దాశరధి సినీ గీత - 2 - అచ్చంగా తెలుగు

దాశరధి సినీ గీత - 2

Share This

దాశరధి సినీ గీత - 2

మామిడి హరికృష్ణ

దాశరధి జానపదుల గుండెనెరిగిన కవి. పాటకి సార్ధకత, అంతిమ పరిపూర్ణత, అతి సామాన్య జనానికి సైతం చేరువైనప్పుడే అని నమ్మిన ప్రజాసాహితీకారుడు. అందుకే ఆయన గ్రామీణ జనావళి హృదయస్పందనలోంచి "గోదావరి గట్టుని, గట్టుమీది చెట్టుని, చెట్టుకొమ్మలోని పిట్టని, పిట్టమనసుని దర్శించాడు.

"వగరు వగరుగా పొగరుంది - పొగరుకు తగ్గ బిగువుంది

తీయతీయగ సొగసుంది - సొగసుని మించి మంచుంది" అని భౌతికమైన శారీరక సౌందర్యంకన్నా, అలౌకమైన మంచితనమే ఉన్నతమైనదని చెప్పారు. అలాగే

"వెన్నెల వుంది, ఎండా ఉంది, పువ్వూ వుంది, ముల్లుంది

ఏది ఎవరికివ్వాలో - ఇడమరిసే ఆ ఇది ఉంది" అని అంటూనే

"పిట్ట మనసు పిసరంతైనా పెపంచమంతా దాగుంది

అంతుదొరకని నిండుగుండెలో ఎంత తోడితే అంతుంది."

అని మనసులో అంతర్గత ప్రసారానికి అగ్ర ప్రాధన్యతనిచ్చారు. భౌతికంగా కనిపించే గోదారి గట్టుతో పాటని మొదలెట్టి, కనిపించని "నిండుగుండె" లోకి దృష్టిని మరల్చి అంతర్వీక్షణంలోనే అనరళసత్యం ఉందని నిరూపించాడు. (మూగమనసులు - 1964)

ఉర్దూ సాహిత్యంలో "గజల్" ఓ విశిష్ఠ ప్రక్రియ. దీనికి ఆద్యుడు మీర్జా గాలీబ్. ప్రపంచ వ్యాప్తంగా ప్ర్ఖ్యాతిగాంచిన ఈ కవి గీతాలు "గాలీబ్ గీతాలు" (1961) పేరిట తెలుగులోకి అనువాదం చేసిన సరస్వతీ పుత్రుడు దాశరధి. అందుకేనేమో, దాశరధి వ్రాసిన సినీగీతాలన్నింటిలోనూ, భావాలపరంగా సున్నితత్వం, పదాల కూర్పులో సౌకుమార్యం, వాక్యాలలో లాలిత్వం పరవళ్ళు తొక్కాయి. దీనివల్ల దాశరధి పాట ఎన్నటికీ మాయని మమతనీ, ఒక్క క్షణమైనా వీడిఉండలేని జన్మ జన్మల బంధాన్ని మన అనుభవంలోకి తెచ్చింది.

"పున్నమి వెన్నలలో పొంగును కడలి

నిన్నే చూసిన వేళ - నిండును చెలిమి" అని మొదటి వరుసలో స్త్రీ పురుషుల మధ్య వుండే భావ సంచలాన్ని వివరించి రెండింటికీ సమన్వయంగా

"నువ్వు కడలివైతే - నేనదిగా మారి

చిందులు వేసి వేసి నిన్ను చేరినాను" అని ద్వైతం నుండి అద్వైతంగా మారే స్థితి అనంతానంద స్థితి అని దాశరధి గీతం చెప్పకనే చెప్పింది. (పూజ - 1975)

దాశరధి ఎన్నెన్నో కావ్యాలను, కవితా సంకలనాలను రచించి వ్లువరించారు. 1949లో "అగ్నిధార" తో మొదలైన ఆయ్న కవితా ప్రస్థానం ఆ తర్వాత పునర్ణవం(1956)మహారధి(1959), రుద్రవీణ, మార్పు నా తీరు, ఆలోచనాలోచనాలు(1975) దిశగా సాగింది. దాశరధి కవితల్లో చైతన్యం, సామాజిక స్పృహ, ప్రజాపక్షపాతం, నిరంకుశ విధానలపై పోరాటం కనిపిస్తాయి. నైజాం ప్రభుత్వంపై పోరాటం చేసే క్రమ్మంలో దాశరధి జైలుశిక్షను కూడా అనుభవించారు. జైల్లో ఉన్న కాలంలో జైలు గోడల మీద బొగ్గు ముక్కలతో విప్లవగీతాలు రాసి అభ్యుదయ కవిగా, ఆచరణాదకవిగా సకల కాలాలో ఆదర్శంగా నిలిచారు. అందుకే దాశరధి పదం - పీడిత జనావళి విమోచనం కోసం, దాశరధి పఠం-అభ్యుదయం కోసం ముందుకురికాయి. అదే సూత్రంలో ఆయన కలం లోకం పోకడలపై, కాలం తీరుపై వ్యంగ్య బాణాలను కూడా వేసింది. "ఇంతేనయా తెలుస్కోవయా" అని చెపుతూ

"డాబులుకొట్టి మోసం చేసి

జేబులు నింపేరు

పాపం పుణ్యం పరమార్ధాలు

పంచకు రానీరు

ఎవరికి వారే యమునా తీరే

ఇదే ప్రపంచమయా" అని లోకం యావత్తూ దోపిడి చేసేవారు, చేయబడుతున్నవారుగా రెండుగా నిలువునా చీలిన పరిస్థితిని కళ్ళకు కట్టారు. (కథానాయకుడు - 1969)

అదే సమయంలో, ఆధునిక నవీన మానవుడు" మంచిని మరిచి వంచన నేర్చి వానరుడుగా" ప్రవర్తిస్తున్న తీరును దాశరధి తీవ్రంగా విమర్శించాడు.

"చదువు తెలివి పెంచాడు - చంద్రలోకం జయించాడు

నీతులు చెప్పి గోతులు తవ్వి - పాతాళానికి జారాడు

మెదడె పెరిగి హృదయం తరిగి

నరుడే ఈనాడు వానరుడైనాడు" అని సాంకేతికలో ఉన్నతిని, నైతికతలో అధోగతిని సాధ్నించాడని ఆధునిక మానవుల "ప్రొగ్రెస్ రిపోర్ట్" ని దాశరధి తేటతెల్లం చేశాడు (ఒకే కుటుంబం - 1970)

మరో వైపున దాశరధి కలం సరదా పాటలను కూడా చక్కగా కదం తొక్కించింది. అప్పట్లో కొత్తరకం యువతీయువకుల మనోభావాలను వారిలోని స్వేఛ్ఛా ప్రవృత్తిని పాట రూపంలో అందించటంలో దాశరధి కొత్త పుంతలు తొక్కాడు. ఆనాటి యువత మనసును చదివేసారండానికి దాశరధి తన తొలి చిత్రంలో చేసిన ప్రయోగాలే ఒక ఉదాహరణ. "ఇద్దరు మిత్రులు"(1961) సినిమాలో గీత రచయితగా పరిచయం అయినా దాశరధి ఖుషీ ఖుషీ గా నవ్వుతూ, చలాకి మాటలు రువ్వుతూ హుషారుగా వినిపిణ్చారు. భాషాపరంగా ఉన్న ధోరణికి భిన్నంగా ఉర్దూ పదాలను తెలుగు పదాలతో కలగలిపి "మణిప్రవాళ" శైలిలో ప్రయోగించారు.

No comments:

Post a Comment

Pages