గాంధీ అంటే... పేరు కాదు - మార్గం. - అచ్చంగా తెలుగు

గాంధీ అంటే... పేరు కాదు - మార్గం.

Share This
గాంధీ అంటే... పేరు కాదు - మార్గం.
-      పరవస్తు నాగసాయి సూరి
  గాంధీ లాంటి ఓ మహాత్ముడు రక్తమాంసాలతో ఈ నేల మీద తిరిగాడంటే.. బహుశా మన ముందు తరాలు నమ్మలేరేమో. సాక్షాత్తు శాస్త్రవేత్త ఐన్ స్టీన్ మాటలివి. నిజమే. ముందుతరాలే కాదు.. బహుశా మనం కూడా నమ్మము. ఎందుకంటే ఆయన ఎంచుకున్న మార్గం అలాంటింది. శత్రువును జయించడమంటే... అతని ప్రాణాన్ని తీయడమనే రుధిరయాగాన్ని నమ్ముకున్న ఈ ప్రపంచానికి... సరికొత్త ధర్మ యోగాన్ని చూపించిన శాంతి మార్గం మహాత్మ గాంధీ. ఆ మహాత్ముని ఆశయాల అర్థాన్ని, అంతరార్థాన్ని ఇవాళ్టి జనాలకు వివరిస్తూ... దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం మహాత్మ. ఈ సినిమాలో... గాంధీజీ స్ఫూర్తిని వివరిస్తూ... తెరకెక్కించిన కొంతమంది ఇంటిపేరు కాదురా గాంధీ అనే గీతం ఉంది. సిరివెన్నెల కలం నుంచి జాలువారిన ఆ పాట వెనుక మాటలు... స్వతంత్ర దినోత్సవ సందర్భాన మీ కోసం...  
రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం
ఈశ్వర్ అల్లా తేరో నామ్ సబ్ కో సన్మతిదే భగవాన్...
కొంత మంది ఇంటిపేరు కాదుర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ            2
కరెన్సీ నోటు మీద... ఇలా నడిరోడ్డు మీద...
మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ
భరతమాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ
తరతరాల యమయాతన తీర్చిన వరదాతర గాంధీ
రామనామమే తలపంతా... ప్రేమధామమే మనసంతా...
ఆశ్రమదీక్ష, స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవధూత
అపురూపం ఆ చరిత.........
ధర్మయోగమే జన్మంతా, ధర్మక్షేత్రమే బ్రతుకంతా...
సంభవామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీత
ఈ బోసినోటి తాత...
మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ
మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచద ఆయన స్ఫూర్తి
సత్య అహింసల మార్గజ్యోతి.... నవశకానికే నాంది....
గుప్పెడు ఉప్పును పోగేసి... నిప్పుల ఉప్పెనగా చేసి...
దండియాత్రనే, దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత
సిసలైన జగజ్జేత
చరఖా యంత్రం చూపించి, స్వదేశి సూత్రం నేర్పించి
నూలుపోగుతో మదపుటేనుగుల బంధించాడుర జాతిపిత
సంకల్పబలం చేత
సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి
తూరుపు తెల్లారని నడిరాత్రికి స్వేచ్ఛాభానుడి ప్రభాత కాంతి
పదవులు కోరని పావనమూర్తి, హృదయాలేలిన చక్రవర్తి
ఇలాంటి నరుడొకడిలాతలంపై నడయాడిన ఈ నాటిసంగతి
నమ్మరానిదని నమ్మకముందే ముందుతరాలకు చెప్పండి.
సర్వజన హితం నామతం
అంటరానితనాన్ని, అంతఃకలహాల్ని అంతం చేసేందుకే నా ఆయువంతా అంకితం...
హేరామ్...
  ఓ సగటు గాంధేయవాది ఆవేదనకు అక్షర రూపమే ఈ గీతం. గాంధీజీ చెప్పిన సిద్ధాంతాల్ని గాలికి వదిలేసి, పాటించమన్న సత్యం, అహింస మార్గాల్ని విడిచిపెట్టి... ఆయన పేరును ఇంటి పేరుగా చేసుకున్న వారు కొందరైతే, ఆయన పేరును వీధులకు పెట్టి, ఆయన విగ్రహాలు రోడ్డు మీద పెట్టి... గాంధీజీని బొమ్మను చేసి మహా(?)నుభావులు మరికొందరు. వీరందరికి గాంధీజీ అంటే... అసలు అర్థమేంటో వివరించిన గీతమిది. కొంత మంది ఇంటిపేరు కాదుర గాంధీ ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ            2 కరెన్సీ నోటు మీద... ఇలా నడిరోడ్డు మీద... మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ ఇప్పటి వాళ్ళకు... ఓ రాజకీయ కుటుంబం ఇంటి పేరుగానే గాంధీ తెలుసు. మరికొందరికి గాంధీ వీధి, గాంధీ రోడ్డుగానే ఆ పేరు తెలుసు. ఇంకొందరికి కరెన్సీ మీద ఉన్న పోటోగానే ఆయన తెలుసు. మరి కొంత మందికి రోడ్డు మీద ఉన్న బొమ్మగానే గాంధీజీ తెలుసు. నిజానికి గాంధీజీ అంటే ఇవన్నీ కాదు. అంటే ఆ మహాత్మునికి నివాళి ఇచ్చే విధానం ఇది కాదు అంటున్నారు సిరివెన్నెల. మరి గాంధీ అంటే ఎవరు అంటే... భరతమాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ తరతరాల యమయాతన తీర్చిన వరదాతర గాంధీ వందల ఏళ్ళుగా విదేశీయుల పాలనలో మగ్గిపోతున్న భారతమాత తలరాతను మార్చేసిన బ్రహ్మ గాంధీ. అంతే కాదు.. కోట్లాది భారతీయులు తరతరాలుగా పడిన యాతన నుంచి విముక్తి కల్పించిన వరదాత గాంధీ. ఓ విధంగా చెప్పాలంటే ఆయన దేవుడితో సమానం. అయితే ఆయనకు కూడా ఓ గుడి కట్టి, విగ్రహాన్ని పెట్టి, కొబ్బరి కాయ కొట్టి రుణం తీర్చుకునే వారు ఎక్కువై పోయారు. మనం చేయాల్సింది అది కాదు. ఆయన ఆశయాల్ని తెలుసుకోవాలి. దీని కోసం ఆయన జీవితాన్ని అధ్యయనం చేయాలి. రామనామమే తలపంతా... ప్రేమధామమే మనసంతా... ఆశ్రమదీక్ష, స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవధూత అపురూపం ఆ చరిత......... ఎప్పుడు రాముడి నామాన్ని స్మరిస్తుంటారు. మనసంతా ప్రేమ ధామంగా మార్చుకుని శత్రువు పట్లకూడా ప్రేమ చూపుతారు. ఆశ్రమంలో జీవిస్తూ... స్వతంత్ర కాంక్షతో నడిచిన అవధూత లాంటి వ్యక్తి గాంధీజీ. నిజమే స్వతంత్రాన్ని సముపార్జించేందుకు అవతరించిన అవధూతే గాంధీజీ. రామాయణం పరంగా గాంధీ వ్యక్తిత్వాన్ని తెలియజేసి ఆయన చరితం అపురూపమైనది అంటున్నారు సిరివెన్నెల. అంతేనా... ధర్మయోగమే జన్మంతా, ధర్మక్షేత్రమే బ్రతుకంతా... సంభవామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీత ఈ బోసినోటి తాత... మాటలు చెప్పి ఊరకుండలేదు. ధర్మయోగాన్ని నమ్ముకున్నారు. ధర్మంగా యుద్ధం చేశారు. ఆయన బతుకంతా ధర్మక్షేత్రంలోనే గడిచింది. సంభవామి యుగే... యుగే.. అని భగవద్గీతలో కృష్ణపరమాత్ముడు చెబితే... ఏదైనా సంభవమే అని చేసి నిరూపించిన భగవద్గీత రూపం మహాత్ముడు. ఇక్కడ సిరివెన్నెల ఉద్దేశం ఒక్కటే. గాంధీజీ నోటిలో ఎప్పుడూ రామనామ స్మరణం, చేతిలో భగవద్గీత ఉంటాయి. ఈ రెండు మార్గాల్ని ఆచరణలో పెట్టిన రూపమని ఆయన మహాత్ముని గురించి తెలియజేశారు... మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచద ఆయన స్ఫూర్తి సత్య అహింసల మార్గజ్యోతి.... నవశకానికే నాంది.... గాంధీజీ ఆకాశంలో నుంచి ఊడిపడ్డ వ్యక్తేమీ కాదు. మనందరిలాగే... ఓ తల్లి నవమాసాలు మోసి కన్న మామూలు మనిషి. ఆయన స్ఫూర్తే తనను మహాత్ముడని మన్నన పొందే స్థాయికి పెంచింది. దీనికి కారణం... రాముణ్ని గుడిలో విగ్రహంగా చూడకపోవడం, భగవద్గీతను పవిత్ర గ్రంధంగా పూజ గదిలో బంధించకపోవడం. రాముడి జీవితాన్ని ఆదర్శంగా చేసుకుని జీవించారు. భగవద్గీతను ఆదర్శంగా చేసుకుని పోరాడారు. అందుకే ఆయన మహాత్ముడయ్యారు. సత్యం, అహింస అనే రెండు మార్గాలతో అపూర్వమైన కార్యాలను సాధించి... మార్గజ్యోతి అయ్యారు. నవశకానికి నాంది పలికారు. చరిత్రలో తన పేరును సువర్ణాక్షాలతో నిలుపుకోగలిగారు. అందుకే గాంధీ అంటే సాధారణ వ్యక్తే కానీ ఆయన మార్గం మాత్రం సాధారణ వ్యక్తులకు సాధ్యమైనది కాదు. కానీ ఆ మార్గాన్ని అనుసరించిన ప్రతి వ్యక్తి మహాత్ముడయ్యితీరతాడు. ఇంతకీ ఆయనేం చేశాడంటారా.....   గుప్పెడు ఉప్పును పోగేసి... నిప్పుల ఉప్పెనగా చేసి... దండియాత్రనే, దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత సిసలైన జగజ్జేత గుప్పెడు ఉప్పును పోగేయడం అంటే... ఇక్కడ గొప్ప రాజనీతి శాస్త్రం ఇమిడి ఉంది. కౌటిల్యుని అర్ధశాస్త్రంలో ఉప్పు మీద వేసే పన్ను గురించి వివరణ ఉంది. అలాంటి పన్నుకు వ్యతిరేకంగా ఉప్పు సత్యాగ్రహాన్ని నిప్పుల ఉప్పెనగా నడిపారు. దండి యాత్రను నాటి బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ దండయాత్రలా నడిపారు. అందుకే ఆయన నిజమైన అధినేత అయ్యారు. ఒక్క ఆయుధాన్ని కూడా వాడకుండా, ఒక్క రక్తపు బొట్టు కూడా నేల చిందకుండా సిసలైన జగజ్జేత అయ్యారు. అంతే కాదు.... చరఖా యంత్రం చూపించి, స్వదేశి సూత్రం నేర్పించి నూలుపోగుతో మదపుటేనుగుల బంధించాడుర జాతిపిత సంకల్పబలం చేత విదేశీ వస్తు బహిష్కరణ పేరిట... చరఖాయంత్రంతో మన బట్టలు మనమే నేసుకోవచ్చు, మనకు కావలసినవి మనమే తయారు చేసుకోవచ్చనే స్వదేశీ సూత్రాన్ని నేర్పించి... ఆ నూలు పోగుతోనే మదపుటేనుగుల్లాంటి బ్రిటీష్ వాళ్ళను బంధించాడు. అంటే... వాళ్ళకు ముఖ్యమైన వ్యాపార మార్గాన్ని నాశనం చేశాడు. ఇదంతా కేవలం సంకల్పబలంతోనే సాధ్యమైంది. దాని ఫలితం.... సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి తూరుపు తెల్లారని నడిరాత్రికి స్వేచ్ఛాభానుడి ప్రభాత కాంతి పదవులు కోరని పావనమూర్తి, హృదయాలేలిన చక్రవర్తి ఎప్పుడూ సూర్యుడు ఉదయించే ఉంటాడని పేరున్న బ్రిటీష్ సామ్రాజ్యాన్ని కూలదోసి.. వాళ్ళుండే పడమటి దిక్కుకు వాళ్ళను పంపించగలిగాడు. అర్ధరాత్రి స్వేఛ్చా సూర్యోదయాన్ని ప్రజలకు చూపించగలిగాడు. ఇంత చేసి, ఏ పదవీ అధిష్టించలేదు. ఫలితంగా.. జాతిపితగా అందరి హృదయాల్లో కొలువు దీరి... హృదయ సామ్రాజ్యాల్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన చక్రవర్తిగా మారారు. ఇక్కడ సిరివెన్నెల కలంలో చమత్కృతి కనిపిస్తుంది. సూర్యుడు అస్తమించేది పడమటి దిక్కున... ఆ మార్గాన్ని బ్రిటీష్ వాళ్ళకు చూపాడనే కవన చమత్కారంతో పాటు.. తూరుపు తెల్లారని నడిరాత్రికి స్వేచ్ఛా భానుడి ప్రభాత కాంతి... అంటూ... మరో చక్కని ప్రయోగాన్ని చేశారు. అందుకే ఐన్ స్టీన్ మాటల్ని సిరివెన్నెల ఇక్కడ తెలియజేశారు. ఇలాంటి నరుడొకడిలాతలంపై నడయాడిన ఈ నాటిసంగతి నమ్మరానిదని నమ్మకముందే ముందుతరాలకు చెప్పండి. గాంధీ లాంటి ఓ వ్యక్తి ఈ భూమ్మిద తిరిగిన ఈ సంగతి నమ్మలేము అనక ముందే ముందు తరాలకు తెలియజేయండి అంటున్నారు సిరివెన్నెల. అంటే దాని అర్ధం రోడ్డు మీద ఆయన విగ్రహాలు పెట్టమనో. రోడ్లకు, భవనాలకు ఆయన పేర్లు పెట్టమనో కాదు. ఆయన నిజమైన ఆశయాల్ని, ఆయన ఆయుధాలైన సత్యం, అహింసను ముందు తరాల వారికి తెలియజేయమని. రిజర్వేషన్ల పేరుతో అంటరాని తనం అనే జుగుప్స కలిగించే పదాన్ని ముందు తరాలకు పరిచయం చేస్తున్న మన నాయకులు గాంధీజీ స్ఫూర్తిని ఏమి అందించగలరు. గాంధీజీ పేరును ఇంటి పేరుగా తగిలించుకుని... ఆయన వారసులుగా పార్టీని నడుపుతూ... ఆ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో... మాంసాహారాన్ని వండి వార్చే... కుటుంబం ఆయన అహింస స్ఫూర్తిని ముందు తరాలకు ఎలా అందించగలదు. కరెన్సీ మీద గాంధీజీని ముద్రించి... ఆ కరెన్సీ సంపాదన కోసం... మద్యాన్ని వరదలుగా పారించే దగకోరు ప్రభుత్వాలకు ఆయన గురించి చెప్పే అర్హత అసలు ఉందా. నోరు తెరిస్తే అబద్దాలు చెప్పే స్వార్థ పరులు ఆయన పేరును ఉచ్ఛరించే సాహం చేయగలరా... గాంధీని పేరుగా, వీధి పేరుగా, ఇంటి పేరుగా, భవనాల పేరుగా చేసి... గోడమీద బొమ్మగా మార్చి... నడిరోడ్డులో విగ్రహంగా చేసి... జాతిపిత అంటూ... డబ్బుల మీద ఆయన ఫోటోను ముద్రించి చేతులు దులిపేసుకున్నారు. ఆయన స్ఫూర్తిని ఏ మాత్రం పాటించి ఉన్నా... ఇవాళ్టి భావ కాలుష్యం అసలు ఉండి ఉండేది కాదేమో. అందుకే కనీసం మనమైనా... ఆ మహానీయుని స్పూర్తిని ముందు తరాలకు అందిద్దామన్న సిరివెన్నెల మాటల్ని తలకెత్తుకుందాం.  

No comments:

Post a Comment

Pages