అంతర్యామి -4(నవలిక )

-      పెయ్యేటి రంగారావు

(జరిగిన కధ : రామదాసు గారు నరసాపురం కాలేజి లో లెక్చరరు ,ఆస్తికుడు. ఆయన మిత్రుడు లావా నాస్తికుడు,స్థానిక హేతువాద సంఘం అధ్యక్షుడు. వారిద్దరి మధ్య భగవంతుడు ఉన్నాడా ,లేడా అన్న విషయమై వాదోపవాదాలు తరచుగా జరుగుతూ ఉంటాయి. రామదాసుగారి ఇంటికి అంతర్యామి అనే స్వామీజీ తన  శిష్యులతో రాబోతున్నారు. ట్రైన్లో టికెట్ లేకుండా ఎక్కుతుంది ఓ అందమైన యువతి. ఎలాగైనా ఆమెను తన దారికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటాడు టి.టి. తిలక్  .... ఇక చదవండి...)   'భలే జోకేశావే?' వెకిలిగా నవ్వుతూ-- అతడి చేతులు తిరిగి ఆమె భుజం పైకి, అక్కడి నించి కిందకి జారుతూ......   మేఘం ఉరిమింది.   'నన్ను విసిగించక వెళ్ళిపో కోతీ!'   అసంకల్పితం గా అతడి చేయి కిందకి వాలిపోయింది.   కోపం గా అరిచాడు,"ఏమన్నావ్?"   మేఘం మరొక సారి ఉరిమింది   'నీ పేరు లోని పొడి అక్షరాలు అవేగా?'-- అతడి షర్టుకున్న బ్యాడ్జీ ని చూస్తూ. , కోలవెన్ను వారి వంశములో పుట్టినందుకు తన పై తరాలవాళ్ళనీ, తిలక్ అని పేరు   పెట్టినందుకు త కన్న తల్లితండ్రుల్నీ తిట్టుకుంటూ గట్టిగా అరిచాడు.   "ఏం కూశావే?......(తిట్టు) .....టికెట్ కి డబ్బులు తియ్యి.'   మేఘం ప్రళయ భీకరముగా గర్జించింది .   'షల్ ఐ పుల్ ద చెయిన్ , ఆర్ విల్ యూ గెట్ ద హెల్ అవుటాఫ్ హియర్ యూ మీనర్ దేన్ ద మీనెస్ట్ క్రీచర్ ఇన్ ద క్రియేషన్ ?'   ఆమె అపర కాళిక ! ఆమె చండిక! ఆమె మహిషాసుర మర్దిని! ఆమె రుద్ర త్రినేత్రఛ్ఛట !!   వెర్రి తుమ్మెద ఎగిరిపోయింది! కుర్ర కోతి పరిగెత్తింది!   తుఫాన్ తరువాత అలుముకున్న ప్రశాంతత!   మహా ప్రళయానంతరం ఉదధి పై వటపత్రశాయి కేరింతల లాగు,ఆమె వదనంపై కురుల మృదుల నాట్యం!   'ఏమాశించి తను ఆ ఊరు వెళ్తోంది?--తనకే తెలియదు! కానీ వెళ్ళి తీరాలి. వెళ్తే తను కోల్పోయిన మనశ్శాంతిని తిరిగి సంపాదించుకోగలదా?లేక-- ఏమో?--'   పేపర్ లో రెండు రోజుల క్రితం తను చదివిన వార్త ! వార్త తో పాటు ప్రచురింపబడిన స్వామీజీ ఫోటో!   'భక్తులకు మహదవకాశం! శ్రీ శ్రీ శ్రీ అంతర్యామి స్వామి వారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం విచ్చేస్తున్నారు.ఈ నెల రెండొ తారీఖు నుండి పన్నెండవ తారీఖు వరకూ కాలెజి వీధిలో ఉన్న రామదాసు గారింట్లో బస చేస్తారు. ఆ అవకాశాన్ని  అందరూ వినియోగించుకోవాల్సింది గా కోరుతున్నాము.   ఇట్లు   భక్త బృందం.   ఇహాన్నించి పరం వైపు దృష్టి సారిస్తూ ఆమె కలువ రేకుల కన్నులు ముడుచుకున్నవి.   బృందావనములో శరద్జ్యోత్స్నలో యమునా తటిపై వేణుగానమారంభమైనది !    
'పావనా! పవనసూనా! నను కావవా!
దశరధ తనయుని సేవకు నోచిన
ధీశాలీ! నను కరుణింపవా, కరుణింపవా? ||
జలధిని దాటుట-మేలము నీకట
లక్ష్మణ రక్షణ- మూలము నీవట
వాయునందనా! లంఖిణి సూదనా!
బంధవిమోచన! నా భాగ్య నిధాన!
కరుణింపవా? ||
సీతామాతకు-స్వాంతన దాతవు
శ్రీరామునకూ-ధర్మబ్రాతవు
రామచంద్రుడె కోరెను సాయము
నేనెత స్వామీ?- రజము ప్రాయము
కరుణించవా? ||
  'స్వామీ ! లంఖిణిని చంపావు. రావణ సంహారానికి సహాయపడ్డావు. ఈ చిన్ని గుండెలో రగిలే దావానలాగ్నిని ఆర్పలేవా ప్రభూ?'   ఆమె పెదవులనుండి సరస్వతి జాలువారుతున్నది!   ఆమె కన్నులనుండి గంగ ప్రవహిస్తున్నది!   చెమర్చిన ఆమె హృదయం నుంచి యమున పొర్లుతున్నది!   ఆమె మూర్తీభవించిన త్రివేణి !!!!        
*********   

 అప్పటికి గంట నుంచీ అందరూ ఆంజనేయ స్వామి వారి ఆదేశం కోసం ఎదురు చూస్తున్నారు. అందరిలోనూ ఉత్కంఠ  , ఆత్రుత ! కాని, ప్రభువు వారి ఆదేశం లభించట్లేదు.   అందరూ భజన ప్రారంభించారు.   లావా కి విసుగెత్తింది. కొబ్బరినీళ్ళు ఎక్కువగా త్రాగినందువల్ల అత్యవసర పరిస్థితి ఏర్పడి పెరట్లోకి వెళ్ళాడు. అక్కడ కొబ్బరి చెట్టు మీద ఒక కోతి కిచకిచ లాడుతోంది.     ఇంకావుంది.....  

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top