చికిత్సతో మాత్రమే రోగాలు నయమవుతాయి.’ ‘ నువ్వు చెప్పేది నిజమే.  మన ప్రయత్నాలు మనం చేస్తూ, ఆ పైన భగవంతుడి మీద భారం వేయాలి.  అంతేగాని, చేతులు ముడుచుకు కూర్చుని, భగవంతుడే అన్నీ చూసుకుంటాడు అనుకోవడం సరికాదు.  భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అదే శలవిచ్చాడు.’ ‘ ఆయనేం చెప్పాడో నువ్వు పక్కన పెట్టు.  మన ప్రయత్నం మనం సవ్యంగా చేసినప్పుడు ఫలితాలు వాటంతటవే వస్తాయిగా?  ఇంక దేముళ్ళని, బాబాలని, స్వాములని నమ్ముకోవడం ఎందుకు, మూర్ఖత్వం కాకపోతే?’ ‘ ఒరేయ్ లావా!  ఎడ్డెమంటే తెడ్డెమనకురా.’ ‘ కాదు దాసూ!  నన్ను సరిగ్గా అర్థం చేసుకో.  కాకతాళీయంగా జరిగిన వాటిని భగవంతుడి లీలలుగా భావించి మూర్ఖంగా ప్రవర్తించకు.  ఇంకోటడుగుతాను.  ఏమనుకోకు.  నీమీద ఆ భగవంతుడికి అంత అనుగ్రహమే వుంటే, పెళ్ళై రెండేళ్ళు కూడా తిరగకుండానే నీ భార్య ఎందుకు చచ్చిపోయింది?  కనీసం నీకంటూ ఒక్క సుపుత్రుడినైనా ఆ దేముడు ప్రసాదించలేదేం?  దీనికి ఆ భగవంతుడిని తప్పు పట్టాలని నీకనిపించలేదా?’ రామదాసుకి ఒక్కసారిగా ఆ సంఘటన గుర్తుకు వచ్చింది.  సంప్రదాయమైన కుటుంబంలోంచి అపరంజి బొమ్మలాంటి అందమైన యువతి తనకి భార్యగా వచ్చింది.  అంతా తన అదృష్టమని, ఆ భగవంతుడి అనుగ్రహమని తనెంతో మురిసిపోయాడు.  పెళ్ళయి ఏడాది కూడా తిరగకుండానే తన భార్య గర్భం ధరించింది.  తనంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఇంకెవరూ వుండరని తనెంతో ఆనందపడ్డాడు. కాని, తన దురదృష్టం!  పూర్వజన్మలో తను తెలియక చేసిన పాపఫలితం ఐవుండవచ్చు.  తన భార్య పురిటిలో బిడ్డను ప్రసవించలేక తనువు చాలించింది.  కనీసం తనకి బిడ్డ కూడా దక్కలేదు. రామదాసు గట్టిగా నిట్టూర్చి అన్నాడు, ‘ లావా1  ఎప్పుడో నేను విన్న గేయం నీకు కొద్దిగా వినిపిస్తాను, వింటావా?’ ‘ ఏమిటది?’
‘అహరహం ఇహంలో హాలాహలం! హరా! హరా! అనుకొంటే పీయూషం!ఇహం పైన వ్యామోహం వదులుకుంటే, అహం వీడి నిను నీవు తెలుసుకుంటే, అనుక్షణం ఉల్లాసం! ఇహమందే కైలాసం!!’మూడు పుండ్రములు ధరియించు మూడు తాపములు హరియించు భుజగభూషణుని నుతియించు ఆరు వైరులను వధియించు నగజాధీశుని శరణుగొను సంచిత పాపం హరణమనుశివా శివా అని స్మరియించు హృదయం పావనమొనరించు నీలకంఠుని ధ్యానించు లీలగ మోక్షం లభియించు భూతంలో నీవేమి చేసినా భూతనాథుడే భావి కాచెనులావా నవ్వాడు.  ‘ హ..హ..హ…  బాగుందిరా.  నీకు ఇహలోకం మీద వ్యామోహం వుండకూడదని అమాయకురాలైన నీ భార్యని ఆ శివుడు బలి తీసుకున్నాడు.  నీలోని అహాన్ని చంపేసి, నిన్నిల్లా జీవఛ్ఛవంగా మార్చేసాడు.’
రామదాసు విరక్తిగా అన్నాడు, ‘ వాసాంసి జీర్ణాని యథా విహాయ…’లావాకి ఒళ్ళు మండింది.  ఇంత చెప్పినా అర్థం చేసుకోలేని మూర్ఖుణ్ణి ఏమనాలి?  కోపంగా రామదాసుకి అడ్డు తగులుతూ అరిచాడు.  ‘ ఆపు, ఆపు!  ఒరేయ్ దాసూ!  అసలు ‘ భగవంతుడు ‘ అంటే అర్థం ఏమిటిరా?” సర్వాంతర్యామి!  ఇందు గలడందు లేడని సందేహము వలదు….’‘ ఔనౌను.  చక్రి సర్వోపగతుండు.  నేను చిన్నప్పుడు చదువుకున్న పద్యమేలే.  మళ్ళీ నువ్వు అరమోడ్పు కళ్ళతో అదంతా చదవక్కర్లేదు.  నేను అడిగింది, ‘ భగవంతుడు ‘ అన్న పదానికి వ్యుత్పత్యర్థం ఏమిటని.’రామదాసు బాధగా అన్నాడు, ‘ లావా!’లావా పరిహాసంగా అన్నాడు, ‘ భగవంతుడు అంటే భగము కలవాడు అనేగా అర్థం?  ఒరేయ్ దాసూ!  భగము అంటే ఏమిటిరా?   అసలు భగవంతుడు ఆడదా లేక మగవాడా?’రామదాసు మ్లానంగా అన్నాడు, ‘ నీ ఆలోచనలు ఆ క్షుద్రమైన పరిధి దాటి ఎదరకు వెళ్ళవురా.
    ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసశ్శ్రియ: జ్ఞాన వైరాగ్య యోశ్చైవ షణ్ణాం వర్గో భగస్మృత:
          అన్నారు.  అంటే ఐశ్వర్యము, వీరత్వము, యశస్సు మొదలైన పైన చెప్పిన ఆరు గుణాలని కలిపి ‘ భగము ‘ అన్నారు.  ఆ ఆరు గుణాలని కలిగి వున్నవాడు కనుకనే పరమాత్మను ‘ భగవంతుడు ‘ అన్నారు.లావా కంగు తిన్నాడు.  ‘ ఓహో!  భగము అన్నదానికి ఇంత అర్థం వుందా!’ అనుకుని అప్పటికి మౌనంగా వుండిపోయాడు.
                                                                                                             **********************
అందరూ ఊరు మొదట్లో ఆత్రంగా అంతర్యామి గారి రాక కోసం నిరీక్షిస్తున్నారు. నాలుగు చిన్న కార్లు అల్లంత దూరాన కనిపించగానే అందరిలోనూ ఉత్సాహం ఇనుమడించింది ,క్షణాల్లో అక్కడి వాతావరణమే పవిత్రముగా మారిపోయింది
వేదవేదాంగ పరాయణులైన పండిత ప్రకండులు ఉఛ్చ స్వరాలతో వేదాలు చదువుతున్నారు.
నాదస్వర విద్వాంసులు సామరాగం వాయిస్తుంటే ,డోలు విద్వాంసులు లయ విన్యాసం చూపిస్తున్నారు .
అంతర్యామి గారు తను వేసుకున్న బంగారు జరీ శాలువాను సవరించుకుంటూ,మంత్ర జపం చేసుకుంటూ నెమ్మదిగా కారులోంచి కిందకు  దిగారు.
ఆహా! ఎంత మనోహరమైన రూపము వారిది! చెవులకు స్వర్ణ కుండలాలు,చేతులకు బంగారు కంకణాలు! మెడలో బంగారముతో చుట్టబడిన రుద్రాక్షలు!
అందరూ దుమ్ము, ధూళి తో ఉన్న కంకర రోడ్డు అని కూడా చూడకుండా ,నేల మీద సాష్టాంగ పడి వారికి ప్రణామాలు ఆచరించి తమ బ్రతుకుల్ని ధన్యం చేసుకున్నారు.
పురోహితులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలుకుతూ ,మంత్రోఛ్చారణల  మధ్య వారిని సగౌరవం గా రామదాసు గారి ఇంటిదాకా తీసుకు వచ్చారు.
                                                                                                           ***************************
అంతర్యామి గారి శిష్యులు ముందు గానే రామదాసు గారికి, మిగిలిన కార్య నిర్వాహక వర్గానికీ చెయ్యవలసిన కార్యక్రమాల గురించి వివరించి వుంచారు.
అంతర్యామి గారు రామదాసు గారి ఇంట్లోకి అడుగు పెడుతూండగానే నూటెనిమిది కొబ్బరి కాయలు పగిలాయి!
వారిని నిలువెత్తు పూలమాలలతో అలంకరించారు తరువాత నలుగురు ముత్తైదువలు వెండిపళ్ళెంలో హారతి కర్పూరపు ముద్దను వెలిగించి వారికి హారతి ఇచ్చారు .
. అంతర్యామి గారు అభయహస్త ముద్ర తో అందరినీ ఆశీర్వదిస్తూ లోనికి అడుగుపెట్టారు.తరువాత హాలులో ముందే ఏర్పాటు చేసిన వేదిక మీద తను తెచ్చుకున్న బంగారు దేవతా విగ్రహాలను ప్రతిష్టించారు  ధూప దీప నైవేద్యాలతో అరగంటలో ఆ విగ్రహాలకు అర్చన ముగించారు.
అంతర్యామి గారి  ముఖ్య శిష్యులు  అయిన భగవంతం గారు అందరికీ పచ్చకర్పూరం ,తులసి వాసనలతో ఘుమ ఘుమ లాడుతున్న తీర్ధాన్ని భక్తులందరికీ ఇచ్చారు .తరువాత అందరినీ ఉద్దేశించి ఈ విధముగా ప్రసంగించారు .
‘అయ్యలారా! అమ్మలారా! స్వామి వారు ప్రయాణములో అలిసిపోయి వచ్చారు.ఈ రోజుకు ఇంక కార్యక్రమాలేవీ ఉండవు. రేపటినుంచి వరసగా తొమ్మిది రోజులు ఉదయాస్తమాన వేళలలో ఆంజనేయస్వామి కి సహస్ర నామార్చనలు,అష్టొత్తర  శతనామార్చనలు ,బాలభోగాలూ వుంటాయి. ఎవరైనా తమ గోత్రనామాలతో అర్చనలు చేయించుకోవాలనుకుంటే ఇక్కడ చీట్లు వ్రాయించుకోవచ్చును. సహస్ర నామార్చనకు అయిదువేలు ,అష్టోత్తర శతనామార్చనకు  మూడు వేలు ,బాల భోగానికి రెండు వేలు ,హారతికి వెయ్యి రూపాయలు సమర్పించుకోవలసి ఉంటుంది .ఈ ద్రవ్యం యావత్తూ ఆ శ్రీ రామచంద్రమూర్తి పాదదాసులైనటువంటి ఆంజనేయస్వామి వారి సేవ నిమిత్తం మాత్రమే వినియోగం అవుతుందని మనవి చేసుకుంటున్నాము.
ఇక , మధ్యాహ్నం   రెండు గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకూ భక్తుల వ్యక్తిగతమైన సమస్యలకు స్వామి వారు సమాధానములిస్తారు .ఐతే తన్నిమిత్తం అంతర్యామి వారికి ఆ ఆంజనేయస్వామి వారి నుండి ఆదేశం లభించవలసి ఉంటుంది. భక్తుల అదృష్టాన్ని బట్టీ స్వామి వారికి భగవంతుని ఆదేశం లభిస్తూ ఉంటుంది.
ఇక ప్రశ్న అడగదలచుకున్న వారు  ఒక చీటీ పై తమ గోత్రనామాలు వ్రాసి ,ప్రశ్న వ్రాసి ,ఆ చీటీ తో కలిపి కేవలమూ రెండు వందల రూపాయలు మాత్రం సమర్పించుకోవాల్సి ఉంటుంది .మానవసేవ లో మాధవ సేవ ఉంటుందని ,అందువల్ల మానవ సేవ కూడా చెయ్యవలసిందని ఆ వాయునందనులైన ఆంజనేయస్వామి వారు స్వయముగా అంతర్యామి వారిని ఆదేశించినందువల్ల, వారు ఈ ప్రజా సేవకు పూనుకున్నారు.
ఇహ ఈ వేళకి అందరూ స్వామివారికి పాదాభివందనములు చేసుకుని తమ తమ ఇళ్ళకు దయచేయవలసిందిగా కోరుతున్నాము ‘.
కొద్దిక్షణాల్లో ఆ ఇంట్లో సద్దుమణిగింది , రామదాసు, లావా ,ఊరి ప్రముఖులు పదిమంది మాత్రమే మిగిలారు .మిగిలిన అందరూ అంతర్యామి గారికి పాదాభివందనాలు చేసి, అర్చనలకు చీటీలు వ్రాయించుకుని వెళ్ళిపొయారు.
అంతర్యామి గారు హాలు లో కుషన్ సోఫా పై దర్భాసనం పరుచుకుని దానిపై ఆశీనులై వున్నారు  .
నరసాపురం టౌను మునిసిపల్ చైర్మన్ గారైన శివరామయ్యగారన్నారు ‘అదృష్టవంతుడవయ్యా  రామదాసూ! మేం కోటీశ్వరులం ఎంతమందిమి ప్రయత్నించినా దొరకని భాగ్యం నీకు లభించింది .సాక్షాత్తూ ఆంజనేయస్వామి వారు నీ పెంకుటింట్లో వెలిసారు. అదిన్నీ శ్రీకృష్ణుడికి కుచేలుడే ప్రేమ పాత్రుడైనట్టూ !’
అంతర్యామి గారు చిరునవ్వు నవ్వి అన్నారు ‘అంతా భగవదనుగ్రహం వల్లను, భగవాదేశం మీదనూ మాత్రమే జరుగుతుంది. నా శిష్యులు ముందర ఈ ఊరు వచ్చినప్పుడు వీరి ఇల్లు చూడగానే అలౌకికమైన అనుభూతికి లోనయ్యారు .ఈ ఇంట్లోని పవిత్ర వాతావరణం  మమ్మల్ని ఇక్కడకు రప్పించడానికి కారణమై ఉండవచ్చు , లేక క్రితం జన్మలో కూడా ఈ రామదాసుగారు ఆంజనేయ స్వామిని అకుంఠిత దీక్షతో ఉపాసించి ఉండవచ్చు.
అందరూ రామదాసు కేసి ఈర్ష్యగా చూశారు .
లావా అంతర్యామి గారినే రెప్పవాల్చకుండా చూస్తున్నాడు .
శివ కామయ్యగారన్నారు ‘స్వామీ ! తమరన్నది అక్షరాలా నిజం ! ఏ క్షణాన ఎవరి మీద భగవంతుడికి అనుగ్రహం కలుగుతుందో ఎవరికీ తెలియదు. ఉదాహరణకి, వేమన గారి మాటేమిటి చెప్పండి? అభిరాముడు ఎన్నో సంవత్సరాల నుంచి గురు శుశ్రూష చేస్తున్నా లభించని బ్రహ్మజ్ఞానం అయాచితం గా వేమనకు లభించింది ‘.
భగవంతం గారు అన్నారు ‘మీరన్నది నిజమేనండీ’.
శివకామయ్య గారు మళ్ళీ అన్నారు ‘ నా చిన్నతనములో ఒక పదేళ్ళ కుర్రాడిని చూశాను. అతడు ప్రతివాళ్ళకీ ముఖం చూసి  భూత భవిష్యద్వర్తమానాలు అవలీలగా చెప్పేసేవాడు . ఆ కుర్రవాడి తండ్రిని ఆ అద్భుతానికి కారణమడిగాను . ఆయన చెప్పింది వింటే నాకు చాలా ఆశ్చర్యమేసింది .  ఒక సాయంత్రం ఆ కుర్రవాడు బడినించి ఇంటికి వస్తూ జేబులో ఉన్న చాక్లెట్టు తీసి నోట్లో వేసుకోబొయ్యాడుట ! అదే సమయానికి రోడ్డు పక్కన మాసిన గడ్డం తోనూ, గోచి గుడ్డ తోనూ ఉన్న ఒక బిచ్చగాడు కనిపించాడుట,ఈ కుర్రవాడికి జాలి కలిగి ఆ చాక్లేట్టుని ఆ బిచ్చగాడి చేతిలో వేసాడుట .వెంటనే ఆ బిచ్చగాడు ఆనందం గా ఆ కుర్రవాడిని దగ్గరకు తీసుకుని మంత్రోపదేశం చేసాడట! అప్పటినుంచీ ఆ కుర్రవాడికి ఎక్కడలేనీ అతీంద్రియ శక్తులూ లభించాయిట!’
అందరూ ఆయన చెప్పేది ఆశ్చర్యముగా వింటున్నారు…
మళ్ళీ శివకామయ్యగారన్నారు ‘ఆ తర్వాత మా ఊరి వాళ్ళు ఆ బిచ్చగాడి కోసం ఊరంతా గాలించారు.నేనైతే ఎప్పుడూ జేబునిండా ఇన్ని చాక్లేట్ట్లు పోసుకుని ఊరంతా తెగ తిరిగాను. కానీ అతడు ఆ తర్వాత ఎప్పుడూ ఎవరికీ కనిపించలేదు.’
భగవంతంగారన్నారు ‘ అంత వరకెందుకండీ? స్వామి వారి జీవితమే భగవంతుడి లీలలకి చక్కని నిదర్శనం! వారెక్కడో ఊరి చివరలో ఒక చిన్న పాక వేసుకుని అందులో నివసించసాగారు .ఐతే వారికి రోజూ అర్ధరాత్రి ఒక ఆకారం లీలగా కనిపించసాగింది. స్వామి వారు మొదట్లో ఎవరో దొంగ అనుకున్నారు . దొంగ అయితే తన దగ్గర ఏముందని తన ఇంటి చుట్టూ తచ్చట్లాడాలి అని  సమాధాన పడ్డారు. తరువాత ఎవరైనా చనిపోయిన వారి ఆత్మేమోనని అనుమాన పడ్డారు.
ఒక రాత్రి ఆ విషయాన్ని ఏమైనా సరే తేల్చుకోవాలని తెగించి ఆ నీడను వెన్నాడారు. కానీ ఆ నీడ చూస్తుండగానేమాయమైంది. ఆ తర్వాత చాలా రాత్రులు ఆయన ఆ నీడను వెంటాడటం, ఆ నీడ ఉన్నట్టుండి అంతర్ధానమవటం కొనసాగింది
ఒక నాడు వేకువ ఝామున స్వామి వారికి స్వప్నం లో వాయుసూనుడు సాక్షాత్కరించారు! వారు చెప్పిన విషయాలు అబ్బుర పరచేవిగా ఉన్నాయి!
స్వామి వారు ఇల్లు కట్టుకున్న ప్రదేశము లో చోళుల కాలం నాటి ఆంజనేయస్వామి ఆలయం వుందిట.ఆ ప్రదేశమంతా చోళరాజధానిట! చోళులు సరిగ్గా ఆ ప్రదేశం లోనే ఆలయాన్ని నిర్మించారుట. ఆ ప్రదేశాన్ని తవ్వితే అడుగున ఉన్న మందిరం బైట పడుతుందట .అందుకని తనకి అక్కడే స్వామివారి ఇంట్లోని ఈశాన్య భాగములో చిన్న ఆలయం నిర్మించమని హనుమంతుడు సెలవిచ్చాడట! అందుకే అంతర్యామి గారు వారి ఇంట్లో చిన్న ఆలయాన్ని నిర్మించారు. అక్కడి స్వామిని దర్శించుకుంటే భక్తులకు సకల శుభాలూ కలుగుతాయనడంలో ఏ మాత్రమూ సందేహం లేదు ‘.
అంతర్యామి గారు మందహాసంతో అన్నారు .’ ఆ స్థలం కావాలని నేనే ఎందుకు కొన్నానో,వారి దర్శనం నాకే ఎందుకు లభించిందో తలుచుకుంటే ఇప్పటికీ…..’
బయట కారాగిన చప్పుడు అయింది.
రామదాసు గారు లావా ని ఆ వచ్చిన వారిని గౌరవించమని బయటకు పంపారు.
లావా బైటకు వెళ్ళాడు.
‘…….నాకు వొళ్ళు గగుర్పొడుస్తుంది! వారెప్పుడు నాకు దర్శనమిచ్చినా……’
చూస్తూ చూస్తూ ఉండంగానే అంతర్యామి గారి మొహం ఎర్రగా మారిపోయింది. కండరాలు బిగుసుకున్నాయి. శరీరమంతా ఉద్రేకంతో ఊగిపోసాగింది! మూతి పొడుచుకు వచ్చింది! చేయి గదను పట్టుకున్నట్టు గా పైకి లేచింది! ఆయన తీవ్రమైన ఆవేశంతో రొప్ప సాగారు.
వారి వొంటి మీదకు ఆంజనేయస్వామి వారు వచ్చారు.
వెంటనే వారి ముఖ్యశిష్యులైన భగవంతం గారు కొబ్బరి కాయ కొట్టి , వారికి హారతి ఇచ్చాడు.
క్షణం…..రెండు క్షణాలు గడిచాయి!
అంతర్యామి గారి కళ్ళు మూత పడిపోయాయి.
ఆయన బిగుసుకున్న కండరాలు తిరిగి మామూలుగా మారసాగాయి. మనిషి అలసట తో వడలిన తోటకూర కాడలా మారిపొయాడు. ఉన్నట్టుండి మెరుపు వేగముతో లేచి, గాలి లోకి చేయి చాపి ,’స్వామీ!’ అని అరిచాడు! ఏదో దొరికినట్ట్లుగా అంది పుచ్చుకున్నాడు . ఆయన కళ్ళవెంట అశృవులు ధారాపాతం గా వర్షించ సాగాయి. రామదాసు తో ఆనందంగా అన్నాడు.
‘నీ పంట పండిదయ్యా రామదాసూ! నీకు స్వామి వారి అనుగ్రహం లభించింది! ఇదుగో,ఇది నీకు ప్రసాదించారు!’
రామదాసు గారు భక్తి పారవశ్యం తో ,కళ్ళ వెంట నీళ్ళు జల జల రాలుతుండగా ఆ విగ్రహాన్ని అందుకుని కళ్ళకద్దుకుని,అక్కడున్న అందరికీ ఆ విగ్రహాన్ని చూపించారు.
అందరూ ఆయనని మనసారా అభినందించారు.
అంతలో అక్కడకు లావా వచ్చాడు.
రామదాసు ఆనందంగా లావాని కౌగిలించుకుని ‘మహత్తర క్షణాల్లో నువ్వు లేకుండా పోయావురా. ఇదుగో ,స్వామి వారు నాకు అనుగ్రహించిన విగ్రహం!’ అంటూ లావా కు కూడా ఆ విగ్రహాన్ని చూపాడు.
లావా ఆ విగ్రహాన్ని చేతిలోకి తీసుకుని పరీక్షగా చూసి చిరునవ్వుతో తిరిగి రామదాసుకు ఇచ్చేశాడు.
                                                                                                      ******      **************     *******
అందరూ వెళ్ళిపొయ్యారు .
అంతర్యామి గారు విశ్రాంతి తీసుకుంటున్నారు.
లావా రామదాసుతో మళ్ళీ వాదనకు దిగాడు.
 ‘దాసూ! ఆ సమయాన నేనుండవలసినది. నీ మీద ఆంజనేయస్వామికి అంత వాత్సల్యమే ఉంటే ఆ కంచుముక్కని విసిరి కొట్టటమెందుకు? బంగారు ముద్దనే ప్రసాదించవచ్చుగా?
రామదాసు అన్నాడు ,’నీకు నిదర్శనాన్ని చూపించవలసిన ఆగత్యం ఆ పరమాత్మకి లేదురా లావా , ఆ నిదర్శనాన్ని చూసే అర్హత కూడా నీకు లేదు . పోతే ,నాకు ఆ పరమాత్మ నిదర్శనం గా ఆ విగ్రహాన్ని ఇవ్వలేదు .అనుగ్రహాన్ని మాత్రమే ప్రసాదించారూ.
                                                                                               *********************************************
గార్డు ఈల వేసి పచ్చ జండా చూపించాడు.
రైలు నెమ్మదిగా కదలసాగింది.
అంతలో ఒకామె ప్లాట్ ఫారం మీద పరిగెట్టుకుంటూ రైలునందుకోవటానికి ప్రయత్నించసాగింది.ఒక ఫస్త్ క్లాస్ కంపార్ట్ మెంట్ అందుబాటు లోకి వచ్చేసరికి ,ఆలోచించకుండా అతి కష్టం మీద ఊచ పట్టుకుని లోపలికి గెంతింది.ఆయాస పడుతూ సీట్లో కూలబడి సేద తీర్చుకోసాగింది.
తనెక్కిన కంపార్ట్ మెంట్ ఫస్ట్ క్లాస్ అన్న ధ్యాస కూడా లేదామెకి.
తను టికెట్టు కొనలేదే అన్న చింత కూడా ఆమె మొహములో కనిపించట్లేదు .
ఆ భోగీ లో వేరే ఎవ్వరూ లేరన్న విషయాన్ని కూడా ఆమే గమనించలేదు.
నిరాసక్తం గా  అలాగే కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోయింది.
రైలు వేగాన్ని పుంజుకుంది.
ఆమె నెమ్మదిగా తేరుకుంది. కళ్ళు తెరిచి కొద్ది క్షణాలు కిటికీ లోంచి కదులుతున్న దృశ్యాల కేసి చూస్తూ వుండిపోయింది.
ఆమె అందానికి నిర్వచనం లా ఉంది. పాల మీగడను,మలయ సమీరాన్ని ,కొండల మధ్య నించి ఉదయిస్తున్న సూర్యుడిని , ఆమని లోని పచ్చటి ప్రకృతిని కలబోసి ,సృష్టికర్త కల్పించిన మానవ రూపమా అన్నంత మనోహరం గా ఉంది.
నీరెండ ఆమె కపోలాల్ని తాకి పులకిస్తున్నది!
చల్లని గాలి ఆమె శరీరాన్ని ఆత్రముగా అలుముకుంటున్నది !
ఐనా ఆ శరీరం తనది కాదన్నట్టు, ‘తను ‘ అంటే ఆ శరీరం కాని మరేదో పదార్ధమైనట్టు — ఒక అలౌకికమైన భావనతో వెనక్కి వాలి కళ్ళుమూసుకుంది. తను అందగత్తెనన్న ధ్యాస కూడా ఆమెకు ఉన్నట్లు లేదు.
‘టికెట్ ప్లీజ్’!
‘……..’
మేడం! టికెట్ ప్లీజ్”!
వెన్నెల విరిసినట్లుగా ఆమె కళ్ళు తెరిచి రెప్పలల్లార్చింది.
మేఘాలలుముకున్నట్లుగా తిరిగి రెప్పలు మూసుకుంది.
కోలవెన్ను తిలక్ లో కొద్దిగా గుండె ధైర్యం, ఎంతోగా మగతనం ప్రవేశించాయి!  అతడికున్న బలహీనతలు రెండే రెండు. మనీ,మగువ!
అతడు చిన్నప్పుడు అతి పేదరికాన్ని అనుభవించాడు. అదృష్టం బాగుండి టికెట్ కలెక్టర్ గా మంచి ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు.ఇది అతడికి చాలా అనువైన ఉద్యోగం. హైదరాబాదులో తను కట్టుకుంటున్న భవంతికి ఆర్ధికసాయాన్ని ప్రజల నుంచి అందజేసేది ఈ ఉద్యోగం. అందుకని ప్రతి రోజూ ఇంతకు తక్కువ సంపాదించకూడదని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, ఆ లక్ష్యాన్ని ఛేదించే వరకూ కిందా మీదా పడే రకం అతడు.
తిలక్ భార్యకి,వేళా పాళా లేకుండా డ్యూటీలు చేసే తన భర్త అంటే చిరాకు. నైట్ డ్యూటీ చేసి వచ్చి ,పట్టపగలు తనని శృంగారం అనే రొంపిలోకి దింపుదామని అతడు పడే తాపత్రయం చూస్తే ఆమెకు ఒళ్ళుమంట . వాళ్ళిద్దరి మధ్యా భావసారూప్యం కూడా పూర్తిగా కొరవడింది.అందువల్ల వారి కాపురం మూడు ఉప్పురాళ్ళూ,నాలుగు మిరపకాయల మంటలో వేసినట్టు గా గొడ్రుగానూ,ఘాటు గానూ సాగుతోంది.ఐనా తిలక్ కి బెంగ లేదు.  అతడు డ్యూటీ చేసేటప్పుడు చిల్లర తిరుగుళ్ళకి బాగా అలవాటు పడిన ప్రాణి.అందుకని అతడు నిర్దేశించుకున్న రెండో లక్ష్యం ,ప్రతి రోజూ ఎలగైనా కాస్త చిల్లరగా గడ్డి మెయ్యాలని.
తిలక్ కి రైలు భోగీలో ఆమె కనిపించగానే తను నిర్దేశించుకున్న రెండు లక్ష్యాలలో ఏదో ఒక లక్ష్యం నెరవేరబోతోందన్న నమ్మకం కలిగింది.
ఎగిరే సీతాకోకచిలుకను పట్టి, గోళ్ళతో సుతిమెత్తగా రెక్కలు తుంచుతున్నట్లు,ఆమె భుజం మీద చేయి వేసి,’ఇదుగో ,నిన్నే…..’ అన్నాడు.
యజ్ఞగుండం లో హోమద్రవ్యం  పడినట్లు ఒక్కసారిగా ఆమె కళ్ళు భగ్గున వెలిగాయి!
కానీ అంతలోనే ఆమె మొహం లో పూర్వపు నిరాశక్తత! భుజం  మీద నుంచి అతడి చేతిని తోలగించడానికి ప్రయత్నం కూడా చెయ్యలేదామె!
తిలక్ కి మరి కొంచెం ధైర్యం కలిగింది.
‘టికెట్ లేదా?’
‘………’ ఆమె కళ్ళు కిటికీ లోంచి ప్రకృతిని చూస్తూ….
‘కొనడానికి డబ్బు లేదా?’…. అతడు ఆమె పక్కన కూర్చుంటూ…..
‘…… ఆమె కళ్ళు శూన్యాన్ని చీలుస్తూ….
‘ఫర్వాలేదులే,కంగారు పడకు .’- అతడు మరికొంత చొరవ తీసుకోడానికి ప్రయత్నిస్తూ…..
‘…..’ ఆమె కళ్ళు శూన్యాన్ని,ఆ శూన్యం వెనుక ఆస్తికులు ఊహించుకునే జ్యోతి స్వరూపాన్ని శోధిస్తూ …..
‘ఇంకో అరగంట దాకా  ఏ స్టేషనూ రాదులే.’- అతడు మరికొంచెం దగ్గరకు జరిగి,భుజాల పైనుంచి చేతుల్ని కిందికి జారుస్తూ…..
ఆమె తల తిప్పి అతడికేసి నిర్వికారం గా ఒకే ఒక్క క్షణం చూసింది.
అతడి చేతులు అప్రయత్నంగా కిందకు జారిపోయాయి.
ఆమె తిరిగి కిటికీలోంచి శూన్యాన్ని ఛేదిస్తూ…..జ్యోతి స్వరూపాన్ని శోధిస్తూ……
‘ఎక్కడకెళ్ళాలి?’
ఆమె నెమ్మదిగా వినిపించీ  వినిపించనట్లుగా  చెప్పింది.
డబ్బులు లేక పోయినా ఫర్వాలేదులే.నేను మేనేజ్ చేస్తానుగా!’– జీవితం లో మొదటి సారి కన్యాకుమారి లోని సూర్యాస్తమయాన్నీ,చంద్రోదయాన్ని శారీరకముగా అనుభవించబోతున్న ఆత్రుత!
సన్నజాజులు పరిమళిస్తున్నట్లుగా ఆమెలో చిన్ననవ్వు!
నెమ్మదిగా అడిగాడు, ‘నీ పేరేమిటి?’
మలయ సమీరం లో జలతరంగ వాదన అతి దూరాన్నుంచి వినిపించింది!
‘ఆడది!’
తిలక్ ఆమె కేసి అయోమయం గా చూసాడు.
‘ఏమిటీ?’
సన్నగా హోరుగాలి మొదలయ్యింది !
‘ఆడది!’
‘అదేం పేరు?’  ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని తమకంగా నిమురుతూ అడిగాడు .
హోరుగాలి ప్రభంజనమయింది!
‘నాలో నువ్వు చూస్తున్నది ఆడతనాన్నేగా?’
'భలే జోకేశావే?' వెకిలిగా నవ్వుతూ-- అతడి చేతులు తిరిగి ఆమె భుజం పైకి, అక్కడి నించి కిందకి జారుతూ......
మేఘం ఉరిమింది.
'నన్ను విసిగించక వెళ్ళిపో కోతీ!'
అసంకల్పితం గా అతడి చేయి కిందకి వాలిపోయింది.
కోపం గా అరిచాడు,"ఏమన్నావ్?"
మేఘం మరొక సారి ఉరిమింది
'నీ పేరు లోని పొడి అక్షరాలు అవేగా?'-- అతడి షర్టుకున్న బ్యాడ్జీ ని చూస్తూ.
,కోలవెన్ను వారి వంశములో పుట్టినందుకు తన పై తరాలవాళ్ళనీ, తిలక్ అని పేరు
పెట్టినందుకు త కన్న తల్లితండ్రుల్నీ తిట్టుకుంటూ గట్టిగా అరిచాడు.
"ఏం కూశావే?......(తిట్టు) .....టికెట్ కి డబ్బులు తియ్యి.'
మేఘం ప్రళయ భీకరముగా గర్జించింది .
'షల్ ఐ పుల్ ద చెయిన్ , ఆర్ విల్ యూ గెట్ ద హెల్ అవుటాఫ్ హియర్ యూ మీనర్ దేన్ ద మీనెస్ట్ క్రీచర్ ఇన్ ద క్రియేషన్ ?'
ఆమె అపర కాళిక ! ఆమె చండిక! ఆమె మహిషాసుర మర్దిని! ఆమె రుద్ర త్రినేత్రఛ్ఛట !!
వెర్రి తుమ్మెద ఎగిరిపోయింది! కుర్ర కోతి పరిగెత్తింది!
తుఫాన్ తరువాత అలుముకున్న ప్రశాంతత!
మహా ప్రళయానంతరం ఉదధి పై వటపత్రశాయి కేరింతల లాగు,ఆమె వదనంపై కురుల మృదుల నాట్యం!
'ఏమాశించి తను ఆ ఊరు వెళ్తోంది?--తనకే తెలియదు! కానీ వెళ్ళి తీరాలి. వెళ్తే తను కోల్పోయిన మనశ్శాంతిని తిరిగి సంపాదించుకోగలదా?లేక-- ఏమో?--'
పేపర్ లో రెండు రోజుల క్రితం తను చదివిన వార్త ! వార్త తో పాటు ప్రచురింపబడిన స్వామీజీ ఫోటో!
'భక్తులకు మహదవకాశం! శ్రీ శ్రీ శ్రీ అంతర్యామి స్వామి వారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం విచ్చేస్తున్నారు.ఈ నెల రెండొ తారీఖు నుండి పన్నెండవ తారీఖు వరకూ కాలెజి వీధిలో ఉన్న రామదాసు గారింట్లో బస చేస్తారు. ఆ అవకాశాన్ని  అందరూ వినియోగించుకోవాల్సింది గా కోరుతున్నాము.
 ఇట్లు
 భక్త బృందం.
ఇహాన్నించి పరం వైపు దృష్టి సారిస్తూ ఆమె కలువ రేకుల కన్నులు ముడుచుకున్నవి.
బృందావనములో శరద్జ్యోత్స్నలో యమునా తటిపై వేణుగానమారంభమైనది !
 'పావనా! పవనసూనా! నను కావవా!
దశరధ తనయుని సేవకు నోచిన
ధీశాలీ! నను కరుణింపవా, కరుణింపవా? ||
జలధిని దాటుట-మేలము నీకట
లక్ష్మణ రక్షణ- మూలము నీవట
వాయునందనా! లంఖిణి సూదనా!
బంధవిమోచన! నా భాగ్య నిధాన!
కరుణింపవా? ||
సీతామాతకు-స్వాంతన దాతవు
శ్రీరామునకూ-ధర్మబ్రాతవు
రామచంద్రుడె కోరెను సాయము
నేనెత స్వామీ?- రజము ప్రాయము
కరుణించవా? ||
'స్వామీ ! లంఖిణిని చంపావు. రావణ సంహారానికి సహాయపడ్డావు. ఈ చిన్ని గుండెలో రగిలే దావానలాగ్నిని ఆర్పలేవా ప్రభూ?'
ఆమె పెదవులనుండి సరస్వతి జాలువారుతున్నది!
ఆమె కన్నులనుండి గంగ ప్రవహిస్తున్నది!
చెమర్చిన ఆమె హృదయం నుంచి యమున పొర్లుతున్నది!
ఆమె మూర్తీభవించిన త్రివేణి !!!!
                                                                                               ***************************************
antharyaami
 అప్పటికి గంట నుంచీ అందరూ ఆంజనేయ స్వామి వారి ఆదేశం కోసం ఎదురు చూస్తున్నారు. అందరిలోనూ ఉత్కంఠ  , ఆత్రుత ! కాని, ప్రభువు వారి ఆదేశం లభించట్లేదు.
అందరూ భజన ప్రారంభించారు.
లావా కి విసుగెత్తింది. కొబ్బరినీళ్ళు ఎక్కువగా త్రాగినందువల్ల అత్యవసర పరిస్థితి ఏర్పడి పెరట్లోకి వెళ్ళాడు. అక్కడ కొబ్బరి చెట్టు మీద ఒక కోతి కిచకిచ లాడుతోంది.
’ కోతికి కొబ్బరికాయ దొరికినట్లు ‘ అన్న సామెత గుర్తుకు వచ్చి నవ్వుకున్నాడు లావా.లావా బైటకి వెళ్ళన సమయంలో టప్పున హాలు పై కప్పులోంచి అందరూ చూస్తుండగా గంగసింధూరం పులిమి వున్న కొబ్బరికాయ కింద పడి భళ్ళున పగిలింది!అందరూ జయజయ ధ్వానాలు చేసారు.లావా లోపలికి వచ్చి, జరిగింది తెలుసుకుని, ఆ సమయానికి తను అక్కడ లేనందుకు నెత్తి మొత్తుకున్నాడు.
అంతర్యామిగారు లోపలి గదిలో కూర్చుని వున్నారు.
ప్రశ్నలు అడగడానికి వచ్చినవారు ఒక్కొక్కరే గదిలోకి వెళ్తున్నారు.  దానికి ముందుగా ప్రశ్న చీటీ భగవంతం గారికి ఇచ్చి రెండేసి వందలు సమర్పించుకుంటున్నారు.
ఐతే ఆ ప్రశ్న చీటీ మాత్రం భగవంతం గారి దగ్గరే వుంటోంది కాని అంతర్యామి గారి దగ్గరకు పంపబడటల్లేదు.  ఐనప్పటికీ భక్తులు అడగదల్చుకున్న ప్రశ్నలు అంతర్యామిగారు కళ్ళు మూసుకుని చెప్పెయ్య గలుగుతున్నారు.
ఒక పట్టు పంచె, పట్టు కండువా ఆసామీ, నాలుగు వేళ్ళకీ నాలుగు ఉంగరాలతో దర్జాగా లోనికి వెళ్ళి స్వామివారికి పాదాభివందనం చేసాడు.  అంతర్యామి గారు కళ్ళు మూసుకునే మాట్లాడుతున్నారు.
‘ మీ శ్రీమతిగారికి ఎన్నాళ్ళ నుంచో తరచుగా కడుపులో నెప్పి వస్తోందని, నివారణోపాయం తెలపమని అడుగుతున్నారు.  ఔనా?’
‘ ఔను స్వామీ!’
‘ జఠరాగ్ని రగిలినప్పుడల్లా ఆర్పడానికి అతిగా ప్రయత్నాలు జరుగుతున్నందు వల్లనే ఇది సంభవిస్తున్నది కోటేశ్వర రావు గారూ!’
‘ ఐతే ఇప్పుడేం చెయ్యాలి స్వామీ?’
‘ అష్టోత్తర శత సువర్ణ కుసుమాలు స్వామికి సమర్పించండి.  ఆ నూటెనిమిది బంగారు పూలతో స్వామి వారికి పన్నెండు శనివారాలు అర్చన జరగాలి.  ఈ పన్నెండు శనివారాలు ఆమె పూర్తిగా ఉపవాసం ఉండవలసి వుంటుంది.  పూజలు మొదలు పెట్టిన ఐదవ శనివారం నుంచి ఆమెకు గుణం కనిపిస్తుంది.’
‘ ధన్యుణ్ణి స్వామీ!  రేపే ఆ బంగారు పువ్వులు తీసుకు వస్తాను.’
‘ మంచిది, వెళ్ళి రండి.’
మరొక మాసిన బట్టల ఆసామీ లోనికి వెళ్ళి దీనంగా వారి పాదాలకు మ్రొక్కాడు.
‘ చూడు బిచ్చాలూ!  నీ ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదు.  దానికి తోడు నీకీ భయంకరమైన గొంతు కేన్సరు వచ్చింది.  అందువల్ల నువ్వు చాలా క్రుంగిపోయావు.  ఏమీ బాధ పడకు.  నీకు నేను విభూతి ఇస్తాను.’
‘ దీనితో నా రోగం పూర్తిగా నయమై పోతుందా స్వామీ?’  ఆశగా అడిగాడు బిచ్చాలు.
‘ దీనితో నీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది.’ అంటూ గాలిలో చేతిని అటూ ఇటూ తిప్పి అతడి చేతిలోకి వంచాడు.
బిచ్చాలు చేతిలో విభూతి పడింది!
‘ ఈ విభూతి నిత్యం ధరిస్తూ వుండు నాయనా.’
‘ అలాగే స్వామీ.’
‘ మంచిది, ఇక వెళ్ళు.’
                                                                                                              ************************
          రైలు దడదడ మంటూ సాగిపోతోంది.  ఆమెకు మాగన్నుగా కునుకు పట్టింది.కోలవెన్ను తిలక్ కి చాల తిక్కగా వుంది.  ఇవాళ తను నిర్దేశించుకున్న రెండు లక్ష్యాలలో ఏ ఒక్కటీ సాధించలేదు.  బోణీయే బెడిసి కొట్టింది.’ అసలు తన గురించి ఆ పిల్ల ఏమనుకుంటోంది?  కాస్త గట్టిగా మాట్లాడినంత మాత్రాన తను బెదిరి పోతాడనుకుంటోందా?  దానికి తన తడాఖా చూపించి తీరాలి.  వచ్చే స్టేషనులో దానిని బలవంతంగా కిందకి దింపి, కేసు బుక్ చేసేయాలి.  అప్పుడు అందరి ముందూ ఏమని వాగుతుంది?  తను డబ్బు లంచం అడిగానని చెబుతుందా?  నో ఛాన్స్.  తను స్ట్రిక్ట్ ఆఫీసరు కనకనే అది లంచం ఇవ్వబోయినా తీసుకోకుండా కేసు బుక్ చేసానని అంటాడు.  అందరూ నమ్మి తీరాల్సిందే.లేక, తనతో వెకిలిగా ప్రవర్తించాడని గొడవ చేస్తుందా?  చెయ్యనీ.  సాక్ష్యమేం లేదుగా!  తను టికెట్ అడిగాడని ఆమే వెకిలిగా ప్రవర్తించ బోయిందంటాడు.  అందుకే మర్యాదగా ఊరుకుని, స్టేషను రాగానే కేసు బుక్ చేసానంటాడు.  దెబ్బకి ఊచల వెనక్కి పోవలసిందే.  అక్కడ ఏ పోలీసో దాని తాట తీస్తాడు.  అప్పుడు కుదురుతుంది దాని తిక్క.  ‘ అయ్యో!  రైల్లో ఆ టి.సి.గాడి కోరిక తీర్చినా ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా!’ అని కుమిలి కుమిలి ఏడుస్తుంది.  అంతే కావాలి.  లేకపోతే తనంత వాడు ఏరి కోరి దాని దగ్గరకి వెళితే, కాదు పొమ్మంటుందా?  పైగా తనని కోతి అని వేళాకోళం చేస్తుందా?’ కోతియే లంఖిణిని జంపెరా, కోతియే లంకనూ గాల్చెరా’ అన్నట్లు ఈ కోతిగాడు ఎంత వరకు వెళ్ళగలడో దానికి చూపించి తీరతాడు.’తిలక్ జేబులోంచి బ్రాందీ బాటిలు తీసి ఒక పెగ్గు బిగించి కసిగా పళ్ళు నూరుకున్నాడు.కాని అతడి దురదృష్టం!  ఆ రైలు తరవాత స్టేషను చేరుకోనే లేదు.  ఎవరో విద్రోహకారులు చేసిన పనికి వేగంగా వెళ్తున్న రైలు కాస్తా పట్టాలు తప్పింది.డోరు దగ్గర నుంచుని రెండో పెగ్గు బిగిస్తున్న తిలక్ రైలు ఒరిగిపోతుండడం గమనించాడు.  వెంటనే ప్రాణభయంతో పడిపోతున్న రైలు లోంచి దూకేసాడు.  అదే అతడు చేసిన ప్రాణాంతకమైన పొరపాటు.  రైలు లోంచి దూకగానే అతడి తల విద్యుత్ స్థంభానికి కొట్టుకుంది. అతడు చేసిన పాపాలన్నీ పండి, అక్కడికక్కడే దిక్కు లేని చావు చచ్చాడు.ఇంజను డ్రైవరు స్టేషను రాబోతోందనో, ఇంకా సిగ్నలు ఇవ్వలేదనో రైలు వేగం కొద్దిగా తగ్గించాడు.  అదే ప్రయాణీకులకు శ్రీరామరక్ష అయింది.  అందువల్ల రైలు యొక్క మొదటి బోగీ మాత్రం పట్టాలు తప్పింది.  మిగిలిన రైలు పట్టాల మీదనే నిలబడి వుంది. ఐతే చుట్టూ చిమ్మచీకటి.  ఎవరు పోయారో, ఎందరు మిగిలున్నారో తెలియని పరిస్థితి! మాగన్నుగా నిద్ర పట్టిన ఆమెకు ఎవరో బలంగా కిందకు నెట్టినట్లు అనిపించడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. అంతా గోల గోలగా వుంది.  ఏమీ అర్థం కావటల్లేదు.  ఎవరివో హాహాకారాలు వినిపిస్తున్నాయి.  ఆమెకు తలంతా దిమ్ముగా వుంది.  తల మీద చెయ్యి వేసుకుంటే తడి తడిగా తగిలింది.  రక్తంలా వుంది.  ఏమయిందో అర్థం చేసుకునే లోగానే  ఆమెకు స్పృహ తప్పింది.
                                                                                                                         **********************
          ‘ లావా!  ఇక కొద్ది రోజులు ఓపిక పట్టు.  ఇది సిధ్ధాంతాలకు మాత్రమే సంబంధించిన విషయం కాదు.  నా పరువుకు కూడా సంబంధించిన విషయం.  ఇప్పుదు నువ్వేమైనా అల్లరి చెస్తే, అంతర్యామి గారి మాటెలా వున్నా, నేను మాత్రం ఇంక రేపటి నుంచి నలుగురిలో తలెత్తుకు తిరగలేను.  నీచేత కావాలని నేనే ఇల్లా గొడవ చేయించానని అందరూ నన్నాడి పోసుకుంటారు.  దయ చేసి నా పరువు బజార్న పడేయకు.” దాసూ!  మరోలా భావించకు.  నీ రికార్డే నేను తిరగేస్తాను.  ఇది కేవలం పరువు, ప్రతిష్టలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు.  ఇంత వరకు నేను గాఢంగా నమ్ముకుంటూ వచ్చిన సిధ్ధాంతాలకు సంబంధించిన విషయం.  ఇప్పుడు నా విజ్ఞానాన్ని ప్రదర్శించి, జనాన్ని నేను జాగృతం చెయ్యకపోతే, ఎప్పటికీ వాళ్ళు చీకటిలోనే మ్రగ్గిపోయే ప్రమాదముంది.  ఈ స్వామి బండారాన్ని నేను బైట పెట్టగలిగితే అప్పుడు ఆ కీర్తి నాకు మాత్రమే దక్కదు.  నిన్ను కూడా అందరూ మెచ్చుకుంటారు.” అది కాదురా లావా!  నీ దగ్గర ఏ విధమైన ఋజువులూ, సాక్ష్యాలూ లేకుండా ఒక మహాత్ముడిని అల్లరి పెట్టాలనుకోవడం హర్షించ దగ్గ విషయం కాదు.  ” నేను ఏ రుజువులూ, సాక్ష్యాలూ చూపించక్కర్లేదు.  అది ఆయన బాధ్యత.  అందుకని ఆ ఋజువులు, సాక్ష్యాలేవో ఆయన్నే చూపించమంటాను.” ఆయన ఎన్నోసార్లు చూపించారురా.  నాకు విగ్రహాన్ని ప్రసాదించడం, మరొకరికి శూన్యం లోంచి విభూతిని తీసి ఇవ్వడం, ఇంటి చూరు లోంచి కొబ్బరికాయ పడడం, ఆ కొబ్బరికాయకు గంగసింధూరం వుండడం, ఇవన్నీ అతీంద్రియ శక్తులు కాక మరేమిటిరా?’‘ అదే, ఆ బండారమే బైట పెట్టాలని నా తపన.’‘ ఒరేయి లావా!  నీకు చేతులు జోడించి నమస్కారం చేసి వేడుకుంటున్నానురా.  అంతర్యామి గారు సగౌరవంగా ఈ ఊరినించి వెళ్ళేందుకు నాకు సహకరించరా.’లావా అన్నాడు, ‘ దాసూ!  నువ్వంత బెంబేలు పడకు.  నేను ఊరికే తొందర పడి ఏ విధమైన గొడవలూ లేవదీయను.  ఇదుగో, నీకు హామీ ఇస్తున్నాను.  నీ ప్రతిష్టకి ఏ విధమైన భంగం కలగనివ్వను.  సరేనా?’రామదాసు తేలిక పడ్డ మనసుతో అన్నాడు, ‘ హమ్మయ్య!  ఇప్పటికి నామనసు కాస్త కుదుట పడిందిరా.  థాంక్ యూ.’ లావా దీర్ఘంగా ఆలోచిస్తూ బైటికి నడిచాడు.  బైటకి వెళ్ళి ఎవరెవరితోనో సుదీర్ఘంగా మంతనాలాడి సంతృప్తిగా తిరిగి ఇంట్లోకి వచ్చాడు.
                                                                                                                     ******************
          ఆమె తలకు బ్యాండేజి గట్టిగా చుట్టబడి వుంది.  కొద్దిసేపు తనెక్కడున్నదీ ఆమెకు అర్థం కాలేదు.  జరిగిన రైలు ప్రమాదం గురించి కొద్ది కొద్దిగా గుర్తుకు వచ్చింది.ఆమె కళ్ళు తెరవడం చూసి నర్సు వచ్చి ఇంజక్షను ఇవ్వబోయింది.’ సిస్టర్!  ఇవాళ తారీకెంత?’సిస్టర్ చెప్పింది.’ ఇదే ఊరు?’సిస్టర్ చెప్పింది.‘ ఇక్కడికి నరసాపురం ఎంత దూరం?’సిస్టర్ జవాబిస్తూ ఇంజక్షను చెయ్యబోయింది.‘ సిస్టర్!  చాలా దాహంగా వుంది.  ముందు కాసిని మంచినీళ్ళిచ్చి ఆ తర్వాత ఇంజక్షను చెయ్యండి.’ సిస్టర్ మంచినీళ్ళు తెచ్చేసరికి ఆమె బెడ్ మీద లేదు!
                                                                                                                      *******************
ఆ వేళ అంతర్యామిగారికి ఆ ఊళ్ళో చివరి రోజు.  ఆ మరునాడు వారు బెంగళూరు వెళ్ళి అక్కడ పూజాది కార్యక్రమాలు, ప్రవచనాలు నిర్వహిస్తారు.  బెంగళూరులో కార్యక్రమాలు పూర్తి కాగానే, అంటే సుమారు ఇరవై రోజుల తర్వాత అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేసియా వెళ్తారు.  వారి కార్యక్రమాలన్నీ దాదాపు రెండు సంవత్సరాల ముందునుంచే ఏర్పాటయిపోయాయి.  దాదాపు తొమ్మిది నెలల తరువాత వారు తిరిగి తమ ఆశ్రమానికి చేరుకుంటారు.  వారికి అన్ని దేశాలలోను అసంఖ్యాకంగా భక్తులు, అనుయాయులు, శిష్యులు వున్నారు.  వారు దేశ విదేశ పర్యటనలన్నీ తమ స్వంత విమానంలోను, హెలికాఫ్టరు లోను, ఖరీదైన కార్లలోను మాత్రమే చేస్తారు. చివరి రోజు కావడం వలన ఆ రోజు ప్రశ్నోత్తరాల కార్యక్రమం వుండదు. సాయంత్రం చాలా భారీ ఎత్తున పూజలు, భజనలు జరుగుతాయి.  ఆ కార్యక్రమాలు రాత్రి సుమారు ఒంటిగంట వరకు వుండవచ్చును.  వారు నరసాపురంలో వున్నన్ని రోజులు, రోజు రోజుకు భక్తజనసందోహం విపరీతంగా పెరుగుతూ వస్తున్నారు.  ఇక చివరి రోజు కావడంతో ఎంతో దూరాల నుంచి కూడా భక్తగణం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. భారీగా జనం తరలి వస్తుండడంతో ఆరోజు రోడ్డు మీద భారీ ఎత్తున షామియానాలు వేసారు.  తూర్పు వైపు పెద్ద వేదికను నిర్మించారు.  ఊరంతా వినపడేలాగు మైక్ సిస్టం ఏర్పాటు చేసారు.  కళాశాల నుంచి సుమారు రెండువందల మంది విద్యార్థులు స్వఛ్ఛందసేవకులుగా బందోబస్తు నిమిత్తం వచ్చారు.  పోలీసులను కూడా భారీగా మోహరించారు.  సూపరెంటెండెంట్ ఆఫ్ పోలీస్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.  శాంతిభద్రతలను జాగ్రత్తగా కాపాడవలసిందిగాను, భక్తులకు ఏవిధమైన అసౌకర్యం కలగకుండా చూడవలసిందిగాను, పోలీసు శాఖకు ముఖ్యమంత్రి గారినుండి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ అయ్యాయి. రోడ్డంతా రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు.  అక్కడి వాతావరణం చూడడానికి చాలా కన్నుల పండువగా వుంది.  ఆ రోజున అక్కడి కార్యక్రమాలు ప్రత్యక్షంగా చూడలేని వారు దురదృష్టవంతులే అవుతారు.  వస్తున్న జనసందోహానికి భోజనాదికాలు ఆ వూరి చైర్మను గారైన పొన్నపల్లి శివకామయ్యగారు, ఆ వూరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులైన కారుమూరి బలరామయ్యగారు సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నారు. పత్రికా విలేఖరులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ఆహ్వానాలు వెళ్ళాయి.  అన్ని ఛానెల్స్ వారు విస్తృతంగా కవరేజి ఇవ్వడానికి సిబ్బందితో సహా వస్తున్నారు.  ఆ నాటి కార్యక్రమం మొత్తం కొన్ని ఛానెల్స్ లో ప్రత్యక్షంగా ప్రసారం కూడా కానుంది.  నరసాపురంలో అదివరకెన్నడూ అంత గొప్ప కార్యక్రమం బహుశా జరిగివుండదు. లావాకి చాలా అశాంతిగా వుంది.  తను చాలామందికి ఫోన్లు చేసాడు.  వారంతా వచ్చి అతడికి బాసటగా నిలబడతామని హామీలు కూడా ఇచ్చారు.  కాని ఇంకా ఎవరూ రాలేదేమిటి?  ఇంతటి మహత్తరమైన అవకాశం తనకి మళ్ళీ మళ్ళీ రావాలన్నా రాదు.  అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరిగితే, రేపు అన్ని వార్తాపత్రికలలోను తన పేరు, ఫొటో ఫ్రంట్ పేజీలలో వచ్చితీరుతుంది.  టి.వి.ఛానెల్స్ లో కూడా రేపు రోజంతా తనే కనబడతాడు.  ఈ దెబ్బతో తన కీర్తి దేశమంతా వ్యాపించి తీరుతుంది.  తలచుకుంటేనే లావాకు చాలా ఉత్కంఠగా వుంది.  అన్నీ తను అనుకున్నట్లుగా భగవంతుడి దయవలన జరుగుతే బాగుండును!  ఆ ఆందోళనలో, అన్నీ అనుకున్న ప్రకారం జరిగేలా చూడమని వున్నాడో, లేడో తెలియని ఆ దేముడిని వేడుకుందామా అని కూడా ఒక్క క్షణం అతడికి అనిపించింది.  మళ్ళీ తన ఆలోచనకు తనకే నవ్వు వచ్చింది.  దేవుడు లేడు అని ఋజువు చెయ్యనిమ్మని తిరిగి దేవుడినే ప్రార్థించుకోవడమా?  తన స్నేహితులంతా తప్పక వచ్చి తీరతారు.  వాళ్ళకి మాత్రం ఇది మహత్తరమైన అవకాశం కాదూ! రామదాసుకి చాలా సంతృప్తిగా వుంది.  ఈ ఒక్క రోజు ఏ ఇబ్బంది లేకుండా గడిచిపోనిమ్మని ఆంజనేయస్వామికి మనసులో పదే పదే మొక్కుకుంటున్నాడు.
          ఐనా తన పిచ్చిగాని, ఈ విషయం గురించి తను ఆందోళన పడడం ఎందుకు?  ఇంతవరకు అంతా భగవన్నిర్ణయం ప్రకారమే జరిగింది.  ఇకముందు కూడా అల్లాగే జరిగి తీరుతుంది.ఎవరో భక్తురాలు లోనికి  వస్తూ కనిపించింది.  ఆమె తలకు కట్టు వుంది.  రామదాసు మర్యాదగా ఎదురు వెళ్ళి ఆహ్వానించాడు.ఆమె లోనికి వస్తూ మర్యాదగా రామదాసుగారికి నమస్కరించింది.రామదాసు ఆప్యాయంగా అన్నాడు, ‘ నమస్కారమండీ.  మిమ్మల్ని చూస్తే చాలా దూరం నించి ఎంతో ప్రయాస పడి వస్తున్నట్లుగా వుంది.” నమస్కారమండీ.  నా పేరు ద్వారక.  నేను నాగపూర్ నించి కేవలం అంతర్యామి గారి దర్శనం కోసం వస్తున్నాను.  వారు నరసాపురం వస్తున్నట్లు పేపరులో చదివాను.  పైగా వారు కొద్దిరోజులలో విదేశీపర్యటనకు వెళ్తారని, మళ్ళీ తొమ్మిది నెలల దాకా రారనీ కూడా తెలిసింది.  మళ్ళీ వారి దర్శనం లభించదని, ఇంక ఆత్రం అణచుకోలేక వెంటనే బయలుదేరి వచ్చేసాను.” చాలా సంతోషమండీ.  కాని కనీసం నిన్నటికి చేరుకున్నా ఆయనను వ్యక్తిగతంగా కలుసుకుని మీ సమస్యలేమన్నా వుంటే పరిష్కార మార్గాలు తెలుసుకునే వారు.  మరీ ఆఖరు రోజున వచ్చారేమిటి?’‘ ఏం చెయ్యమంటారు?  నాకింతే ప్రాప్తం అనుకుంటాను.  నేను వస్తున్న రైలు పట్టాలు తప్పింది.  చాలా మందితో పాటు నేను కూడా ఆస్పత్రి పాలయ్యాను.  కొంతమందికి పెద్ద పెద్ద గాయాలే అయ్యాయి.  నా అదృష్టం బాగుండి కొద్దిపాటి దెబ్బలతో బతికి బైటపడ్డాను.  ఐనా దెబ్బలు చాలావరకు నెమ్మళించాయి లెండి.’ ద్వారక తలకున్న కట్టుని తడుముకుంటూ మళ్ళీ అంది, ‘ నా అదృష్టం బాగుంది కనుక కనీసం ఆయన దర్శనానిైనా నోచుకోగలుగుతున్నాను.’రామదాసు నొచ్చుకుంటూ అన్నాడు, ‘ అయ్యొయ్యో, అలాగా?  పేపరులో ఏక్సిడెంట్ గురించి చదివాను.  మీరు చాలా అదృష్టవంతులే.  ఆ భగవంతుడి దయ మీమీద వుండబట్టి బైటపడ్డారు.  అరెరె, నన్ను క్షమించండి ద్వారకగారూ!  మిమ్మల్ని నిలబెట్టే మాట్లాడేస్తున్నాను.  నా పేరు రామదాసు.  ఇక్కడ యర్రమిల్లి నారాయణ మూర్తి కళాశాలలో లెక్చరర్ గా పని చేస్తున్నాను.  ఈ ఇల్లు నాదే.  సరి, సరి.  తరవాత మాట్లాడుకోవచ్చు.  ముందు మీరు లోపలికి వెళ్ళి హాయిగా స్నానం చేసి, వేడి వేడిగా నాలుగు మెతుకులు నోట్లో వేసుకోండి.  ప్రాణం కాస్త తెరిపిన పడుతుంది.’‘ అబ్బెబ్బె!  మీకెందుకండీ ఆ శ్రమంతాను?’రామదాసు స్నేహపూర్వకంగా అన్నాడు, ‘ అయ్యో!  అలా మీరేమీ భావించకండి.  మీరు భగవత్కార్యం మీద వచ్చారు.  అదిన్నీపెద్ద గండం గడిచి వచ్చారు.  మీరిక్కడేమీ మొహమాట పడవద్దు.  ఇది మీ ఇల్లుగానే భావించండి.  నేనున్నూ ఒకసారి మీలాగే కేవలం భగవదనుగ్రహం వల్ల మృత్యువు నోట్లోంచి బైట పడ్డాను.’ ద్వారక కృతజ్ఞతగా నమస్కరించి ఆయనతో పాటు లోనికి నడిచింది. టికెట్ కలక్టర్ దగ్గర ద్వారక ప్రవర్తనకు, రామదాసు గారి దగ్గర ఆమె ప్రవర్తనకు ఎంత వైరుధ్యం!  తిలక్ ఆమె పేరడిగినా ఆమె చెప్పలేదు.  ఇక్కడ రామదాసుతో ఎంతో చనువుగా, తన ఆత్మబంధువు అన్నట్లుగా హాయిగా, గలగలా మాట్లాడేస్తోంది. ద్వారకను లోనికి తీసికెడుతున్న రామదాసుకు లావా ఎదురయ్యాడు.  లావా ద్వారకను చూడగానే నిశ్చేష్టుడై నిలబడిపోయాడు.  ఏమిటి?  ఈమె…..ఈ సమయంలో…..ఇక్కడ…..?  అతడి మెదడంతా మొద్దుబారి పోయింది. రామదాసు లావాకి ఆమెని పరిచయం చేసాడు, ‘ ఒరేయి లావా!  ఈవిడ పేరు ద్వారక.  పాపం ప్రత్యేకించి నాగపూర్ నించి స్వామివారి దర్శనం కోసం వచ్చారు.  ముందు వీరి స్నానానికి, భోజనానికి ఏర్పాట్లు చూడు.’ తిరిగి ద్వారకతో అన్నాడు, ‘ ద్వారరకకగారూ!  వీడు నాకు చాలా ఆప్తమిత్రుడు.  వీడి పేరు లావా.  వీడో పెద్ద సంఘసంస్కర్త లెండి.’ ద్వారక నిశ్చలంగా లావాకేసి చూస్తూ అంది, ‘ నమస్కారమండీ లావాగారూ!  మీ పేరు చాలా గమ్మత్తుగా వుందే?’ రామదాసు నవ్వుతూ అన్నాడు, ‘ అసలు పేరు అది కాదులెండి.  వాడి పూర్తి పేరు చెప్పాలంటే పదమూడు నిముషాలు పడుతుంది.  ఐనా అంత పొడుగు పేరు వాడు కూడా మర్చిపోయే వుంటాడు.  ఏరా, అంతేనా?  పెద్దలు పెట్టిన ఆ పేరు ఇష్టం లేక తన పేరుని లావాగా కుదించుకున్నాడు.  అంటే అగ్నిపర్వతం బద్దలైనప్పుడు ప్రవహిస్తుంది కదండీ, అదన్న మాట!  వీడి స్వభావం కూడా ఇంచుమించు అంతే లెండి.  పరమ నాస్తికుడు, పచ్చి హేతువాది.  ఇక్కడేదో గొడవ చేద్దామని బైఠాయించాడు.  కాని, నా పరువు దక్కించడానికి నిగ్రహించుకుంటున్నాడు.’ ద్వారక నవ్వింది, ‘ బాగుందండీ.  ఉత్తర దక్షిణ ధృవాల కలయిక అన్న మాట!’ రామదాసు అన్నాడు, ‘ కరెక్టుగా అంతేనండి.’ ద్వారక సంతోషంగా అంది, ‘ మిమ్మల్నిద్దర్నీ కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా వుందండి.  ఇక్కడికొచ్చేటప్పుడు కొత్త ప్రదేశానికి వెళ్తున్నానే అన్న బిడియంతో ఎంతో సంకోచిస్తూ వచ్చాను.  కాని ఇక్కడ మీ ఆప్యాయత చూస్తూంటే నా సంకోచమంతా ఎగిరిపోయింది.’ రామదాసు అన్నాడు, ‘ లావా!  నువ్వీవిడ గురించి శ్రధ్ధ తీసుకో.  నేను ఇంకా చాలా వ్యవహారాలు చూడాలి.  వెళ్ళండి ద్వారకగారూ!  ఇంకేమీ బిడియపడకండి.’ రామదాసు వెళ్ళగానే ద్వారక అంది, ‘ లావాగారూ!  ఏమనుకోకండి.  నాకింక చనువు వచ్చేసింది.  నాక్కాస్త బాత్ రూము చూపించారంటే, ఒక్క క్షణంలో స్నానం చేసి వచ్చేస్తాను.  ఆ తర్వాత దయ తలిచి కాస్త భోజనం కూడా పెట్టించారంటే, ఇంక మీతో కలిసి నేను కూడా ఇక్కడ పనులన్నీ చక్కబెడతాను.’ లావా ఆమె మొహంలోకి పరిశీలనగా చూస్తూ అన్నాడు, ‘ ద్వారకగారూ!  ఇంతకు ముందు మిమ్మల్నెక్కడో చూసినట్లనిపిస్తోందండీ.’ ద్వారక అమాయకంగా అంది, ‘ కదూ?  నాక్కూడా మిమ్మల్ని చూసినా, రామదాసు గారిని చూసినా ఇదివరరకెక్కడో చూసినట్లే అనిపించిందండీ.  కొంతమందిని చూస్తే అంతేనండీ.  ఎన్నాళ్ళ నుంచో పరిచయం వున్న మనుషుల్లా అనిపిస్తారు.  అల్లా అనిపించడానికి కూడా కారణం పూర్వజన్మ బంధం అండీ.  మీరు నమ్మినా, నమ్మకపోయినా ఇది మాత్రం నిజం.’ లావాకి ద్వారక మాటలు విన్నాక కాస్త స్తిమితం చిక్కింది.  తేలిగ్గా నవ్వేస్తూ అన్నాడు, ‘ అంతే అయుంటుంది లెండి.  పదండి, స్నానం చేద్దురు గాని.’ ద్వారక స్నానం చెయ్యడానికి వెళ్ళింది.
 ద్వారకను చూడగానే లావా నిర్ఘాంతపోయాడు.  కారణం?  చూడగానే తనామెను గుర్తు పట్టాడు.  కాని ద్వారక తనని ఏమాత్రం గుర్తు పట్టలేకపోయిందేం?  తనని చూసి చాలా సంవత్సరాలైనందు వల్లనా?  ఏమో!  లేక, బహుశా ఆ రోజున కరెంటు లేని సమయంలో కొవ్వొత్తి వెలుగులో తనను చూసినందువల్లనా?  ఏదేమైనేతేనేం, ఆమె తనను గుర్తు పట్టలేదు.  ఇది నిజంగా తన అదృష్టం.  ఒక విధంగా శుభసూచకం కూడానేమో!
          కాని ఏమిటీమె పిచ్చి?  ఎక్కడో నాగపూరు నించి ప్రత్యేకం అంతర్యామిని చూడడానికి రావడమా?  ప్రజలెంత మూర్ఖులు!  వాళ్ళ సమస్యలని వాళ్ళే పరిష్కరించుకోవాలని ఎందుకు ఆలోచించరు?  ఆ సమస్యలని పరిష్కరించుకోడానికి కావల్సిన విజ్ఞత చూపించరు.  పోనీ, స్నేహితులతోను, శ్రేయోభిలాషులతోను చర్చించి, సలహాలు తీసుకుంటారా?  అదీ వుండదు.  వెంటనే కనిపించిన ప్రతి రాయికీ మొక్కెయ్యడం, లేకపోతే ఎదురయ్యే ప్రతి స్వాములవారికి సాష్టాంగ ప్రణామాలు చేసి, వాళ్ళిచ్చిన విభూతితో సంతృప్తి పడడం!  ఆ విభూతి వల్ల గుణం కనిపిస్తుందా అని వివేకంతో ఆలోచించరు.  మంచి జరుగుతే ఆ విభూతి మహిమ.  లేకపోతే వాళ్ళ ఖర్మ అనుకుంటారు!లావా ఇలా ఆలోచిస్తూండగానే ద్వారక స్నానం చేసి మల్లెపూవులా తయారై వచ్చింది.  ఆమె అందాన్ని చూస్తూ లావా గుటకలు మింగాడు.ద్వారక కొద్ది క్షణాలలోనే లావాకి సన్నిహితమై పోయింది.లావా తన గొప్పతనాన్ని చాటుకోడానికా అన్నట్లు అన్నాడు, ‘ ద్వారకగారూ!  మీ లాంటి ఆడాళ్ళు ఈ స్వాములని, వారు చూపే మహిమలని నమ్ముతున్నారంటే అర్థముంది.  కాని ఈ మామాబెడ్ గాడు చూడండి!” మామాబెడ్ ఎవరండీ?’లావా హేళనగా నవ్వుతూ అన్నాడు, ‘ వీడేనండీ, ఈ రామదాసుగాడు!  వీడు ఎం.ఏ ఇంగ్లీషు లిటరేచర్, ఎం.ఏ. తెలుగు, బి.ఇడి. చేసాడు.  ఇంత చదువుకుని కూడా వీడికి అంత మూఢనమ్మకమేమిటండీ?’ద్వారక లావా కేసి ఓరగా చూస్తూ అంది, ‘ మీరన్నది నిజమే లావాగారూ!  నాకు జీవితంలో తోడూ నీడా ఎవరూ లేకపోవడం వలన ఒక రకమైన బెంగ, భవిష్యత్తు అంటే చాలా భయం ఏర్పడిపోయాయి.  అందుకే దేవుడున్నాడని, ఆయన తోడు నాకుంటుందని ఊహించుకుంటే, అదో సంతృప్తిగా వుంటుంది.  అదే మీలాంటి వారెవరన్నా తోడున్నారనుకోండి, అప్పుడు ఏ దేముణ్ణీ ప్రార్థించవలసిన అవసరమే నాకుండదనుకుంటాను.  అంతే కాదు, అప్పుడైతే నేను కూడా మీలాగే దేవుడు లేడని వాదిస్తానేమో!’ఇద్దరి కళ్ళూ క్షణం సేపు కలుసుకున్నాయి.ద్వారక కళ్ళు సిగ్గుగా కిందకి వాలిపోయాయి. లావా హుషారుగా ఈల వేసాడు. ద్వారక చలాకీగా కళ్ళు తిప్పుతూ అంది, ‘ ఐతే లావాగారూ!  మీరు నిజంగా దేవుడ్ని నమ్మరా?’ ‘ చచ్చినా నమ్మను.’ ద్వారక అతడి కేసి ఆరాధనగా చూస్తూ అంది, ‘ స్వశక్తి మీద పైకి వచ్చిన వాళ్ళకి భగవంతుడంటే నమ్మకముండదు.  మీరు అంత దీక్ష కలవారని, స్వశక్తి మీద పైకి వచ్చిన వారని తెలిసినప్పుడు మిమ్మల్ని ఆరాధించాలనిపిస్తోంది.’ లావా ఆమె కేసి కోరికగా చూసాడు. ‘ కాని ద్వారకా!  నేను పరమ నాస్తికుడినని నీకు తెలుసు.  నువ్వా, ఆస్తికురాలివి!  మనిద్దరి మధ్య స్నేహం కలుస్తుందంటావా?’ తనని అప్పుడే చనువుగా ‘ నువ్వు ‘ అని సంబోధించినందుకు ద్వారకకు నవ్వు వస్తోంది. ‘ లావాగారూ!  అభిరుచులు, వ్యక్తిత్వాలు వేరై వుండచ్చు.  ఐనంత మాత్రాన ఒకరినొకరు గౌరవించుకోకూడదా?’ ‘ ఔను ద్వారకా!  చాలా కరక్టుగా చెప్పావు.  నీ అభిప్రాయాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.’ ‘ నాకు మీ వ్యక్తిత్వం మీద గౌరవం పెరుగుతోంది లావాగారూ!’ ‘ ఐతే ద్వారకా, నాదో కోరిక.  మన్నిస్తావా?’ ‘ మీరేం కోరినా ఇవ్వడానికి సిధ్ధంగా వున్నాను లావాగారూ!’ ‘ థాంక్స్.  కాస్త ఏకాంతం దొరికాక నీతో మాట్లాడతాను.  సరేనా?  కాని తీరా అడిగాక నువ్వు కాదనవు కదా?’ ‘ నాదేముంది లావాగారూ?  నీళ్ళలాంటి దాన్ని.  ఏ గ్లాసులో పోస్తే, ఆ ఆకారం దాలుస్తాను.’ ‘ నాకు చాలా సంతోషంగా వుంది ద్వారకా!  నువ్వు రావడం నిజంగా నా అదృష్టం.’ ద్వారకకి చాలా ఆనందంగా వుంది.  ఇక్కడికి వచ్చేటప్పుడు భగవంతుడ్ని ప్రార్థించుకుంది.  తనకేదైనా దారి చూపించమని, తరుణోపాయాన్ని సూచించమని.  ఇప్పుడు లావాని చూస్తే ఆమెకి చాలా ధైర్యం వచ్చేసింది.  లావాని భగవంతుడే ఇక్కడికి తీసుకు వచ్చి తనతో కలిపాడు.  ఖచ్చితంగా తన కోరిక నెరవేరుతుందన్న నమ్మకం కలిగిందామెకు. ‘ లావాగారూ!  ఇవాళ పూజలు ఎప్పుడో సాయంత్రం గాని మొదలవవు కదా?  అందాకా కాసేపు గోదావరి ఒడ్డున తిరిగి వద్దామా?’ లావా ఒక్క క్షణం సందేహించాడు.  తను ఫోన్లయితే చేసాడు గాని, వాళ్ళందరూ వస్తారో, రారో?  తీరా వాళ్ళు వచ్చేసరికి తనక్కడ వుండక పోతే ఎలా?  వాళ్ళతో కలిసి భవిష్యత్కార్యక్రమం నిర్ణయించుకోవాలి కదా?  ఊహు!  ఈ అందాలరాశి పొందు ముందు మిగతా విషయాలన్నీ బలాదూర్!  ఇంత చక్కని అవకాశం ఎదురైనప్పుడు కాళ్ళతో తన్నుకునేంత మూర్ఖుడు కాదు తను.  ఈ అద్భుత సౌందర్యరాశితో తనకు లభించే ఒక్క క్షణపు ఆనందం కోసం తనను, తన ఆదర్శాలను, తన సిధ్ధాంతాలను శాశ్వతంగా పణంగా పెట్టెయ్యమన్నా పెట్టెయ్యడానికి సిధ్ధంగా వున్నాడు. లావా హుషారుగా లేచాడు, ‘ పద ద్వారకా.  నీ సరదా తీర్చడం కన్న నాకు కావల్సిందేముంది?’
                                                                                                            *****************************
          లావా, ద్వారక గోదావరి ఒడ్డున సిమెంటు బెంచీ మీద కూర్చున్నారు.జనం నాటుపడవల మీద సఖినేటిపల్లి నించి నరసాపురానికి, నరసాపురం నించి సఖినేటిపల్లికి వెళ్తున్నారు.  రేవులో అంతా హడావిడిగా వుంది.  మోటారుసైకిళ్ళు, స్కూటర్లు, కార్లు కూడా ఈ రేవునించి ఆ రేవుకి, ఆ రేవునించి ఈ రేవుకి అవలీలగా తీసుకుపోతున్నారు.  ద్వారక అదంతా విడ్డూరంగా చూస్తోంది.నరసాపురం గోదావరిని వశిష్టగోదావరి అని, రాజమండ్రి దగ్గర గోదావరిని గౌతమి గోదావరి అని అంటారుట.  దానికేదో పురాణ కథ వుండే వుంటుంది.  ఈ సారి తీరిక దొరికితే రామదాసు గారిని అడగాలి.నరసాపురంలో గోదావరి నీళ్ళు చాలా ఉప్పగా వుంటాయి.  అక్కడికి సముద్రం ఏడు మైళ్ళ దూరం లోనే వుంది.  సముద్రతీరాన అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి వారు వెలిసారు.  ఆ స్థలానికి చాలా మహత్తు వుంది.  ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి నాడు అక్కడ రథోత్సవం జరుగుతుంది.  మొగల్తూరు రాజు గారు రాచరికపు దుస్తులలో వచ్చి, రధం మీద చెయ్యి వేసిన తరువాతే రథాన్ని బయలుదేర దీస్తారు.  అది అక్కడి సంప్రదాయం.నరసాపురంలో ఎంబెరుమన్నార్ కోవెల వుంది.  అక్కడ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి.  తమిళనాడు లోని సిరిపెరుంబుదూరులో వున్న కోవెలకు నరసాపురం లోని కోవెల రెప్లెకా అంటారు.  నరసాపురం లోని కోవెలలో కూడా తమిళ సంప్రదాయం ప్రకారమే అర్చనలు జరుగుతాయి.  ధనుర్మాసంలో భక్తులు తెల్లవారు జామునే కోవెలకు వెళ్ళి అర్చనలు చేయించుకుంటారు.ద్వారకకు గోదావరి ఒడ్డున కూర్చుంటే చాలా హాయిగా వుంది.  ఆమెకు కూడా గోదావరిలో ప్రయాణం చెయ్యాలనిపించింది.లావా కేసి చూస్తూ అడిగింది, ‘ ఏమండీ!  మనం కూడా సరదాగా పడవలో అవతలి రేవు దాకా వెళ్ళి, మళ్ళీ తిరిగి అదే పడవలో ఇక్కడికి వద్దామా?  నేను ఎప్పుడూ పడవ ఎక్కలేదు.’లావా అన్నాడు, ‘ అల్లా ఎందుకు?  నీకంత సరదాగా వుంటే, మనం సెపరేట్ గా ఒక పడవ మాట్లాడుకుని ఒక అరగంట గోదావరిలో షికారు చేద్దాం.’ద్వారక సంబరంగా అంది, ‘ అబ్బ!  అల్లాకూడా వెళ్ళచ్చా?  అల్లా ఐతే ఇంకా బాగుంటుంది.  ఐతే పదండి, వెళదాం.’ లావా లేస్తూ అన్నాడు, ‘ నాకు పడవ ప్రయాణం ఎప్పుడూ అలవాటే.  కాని నీతో పడవలో ప్రయాణం చెయ్యడం అంటే, ఇది నాకు అరుదైన, మహత్తరమైన అనుభూతి.  పద, వెడదాం.’ లావా వెళ్ళి ఒక బోటు మాట్లాడాడు.  ముందు అందులోకి తనెక్కి, తర్వాత ద్వారకకి చేయి అందించాడు.  ద్వారక నెమ్మదిగా అతని చేయి పట్టుకుని పడవ ఎక్కింది.  పడవ నెమ్మదిగా గోదావరిలో పైకి, కిందకి ఊగుతూ సాగిపోతోంది.  ద్వారక చిన్నపిల్ల లాగ గోదావరి నీళ్ళలో చెయ్యి పెట్టి ఆడుకుంటోంది. లావా నెమ్మదిగా ద్వారకతో అన్నాడు, ‘ ద్వారకా!  నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి.’ ద్వారక గోదావరి నీళ్ళతో ఆడుకుంటూనే తలెత్తకుండా అంది, ‘ మాట్లాడండి.’ లావా కొంచెం అసహనానికి గురయ్యాడు.  ‘ ద్వారకా!  బి సీరియస్.  ఇది నాకు జీవన్మరణ సమస్య.  నువ్వు శ్రద్ధగా వినకపోతే ఎలాగు?’ ద్వారక నొచ్చుకుంది.  ‘ ఐ యాం సారీ అండీ.  ఈ గోదావరిని చూస్తూంటే నన్ను నేనే మరిచిపోతున్నాను.  సరే, నౌ అయాం సీరియస్.  చెప్పండి.’ పడవ గోదావరిలో చాలా దూరం వెళ్ళింది.  వాళ్ళిద్దరూ చాలా సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు. (ఐతే వాళ్ళు మాట్లాడుకుంటున్నది ఈ రచయితకు వినబడటల్లేదు.  రచయిత తన ఏ.సి.గదిలో కూర్చుని వున్నాడు.  ఎదర టేబులు మీద కాగితాల దొంతరలున్నాయి.  వాటి పక్కన ఎం.పి.3 ప్లేయర్ లోంచి మంద్రంగా ఈమని శంకరశాస్త్రి గారి వీణా వాదనం వస్తోంది.  చెవులు రెండూ ఆ సంగీతాన్ని హాయిగా ఆస్వాదిస్తున్నాయి.  చేతులోని పార్కర్ పెన్ను అలవోకగా కాగితాల మీద వ్రాసుకుంటూ పోతోంది.  పాత్రలు రెండూ, అంటే ద్వారక, లావా గోదావరిలో దూరంగా వెళ్ళకుండా మాట్లాడుకుంటున్నంత వరకు అతడికి వినబడ్డాయి.  కాని వాళ్ళు పడవలో దూరంగా వెళ్ళిపోయే సరికి, వాళ్ళ మాటలు వినపడక, కలం టేబులు మీద వుంచేసి, తన ఊహకి పదును పెట్టాడు.  అందుచేత వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో రెండు రకాలుగా ఊహించుకుంటున్నాడు.  ఐతే గియితే వాళ్ళు ఆస్తికత, నాస్తికత గురించి వాదోపవాదాలు చేసుకుంటూ వుండి వుండాలి.  లేకపోతే ఆ వయసు వారి మధ్య జనించే సహజమైన ఆకర్షణ గురించన్నా మాట్లాడుకుంటూ వుండి వుండాలి.) లావా గోదావరి కేసి చేయి చాపి ఏదో అన్నాడు.  మళ్ళీ పైన సూర్యుడి కేసి, ఒడ్డు కేసి చూపించి ఏదో అన్నాడు.  తరవాత చేయి గుండెల కేసి కొట్టుకున్నాడు.  ఆ తర్వాత చేయి గాలిలోకి ఊపి ఏదో అన్నాడు. (రక్తి: ‘ఈ పంచభూతాల సాక్షిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను.  నీకు జీవితాంతం తోడుగా వుంటాను.  మనిద్దరం ఈ క్షణం నించే భార్యాభర్తలం.’ అంటున్నాడా?) (నాస్తి:  ‘ఈ భూమి, ఈ ఆకాశం, ఈ సూర్యుని చుట్టూ భూమి తిరగడం – ఇదంతా శాస్త్రీయంగా జరుగుతున్నదే కాని, ,పైన ఎవడో దేవుడనే వాడుండి జరుపుతున్నది కాదు.  ఈ మాత్రం అర్థం చేసుకోకుండా ఎందుకు మూఢనమ్మకాల్లో పడిపోతున్నావు?’ అంటున్నాడా?) ద్వారక అతడి కేసి తిరిగి చేతులు జోడించింది.  పిడికిలి బిగించింది.  మళ్ళీ చేయి చాపింది.  అతడు ఆమె చేతిలో చేయి వేసాడు. (రక్తి: ‘ నీ భావాలు నీవి.  నా భావాలు నావి.  చేతికున్న ఐదు వేళ్ళూ సమానంగా వుండవు.  కాని అవి కలిసే వుంటాయి.  అలాగే నేను ఆస్తికురాలినే కావచ్చు.  నీవు నాస్తికుడివే కావచ్చు.  ఐనంత మాత్రాన మనం కలిసి జీవించలేమా?  నాకు నువ్వు కావాలి.  మనిద్దరం జీవితాంతం కలిసి వుంటామని ప్రమాణం చెయ్యి.’ అంటోందా?) (భక్తి: భగవంతుడు కచ్చితంగా వున్నాడు.  అతడి అనుగ్రహం వల్లనే పంచభూతాలు కలిసికట్టుగా ప్రపంచానికి సృష్టి, స్థితి, లయలు కలిగిస్తున్నవి.  ఋజువు చూపిస్తే నా దారిలోకి వస్తానని ప్రమాణం చెయ్యి.’ అంటోందా?) (రచయితకి అంతా అగమ్యగోచరంగా వుంది.  అమ్మయ్య, పడవ ఒడ్డుకు వచ్చేస్తోంది.  ఇంక వాళ్ళ మాటలు వినబడతాయి.  ఇంక కథ కొనసాగించ వచ్చు అని దీర్ఘంగా నిశ్వసించి తిరిగి కలం చేతులోకి తీసుకున్నాడు.) పడవ ఒడ్డుకు చేరుకుంది.  ముందు లావా కిందకి దిగి, ద్వారకకు చేయి అందించాడు.  ద్వారక చిరునవ్వుతో అతడి చేయి అందుకుని చెంగున కిందకి దూకింది. లావా ఆమె చేతిని వదల్లేదు.  ఆమె చేతిని మృదువుగా నొక్కుతూ ఆనందంగా అన్నాడు, ‘ థాంక్స్ ద్వారకా!  నువ్వు ఇంత త్వరగా అంగీకరిస్తావని నేను అనుకోలేదు.  అడిగితే ఏమనుకుంటావో అని భయపడ్డాను కూడా.  నాకెంతో సంతోషంగా వుంది.’ ద్వారక నవ్వుతూ అంది, ‘ లావాగారూ!  మీరడిగిన తీరు చూసాక ఒప్పుకోకుండా వుండలేక పోయాను.’ ఇద్దరూ చేతిలో చేతులు వేసుకునే రామదాసుగారి ఇంటికి చేరుకున్నారు.  అప్పటికి దాదాపు నలభయి మంది లావా స్నేహితులు అక్కడికి చేరుకుని వున్నారు.  వాళ్ళందర్నీ చూడగానే లావాకి ఎక్కడ లేని బలం వచ్చేసింది.  అతడి మొహం సంతోషంతో వెలిగిపోయింది.  వాళ్ళందర్నీ పేరు పేరునా పలకరించి, కవుగలించుకుని, వాళ్ళందర్నీద్వారకకు పరిచయం చేసాడు.  ఆ తర్వాత ద్వారకతో సహా అందరూ ఒక పక్కకి వెళ్ళి మంతనాలు జరపసాగారు. మూడు నిముషాలకో కొబ్బరికాయ పగులుతోంది.  అంతర్యామి గారి కార్యదర్శి అయిన భగవంతంగారు వేదిక మీద హడావిడిగా తిరుగుతూ ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడి వాతావరణం ఎంతటి నాస్తికుల నయినా ఆస్తికులుగా మార్చివేసేలా అనిపిస్తోంది. ఐతే ఆ పవిత్రమైన వాతావరణంలో ఇద్దరి చిరకాల వాంఛలు పూర్తి కావలసి వున్నాయి. అంతర్యామి గారి బండారాన్ని బైట పెట్టి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావాలనే లావా కోరిక! మరి ద్వారకకున్న కోరికేమిటో సరిగ్గా తెలీదు.  కాని ఆమె ప్రవర్తన చూస్తూంటే, లావా తోడు లభించడం భగవంతుడామెకు అందించిన అపూర్వమైన వరంగా భావిస్తున్నట్లనిపిస్తోంది.  వారి స్నేహం వివాహానికే దారి తీస్తుందో, విడిపోవడానికే కారణమవుతుందో తెలియదు.  ఎందుకంటే వాళ్ళిద్దరికీ భావాలలో చాల వైరుధ్యం వున్నట్టు స్పష్టమవుతోంది.  స్నేహంగా వుండడం వేరు, జీవితాంతం భార్యాభర్తలుగా కలిసి వుండడం వేరు. ఒకవేళ లావాని వివాహం చేసుకోవాలనే ద్వారక గనక నిశ్చయించుకుని వుంటే, ఆమె పొరపాటు పడిందేమోననే అనిపిస్తోంది. ఏది ఏమైనా, ఆ రాత్రి అక్కడ కొన్ని అద్భుతాలు జరగవచ్చనే అనిపిస్తోంది.
******************
          అంతర్యామిగారు ప్రజలనుద్దేశించి ప్రసంగించడం మొదలుపెట్టారు.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే ||ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం భూయో భూయో నమామ్యహం ||మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుధ్ధిమతాం వరిష్ఠం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ||
           సభాయైనమ:  ఇక్కడకు విచ్చేసిన పరమ భాగవతోత్తములారా!  అపూర్వ భక్తశిఖామణులారా!  పరస్త్రీని కన్నెత్తి కూడా చూడని ఏకపత్నీవ్రతుడు, పితృవాక్య పరిపాలనా దురంధరుడు, ఐహిక సుఖాల కన్న నైతిక విలువలకే అత్యధిక ప్రాధాన్యత వున్నదని చాటి చెప్పిన మహనీయుడు అయిన ఆ రఘువంశ సుధాంబుధి చంద్రుడు, ఆ ఇనకుల తిలకుడు, ఆ జానకీ హృదయనాథుడు, ఆ శ్రీరామచంద్రుడు మీకు సకల సుఖాలు కలిగించు గాక!సర్వకాల సర్వావస్థల యందు శ్రీరాముని పాదపద్మములనే మనసులో ధ్యానించుకొనువాడు, జితేంద్రియుడు, ధీశాలి, అపూర్వబల సంపన్నుడు, వాయుసూనుడు, లంఖిణి పీచమడంచిన వాడు, లక్ష్మణ ప్రాణదాత అయిన అంజనాసూనుడు, ఆ ఆంజనేయస్వామి మీకు ఆయురారోగ్యములను, సకలైశ్వర్యాలను, సుఖశాంతులను ప్రసాదించు గాక!నా ఉపన్యాసం లోని సారాంశం ఇప్పటికే మీకు అర్థం అయివుంటుంది.  కేవలం అర్థం చేసుకున్నంత మాత్రాన సరిపోదు.  నేను చెప్పే విషయాలు మీరు ఆచరణలో పెట్టాలని మీకు సందేశమిస్తున్నాను.కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను అరిషడ్వర్గాలు అంటారు.  అంటే మన మోక్షమార్గంలో అవి అవరోధాలన్న మాట.  ఈ ఆరు శత్రువులను జయించడం మానవుల ప్రథమ కర్తవ్యం.  మన జీవన విధానాన్ని తదనుగుణంగానే మలుచుకోవాలని మీ అందరికీ నేను ఆదేశమిస్తున్నాను.ధర్మార్థ కామ మోక్షాలలో అర్థ కామముల ధ్యాసయె గాని, ఇతరములు లేక మగ్గిపోయే మానవాళికి నేను హెచ్చరిక చేస్తున్నాను.ధర్మమార్గాన్ని అనుసరించండి.  మోక్షగాములై చరించండి.ధర్మార్థ కామ మోక్షాలు పురుషార్థాలు అని చెప్పారు.  వాటిని పురుషార్థాలే అని ఎందుకన్నారు?  స్త్రీల అర్థాలు అని ఎందుకనలేదు? ఆలోచించండి. తండ్రి చాటున, భర్త సంరక్షణలో, పుత్రుల పోషణలో వుండవలసినది ఆడది!  ఆమెని సరైన మార్గంలో నడిపించవలసిన వాడు మగవాడు! స్త్రీ ఎక్కడైతే పూజింప బడుతుందో, అక్కడ సకలైశ్వర్యాలు వుంటాయి.  కలకంఠి కంట కన్నీరొలికిన చోట దారిద్ర్యం తాండవిస్తుంది. కనక మీరంతా సన్మార్గ గాములై చరించాలని, స్త్రీకి సమాజంలో అత్యున్నత స్థానాన్ని ఇచ్చి గౌరవించాలని, ఇంద్రియ నిగ్రహంతో సాధన చెయ్యాలని సందేశమిస్తున్నాను.
          ప్రస్తుత సమాజంలో అన్యాయాలు, అక్రమాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  హింస పెచ్చుమీరి పోతోంది.  రాజకీయం భ్రష్టు పట్టింది.  దేశానికి చక్కని పరిపాలనని అందించ వలసిన నాయకులు ధనసంపాదనే ధ్యేయంగా చేసుకుని, రాజకీయాన్ని లాభసాటి వ్యాపారంగా మార్చేసారు.  అసెంబ్లీ లోను, పార్లమెంటులోను, రాధ్ధాంతాలు, వాకౌట్లే తప్ప పరిపాలన సాగటల్లేదు.  ప్రతిపక్షాలవారు ప్రభుత్వాన్ని మీ పాలనలో లంచగొండితనం పెరిగిపోయిందని, నేరాలు, అత్యాచారాలు ఎక్కువై పోయాయని ఆరోపిస్తారు.  దానికి ప్రభుత్వం వారు, మీ పాలనలో ఇంతకన్న ఎక్కువగానే ప్రజలను దోచుకున్నారని, మీ పాలనలో హత్యలు, మానభంగాలు ఇంతకన్న ఎక్కువగానే జరిగాయని సిగ్గు లేకుండా సమాధానమిస్తారు.  ఎం.ఎల్.ఏ.లు, ఎం.పి.లు రోడ్ల మీద పడి, గూండల కన్న హీనంగా అరాచకాలు సృష్టించడం, బందుల పేరుతో ప్రభుత్వ ఆస్తులని, ప్రైవేటు ఆస్తులని ధ్వంసం చెయ్యడం చేస్తున్నారు.  ఒకవేళ పోలీసులు గత్యంతరం లేక లాఠీచార్జి చేస్తే, వారిని కూడా చితకబాదుతున్నారు.  ఆస్తులని ధ్వంసం చేసిన వారి మీద, బస్సులని తగలబెట్టిన వారిమీద పోలీసులు కేసులు పెడితే, ఈ ప్రజానాయకులే హీనంగా ఆ కేసులు ఎత్తివేయాలని, లేకపోతే మళ్ళీ బందులు చేస్తామని హెచ్చరికలు చేస్తున్నారు.  దోపిడీలు, హత్యలు చేసే గూండాలు కూడా రాజకీయాల్లోకి వచ్చి, కొద్ది రోజుల్లోనే కోట్లకు పడగలెత్తుతున్నారు.  ఉద్యోగులకు జీతాలు పెంచాలంటే, యాజమాన్యం, కార్మిక సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వ అధికార్లు కలిసి సమావేశమై, ట్రైపార్టైట్ టాక్స్ జరిపి అప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు.  కాని ఎం.ఎల్.ఏలు, ఎం.పి.లు వారికి వారే జీతాలు, అలవెన్సులు విపరీతంగా పెంచేసుకుంటారు.  ధరలు విపరీతంగా పెరిగిపోతూ, సామాన్య మానవుడి జీవితం దుర్భరమై పోతున్నా ఎవరూ పట్టించుకోరు.  ఏ పార్టీవారు అధికారంలోకి వచ్చినా, మరే పార్టీవారు ప్రతిపక్షంలో కూర్చున్నా ఇదే తంతు.సినిమాలలో హీరోల దగ్గర్నుంచి, రాజకీయాలలో పదవుల దాకా అంతా వారసత్వమే తప్ప, అర్హులకి స్థానం లభించదు.సంఘంలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోంది.  ధర్మాసుపత్రులలో, ప్రభుత్వ కార్యాలయాలలో, ఒక చోట అనేమిటి, అన్ని చోట్లా లంచగొండితనం ఎల్లలెరుగకుండా స్వైరవిహారం చేస్తోంది.చదువుకుని వృధ్ధిలోకి రావాల్సిన విద్యార్థులు ఇహలోక సుఖాలపై ఎక్కు వ మొగ్గు చూపుతున్నారు.  ఆడపిల్లల్ని ప్రేమ పేరుతో వేధించడం, వాళ్ళు తమ ప్రేమను అంగీకరించక పోతే వారిపై పట్టపగలు నడిరోడ్డు మీద యాసిడ్ దాడులు చెయ్యడమో, లేక హత్య చెయ్యడమో చేస్తున్నారు.నేరగాళ్ళు చిన్నపిల్లల్ని సైతం వదలటల్లేదు.  వారిని కిడ్నాప్ చేసి దారుణంగా చంపేస్తున్నారు.దొంగలు పట్టపగలే స్త్రీల మెడలలోంచి అతి పవిత్రమైన మంగళసూత్రాలని సైతం లాక్కుని పరారవుతున్నారు.  నిద్రిస్తున్న వారిని కిరాతకంగా చంపేసి దోపిడీలకు పాల్పడుతున్నారు.ఆ నేరస్తుల్ని పట్టుకుని ఒకవేళ కోర్టులో హాజరు పరిచినా కేసులు ససంవత్సరాల తరరబడి సాగుతాయి.  ఆ నేరస్తులకి రాజకీయ నాయకుల ప్రోద్బలం వుంటుంది.  వారికి జైళ్ళలో కూడా సకల రాజభోగాలు జరుగుతాయి.  వారికి రాజకీయ నాయకులతో సంబంధాలు వుండే నిమిత్తం సెల్ ఫోన్లు కూడా సప్లై చెయ్యబడతాయి.  ఒకవేళ వారికి కింది కోర్టులో శిక్ష పడినా, వారు పై కోర్టుకి, అక్కడ చుక్కెదురైతే సుప్రీం కోర్టుకి వెళతారు.  ఈలోగా బెయిలుపై విడుదలయి మరిన్ని నేరాలు చేస్తారు.  లేకపోతే ప్రభుత్వం వారే అంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా అనో, మరే కారణమో చూపి కరడు గట్టిన నేరస్తుల్ని సైతం మూకుమ్మడిగా విడుదల చేసేస్తారు.  న్యాయస్థానం వారు అది తప్పని మొట్టికాయలు వేసినా వారికి సిగ్గెగ్గులుండవు. సమాజం ఇంతలా పాడైపోవడానికి ముఖ్య కారణం మనలో భక్తి తగ్గిపోవడం, మనలో ఆధ్యాత్మిక తత్వం సన్నగిల్లడం.  అందువల్ల మళ్ళీ మనందరం దైవభక్తి పెంపొందించుకోవాలి. అంతేకాదు, మీరంతా చుట్టూ వున్న తమస్సుని తిట్టుకుంటూ కూర్చోకుండా, మీ మీ వంతు బాధ్యతని చిత్తశుధ్ధితో నిర్వర్తించాలని చెబుతున్నాను.  ఈ సందర్భంగా మీకో పాట పాడి వినిపిస్తాను, వినండి.
ఎటు పోతోందీ దేశం? ఆలోచించు నేస్తం! చుట్టూ చీకటి, మదిలో చీకటి వెలిగించు చిరుదీపం ||విద్యార్థులమని అంటారు కళాశాలలకు వస్తారు సమ్మెలు చేస్తూ వుంటారు చదువుకు నామం పెడతారు ||ప్రజాసేవకులమంటారు ప్రభుత్వసంస్థల నుంటారు లంచాలను తెగమేస్తారు నీతికి గంతలు కడతారు ||ప్రజానాయకులమంటారు ఎన్నికలెన్నిక లంటారు ఓట్లకు నోట్లను ఇస్తారు భ్రష్టులు నాయకులౌతారు ||కళారాధకులమంటారు ప్రజలను మార్చాలంటారు ఏమార్చే వాళ్ళవుతారు కాసుల కమ్ముడు పోతారు ||గంగాయమునలు పారేటి ధర్మభూమి అని అంటారు ధర్మో రక్షతి రక్షిత: ఈ సూత్రం తెలియక వున్నారు ||
          ఇక ఈ రోజు మంగళవారం.  మంగళ ప్రదమైన రోజు.  ఆంజనేయస్వామికి ప్రీతిపాత్రమైన రోజు.  ఇక్కద భక్తశిఖామణులందరు సంఘటితమైన రోజు.  ఈనాడు మనందరం హిందూమతాన్ని పునరిధ్ధామని దృఢదీక్షా కంకణ బధ్ధులమవుదాం.  ఇప్పుడు విచ్చలవిడిగా చెలరేగుతున్న నాస్తికత్వాన్ని కూకటివేళ్ళతో సహా పెకలించి, తిరిగి కృతయుగంలోకి, అంటే ఏ యుగంలోనైతే ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందో, అక్కడికి, అంటే కొన్ని వేల ఏళ్ళ వెనక్కి ఈ భారతదేశాన్ని తీసుకువెళ్ళిపోదాం!ఇప్పుడు మీకందరికీ ఎలుగెత్తి పిలుపునిస్తున్నాను.  అందరూ ముక్తకంఠంతో భగవంతుడిని కీర్తించండి.  ఒక్కరు చేసే ప్రార్థన కన్న సామూహికంగా చేసే ప్రార్థనకు కొన్ని వేల రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుంది.  మీరు కీర్తించేటప్పుడు భక్తిభావన ఉప్పెనలా గుండెలనించి చిప్పిల్లాలి.  కేవలం భక్తిరసమె కాదు.  మీ పిలుపుకి భగవంతుడు ప్రతిస్పందించాలంటే మీలో దైన్యముండాలి.  అహంకారాన్ని వదిలివేసి, ప్రాపంచిక విషయాలని కాసేపు విస్మరించి, అకుంఠిత భక్తిభావంతోను, అత్యంత దీనభావం తోను ఎవరైతే భగవంతుణ్ణి ప్రార్థిస్తారో, వారికి తప్పకుండా ఫలితం లభిస్తుందని నేను హామీ ఇస్తున్నాను.అందరూ నాతో గొంతు కలపండి.జై పవనపుత్ర హనుమాన్ కీ ---------వేలకొద్దీ గొంతులు బదులు పలికాయి-----------' జై 'భజన ప్రారంభమయింది.
' అంజనిపుత్రా - ఆంజనేయా వాయునందనా - ఆంజనేయా రామభక్తా - ఆంజనేయా లంఖిణి జంపిన - ఆంజనేయా! భక్తరక్షకా - ఆంజనేయా! దుష్టశిక్షకా - ఆంజనేయా!
          జనంలో కొందరికి ఆవేశం అంతకంతకూ అధికమవుతోంది.  భక్తిపారవశ్యంతో ఒళ్ళు మైమరిచి పోతున్నారు.పదిమంది తమను తాము అదుపులో వుంచుకోలేక దిగ్గున లేచారు.వారితో పాటు సౌందర్యానికి పరాకాష్ట ఐన ద్వారక కూడా లేచింది!  విచిత్రమైన కాంతితో వదనం మిలమిల మెరుస్తుండగా ఆమె వేదిక మీదకు భజన చేసుకుంటూ, ఊగిపోతూ వెళ్ళింది.ఆ పదిమంది కూడా వేదిక మీదకు భజన చేసుకుంటూ, పూనకం వచ్చిన వారిలా ఊగిపోతూ వెళ్ళి, ఆంజనేయస్వామి విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, నృత్యం చెయ్యసాగారు.దాన్నే శాస్త్రజ్ఞులు మాస్ హిస్టీరియా అంటారేమో మరి!ద్వారక కళ్ళు అరమోడ్పులయ్యాయి.  ఆమెకు తనెక్కడుందో కూడా తెలియటల్లేదు.  సాక్షాత్తు భగవంతుని సన్నిధిలోనే తానున్నది అనుకుంటోంది.  ఈ ప్రపంచంతో తనకేమీ సంబంధం లేనట్లు, తను, తన స్వామి తప్ప మరెవరితోను సంబంధం లేనట్లు కనిపిస్తోంది.భజన ఇంకా తీవ్రతరమైంది.
' జ్ఞానసాగరా - ఆంజనేయా! జయ కపీశ్వరా - ఆంజనేయా! అతి బలశాలీ - ఆంజనేయా! శూరా వీరా - ఆంజనేయా! వజ్రశరీరా - ఆంజనేయా! కేసరి తనయా - ఆంజనేయా! జగద్వంద్యుడా - ఆంజనేయా!
          అంతర్యామిలో చలనం ఆరంభమైంది.  ఆయన కూడా ఆవేశంగా ఊగిపోసాగారు.
' విద్వన్మణివే - ఆంజనేయా! సుగుణసాగరా - ఆంజనేయా1 చతురుడవయ్యా - ఆంజనేయా! రామదాసువే - ఆంజనేయా!'
          రామదాసు కళ్ళనుంచి అశ్రువులు ధారగా జాలువారుతున్నాయి.  ఆయన కళ్ళు మూతలు పడిపోయాయి.  తన్మయత్వంతో గొంతెత్తి భజన చేయసాగారు.
' సూక్ష్మరూపా - ఆంజనేయా! విశ్వస్వరూపా - ఆంజనేయా!'
          అంతర్యామిగారి కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా మారిపోయాయి!  మొహమంతా కందగడ్డలా అయిపోయింది!  శరీరమంతా వణికిపోతుండగా దిగ్గున లేచాడు.  నిలువెల్లా ఆవేశంతో ఊగిపోతున్నాడు.  మూతి పొడవుగా ముందుకు సాగింది!  గదను ధరించినట్లుగా చేయి గాలిలోకి లేచింది!  ఆయనకు ఆంజనేయస్వామి వంటిమీదకు వచ్చాడు!అందరూ జయజయ ధ్వానాలు చేసారు.  ఎవరికీ వంటిమీద స్పృహ లేదు.భగవంతంగారు, మిగిలిన శిష్యులు కలిసి గబగబా నూటేడు కొబ్బరికాయలు కొట్టారు.నూట ఎనిమిదవ కొబ్బరికాయ కొట్టబోతుండగా, అంతర్యామిగారు ఆవేశంగా ఆ కొబ్బరికాయను చేతుల్లోకి తీసుకుని, అరచేతితో దానిమీద చరిచారు.  అది భళ్ళున బద్దలలయింది!చేతిని గాలిలోకి తిప్పారు.  అల్లా తిప్పుతూండగానే ఆయన చేతిలో హారతి కర్పూరం ముద్ద తెల్లగా కనిపించింది.!  అందరూ చూస్తుండగానే ఆ హారతి కర్పూరం భగ్గున మండింది!ఎక్కడినుంచో గంటలు గణగణమని మోగుతున్నట్టు చప్పుదు వినిపించసాగింది!ఆ కర్పూరం అల్లా మండుతుండగానే, ఆ మండుతున్న ముద్దను నోట్లో వేసుకుని అంతర్యామిగారు మింగేసారు!  వేదిక పైన కట్టిన షామియానా లోంచి సుగంధాలు వెదజల్లుతూ రకరకాల పువ్వులు కురిసాయి! ఆ అద్భుతాలను తిలకించిన అందరి తనువులూ పులకరించిపోయాయి!  వారందరరి జీవితాలు ఆ అపూర్వ దృశ్యాలను వీక్షించడం వలన పరమ పునీతమయ్యాయి! భగవంతంగారు పళ్ళెంలో పెద్ద ముద్దహారతి కర్పూరం వుంచి అంతర్యామిగారికి హారితి ఇచ్చారు.  మెల్లగా అంతర్యామిగారి కళ్ళు తెరుచుకున్నాయి.  ఆయన తిరిగి మామూలు మనిషిగా అయ్యారు.  ఆంజనేయస్వామి విగ్రహం కేసి చూస్తూ భజన కొనసాగించారు.
' భీమరూపా - ఆంజనేయా! అసుర సంహారా - ఆంజనేయా! లక్ష్మణ రక్షక - ఆంజనేయా! చిరంజీవివే - ఆంజనేయా! జలధిని దాటిన - ఆంజనేయా! బ్రోవుమయా మము - ఆంజనేయా1'
          ఉన్నట్లుండి ద్వారక కెవ్వున అరిచింది!అందరూ ఆమెకేసి తిరిగారు.ఆమె పూనకం వచ్చి ఊగిపోతోంది.  ధరించిన దుస్తులు అస్తవ్యస్తమై పోతున్నాయి.  మొహం ఎర్రగా మారిపోయింది.  కళ్ళు అరివీర భయంకరంగా నెత్తుటి వర్ణంలోకి మారిపోయాయి!  నోట్లోంచి నాలుక బాగా పొడుగ్గా వెళ్ళుకు వచ్చింది!ఆ నాలుక నిండా రక్తం అంటుకుని వుంది!ఆమె వంటి మీదకు కాళికాదేవి వచ్చింది!ఆమె చేతులు పక్కకి చాపి, మహిషాసురమర్దినిలా భీకరంగా నృత్యం చెయ్యసాగింది!జనంలో భక్తిభావం మరింత పెల్లుబికింది. వేదిక మీదకు వెళ్ళి నృత్యం చేస్తున్న యువకులు గబగబా ఆమెకు హారతి ఇచ్చి, నిమ్మకాయలు కోసి ఆమెకు నివేదన చెయ్యసాగారు.  విచిత్రంగా ఆ నిమ్మకాయల లోంచి రక్తం కారుతోంది!! జనమంతా ఆమెకు సాష్టాంగ నమస్కరాలు చెయ్యసాగారు. ఆమె గొంతు చించుకు అరుస్తోంది, ' ఒరేయ్!  నేనురా.......!  మీ అందరికీ అమ్మనిరా.....!  మహిషాసురమర్దినినిరా!  నన్నే మరిచిపోతారురా?.....' అందరూ చూస్తూండగా ఆమె చెయ్యి గాలిలోకి తిప్పింది.  ఆమె చేతిలో కొబ్బరికాయ ప్రత్యక్షమైంది!  ఆ కొబ్బరికాయను గాలిలోకి విసిరి, తల అడ్డు పెట్టింది.  ఆ కొబ్బరికాయ భళ్ళున పగిలి, అందులోంచి నీళ్ళకి బదులు ఎర్రని రక్తం వచ్చి, ఆమె తలంతా తడిపేసింది!  ఆమె రూపం భీకరంగా కనిపించసాగింది.  ఆమె రెండు చేతులూ గాలిలోకి తిప్పేసరికి, రెండు నిమ్మకాయలు ఆమె రెండు చేతులలోకి వచ్చాయి!  వాటిని కర్కశంగా నలిపేస్తుంటే, వాటిలోంచి రక్తం ధారలుగా ప్రవహించ సాగింది! ఆమె ఆబగా రక్తం జుర్రుకోసాగింది! ఆ యువకులు ఆమె చుట్టూ చేరి, వంగి వంగి దణ్ణాలు పెడుతూ, ' అమ్మా!  కాళీమాతా!  శాంతించు తల్లీ!  మీ బిడ్డలం తల్లీ!  మమ్మల్ని క్షమించమ్మా!' అంటూ వేడుకోసాగారు. ఆమె ఉగ్రంగా అరిచింది, ' మీరు కాదురా అపరాధులు!  మీ మీద కాదురా నా ఆగ్రహం!  వీడురా........వీడురా..........నన్ను నిరతం ఆరాధించే ఆ శ్రీరామచంద్రుడి బంటుని పూజించే ఈ అంతర్యామిగాడి మీదరా నా కోపం!.....................నన్ను మరిచిపోయేంత అహంకారం వీడికొచ్చేసిందిరా?  నన్ను ధిక్కరించేటంత పొగరుమోతుతనం వీడిలో పెరిగిపోయిందటరా?' అందరూ నిర్ఘాంతపోయారు! ఆ యువకులు మళ్ళీ లెంపలేసుకుని దణ్ణాలు పెడుతూ, ' అమ్మా!  శాంతించు తల్లీ.  ఏమీ ఎరుగని అజ్ఞానులం తల్లీ!' అని మొర పెట్టుకోసాగారు. ఆమెలో ఉద్రేకం ఇంకా పెరిగిపోయింది. ' అందుకే మీకందరికీ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించడానికే జ్యోతిస్వరూపుడైన పరమాత్మ నన్ను మీ దగ్గరికి పంపించాడురా.  ఈ అంతర్యామి వచ్చే దారిలో, త్రేతాయుగంలో సీతా లక్ష్మణ భరత శతృఘ్న సహితుడైన శ్రీరాముడు, ఆంజనేయస్వామి భజిస్తుండగా, నా విగ్రహాన్ని ప్రతిష్టించి పూజ చేసిన ప్రదేశం వుందిరా.  అక్కడ కొలువై వున్న నన్ను నిర్లక్ష్యం చేసి, నాకు అర్చనలు జరపకుండా, ఇలా వచ్చేస్తాడ్రా ఈ అంతర్యామి?  వీడి రక్తాన్ని ఇప్పుడే పీల్చి తాగేస్తానురా.  వీడి పేగులు తీసి నా మెడలో దండలా వేసుకుంటాన్రా.' అంతర్యామిగారు మెల్లగా లేచారు.  ఆమె వద్దకు వెళ్ళి చేతులు జోడించారు. ' కుపుత్రో జాయేత్, క్వచిదపి కుమాతా న భవతి!  తెలియక చేసిన తప్పును మన్నించు తల్లీ!  నా తిరుగు ప్రయాణంలో ప్రత్యేకించి అక్కడ ఆగి, నిన్ను సహస్ర నామాలతో అర్చించుకుంటా తల్లీ!  అంతే కాదు, ఇక్కద భక్తులు సమర్పించుకున్న కానుకలన్నీ నీ హుండీలో వెసేస్తానమ్మా!' పూజలు బెడిసి కొట్టడమంటే ఇదేనేమో!  ఆంజనేయస్వామి ఒంటి మీదకు ఆవహించే అంతర్యామిగారు పొరపాటు చెయ్యడమా?  ఎంత ఆశ్చర్యం! ఆమె శాంతించలేదు.  ' లేదురా, నిన్ను క్షమించే ప్రసక్తే లేదు.' అంటూ చుట్టూ కలయజూసింది. అక్కడ అనవసరంగా వచ్చి ఈ రొంపిలో ఎందుకు ఇరుక్కున్నానురా భగవంతుడా!' అన్నట్లుగా వణికిపోతున్న లావా మీద ఆమె దృష్టి పడింది.  ఆమె అతడి కేసి కౄరంగా చూసింది. ' ఒరేయి నాస్తికుడూ!  ఇల్లా రారా.  నా అస్తిత్వాన్నే శంకిస్తున్నావు కదురా?  నా మహిమలు నీ ద్వారానే నేను చూపిస్తాను.  నిన్నే నా త్రిశూలంగా ఉపయోగించుకుని, ఈ అంతర్యామిగాడి అంతు చూస్తాను.  రారా!' అని గర్జించింది. లావా నిలువెల్లా వణికిపోతున్నాడు.  అతడికి ముచ్చెమటలు పోసాయి.  తన బతుకు ఇవాళ్టితో అంతమై పోతోందా అన్నట్లు తెగ భయపడి పోసాగాడు.  పడుతూ, లేస్తూ ద్వారక దగ్గరకు వెళ్ళి, ఆమెకు సాష్టాంగ నమస్కారం చేసాడు.  అల్లా చేస్తుండగానే అతడికి స్పృహ తప్పింది. ఆమె గర్జించింది.  ' లే, లేవరా నాస్తికుడూ............' లావా నిద్రలో వున్నట్లుగా లేచాడు.  అతడి కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి.  అతడికి అక్కడ వున్న జనంతోను, అక్కడ జరుగుతున్న సంఘటనలతోను ఏమీ ప్రమేయ్హం లేనట్లుగా విగ్రహం లా నుంచున్నాడు. ' వెళ్ళరా నాస్తికుడూ!  వెళ్ళి అంతర్యామిని వచ్చి నా కాళ్ళకు మొక్కమని చెప్పు.' లావా నిర్వికారంగా అంతర్యామి దగ్గరకు వెళ్ళి చేతులు చాపాడు.  ఆశ్చర్యం!  అతడి చేతిలోకి ఒక పూలమాల వచ్చింది!  ఆ పూలమాలని అంతర్యామికి అందించాడు. అంతర్యామి ఆ మాలను అందుకుని ఆమె వద్దకు వెళ్ళి, ఆమె కాళ్ల మీద ఆ మాలనుంచి, భక్తి శ్రధ్ధలతో నమస్కరించాడు. ఆమె భయంకరంగా ఛీత్కారం చేసి, ఆ పూలమాలను గాలిలోకి తన్నింది. ఆ మాల తిరిగి లావా చేతిలో పడింది. కాని అద్భుతం!  చూస్తూండగానే ఆ మాల చిన్న త్రిశూలంగా మారిపోయింది!!! ఆమె గర్జించింది.  ' రారా, నాస్తికుడూ!  వచ్చి ఆ త్రిశూలంతో ఈ అంతర్యామి పొట్ట నిలువునా చీల్చి, వాడి పేగులు పైకి తీసి నా మెడలో మాలగా వెయ్యి.  హ..........హ..........హ...........!' లావా రాక్షసంగా అంతర్యామి మీదకు దూకాడు.  అంతర్యామి ప్రాణభయంతో కెవ్వున అరిచి జనంలోకి పరిగెట్టాడు.  లావా ఆయన్ని తరమసాగాడు. అంతర్యామి రొప్పుతూ వెళ్ళి రామదాసు కాళ్ళమీద పడ్డాడు. ' రామదాసుగారూ!  నన్ను రక్షించండి.  ఇదంతా మోసం, దగా, కుట్ర.....' లావా అంతర్యామి జుట్టు పట్టుకుని పైకి లేపాడు. ' ఎవరిదిరా మోసం, దొంగసన్యాసీ!' అంతర్యామి వణికిపోతూ అన్నాడు, ' నన్ను క్షమించండి.  ఇంకెప్పుడూ జనాన్ని ఇల్లా మోసం చెయ్యను.  నన్ను వదిలెయ్యండి.' జనానికిదేం అర్థం కావటల్లేదు.  అర్థం అయిన కొందరు ఆగ్రహంగా అరిచారు, ' వాణ్ణి వదలడానికి వీల్లేదు.  ప్రాణం పోయేదాకా వాణ్ణి కుళ్ళబొడిచెయ్యండి.' రామదాసు అయోమయంగా అరిచాడు, ' లావా!  ఆగు.  అసలేమిటిదంతా?' జనంలోంచి కూడా కొందరు అరిచారు, ' ఔను.  మాక్కూడా ఏమీ అర్థం కావటల్లేదు.  దయ చేసి విషయమేమిటో వివరంగా చెప్పండి.' లావా గంభీరంగా అన్నాడు, ' అయ్యా, అందరూ దయ  చేసి మీ మీ స్థానాల్లో కూర్చోండి.  జరిగిందేమిటో మీ అందరికీ వివరంగా అర్థమయ్యేలా చెబుతాం.' లావా అంతర్యామిని ఈడ్చుకుంటూ వేదిక మీదకు లాక్కు వెళ్ళాడు. ' ఇక్కడికి విచ్చేసిన అమాయక ప్రజలందరికీ నమస్కరిస్తున్నాను.  ఈ అంతర్యామి మోసగాడని ఇప్పటికే మీ అందరికీ తెలిసిపోయి వుంటుంది.  ఐతే, వీడి బండారం బయట పెట్టడానికి, ఇదుగో, ఈ మహాత్మురాలు నాకు మనస్ఫూర్తిగా తన సహకారాన్నందించింది.' అంటూ ద్వారకను చూపించాడు. ' వీడు చూపించిన మహిమలన్నీ మేము కూడా మీకందరకూ ఇంతకు ముందే చూపించాం.  అవన్నీ మీరంతా గమనించారు.  ఈ మహిమలు చూపించడమనేది అతీంద్రియ శక్తుల వల్ల కాదని, కేవలం హస్తలాఘవం వల్లను, కనుకట్టు వల్లను మాత్రమేనని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను.' లావా అనుచరులందరూ హర్షోల్లాసంతో చప్పట్లు కొట్టారు. లావా మొహం విజయగర్వంతో వెలిగిపోతోంది.  ఇన్నాళ్ళకి తన జీవితధ్యేయం నెరవేరింది.  నిజంగా ద్వారక చేసిన సహాయం మరువరానిది.  తను కోరగానే తనకు సహకరించడానికి ఒప్పుకుంది. రామదాసు వేదిక మీదకు వెళ్ళి ద్వారకనుద్దేశించి గంభీరంగా అన్నాడు, ' ద్వారకా!  అసలు నువ్వెవరివి?  ఈ అంతర్యామి మీద కక్ష గట్టి ఇంత దూరం రావల్సిన అవసరం నీకేమొచ్చింది?  అంతర్యామి మోసగాడని నువ్వు ఋజువు చెయ్యడం నాకు సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ, నీ బరి తెగించిన ప్రవర్తనని నేను మెచ్చుకోలేక పోతున్నాను.  అసలు విషయమంతా లావా ద్వారా కాక, నీ ద్వారా వినాలనుకుంటున్నాను.  దయ చేసి వివరంగా చెప్పు.' ద్వారక అందరికీ వినయంగా నమస్కరించింది.  ' చెబుతాను.  రామదాసుగారికే కాదు, మీ అందరికీ సవినయంగా విన్నవించుకుంటాను.  నా కథ పూర్తయ్యే వరకు ఈ లావాగారు, ఈ అంతర్యామిగారు ఈ వేదిక మీదే వుండాలని, వీరిని ఇక్కడినించి కదలనివ్వకుండా చూడమని, నన్ను ఆడపడుచుగా భావించే వారెవరైనా వుంటే, వారిని అర్థిస్తున్నాను.' చురుకుగా ఇరవై మంది యువకులు, వారిలో లావా అనుచరులు కూడా వున్నారు, వచ్చి వేదిక చుట్టూ వలయాకారంలో నిలబడ్డారు. ద్వారక చెప్పసాగింది. ' ఈ అంతర్యామికి ఆంజనేయస్వామి పూనడం ఎంత అబధ్ధమో, నన్ను కాళికాదేవి ఆవహించడం కూడా అంతే అబధ్ధం.  ఐతే ఈ అంతర్యామి గుట్టు బయట పెట్టాలన్న కోరికతో నేనూ, లావాగారూ కలిసి ఈ నాటకం ఆడాం. ఐతే దీనికన్నా ముందు మీకు మరొక్క కథ చెప్పాలని వుంది.  అది నా కథ......నా వ్యథ!  దయచేసి మీరందరూ కదలకుండా, నా కథ పూర్తిగా వినమని ప్రార్థిస్తున్నాను. ఖండ ఖండాంతరాలలో ఖ్యాతి గొన్న భరతఖండమిది, జగ జగాల చరిత పుటలలో పసిడివన్నె నొంది యున్నది, ఇట త్రివేణి సంగమం - ఘోరాఘ భగ్నకారకం, బహుజాతుల సంగమం - విశాల భావప్రేరకం, ఈ ధరణి పుణ్యచారిణి, క్షమయా ధరిత్రి రూపిణి, ఇచ్చోట జన్మనొందుట, ఇది ఎంతొ పుణ్యఫలమట ' అని కవులు ఉధ్ఘోషించిన పుణ్యభూమిలో నేను పుట్టాను.  ఎక్కడైతే నారి పూజింప బడుతుందో, అక్కడ సకల సంపదలు నిలుస్తాయని, కలకంఠి కంట కన్నీరొలికిన, దరిద్రం తాండవిస్తుందని, ఈ అంతర్యామి లాంటి మహానుభావులు సెలవిచ్చిన సుసంపన్న భారతావనిలో నేను జన్మించాను. కాని, నా ఖర్మ కాలి, నాకు జన్మనిచ్చిన నా తలిదండ్రులు సుసంపన్నులు కారు.  ఈ దేశంలో ఆడపిల్లగా పుట్టడమే దరిద్రం!  మరి, పెరిగి అందాన్ని సంతరించుకుని యువతిగా ఎదగడం ఘోరనరకం! నన్నెల్లా వదిలించుకోవడమా అని నా పుట్టుకనించే నా తలిదండ్రులకి ఆరాటం.  ఆసేతు శీతాచలం వెతికి ఆణిముత్యం లాంటి అల్లుణ్ణి తెచ్చుకున్నారు మా నాన్నగారు.  అల్లా తెచ్చుకునే నిమిత్తమై తన సర్వస్వాన్ని పణంగా పెట్టి, చివరికి బికారిగా మిగిలిపోయారు.  ఆ తర్వాత నా తలిదండ్రులు యాచకవృత్తినే స్వీకరించారో, ఉపవాసాలతో కృంగి, కృశించి మరణించారో నాకు తెలియదు.  కాని, నా జీవితం లోకి ఏలిననాటి శని భర్త రూపంలో ప్రవేశించింది. ఆ తర్వాతి కథ నేను చెప్పక్కర్లేదు.  భారతదేశంలో తరచుగా జరుగుతున్నదే.  రోజూ మీరు పేపర్లలో చదువుతున్నదే.  చదివిన తర్వాత, ' 'ఓస్!   ఇంతేనా?' అని మీరంతా పెదవి విరిచి మర్చిపోతున్నదే. మావారికి డబ్బు కావాలి.  ఆ డబ్బు, అప్పుడప్పుడు ఆయన అవసరాలు తీరేలా, నేను పుట్టింటి నించి తీసుకురావాలి.  అల్లా తేలేక పోతున్నాను కనక, ఆయన పెట్టే చిత్రహింసలన్నీ నేను నోరు మూసుకు భరించాలి. దేనికదే చెప్పుకోవాలి.  ఆయన మహా మేధావి.  నన్ను చిత్రహింసలు పెట్టడంలో ఆయన రోజుకొక కొత్త పధ్ధతి కనిపెట్టే వారు.  ఒకరోజు బ్లేడుతో చర్మం మీద గాట్లు పెట్టి కారం అద్దేవారు.  మరొకరోజు  సిగరెట్టుతో వాతలు పెట్టి పెట్రోలు చల్లేవారు. ఆయన చిత్రహింసలు రాను రాను పరాకాష్ఠకు చేరుకోవడం మొదలయ్యాయి.  ఒకరోజు నేను నీళ్ళు తోడుతుండగా, బలవంతంగా నూతిలోకి తోసేసారు.  నేను మరణభయంతో గావుకేకలు పెట్టేసరికి చుట్టుపక్కలవారు వచ్చి రక్షించారు.  ఏం జరిగిందని అందరూ అడుగుతుంటే, నా కాపురంలో నిప్పులు పోసుకోవడం ఇష్టం లేక, నీళ్ళు తోడుతుంటే ప్రమాదవశాత్తు నూతిలో పడ్డానని అబధ్ధం చెప్పాను. కాని నన్ను భరించడం ఆయన శక్తికి మించిన పని అని తేలిపోయింది.  నేను చచ్చిపోతే, మళ్ళీ బోలెడు కట్నంతో ఆయనకి వేరొక ఆడకూతురు పెళ్ళికానుకగా చేతికందుతుంది. ఏ క్షణాన ఆయన నా ప్రాణం తీస్తారో అన్న భయంతో రాత్రీ, పగలూ నిద్ర లేకుండా కుళ్ళిపోయేదాన్ని. `         ఒకరోజున చుట్టుపక్కల వాళ్ళు ఎగ్జిబిషన్ కి వెళ్ళగా చూసి, కలత నిద్రలో వున్న నా మొహం మీద దిండు పెట్టి గట్టిగా అదిమి, నన్ను హత్య చెయ్యడానికి ప్రయత్నించారు.  పది నిముషాల తీవ్ర ప్రతిఘటన తర్వాత అతి కష్టం మీద ఆయన్ని కిందకి నెట్టేసి, కంగారుగా వీధిన పడ్డాను. కట్టుబట్టలతో ఒంటరిగా రోడ్డు మీద వెళ్తున్నాను.  ఎక్కడికి వెళ్ళాలి?  ఎవరిని సాయం అడగాలి?  ఈ పురుషాధిక్య ప్రపంచంలో నాకు జరిగే న్యాయమేముంటుంది? అనాలోచితంగా వెళ్ళి బస్ స్టాండులో నిలుచున్నాను.  ఒక పదిహేనేళ్ళ చంటి సన్నాసి నా చుట్టూ తిరుగుతూ ఒకటే ఆరాటపడిపోసాగాడు.  అతడిని సైగ చేసి దగ్గిరకి పిలిచాను.  లాటరీలో పదిలక్షలు దొరికినంత సంబరంగా పరిగెత్తుకుంటూ నా దగ్గిరకి వచ్చి చేతులు కట్టుకు నుంచున్నాడు. అతగాడికి నా దీనగాధంతా చెప్పి, ' ఈ పరిస్థితుల్లో నన్నేం చెయ్యమంటావు తమ్ముడూ?' అని అడిగాను. తమ్ముడూ అనగానే అతడి అంతరాత్మ మేలుకుంది.  అతడిలోని కామవాసనలు దగ్ధమై, మానవత్వం మేలుకుంది.  నా కథ వినగానే ఆ పసివాడు వెక్కి వెక్కి ఏడిచేసాడు. ' అక్కా!  ఈ ఊళ్ళో దీనజన మహిళాపరిరక్షణ సమితి అని ఒకటుంది.  దానికి లక్ష్మీనరసింహ మూర్తి అనే ఆయన ప్రెసిడెంటు.  ఆయన యువకుడు.  ఆవేశమున్న వ్యక్తి.  ఆయన నీకు జరిగిన అన్యాయానికి తప్పకుండా పరిష్కారం చూపిస్తారు.' అని చెప్పి నన్ను వారింటికి తీసుకు వెళ్ళి దిగబెట్టాడు. ' నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మరిచిపోలేను తమ్ముడూ!' అన్నాను. అతడు కళ్ళనీళ్లతో ' వస్తానక్కా.' అంటూ వెళ్ళిపోయాడు. అతడు చేసిన మేలు నేను మరిచిపోలేక పోయాను కూడా! ఆ కుర్రాడు మంచివాడైనప్పటికీ, మంచిగానే నాకు సాయం చేసినప్పటికీ, నా దురదృష్టం నన్ను వదిలి పెట్టలేదు. లక్ష్మీనరసింహమూర్తిగారు నన్ను చాలా ఆదరంగా లోనికి తీసుకు వెళ్ళారు.  లోపల కరెంటు లేదు.  ఎక్కడో ఓ మూల చిన్న కొవ్వొత్తి గుడ్డిగా వెలుగుతోంది.  ఎక్కడ ఏ వస్తువుందో కూడా సరిగ్గా కనబడటల్లేదు.  ఆ మసకవెలుగులో ఆయన నా కథంతా ఓపిగ్గా విని చాలా బాధ పడ్డారు.  ఈ దుర్మార్గానికి ప్రతీకారం తీర్చుకోవలసిందేనన్నారు.  నాకు తగిన న్యాయం చేకూర్చేంతవరకు నిద్ర పోనని నా చేతిలో చేయి వేసి ప్రమాణం చేసారు.' లావాకి ఆమె కథ వింటూంటే హృదయం ద్రవించినట్లుంది.  ఇంక వినలేనన్నట్లుగా లేచి వెళ్ళిపోబోయారు.  ద్వారక అతడిని బుజం పట్ఘ్టి ఆపింది. ' లావాగారూ!  ప్లీజ్, వెళ్ళిపోకండి.  నా కథ మీలాంటి సున్నిత హృదయులు విని తట్టుకోలేరని నాకు తెలుసు.  కాని నా కథ పూర్తి కాకుండా ఇక్కడినించి ఎవరూ కదలడానికి వీలు లేదు.  అంతేనా తమ్ముళ్ళూ?' అంటూ చుట్టూ వలయంలా వున్న యువకుల కేసి తిరిగింది. వారు ఔనన్నట్లుగా తలలూపారు. ద్వారక కొనసాగించింది. ' ఆ విధంగా నరసింహమూర్తిగారు నన్ను ఆ రాత్రి ఆదరించారు.  నాకు తగిన న్యాయం చేకూర్చేంత వరకు నిద్ర పోనని ప్రమాణం చేసారు కదా?  అందుకని కరెంటు పోయిన ఆ రాత్రి వారు నిద్ర పోలేదు.  నన్ను కూడా నిద్ర పోనివ్వలేదు. అది నా జీవితనికి తగిలిన మరొక చావుదెబ్బ! నరసింహమూర్తిగారిని పాదాలంటి బతిమాలాను.  నన్ను తన చెల్లెలిగా అభిమానించి, నాకు దారి చూపించమని ప్రార్థించాను.  కాని వారికి నా వంటి మీదున్న గాయాల మీదున్న సానుభూతి కన్నా, నా శరీరం మీద వ్యామోహమే ఎక్కువైంది. వారి ఆశయం మహిళలని ఉధ్ధరించడం కాదని, సంఘంలో సుస్థిరమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడమేనని, మధ్య మధ్యలో ఆడవాళ్ళని తన కామానికి ఆహుతి చేయడమేనని నాకు తెలియదు.  ఆ మహానుభావుడికి ఒక రాత్రికి సరిపడే ఆహారంగా నేను ఉపయోగపడ్డాను. ఇప్పుడు మీ అందరి ముందు గుట్టు బైట పెడుతున్నాను.  ఆ సంఘసంస్కర్త, ఆ పరోపకార పరాయణుడు, ఆ మహానుభావుడు ఎవరో కాదు.  వెంకట నాగ మల్లేశ్వర సత్యసాయీ త్రినాథ వర ప్రసాద లక్ష్మీనరసింహ మూర్తి అనబడే ఈ లావాయే!  అక్కడి దీన మహిళా పరిరక్షణ సమితి అధ్యక్షుడే నరసాపురం వచ్చి, ఇక్కడ హేతువాద సంఘానికి అధ్యక్షుడుగా మరొక అవతారం ఎత్తాడు. జనంలో కలకలం చెలరేగింది.  ఉద్రేకంగా లావా మీదకి లంఘించబోయారు. ద్వారక వినమ్రంగా అందరికీ నమస్కరించింది.  ' దయచేసి ఎవరూ ఆవేశపడకండి.  నా కథ ఆసాంతం వినండి.  అందువల్ల బహుశా మీక్కూడా సంఘంలో ఎదురయ్యే ఇలాంటి పెద్దమనుష్యుల గురించి అవగాహన ఏర్పడవచ్చు.' లావా నిస్సహాయంగా తల వంచుకు కూర్చుండిపోయాడు. ద్వారక తన కథ కొనసాగించింది. ' ఆ రోజు ఈ లావా తన క్షుద్రమైన పాశవిక వాంఛని తీర్చుకుని, సంతృప్తిగా ఆవలించి, నన్ను బైటికి గెంటి తలుపులేసుకుని గాఢంగా నిద్రపోయాడు.  నా జీవితం ఎంత నిరర్ధకమైనదో అప్పుడు నాకు తెలిసి వచ్చింది.  నా భర్త నన్ను చంపబోతుంటే, పవిత్ర భారతనారిలా వారి చేతుల్లో హాయిగా చచ్చిపోక, పిచ్చిదానిలా ఎందుకిల్లా రోడ్డున పడ్డానా అనే బాధ కూడ కలిగింది. సరే, ఆ చనిపోయేదేదో మరొకరి బలవంతం వల్ల కాక, హాయిగా, స్వేఛ్ఛగా, ఆనందంగా నాకు నేనే చచ్చిపోతే బాగుంటుందనిపించింది.` అప్పటికి తెల్లవారుఝామున మూడు గంటలై వుంటుంది.  ఆ ఊరి చెరువులో పడి నాజీవితానికి మంగళం పాడేద్దామనుకున్నాను. కాని అక్కడ నా జీవితం మరొక కళాత్మకమైన మలుపు తిరగబోతోందని నాకేం తెలుసు? చివరిసారిగా మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి తలుచుకుని కళ్ళు మూసుకుని చెరువులోకి దూకేసాను. నేను చచ్చి బతికేసరికి, పవిత్రతకి మారుపేరా అనిపించేటంతటి ఒక ఆశ్రమంలో ఉన్నట్లుగా కనుక్కున్నాను.  ఆ ఆశ్రమాన్ని నడిపే వ్యక్తి ఒక మహానుభావుడు.  సదాచారసంపన్నుడు.  నిత్యపరోపకార పరాయణుడు.  పరమ భాగవతోత్తముడు.  ఆయన తెల్లవారుజామున వీధుల్లో తన శిష్యులతో కలిసి భజన చేసుకుంటూ అటు వచ్చి, నేను చెరువులో దూకడం చూసి, తన శిష్యుల ద్వారా నన్ను రక్షించాడు. వారి ఆశ్రమం నిజంగా స్వర్గధామమే.  అందులో ఎందరో భక్తులు, భక్తురాండ్రు, అందరూ ఏ కల్లా కపటమూ లేకుండా, అరమరికలు లేకుండా కలిసి మెలిసి తిరుగుతూ వుంటారు. అక్కడ అంతా నియమబధ్ధమైన జీవితం.  తెల్లవారుజామున లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, సామూహికంగా భగవధ్ధ్యానం చెయ్యాలి.  ఆ తర్వాత కొద్దిగా పాలు తీసుకోవాలి.  ఆ పైన ఎవరికి నిర్దేశించిన విధులను వారు నిర్వర్తించాలి.  కొందరికి తోటపని, కొందరికి వంటపని, కొందరికి కుట్టుపని, మరి కొందరికి మరికొన్ని చేతిపనులు - ఇలా విధులన్నీ స్వామివారే నిర్ణయించేవారు. మధ్యాహ్నం భోజనాదికాలైన తర్వాత సత్సంగం, గీతాపారాయణ వుండేవి.  రాత్రి కేవలం పళ్ళు, పాలు ఇస్తారు. అందరికీ ఎప్పుడూ ఒకే విధులుండేవి కావు.  వీలును బట్టి స్వామివారు ఆశ్రమవిధులను మారుస్తూండేవారు. స్వామివారు అత్యంత దయామయులు.  వారు అందర్నీ ' బిడ్డా!' అనే సంబోధించేవారు.  వారి పాదసేవ చేస్తే, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడిని సేవించుకున్నట్లేనని ఆశ్రమవాసులందరూ భావిస్తూండేవారు.  వారి అనుగ్రహానికి పాత్రులవాలని అందరూ ఉవ్విళ్ళూరేవారు. కాని ఆ శ్రీకృష్ణభగవానునికి కుబ్జ ప్రీతిపాత్రురాలైనట్లు, స్వామివారికి నా మీద ప్రత్యేకమైన పుత్రికావాత్సల్యం ఉన్నట్లు నాకనిపిస్తూండేది.  వారి సేవలోనే నా జీవితం గడిచిపోతే చాలనుకునే దాన్ని. అక్కడ నాకు రోజులు చాలా ప్రశాంతంగా గడవసాగాయి.  స్వామివారు మెల్లిమెల్లిగా తన అంతరంగిక వ్యవహారాలు చూడడానికి కూడ నన్ను వినియోగించసాగారు.  ఒక్కొక్కసారి వారు ఉపదేశించే ధర్మసూక్ష్మాలు వింటూ, రాత్రి పొద్దుపోయేదాకా వారి పాదాలవద్దనే పడివుండేదాన్ని. ఒకరాత్రి అల్లాగ వారి ఉపదేశాలు వింటుండగా, మాగన్నుగా నాకు నిద్ర పట్టేసి, అక్కడే పరుండిపోయాను.  అర్థరాత్రి అకస్మాత్తుగా నాకు మెలకువ వచ్చింది.  నా మీద ఎవరో బరువుగా వాలిపోయి వున్నారు.  గట్టిగా అరవబోయాను. బలవంతంగా నా నోరు నొక్కి స్వామివారు, ' భయపడకు బిడ్డా1  నీకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాను.' అంటూనే నన్ను బలవంతంగా ఆక్రమించుకున్నారు.  నాపై అత్యాచారం చేస్తున్నదెవరో తెలిసాక, ఆ షాక్ లో నిర్ఘాంతపడి వుండిపోయాను.  ఆ స్వామివారు నాకు ఏడు జన్మలవరకు మర్చిపోలేని విధంగా బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించారు. ఆ స్వామివారే ఈ అంతర్యామి!  ఆ తర్వాత వారు అక్కడ అవతారం చాలించి, మరెక్కడో వెలిసి, తిరిగి ఇన్నాళ్ళకు ఇక్కడ దర్శనమిచ్చి, నన్ను తరింపజేసారు.  వీరి ఫొటో పేపర్లో చూడగానే, వీరిని దర్శించుకోవాలని, వీరి తత్వాలను మీ అందరికీ పాడి వినిపించాలని, అతి గాఢంగా వాంఛించి, ఇక్కడికి వచ్చాను.  అదృష్టవశాత్తు ఇక్కడే నాకు లావాగారు కూడా కనిపించారు.  వీరిద్దరిలో ఒకరు ఆస్తికులు, మరొకరు నాస్తికులు!  ఐనప్పటికీ ఇద్దరూ మహానుభావులే!  ఇద్దరూ సంఘసంస్కర్తలే!  ఇద్దరిదీ ఒక్కటే ధ్యేయం!  ఈ సమస్త మానవాళినీ ఉధ్ధరించి పడెయ్యాలి! ఇప్పుడు మీరు చెప్పండి.  ఆస్తికవాదం మంచిదో, నాస్తికవాదం మంచిదో మీరే న్యాయనిర్ణయం చెయ్యండి.'
అందరి కళ్ళూ అవిరళంగా స్రవిస్తున్నాయి.  అందరి హృదయాలలోను తీరని ఆవేదన, తరగని ఆవేశం!  లావాని, అంతర్యామిని ఖండ ఖండాలుగా నరికి, ఆ అభినవ కీచకుల రుధిరధారలతో ద్వారక పాదాలకు పారాణి పూయాలనే తపన!కాని ద్వారక ముకుళిత హస్తాలు, వినీత ప్రార్థనలు వారిని బంధించి వేస్తున్నాయి.అందరి కన్నా రామదాసు గారి పరిస్థితి మరీ దయనీయంగా వుంది.  ఆయన మెడలోని నాళాలు చిట్లిపోతాయేమో అన్నట్లుగా వారి మొహం ఉబ్బిపోయింది.  ఇంతవరకు అంతర్యామిని ఆంజనేయస్వామి ఆవహించడం, ద్వారకకు కాళీమాత పూనడం, కేవలం నాటకమైనప్పటికీ, రామదాసుగారికి మాత్రం నిజమైన వీరావేశమే కలిగింది.  ఉద్రేకంతో వణికిపోతున్నాడు.  దుఖంతో కుమిలిపోతున్నాడు.  శిధిలమైన అవయవాలతో జీవఛ్ఛవంలా ద్వారక వద్దకు వెళ్ళాడు.  అతడి నోటినుంచి మాట సరిగా పెగలటల్లేదు.  తూలి పడబోయాడు.చటుక్కున ద్వారక అతడిని పొదివి పట్టుకుని మంచినీళ్ళు తాగించింది.కొద్ది క్షణాలు గడిచాయి. రామదాసు కొద్దిగా తేరుకున్నాడు.  అందరికీ అశ్రునయనాలతో నమస్కరించాడు.  తనని తాను అదుపులోకి తెచ్చుకుని అన్నాడు. ' ఇక్కడికి విచ్చేసిన విజ్ఞానఖనులారా !  మీ అందరికీ నమస్కారం.  ఇంతవరకు నేను కూడా చాలా మూర్ఖంగా భ్రమల సుడిగుండాలలో పడి, నా జీవితాన్ని అగాధంలోకి తోసేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఈ జ్యోతిస్వరూపం, ఈ సబల, ఈ శక్తిస్వరూపిణి నాకు ఆత్మజ్ఞానాన్ని, పరమాత్మ తత్వాన్ని ప్రబోధించింది. అవును!  దేవుడుంటే ఎవరికి కావాలి? దేవుడు లేకపోతే ఎవరికి కావాలి? దేవుడున్నాడని నమ్మితే, కష్టాలలో ఉన్నవాడికి అదొక సాంత్వన. దేవుడు లేడని వాదనలోకి దిగితే, తనొక విజ్ఞానమూర్తిగా నివాళులందుకోవచ్చన్న వెర్రిదనం!! రెండూ అల్పమైన విషయాలే. దేవుడున్నాదని నమ్మితే మనసులో ధ్యానం చేసుకోండి.  ఆ సర్వాంతర్యామి అన్ని వేళలా మిమ్మల్ని పరికిస్తూనే వుంటాడన్న ఆలోచనతో, ఎప్పుడూ సత్కార్యాలే చెయ్యడానికి ప్రయత్నించండి.  సాటివారికి సహాయపడుతూ, మానవసేవలోనే మాధవుడిని సేవించుకోండి.  అంతేగాని పరమభాగవతోత్తములుగా పైకి సంచరిస్తూ, అంతరాళాలలో కల్మషాన్ని నింపుకోకండి.  మీ భక్తి ముసుగులో అమాయకులని మోసగిస్తూ, మీకు కావలిసిన ఇహలోక సుఖాలను అనుచితంగాను, క్షుద్రంగాను పొందడానికి ప్రయత్నించకండి.  అతీంద్రియ శక్తులున్నాయంటూ, మహిమలు చూపిస్తూ బూడిద జనానికిచ్చి, వారినుంచి అమూల్యమైన ధన, మాన, ప్రాణాలను అపహరించకండి. కాని దేవుడు లేడనే అనుకుంటే, అప్పుడు కూడా నష్టమేమీ లేదు.  కనిపించిన ప్రతి రాయికి, రప్పకి, చెట్టుకి, పుట్టకి నమస్కరించడం మానెయ్యండి.  స్వయంకృషితో కీర్తి శిఖరాలని అధిరోహించడానికి ప్రయత్నం చెయ్యండి.  అంతేగాని మరొకరి నమ్మకాలని హేళన చెయ్యడానికి ప్రయత్నం చెయ్యకండి.  అంతేకాదు, సమాజాన్ని మీరేదో ఉధ్ధరించేస్తున్నట్లుగా నటిస్తూ, అనవసరమైన అల్లర్లు, అలజడులు, హింసాకాండలు, దౌర్జన్యాలు జరపకండి. మీరు ఆస్తికులైనా, నాస్తికులైనా ప్రపంచానికి ఒరిగేదేమీ లేదు.  అందుకే మీ నమ్మకాలు మీలోనే వుంచుకుని, సాధ్యమైనంత వరకు సాటివాడికి సాయపడటానికి ప్రయత్నించండి. సమాజంలో ఎన్నో దుర్మార్గాలు జరుగుతున్నాయి.  ఘోరాలు జరుగుతున్నాయి.  అత్యాచారాలు జరుగుతున్నాయి.  ఎక్కడ చూసినా మోసం, దగా ! మతం పేరిట హింసాకాండలు, చంపుకోడాలు! ఈ కుళ్ళిపోయిన సమాజంలో, మనిషిని మనిషి నిర్దాక్షిణ్యంగా పీక్కు తింటున్న తరుణంలో, కనీసం ఒక్క ఆర్తుడికైనా ఆపన్నహస్తం అందించి ఆదుకోండి.  ఒక్క నిస్సహాయుడికైనా మానవతా ధర్మంగా అండగా నిలవండి.  అంధకార బంధురమైన ఒక్కరి జీవితంలోనైనా వెలుగు నింపడానికి మిమ్మల్ని మీరు మండించుకోండి.  అప్పుడే మీ జీవితానికి సార్థకత, మీరు మనిషిగా జన్మించినందుకు సాఫల్యం లభిస్తాయి !' అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టారు. రామదాసు కొనసాగించాడు. ' ఆగండి!  ఈ లావా లాగు, ఈ అంతర్యామిలాగు నేను కూడా ప్రబోధాలు చేస్తున్నానని మీరనుకోకండి.  నా జన్మకు సాఫల్యాన్ని, నా పుట్టుకకు అర్థాన్ని కల్పించమని మిమ్మల్నందర్ని, ముఖ్యంగా ద్వారక గారిని పాదాలంటి అర్థిస్తున్నాను. ద్వారక ప్రశ్నార్థకంగా రామదాసు కేసి చూసింది. రామదాసు అన్నాడు, ' ద్వారకగారూ!  నేను లావాని కాను.  అంతర్యామిని అంతకన్న కాలేను.  ఇక్కడున్న అందరూ నా మాటలకి, నా చేతలకి సాక్షీభూతాలై వుంటారు.  నేను సగటు మగవాడిగా ఈ మాటలు చెప్పడం లేదు.  మీ మీద  సానుభూతితో అంతకన్నా చెప్పడం లేదు. ఇప్పటివరకు మీరు జీవితంలో అన్నీ కష్టాలే అనుభవించారు.  చీకటిలోనే బతికారు.  ఇప్పుడైనా మీ జీవితంలోకి వెలుగుని తీసుకు వచ్చే అవకాశాన్ని నాకు ప్రసాదించండి.  మీ పెదవులపై వెలిగే క్షణకాలపు చిరునవ్వుకోసం నా యావత్తు జీ్వితాన్ని వత్తిగా మండించుకోవాలన్న నా పిచ్చి కోరికను మన్నించండి.  బిచ్చగాడిగా మీ ముందు జోలె పడుతున్నాను.  నిజం చెబుతున్నాను.  నాకు మీపై వ్యామోహం లేదు.  మిమ్మల్ని నే్ను కేవలం ఆడదానిగా చూడను.  నా స్నేహితురాలిగా నా యింట్లో వెలుగు నింపండి.  ఈ సమాజపు కట్టుబాట్లకి లోబడి వుండాలి కనక, మీకు భర్తగా వుండే అత్యున్నతమైన హోదాని నాకు కల్పించి, మీ కోసం నన్ను బతకనివ్వండి.  నా ఇంట్లో మీరు వున్నంత మాత్రాన మీరు నా అధీనులు కారు.  నేను మీ స్వేఛ్ఛకి, స్వాతంత్ర్యానికి అడ్డు రాను.  మీ అభీష్టాలకి, అభిరుచులకి ఎదురు చెప్పను.  నేను మీ స్నేహితుడ్ని.  మీ సేవకుడ్ని.  ఈ నా ఆస్తిపాస్తులు, ఈ చిన్ని అంతస్తు మీ పవిత్రమైన అంతరాత్మకు అర్పించుకోనివ్వండి.  కనీసం ఒక్కరికైనా, కొద్దిపాటిగానైనా సాయపడ గలిగానన్న సంతృప్తి నాకు కలిగించండి.  అల్లాగే నా మూర్ఖత్వాన్ని, నా పిచ్చి నమ్మకాలని పటాపంచలు చేసి, నన్నొక కార్యశూరుడిగా మార్చటం కోసం ప్రయత్నించ బోతున్నందుకు మీరున్నూ తృప్తిని, ఆనందాన్ని పొందండి.  నాకు మీరు.....మీకు నేను!  మనిద్దరికి ఈ యావత్తు ప్రపంచం!  ఏ ప్రపంచంలో నైతే ఆర్తులున్నారో, అసహాయులున్నారో, కరువు, కాటకాలతో, రోగాలు, రొచ్చులతో, పరమ దరిద్రంతో బాధ పడుతున్న దీనులున్నారో......ఆ ప్రపంచం మనది!  మనిద్దరం ఈ ప్రపంచం లోని నిర్భాగ్యుల సేవ కోసం, దరిద్రనారాయణుల బాధలని తగ్గించడం కోసం అంకితమై పోదాం.  వీలైనంతమందికి సహాయపడుతూ, అవినీతిని, అక్రమాలని ఎదిరిస్స్తూ బతుకుదాం.  చనిపోయేటప్పుడు కూడా, మన బతుకులు నిరర్థకం కాలేదన్న ఆత్మసంతృప్తితో మరణిద్దాం!  నా ఈ అభ్యర్థనని కాదనకండి.' ద్వారక వెక్కి వెక్కి ఏడవసాగింది. రామదాసు చేతులు జోడించి అన్నాడు, ' ద్వారకగారూ!  మీ మనసుకి బాధ కలిగిస్తే నన్ను క్షమించండి.  నా కోరిక అనుచితమైనదైతే, ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలెయ్యండి.  కాని దయచేసి మీ కళ్ళనించి కన్నీటిని రానివ్వకండి.' ద్వారక అందరి కేసి తిరిగి, ' అన్నలూ, తమ్ముళ్ళూ, నాన్నలూ, అమ్మలూ, అక్కలూ, చెల్లెళ్ళూ!...............ఉన్నాడు!  దేవుడున్నాడు!' అంటూ గబగబా రామదాసు దగ్గరకు వెళ్ళి, ఆయన బుజలను కుదిపేస్తూ అంది, ' ఇటువంటి ప్రతి మనిషిలోను భగవంతుడున్నాడు.  సమాజంలో వున్న ఈ దేవుళ్ళని గౌరవించుకోలేని మనం, రాళ్ళకి మొక్కుతాం.  ఆకలితో చావడానికి సిధ్ధమవుతున్న వాడికి పట్టెడన్నం పెట్టడానికి కొట్టుకు చచ్చే మనం హుండీల్లో నోట్ల కట్టలు విసురుతాం!  పాలరాతితో దేవాలయాలు నిర్మిస్తాం!  శిలావిగ్రహాల స్థాపనకు లక్షలు, లక్షలు ఖర్చు పెడతాం! వద్దు!  వద్దు!  ఇప్పటికైనా నిజాలు గ్రహిద్దాం!  ప్రతి మనిషి ఒక దైవంగా మారదాం.' ద్వారక తిరిగి రామదాసుని చూపిస్తూ అంది, ' ఈ రోజున నాకు ఈ దైవానుగ్రహం లభించింది.  మీ అందరి ఆశీస్సులు నాకుంటే, వారి పాదాలు కడిగి, ఆ జలంలో నేను స్నానం చేసి పవిత్రతను పొంది........' అంటూంటే రామదాసు అడ్డుపడ్డాడు. ' దేవతా!  పాపాత్ములందరూ రాతి విగ్రహాల ముందర తలలు వంచి మొక్కుతారు.  కాని పవిత్రమైన గంగలో వారి మురికి పాదాలను ముంచుతారు.  ఆ గంగమ్మ తల్లి ప్రేమతో వారి పాదాలను కడిగి, వారిని ప్రక్షాళితులను చేసి, వారికి పవిత్రతను ప్రసాదిస్తుంది.  గంగకు అపవిత్రత లేదు.  దయచేసి మిమల్ని మీరు కించ పరుచుకోకండి.  మీ పవిత్రత లోని సహస్రాంశాన్ని నాకు ప్రసాదించి, నన్ను కూడా పునీతుడ్ని చెయ్యండి.' అందరూ విపరీతమైన ఆనందంతో చప్పట్లు కొట్టారు. రామదాసుకి, అంతర్యామి విగ్రహాన్ని ఇచ్చినప్పుడు, లావా అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ' దాసూ!  ఆ సమయాన నేనుండవలసింది.  నీ మీద ఆంజనేయస్వామికి అంత వాత్సల్యమే వుంటే కంచు ముక్కని విసిరి కొట్టడమెందుకు?  బంగారపు ముద్దనే ప్రసాదించ వచ్చుగా?' ఇప్పుడు ఆ ఆంజనేయస్వామే తనకీ బంగారపు ముద్దని ప్రసాదించాడా? ఏమో!  నిజమేనేమో! అంతర్యామి అంటే లోపలికి జొచ్చి, ఇంద్రియములను గాని, జీవుని గాని, తమ తమ కర్మములందు మెలగజేయు పరమాత్మ అని అర్థం!  అందువల్ల తనకి ద్వారక మాత్రమే అంతర్యామి......సర్వాంతర్యామి! ఆ సమయానికి ద్వారక కూడా సరిగ్గా అల్లాగే ఆలోచించుకుంటోంది.
                                                                                           **********************
          అంతా విపరీతమైన కోలాహలం, సందడి!అక్కడ జరగబోయే వివాహమహోత్సవానికి అందరూ పెద్దలే!ఎవరికి వారే పక్కవాళ్ళకి ఏవో పురమాయింఫులు చేస్తున్నారు!అక్కడ ఎవరూ వేదమంత్రాలు చదవడం లేదు.  అందరూ ' శ్రీరామ, జయరామ, జయ జయ రామ ' అంటూ ఉచ్చైస్వరాలతో భజన చేస్తుండగా, రామదాసు ద్వారక మెడలో మంగళసూత్రాన్ని కట్టాడు.పైనించి దేవతలో తలియదు, హేతువాదులో తెలియదు, పూల వర్షం కురిపించారు! అందరి మనసులు చల్లబడ్డాయి!  అందరికీ జ్ఞానోదయమయింది.  భగవంతుడు వున్నాడా, లేడా అన్న మీమాంస తర్కం నశించాయి. ఈ సమాజం వుంది.  ఈ ప్రపంచం వుంది.  అందులో ఈ మనుషులు వున్నారు. వీరిలో స్వార్థం వుంది, త్యాగం వుంది.  పశుత్వం వుంది.  మానవత్వం వుంది.  మంచితనం వుంది.  చెడ్డతనం వుంది.  అమాయకత్వం వుంది.  కౄరత్వం వుంది.  ప్రేమించే గుణం వుంది.  ద్వేషించే బుధ్ధి వుంది.  ఇది.....ఇది మాత్రమే నిజం. అందరిలో ఒక్క తపనే కనిపిస్తోంది. ' అందరం దీక్షాకంకణ బధ్ధులమవుదాం.  ఈ సమాజాన్ని పునర్నిర్మించుకుందాం.  అందరం ఒక కుటుంబంగా జీవిద్దాం.  మంచితనాన్ని పెంచుకుందాం.  చెడ్డతనాన్ని వదిలించుకుందాం.  ప్రేమించే తత్వాన్ని పెంపొందించుకుందాం. ద్వేషించే గుణాన్ని పోగొట్టుకుందాం.  మనమంతా మానవులం....మనదంతా ఒకటే కులం!!!
సర్వేజనాస్సుఖినోభవంతు!!!(అయిపోయింది)  
************

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top