Monday, June 23, 2014

thumbnail

నిత్యవసంతం కృష్ణశాస్త్రి కవిత్వం

 
 నిత్యవసంతం కృష్ణశాస్త్రి కవిత్వం
-వింజమూరి వెంకట అప్పారావు
  ఆధునికాంధ్ర సాహితీ జగత్తులో " ఆకులు రాలని, పూలు వాడని, నిత్య వసంతారామం కృష్ణశాస్ర్తి సాహిత్యోద్యానవనం" అని  నాటి నేటీ మేటీ కవుల , విమర్శకుల అభిప్రాయం. అది కాదనలేని వాస్తవం.. ఒక సుందర దృశ్యాన్ని చూసినా, ఒక మనోహర కవితను చదివినా కృష్ణశాస్తి స్మృతి మన మనో వీథిలో తళుక్కుమనకమానదు.   వ్యక్తిని మహోన్నతుడిగాను , మహా మనిషి గాను, మహాకవి గాను, యుగకర్త గాను మలచడంలో జన్మత: అతనికి సంక్రమించే  ప్రతిభా పాఠవాలే గాక, వంశపరంపరాగత గుణాలు..గణాలు.. తల్లిదండ్రుల శిక్షణాదికాలు కొంతవరకు , విద్యాబుద్ధులు కొంతవరకు,  పుట్టిపెరిగిన వాతావరణము కొంతవరకు, గురు ప్రభావము,, మిత్ర సహవాసము, సమకాలీన ఉద్యమ ప్రభావము, నాటి సామాజిక ఆర్ధిక, రాజకీయాది స్థితి గతులు, మరికొంతవరకూ తోడ్పడతాయి. ఇవన్నీ కృష్ణశాస్త్రి జీవిత, వ్యక్తిత్వ, వికాసాభ్యున్నతులకేవిధంగా దోహదపడ్డాయో వీరి కవితలలో, సినీగీతాలలో స్పష్టంగా గోచరిస్తాయి.  విరహ వేదనను అత్యంత హృద్యంగా మరెవరూ  వ్రాయలేనంతగా అక్షరాలను పొదివి వాడేది వారి కలం .   ఆలోచనల్లో పుట్టిన సాహిత్యం... వెయ్యికాలాలు వర్థిల్లుతుందట. సరిగ్గా అలాంటివే దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం. విరహవేదనను ఎంత హృద్యంగా వర్ణించారో చూడండి ఆయన.   క్షణాలు రాళ్ళుగా మారి కదలడం లేదట. మనసులోరూపం మాత్రం అలానేఉందట. పోనీవెళ్దామా అంటే... కుదరడం లేదట. అసలు వేదన ఎంత మధురంగా ఉంటుందా అని... చదివిన వారికితొలిసారిఅనిపిస్తుంది....   ఏ సీమల ఏమైతివోఏకాకినినా ప్రియా.. ఏకాకినినా ప్రియా.. ఏలాగీవియోగాన వేగేనోనా ప్రియా.. ఏలాగీమేఘమాసమేగేనోప్రియా.. ప్రియా.. ప్రియా.. ఘడియ ఘడియ ఒక శిలయైకదలదు సుమ్మీ..   ఎద లోపల నీరూపము చెదరదు సుమ్మీ.. పడిరావాలంటేవీలు పడదు సుమ్మీ.. వీలు పడదు సుమ్మీ.. దారులన్నియు మూసెదశ దిశలు ముంచెత్తె.. నీరంధ్ర భయధాంథకార జీమూతాళి.. ప్రేయసీ.. ప్రేయసీ.. వెడలిపోయితివేల ఆ అగమ్య తమస్వినీగర్భకుహరాల.. తమస్వినీగర్భకుహరాల..   లోకమంతా పాకినవిపగటివెలుగులు.. నాకు మాత్రం రాకాసిచీకట్ల మూలుగులు.. రాకాసిచీకట్ల మూలుగులు..   ఎపుడు నీపిలుపు వినబడదోఅపుడు నా అడుగు పడదు.. ఎచటికోపైనమెరుగక ఎందుకోవైనమందక నా అడుగు పడదు..   నవ్విపోదురు గాక నా కేటిసిగ్గు? అంటూ దేవులపల్లి వారు తన మనసులోని భావాలని  ప్రకటిస్తూ నవ్వేవారు నవ్వనీ అని తన కవితతో విమర్శకులకు సవాల్ విసిరిన ధీశాలి.   నవ్విపోదురు గాక నా కేటిసిగ్గు? నా యిచ్ఛయే గాక నా కేటి వెరపు? కలవిహంగము పక్షముల దేలియాడి తారకా మణులలో తారనై మెరసి మాయ మయ్యెదను నా మధురగానమున!   నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు? మొయిల దోనెలలోన పయనంబొనర్చి మిన్నెల్ల విహరించి మెరపునై మెరసి పాడుచు చిన్కునై పడిపోదు నిలకు   నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు? తెలిమబ్బు తెరచాటు చెలిచందమామ జతగూడిదోబూచిసరసాల నాడి దిగిరాను దిగిరాను దివినుండిభువికి   నవ్విపోదురు గాక నా కేటిసిగ్గు? శీకరంబులతోడ చిరుమీలతోడ నవమౌక్తికములతో నాట్యమ్ము లాడి జలధి గర్భమ్ము లోపల మున్గిపోదు   నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు? పరువెత్తి పరువెత్తి పవనునితోడ తరుశాఖ దూరి పత్రములను జేరి ప్రణయ రహస్యాలు పల్కుచు నుందు   నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు? అలరుపడంతి జక్కిలిగింత వెట్టి విరిచేడె పులకింప సరసను బాడి మరియొక్క ననతోడ మంతనం బాడి వే రొక్క సుమకాంత వ్రీడ బో గొట్టి క్రొందేనె సోనల గ్రోలి సోలుటకు పూవు పూవునకును పోవుచునుందు   నవ్విపోదురు గాక నా కేటిసిగ్గు? పక్షిసయ్యెద చిన్నిఋక్ష మయ్యెదను మధుప మయ్యెద చందమామ నయ్యెదను మేఘ మయ్యెద వింత మెరుపు నయ్యెదను   అలరు నయ్యెద చిగురాకు నయ్యెదను పాట నయ్యెద కొండవాగు నయ్యెదను పవన మయ్యెద వార్ధిభంగ మయ్యెదను ఏలొకోయెప్పుడోయెటులనోగాని మాయ మయ్యెద నేను మారిపోయెదను.   నవ్విపోదురు గాక నా కేటిసిగ్గు? నా యిచ్ఛయేగాక నా కేటివెరపు   దేవులపల్లి వారి దేశభక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రతి అక్షరం దేశభక్తిమయం .. ఈ దేశభక్తి గేయం లో ఆయన వాడిన ప్రతి పదం పండిత పామరుల నోళ్ళపై పలికింపబడిన శక్తి  దేవుల పల్లి కృష్ణశాస్త్రి అక్షరాలది.   జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి.. జయ జయ జయ సత సహస్ర నర నారి హృదయ నేత్రి..   జయ జయ సస్యామల సుస్యామల చల శ్చేలాంచల జయ వసంత కుసుమ లత చలిత లలిత చూర్ణ కుంతల జయ మదీయ హృదయశయ ళాక్షరుణ  పద యుగళ   జయ దిశాంత గత శకుంత దివ్య గాన పరితోషణ జయ గాయక వైతాళిక గళ విశాల పధ విహరణ జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ...!   దేవులపల్లి కలం నుండి  కవితలు,గీతాలు,గేయాలు జలపాతమై జాలువారాయి.. తెలుగు నేలను, తెలుగు వారిని తేటతెనుగులో తడిపి ముద్దచేశాయ్.. ఆ మనోహరపరిమళాలు ఏళ్లతరబడి సువాసనలు వెదజల్లుతూనే వుంటాయ్.. దేవులపల్లి వారిని గురించి తెలియజేయాలంటే పుటలు చాలవు .. వారికి ఇది వ్యాస రచయిత సమర్పించుకుంటున్న ఓ చిరు పుష్పం మాత్రమే..!  

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information