సంపాదకీయం - అచ్చంగా తెలుగు

సంపాదకీయం

Share This
సంపాదకీయం
-      భావరాజు పద్మిని
చూస్తుండగానే... ‘అచ్చంగా తెలుగు’ అంతర్జాల మాస పత్రిక అర్ధ వసంతం పూర్తి చేసుకుంది. ఈ  ఆరు నెలల సంచిక మీ కళ్ళముందుకు వచ్చిన శుభ తరుణంలో... మా వెన్నంటి ఉండి , మమ్మల్ని అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్న ప్రతీ ఒక్కరికీ వినమ్ర నమస్కారాలు. 15 ఆగష్టు న మనం 68 వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా దేశభక్తిని గురించి రెండు మాటలు... లంక ను జయించాక, ఆ రాజ్య సౌందర్యాన్ని చూసి, లక్ష్మణుడు , కొన్ని రోజులు అక్కడే వుండి, విభీషణుని ఆతిధ్యం స్వీకరించి వెళదాం అని కొరితే, రాముడు ఇలా అంటాడు
* " అపి స్వర్ణమయీ లంకా- న మే రోచతి లక్ష్మణా, జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి ".*
బంగారం తో నిర్మించబడ్డది, ఎంతో ఉత్సుకతని కలిగించేది అయినా, ఈ లంకా నగరం పై నాకు ఆసక్తి లేదు. మన తల్లి వంటి మాతృభూమికి సమానమయినది, ఏది లేదు. చివరికి  స్వర్గం కూడా మాతృ దేశం ముందు దిగదుడుపే.   కర్మభూమి, యోగ భూమి, తపో భూమి మన పవిత్ర భారత భూమి.... ఈ మట్టిలో పుట్టిన ఎన్నో మాణిక్యాలు మన దేశ కీర్తిని దశదిశలా వ్యాపింపచేసాయి. ‘దేశం మనకు ఏమి చేసింది... ‘ అని ప్రశ్నించుకోక... ‘దేశానికి మనం ఏమి చెయ్యగలం...’ అనే ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతీ కుటుంబం దేశానికి ఇవ్వగలిగింది ... సత్ప్రవర్తన కల భావి పౌరులను. వ్యక్తి నుంచి కుటుంబం, కుటుంబం నుంచి సమూహం, సమూహం నుంచి సమాజానికి విలువలు, మంచి నడవడి వ్యాపిస్తాయి. ప్రస్తుతం అనేక కుటుంబ కలహాలు, సరైన పర్యవేక్షణ లేని పిల్లల పెంపకాల వల్ల అనేక దారుణాలు జరుగుతున్న తరుణంలో, ప్రతీ ఒక్కరూ తమ కుటుంబం పట్ల శ్రద్ధ వహించడం ఎంతో అవసరం. మనం మన పిల్లలకు ఇవ్వగలిగే నిజమైన వారసత్వం కాస్తంత విద్యావినయాలు, సేవానిరతి, దేశభక్తి. ‘ఇండియాలో ఏముంది...’ మేము విదేశీ చదువులకు వెళ్లి, అక్కడే స్థిరపడతాం...’ అనే స్థాయి నుంచి, మేము ఇక్కడే ఉండి , దేశ ప్రగతికి మా వంతు సాయం అందిస్తాం అనే స్థాయి వరకూ మనం పురోగతి సాధించాలి.   ఇక ఈ సంచికలో ... శ్రావణ మాస ప్రత్యేకత, పంచమి తిధి విశిష్టత, గురువుకు సమర్పించే అక్షర మాల వంటి ఆధ్యాత్మిక వ్యాసాలు ఉన్నాయి.  దేశభక్తికి సంబంధించిన కధలు, కవితలు, వ్యాసాలు, ప్రత్యేకంగా అందించబడ్డాయి. శ్రీధర మాధురిలో నృసింహ అవతారం విశిష్టత, కొన్ని విశేషమైన మంత్రాలు ఉన్నాయి. తెలుగు కొమ్మకు బాపు రమణ గార్లతో సహా కోతి కొమ్మచ్చులు ఆడి, బాపు గీతని- ముళ్ళపూడి రాతని హైజాక్ చేసిన బహుముఖప్రజ్ఞాశాలి “బ్నిం “గారి గురించిన వ్యాసం ‘తెలుగు బొమ్మలో’ మీ కోసం ప్రత్యేకం. సంగీత విద్యకు తన అపర మేధస్సుతో అనేక కొత్త కృతులు, వర్ణాలు, జావళీలు అందించి, ముందు తరాలకు సంగీత భాండాగారాన్ని అందించిన , శర్వాణి శ్రీ పాదం --- శ్రీ పాద పినాకపాణి గారిని గురించి, “సంగీతం” లో చదవండి. ఎప్పటికప్పుడు మీకు నవనవోన్మేషితంగా కొత్త విషయాలను అందించాలని... పూజ్యులైన పెద్దలు చెరుకు రామమోహనరావు గారు, రచయతలు, రచయిత్రులు, మన ఆర్టిస్ట్ నాగేంద్రబాబు గారు, టెక్నికల్ సహాయం అందిస్తున్న శ్రీకాంత్, తమ్ముడు సూరి, కళ్యాణ్ గారు ఇతర సభ్యులు... అంతా వెరసి... మేమంతా ఒకే కుటుంబంగా... మా ‘అచ్చంగా తెలుగు కుటుంబం’ అందిస్తున్న ఈ పత్రిక మన అందరిదీ. “మీ ప్రోత్సాహమే... మాకు బలం...” సదా మీ ఆదరాభిమానాలను చూరగోనాలనే మా ప్రయత్నం. పత్రిక గురించి మీ విలువైన అభిప్రాయాలను ‘అభిప్రాయాలు’ శీర్షికలో అందించమని మనవి.
సవినయ నమస్సులతో,
అచ్చంగా తెలుగు కుటుంబం.
   

No comments:

Post a Comment

Pages