సంగీత సుమదళం – బాలమురళి గళం - అచ్చంగా తెలుగు

సంగీత సుమదళం – బాలమురళి గళం

Share This
 సంగీత సుమదళం  – బాలమురళి గళం
-      భావరాజు పద్మిని.
“ఏ వాణి పుంభావమో ఈ మురళీ నాదమయుడు ఏ వారాల తొలి పంటయొ, ఈ స్వరాల వన్నెకాడు “   - డా.సి.నారాయణ రెడ్డి.   తంత్రీ సంగీత వాద్యాలు, చర్మ తాళ వాద్యాలు ఆయన చేతుల్లో పరవశించాయి. తన పాటకు తానే వయోలిన్ వాయించుకుంటూ గాత్ర కచేరీ చేసిన ఒక రికార్డింగ్ , రెండవ టేక్ గా తన పాటకు తానే మృదంగం వాయించుకుని, మొత్తం అన్నీ తానే అయ్యి రూపొందించిన ఒక గ్రామ్  ఫోన్ రికార్డు, ఏకైక ప్రపంచ రికార్డు గా నిలిచి, ఇప్పటికీ ‘అన్ బీటెన్ ‘ గా నిలిచింది. నాటికీ నేటికీ మేటిగా సంగీత గగనాన తళుకులీనుతున్న ఆ ధృవతార... మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు.   బాలమురళీకృష్ణ ఆంధ్రప్రదేశ్‌లోని శంకరగుప్తంలో 6.7.1930 లో జన్మించారు . ఆయన కుటుంబీకులు వృత్తిరీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. తండ్రి పట్టాభిరామయ్య ప్రముఖ సంగీతకారుడు మరియు వేణువు, వయోలిన్‌, విద్వాంసులు . వయోలిన్‌ టీచర్‌గా శంకరగుప్తంలో సంగీత తరగతులు నిర్వహించేవారు. తల్లి వైణికురాలు .బాలమురళీకృష్ణ పుట్టిన 13వ రోజునే తల్లి సూర్యకాంతం మరణించడంతో అమ్ముమ్మగారి ఊరు అయిన గుడిమెళ్ళంకలో తండ్రి ఆలనాపాలనలో పెరిగారు. చిన్నతనంలోనే అతనిలోని సంగీత ప్రతిభను గుర్తించి అతని తండ్రి పారుపల్లి రామకృష్ణ పంతులు దగ్గరకి శిష్యరికానికి పంపారు.   ఎనిమిదేళ్ళ ప్రాయంలోనే విజయవాడలోని త్యాగరాజ ఆరాధనలో కచేరి చేశారు .ఆనాటి నుండి సంగీతలోకంలో ఓ నూతన శకం ఆరంభమౌతోందని గుర్తించిన ముసునూరి సూర్యనారాయణ భాగవతార్ అప్పటి వరకు 'మురళీకృష్ణా' అని పిలుస్తున్న  ఆయన  పేరుకు ముందు 'బాల' అని చేర్చి, హృదయానికి హత్తుకుని ఆశీర్వదించారట. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిన ఆ శుభ ఘడియలను ప్రేక్షకులు తమ కరతాళ ధ్వనులతో శాశ్వతం చేసికున్నారు. ఆనాటి నుండి బాలమురళికృష్ణ చేసిన కచేరీలు సంగీత చరిత్రను తిరగవ్రాసేవి. రేడియోలో సంగీత కచ్చేరీలు వస్తాయని వాటిని వినాలనే ఊహే తెలియని పదకొండు సంవత్సరాల పసివయసులో 'బాలమురళి' మద్రాసు కేంద్రం నుండి మొదటి సంగీత కచేరీ చేసారు. ఆకాశవాణి కేంద్రం ప్రచురించే 'వాణి' పుస్తకం ఆ నెల 'బాలమురళి' ముఖచిత్రంతో అందరినీ అబ్బుపరచింది.   నాటి నుంచి నేటి వరకు ప్రపంచ దేశాలలో పర్యటిస్తూ 25 వేలకు పైగా సంగీత కచేరీలు ఇచ్చి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించారు. కొత్త రాగాల సృష్టికర్త. అనేక వాయిద్యాలను అలవోకగా వాయించగల ప్రవీణులు  బాలమురళి. 72 మేళకర్తల రాగాలలోనూ, ఒక్కో రాగానికి, ఒక్కో కృతి చొప్పున “జనక రాగ కృతి మంజరి “ అన్న గ్రంధాన్ని రచించి ప్రచురించారు. అంతేకాక, ఈ కృతులకు తన గానంతో ఆకృతి ఇచ్చారు. బాలమురళి స్వీయ సంగీత రచనల్లో ప్రసిద్ధమైనది “ రాగ ఠాయ మాలిక “. ఈ రచనలో బాలమురళి కళ్యాణి రాగాన్ని గ్రహ భేదం చేసి, శంకరాభరణం, తొడి, హరికాంభోజి, వంటి ఐదు రాగాలను అద్భుతంగా పలికించారు.   1977లో బొంబాయిలోని షణ్ముఖానంద హాలులో బాలమురళి, పండిట్‌ భీమ్‌సేన్‌ జోషిల జుగల్‌బంది మూడువేలమంది ప్రేక్షకుల మన్ననలను పొందింది. హిందూస్థానీ కళాకారులు చాలామంది జుగల్‌బందీ కార్య క్రమంలో పాల్గొన్నా, కర్నాటక సంగీత విద్వాంసునిగా బాలమురళి ఒక్కరే ఈ కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహించారు.  సంగీతంలో అనేక ప్రయోగాలు చేసిన మంగళంపల్లి ప్రసిద్ధ హిందుస్థానీ సంగీత విద్వాంసులు   కిషోరీ అమోంకర్‌, వేణుగాన విద్వాంసుడు హరిప్రసాద్‌ చౌరాసియా తదితరులతో కూడా జుగల్‌బందీలు నిర్వహించారు. ఆయన రూపొందించిన 'తిల్లానా'లు చాలా ప్రసిద్ధమైనవి . తెలుగు, తమిళం, కన్నడ, సంస్కృత సినిమాల్లో 400 గీతాలను కంపోజ్‌ చేశారు. భక్తప్రహ్లాద సినిమాలో నారదుడిగా, సందెని సింధూరం అనే మళయాళం సినిమాలో నటించారు.   బాలమురళి తెలుగులోనే కాకుండా కన్నడ, సంస్కృత, తమిళ, హిందీ, బెంగాలీ, పంజాబీ భాషల్లో కూడా వీరు సంగీత కచేరీలు చేసి బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు. ఫ్రెంచ్‌ భాషలో కూడా మంగళంపల్లికి ప్రవేశం ఉంది. ఫ్రెంచిలో వీరు చేసిన సంగీత కచేరిని అభినందిస్తూ ఆ ప్రభుత్వం వీరిని శెవిలియర్‌ డేలార్డేర్‌ డెస్‌ ఆర్ట్‌‌స ఎట్‌డెస్‌ లెటర్స్‌ అనే బిరుదును ప్రదానం చేసింది. స్థాయికి నాలుగే స్వరాలతో రాగాన్ని సృష్టించి, స్వేచ్చగా రాగాలాపన, సాహితీ ప్రస్తారం, స్వర ప్రస్తారం చేసిన సంగీత మాంత్రికుడు బాలమురళి.   బిరుదులు :   వీరికి సంగీత కళానిది, గానకౌస్తుభ, గానకళాభూషణ, గాన గంధర్వ, గాయకశిఖామణి, గాయక చక్రవర్తి, గానపద్మం, నాదజ్యోతి, సంగీత కళాసరస్వతి, నాదమహర్షి, గంధర్వగాన సామ్రాట్‌, సంగీత సామ్రాట్‌ ,జ్ఞానసాగర తదితర ఎన్నో అవార్డులు లభించాయి. ప్లేబ్యాక్‌సింగర్‌, మ్యూజిక్‌ కంపోజర్‌, మ్యూజిక్‌ డైరక్టర్‌గా మంగళంపల్లి జాతీయ అవార్డులను అందుకున్నారు. పలు విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు ఎన్నో వీరికి లభించాయి.   మ్యూజిక్‌ థెరఫీ ద్వారా రోగాలు ఎలా నయం చేయవచ్చు అనే అంశంపై డాక్టర్‌ మంగళంపల్లి పరిశోధనలు చేస్తున్నారు. దీని గురించి ఆయన మాటల్లోనే... “మానసిక రుగ్మతలకు,వ్యాధులకు సంగీతం ఒక అద్భుత చికిత్సా ప్రక్రియ. అయితే పరిశోధనలు మాత్రం చేయలేదు. ఇది ప్రాక్టికల్ సబ్జెక్టు కనుక అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోగలిగేది. ఈ ప్రక్రియ ద్వారా చావుకు దగ్గరగా వెళ్లిన అనేకమంది సాంత్వన పొందారు.”   “ సంగీతమే నా ప్రాణం, రాగమే నా జీవనమని “ చెప్పే మంగళంపల్లి బాలమురళీకృష్ణ శాతాయుష్కులై శాస్త్రీయ సంగీత పతాకాన్ని వినువీధిలో ఎగురవెయ్యాలని వాగ్దేవిని ప్రార్ధిద్దాం.   ఆయన తంజావూరు లోని బృహదీశ్వర లింగం దర్శించినప్పుడు, మొదటి ప్రదక్షినతో పల్లవి, రెండవ ప్రదక్షిణ తో అనుపల్లవి, మూడవ ప్రదక్షిణ తో చరణం రాసిన కానడ రాగంలోని “బృహదీశ్వర మహాదేవ” అనే కృతిని క్రింది లింక్ లో వినండి. https://www.youtube.com/watch?v=gmqTwTRuDUo 'ఖగరాజు నీ ఆనతి...' అనే చరణంలో వైవిధ్యమైన సంగతులను పలికిస్తూ, బాలమురళి గానం చేసిన అభేరి రాగంలోని 'నగుమోము కనలేని...' కృతిని క్రింది లింక్ లో వినండి...
 https://www.youtube.com/watch?v=ZY0GQfLXkfE
   

No comments:

Post a Comment

Pages