పెంచి పోషిస్తే మిమ్మల్నే మింగేస్తుంది... “భయం!” - అచ్చంగా తెలుగు

పెంచి పోషిస్తే మిమ్మల్నే మింగేస్తుంది... “భయం!”

Share This
పెంచి పోషిస్తే మిమ్మల్నే మింగేస్తుంది... “భయం!”
బి.వి.సత్యనగేష్
హైదరాబాద్ లోని మైండ్ ఫౌండేషన్ సెంటర్ ఫర్ పర్సనల్ ఎక్సల్లెన్స్ డైరెక్టర్.
మనసు అనేది ‘ఆలోచన ప్రక్రియ’ తో కూడిన మానసిక ముద్రల సమూహం. ఆసాజీవిలా ఆలోచించే వారికి జీవితం ఆశాజనకంగా ఉంటుంది. నిరాశా జేవిలా ఆలోచించేవారికి జీవితం ఎంతో విషాదంగా ఉంటుంది. ఈ ఆలోచన ప్రక్రియ అనేది మనసులోని మానసిక ముద్రలను బట్టే ఉంటుంది. ఎన్నో రకాల సందర్భాలలో ఎదురైన సంఘటనలలో మనసు స్పందిస్తుంది. ఆ స్పందన ఆలోచనా ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి భయాన్ని పెంచుకున్నాదంటే అతనిలోని మానసిక ముద్రల వల్ల మాత్రమె. అలానే ధైర్యం కూడా. అలవాట్లు, భయాలు పుట్టుకతో రావు. మనిషికి పుట్టుకతో ఉండేవి రెండు భయాలు. ఒకటి పెద్ద శబ్దాలకు భయపడడం. రెండవది లోతు ప్రాంతంను చూడటం వలన వచ్చే భయం. మిగిలిన భయాలన్నీ మనిషి పెంచుకున్నవే. అమెరికాలోని విస్కాన్సిన్ యునివెర్సిటీ వారు ‘భయం’ పై చేసిన అధ్యయనం ద్వారా వచ్చిన పరిశోధన ఫలితాలు ఈ విధంగా వున్నాయి.
  1. మనం భయపడే విషయాలలో 40% అసలు ఎప్పుడూ మన జీవితంలో చోటుచేసుకోవు. అంటే అవి జరగవు.
  2. జరిగిపోయిన వాటి గురించి తలచుకుని భయపడేవి 30% వుంటాయి.
  3. అసలు ప్రాముఖ్యతే లేని విషయాల గురించి ఆలోచించి భయపడుతూ ఉండేవి 22% వుంటాయి.
  4. మనం శ్రద్ధ వహించ వలసిన విషయాలు కేవలం 8% మాత్రమె వుంటాయి.
కేవలం 8% విషయాలు మాత్రమె మనకు భయాన్ని కలిగించేవి కనుక వీటిని అర్ధం చేసుకుని అధిగమించాలి.   భయాలు పుట్టుక ఎంతో రక్షణతో పెరిగిన పిల్లల్లో భయం ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులు, ఇతర పెద్దలు అన్ని విషయాల్లోనూ రక్షణ కల్పిస్తూంటారు. ప్రేమ, అనురాగం పేర్లతో వారిని ఎప్పుడూ రక్షిస్తూ వుంటారు. అంతే కాకుండా భయపెడుతూ వుంటారు కూడా. రోడ్డు దాటాలని (క్రాస్), సైకిల్ తొక్కాలని, స్విమ్మింగ్ చెయ్యాలని పిల్లలు ఉత్సాహంతో వున్నా భయం కలిగించే ఉదాహరణలతో సూచనలిస్తారు. మరొక కోణం చూద్దాం ఎటువంటి రక్షణ లేని పిల్లలను పరిశీలిస్తే... వారు భయం లేని వారుగా పెరిగినట్లు ఋజువవుతుంది. దీనికి కారణం... ఎటువంటి భయం కలిగించే ఉదాహరణలతో సూచనలు లేకపోవడమే! చెడు సూచనలను పదేపదే గుర్తు చేసుకోవడం, ఊహించుకోవడం, పునశ్చరణ చేయడం వల్లనే ‘భయం’ అనే మానసిక ముద్ర పడుతుంది. నూటికి 99 మంది స్కూటర్ ను సునాయాసంగా డ్రైవ్ చేస్తారు. కొంత మంది అదే పనిని అతి భయంకరమైనదిగా భావిస్తారు. భయానికి సంబంధించిన విషయాలను అదే పనిగా గుర్తు చేసుకుంటూ వుంటే కొన్నాళ్ళకు అవి ఫోబియాలుగా మారుతాయి. వినటానికి ఈ ఫోబియాలు విచిత్రంగానూ, మూర్ఖంగానూ అనిపిస్తాయి. ఈ భయాలకు వ్యతిరేకంగా పోరాడమని బలవంతం చేస్తే కళ్ళు తిరగటం, కడుపు నొప్పి, వికారం లాంటి లక్షణాలు ప్రదర్శిస్తారు. ఒక ఉదాహరణను చూద్దాం. ఒక బ్యాంకు ఉద్యోగి అన్ని విషయాల్లోనూ చురుకుగా ధైర్యంగా ఉండేవాడు. 1983వ సంవత్సరంలో ఆ బ్యాంకు లోని కస్టమర్ లు లేని సమయం చూసుకుని కస్టమర్స్ లా నలుగురు ప్రవేశించారు. అదొక చిన్న బ్రాంచ్. నేషనల్ హైవే మీద వుంది. బ్యాంకు తలుపులు మూసేశారు. ఒక వ్యక్తి బయట నిలబడి వచ్చిన కస్టమర్ లను ఈ విధంగా చెప్పి వెనక్కి పంపించేస్తున్నాడు. “హెడ్ ఆఫీస్ నుంచి చెకింగ్ కు పెద్ద ఆఫీసుర్లు వచ్చారు. ఒక గంట వరకు బ్యాంకు కార్యకలాపాలుండవు. దయచేసి సహకరించండి” అని చెప్పాడు. ఇంతలో లోపలున్న సిబ్బందిని కరెన్సీ, గోల్డ్ ఉంచే “స్ట్రాంగ్ రూమ్” లో పెట్టి అన్నీ తీసుకుని దుండగులు వెళ్ళిపోయారు. తరువాత వచ్చిన కస్టమర్ లు బ్యాంకు ఖాళీగా ఉండడంతో ఆశ్చర్యపోయారు. “స్ట్రాంగ్ రూమ్” లో నుంచి “రక్షించండి” అనే అరుపులు బయటకు వినపడటం లేదు. చివరికి పక్క బ్రాంచ్ కు పని మీద వెళ్ళి, తిరిగి వచ్చిన జీపు డ్రైవర్ పరిస్థితిని చూసి, అనుమానం వచ్చి అతి కష్టం మీద ఆ “స్ట్రాంగ్ రూమ్” ను తెరిచాడు. గాలి కూడా దూరలేని ఆ గది నుంచి కోన ఊపిరితో సిబ్బంది బయటపడ్డారు. ఈ సంఘటన కళ్ళారా చూసి, అనుభవించిన ఈ సదరు ఉద్యోగి భయానికి లోనయి బ్యాంకు ఉద్యోగానికి పదవీ విరమణ చెయ్యాలనే నిర్ణయానికొచ్చాడు. మిగిలిన సిబ్బంది మాత్రం మామూలుగానే పని చేసుకోవడం ప్రారంభించారు. 1983లో సెల్ ఫోన్లు వుండి వుంటే కొంతవరకు ఈ అపాయం జరిగేది కాదేమో! ఈ సంఘటనను విశ్లేషిస్తే భయం ఎలా మానసిక ముద్రగా మారుతుందో తెలుస్తుంది. దోపిడీ జరిగిన తీరును అతను గుర్తు చేసుకుని,బ్యాంకు లోకి ప్రవేశించిన ప్రతి వ్యక్తిని అనుమానంగా చూస్తూ, ఆందోళనకి గురవుతూ ఉండేవాడు. దీనిని POST TRAUMATIC STRESS DISORDER అంటారు. ప్రతీక్షణం తలచుకుని ఆందోళన చెందడం వలన ఆ ఉద్యోగమే ఒక భయంగా మారింది. ఇది కేవలం మానసిక ముద్ర మాత్రమే. ఇటువంటి భయాలు ‘సైకోసిస్’ కు సంబంధించినవి కావు. ఇవి కేవలం భావోద్వేగం పునశ్చరణ అవటం వల్ల వచ్చినవి మాత్రమే. వీటిపై BAGBY మరియు SHAFFER అనే ఇద్దరు సైకోలజిస్టులు ఎంతో సమాచారం అందించారు. ఎదురుతిరగాలి ఇటువంటి భయాలకు ఎదురు తిరిగి ప్రయత్నం చేసి, సఫలీకృతులై ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవడమే నివారణ. ముందడుగు వెయ్యాలి. ఛాలెంజ్ గా తీసుకోవాలి. సిపాయిలా ప్రవర్తించాలి. భయం కలిగించే విధంగా ఆలోచించకూడదు. చెడు సంఘటనలను పునశ్చరణ చేసుకోకూడదు. సానుకూల దృక్పధం అలవర్చుకోవాలి. ‘మానసిక స్వాతంత్ర్యం’ సంపాదించుకోవాలి. ఇది కేవలం మానసిక వ్యాయాయం మాత్రమే.

No comments:

Post a Comment

Pages