సబల
-      పోడూరి శ్రీనివాసరావు
  సాయంత్రం ఆరుగంటలవడానికి ఇంకా పది నిముషాలె టైముంది. గోధూళి వేళ. పశువులన్నీ పొలాలనుంచి ఇళ్ళకు చేరుకుంటున్నాయి. మబ్బులు కమ్ముకుంటున్నాయి. కానీ ఉక్క పోత తప్పితే, వానొచ్చే సూచనలేమీ కనబడ్డంలేదు. ట్రైన్ కోసం ఎదురు చూస్తున్న ప్రయాణీకుళ్లా, సూర్యుడు ఇంకా అస్తమయానికి టైముందన్నట్లు సిగ్నలివ్వక అవుటర్లో ఆగిపోయి, కూతల మీద కూతలు కూస్తూ మెల్లిగా చక్రాలనీడ్చుకొంటూ, పట్టాలను రాసుకొంటూ మూలుగుతూ నడుస్తున్న రైలింజనులా నెమ్మది నెమ్మదిగా అస్తమయానికి సన్నద్ధమౌతున్నాడు. సిర్పూర్కాగజ్ నగర్ ట్రైను రావడానికి టైమయిందని మైకులో అనౌన్సు చేశారు. జమ్మికుంట ప్లాట్ఫార్మ్ నెంబరు ఒకటి మీద, సిమెంటు బెంచి మీద, కాళ్ళు రెండూ మఠమేసుకొని, మోకాళ్ళ మీద బుర్ర వాల్చి, దీర్ఘాలోచనలో మునిగి వున్న లక్ష్మి అనౌన్స్మెంటు వినగానే కంగారుగా లేచి నిలబడింది. అనౌన్సుమెంటు వినపడ్డ సుమారు పది నిముషాలకు కీచుమంటూ శబ్దం చేసుకొంటూ ట్రైను స్టేషనుకి వచ్చి ఆగింది.  ఎక్కే జనాల్తో, దిగే జనాల్తో, స్టేషనంతా సందడి సందడిగా వుంది. టీ, కాఫీలు అమ్ముకొనే వాళ్ళు, ఇడ్లీ వడలు అమ్ముకొనే వాళ్ళ కేకల్తో రణగొణ ధ్వనులతో స్టేషనంతా హడావుడి హడావుడిగా వుంది.  ట్రైన్ బయల్దేరడానికి సిద్ధంగా వుందంటూ మైకులో అనౌన్స్మెంటు వింటూనే, అంతవరకూ అటూ ఇటూ పరిగెత్తుతూ జనరల్ బోగీని వెతుక్కుంటున్న లక్ష్మి ట్రైన్ కదలడం చూసి, ఎదురుగా కనిపించిన కంపార్ట్మెంటులో చొరబడింది. ఇంతా చేస్తే, అది రిజర్వుడు కంపార్టుమెంటు. కంగారుగా దిగుదామని అనుకొన్నా, ట్రైన్ అప్పటికే స్పీడందుకోవడంతో, గత్యంతరం లేక, కంపార్టుమెంటులోనే తలుపు దగ్గర సర్దుకొని ముడుచుకొని కూర్చుంది. భయం భయంగా ఎక్కడ టీటీ వస్తాడో అని బిక్కు బిక్కు మంటూ చూస్తూ కూర్చుంది. రెగ్యులర్గా జమ్మికుంట నుండీ పెద్దపల్లి కాలేజ్ షటిల్ చేసే కుర్రాళ్ళకు ఇది మామూలే ! కొంత సేపు మాత్రమే ఈ సన్నివేశం. మామూలుగా భయం భయం - కొంత సేపు మాత్రమే ప్రదర్శించి, ఆ తరువాత నృత్య ప్రదర్శన చేస్తుంది. తెలుగు పాటలకు, హిందీ పాటలకు అణుగుణంగా స్టెప్పులు వేస్తూ సీట్ల మధ్య గల ఖాళీ స్థలంలో డాన్స్ చేస్తూ అయిపోయాకా, అక్కడున్న ప్రయాణీకులు ఇచ్చే డబ్బుల్తో మరో పెట్లో ప్రవేశిస్తుంది లక్ష్మి. అక్కడ కూదా ఇదే తంతు. ఈ విధంగా రోజూ ఇదే ట్రైన్ కి జమ్మికుంట నుంచి పెద్దపల్లి వరకూ ప్రయాణించడం, వసూలైన డబ్బుల్తో పెద్దపల్లి లోనే రాత్రి భోజనం లాంటిదో, టిఫినో కానిచ్చేయడం, ఆ రాత్రి పెద్దపల్లి స్టేషన్లోనే గడిపేసి, మర్నాడుదయమే జమ్మికుంట చేరుకోవడం, తన గుడిసెకు చేరుకొని పగలంతా వాళ్ళింట్లో, వీళ్ళింట్లో పని పాటలు చేసుకొని నెలంతా పనిచేసినదానికొచ్చిన జీతం డబ్బుల్తో కాలం వెళ్ళబుచ్చుతోంది. సాయంత్రం అయ్యేసరికి మాత్రం, తయారయి, 6 గంటల బండికి జమ్మికుంట  నుంచీ పెద్దపల్లి వరకూ సిర్పూర్ కాగజ్ నగర్ ట్రైను లో వెళ్ళడం, డాన్స్ చేసి నాలుగు డబ్బులు సంపాదించుకోడం కొన్నేళ్ళుగా జరుగుతున్నదే. చిన్న తనమ్నుంచీ, తల్లెవరో, తండ్రెవరో కూడా తెలియక, అనాధగా ఆపంచా, ఈ పంచా చేరి బ్రతకడానికి అలవాటు పడిపోయింది లక్ష్మి. తనకెంతో ప్రాణమైన నాట్యాన్ని మాత్రం మానలేదు. జ్వరమొచ్చి, వంట్లో సత్తువ లేక అడుగు పడనప్పుడు తప్పితే, స్సంవత్సరంలోని మూడువందల అరవై అయిదు రోజులూ కూడా పాదాల మీద గజ్జలు పారాడ వలసిందే. పదహారు వసంతాల పరువపు ప్రాయం లోనే చక్కగా ఏపుగా పెరిగిన శరీరం, రోజూ చేసే కాయ కష్టంతోనూ, నృత్య సాధనతోనూ, మన్మధుని పూల బాణాన్ని, ధనస్సును తలపోస్తూ వుంటుంది. లక్ష్మికి తెలుసు తన సౌందర్యం తనకెప్పటికైనా శాపమేనని. అందుకనే తన జాగ్రత్తలో తను వుంటుంది. పరువంలో ఆడే కోడె త్రాచు ఎంత అందంగా ఠీవీగా వుంటుందో అంత ప్రమాదకరమైంది కూడా. కాటు వేయడానికి సిద్ధంగా పడగను అటూ ఇటూ ఆడిస్తూ నాగస్వరానికి నాట్యం చేసే ఫణిరాజు కళ్ళల్లోని ఆకర్షణ, తీక్షణత లక్ష్మి నృత్యం చేసేటప్పుడు ఆమె కళ్ళల్లో కనిపిస్తూ వుంటాయి. ఎవరైనా అనుచితంగా ప్రవర్తించాలని అనుకొన్నారో, వారికి మూడిందన్న మాటే. చిన్నతనం నుంచీ అనాధగా పెరిగినా కూడా ఆత్మ రక్షణకు కావల్సిన పద్దతులు నేర్చుకుంది. రివాజుగా సాయంత్రం 6 గంతలకు ప్రయాణం చేసే కుర్రాళ్ళందరకూ ఈ విషయం క్షుణ్ణంగా తెలుసు. అందు వల్ల లక్ష్మి పాటలకనుగుణంగా నృత్యం చేస్తున్నంత సేపూ, ఆనందించి సహాయం చేస్తారే గానీ, వెకిలిగా ప్రవర్తించడ్డం ఎపుడూ చేయరు. గతంలో చాలా రోజుల క్రితం కాలేజ్ లో రౌడీగా పేరు పొందిన విద్యార్ధి ఒకతను, లక్ష్మి పట్ల అనుచితంగా, అసహ్యంగా ప్రవర్తించడంతో మిగిలిన కాలేజ్ పిల్లలు అతనికి గట్టిగా బుద్ధి చెప్పారు. లక్ష్మి అంటే పిల్లలందరికీ కూడా సోదరీ భావం. ఆమె ఆత్మవిశ్వాసం పట్ల అందరికీ ఎనలేని గౌరవం. ట్రైన్ బయల్దేరిన కాసేపటికి, అంత వరకూ తలుపు వద్ద భయంతో కూర్చున్నట్లున్న లక్ష్మి ఒక్క సారిగా లేచి నిలబడింది. ప్రక్కనున్న చేతి సంచిలోంచి చిన్న సైజు టేప్ రికార్డర్ తీసింది. చిన్న చిన్న మువ్వలతో వున్న గజ్జెలు తీసింది. ఆ సన్నివేశం కోసమే సిద్ధంగా వున్నట్లు కాలేజ్ కుర్రళ్ళందరు 'షో'కి సిద్ధమైపోయారు. టేప్ రికార్డర్ ను ఒక పక్కన వుంచి, కాసెట్ ప్లే చేసింది లక్ష్మి. డాన్స్ చేయడానికి సిద్ధ పడింది. తేజాబ్ సినెమా లోని ఏక్ దో తీన్ ప్లే అవుతోంది. ఆ పాటకి అణుగుణంగా డాన్స్ చేయడం మొదలు పెట్టింది. కుర్రకారంతా హుషారుగా ఈలలు వేస్తూ, లక్ష్మిని ఎంకరేజ్ చేయడం మొదలు పెట్టారు. ప్రేక్షకుల హర్షధ్వానాలు ఎంకరేజ్ చేస్తుండగా  అమితోత్సాహంతో పూర్తిగా నాట్యంలో లీనమైపోయి ఆ పాటకు అణుగుణంగా నృత్యం చేసింది. లక్ష్మికి చిన్నతనం నుంచీ నాట్యం అంటే అపరిమితమైన ఇష్టం.. ప్రాణం అనుకోవచ్చు. చిన్నతనం నుంచీ కూడా ఎక్కడైనా పాటలు వినిపిస్తే చాలు ఆటోమేటిక్ గా కాలు కదపడం మొదలు పెట్టేది. తేజాబ్ పాట పూర్తైన వెంటనే అంతవరకూ ఆ అభినయం తో మైమరచిపోయిన ప్రయాణీకులు తమకు తోచిన విధంగా ధన సహాయం చేయడం మొదలు పెట్టారు. తరువాత 'అదృష్టవంతులు చిత్రంలో 'మొక్కజొన్న తోటలో' పాట ప్రారంభమైంది. ఆ పాటకి అణుగుణంగా కాలు కదిల్చింది. అభినయంతో అందరి హృదయాలనూ కొల్లకొట్టింది. ప్రయాణీకులు ఇచ్చిన డబ్బులు తీసుకొని, ఇంకో కంపార్ట్మెంట్లోకి దారి తీసింది. ఒక ప్రక్క నిలబడి అంతవరకు అభినయాన్ని, అందాన్ని కళ్ళతో జుర్రేస్తూ ఆనందాన్నీ అనుభవిస్తున్న ముగ్గురు యువకులు మాత్రం వాళ్ళలో వారు సంజ్ఞలు చేసుకుంటూ ఆమెతో పాటే మరో కంపార్ట్మెంటులోకి ఆమెను అనుసరించారు. మరో కంపార్టుమెంటులో కూడా ఇంతకు ముందులాగే ముందు తేజాబ్ సినెమా గీతానికీ,ఆ తరువాత మొక్క జొన్న తోటలో పాటకి నర్తించింది. అక్కడ కూడా ప్రయాణీకుల నుంచి విరాళం తీసుకున్న  డబ్బులు ప్రోగు చేసుకొని వేరే కంపార్ట్మెంటు వైపు నడిచింది. ఆమెనే అనుసరిస్తూ ఈ ముగ్గురు యువకులు, ఆమే తోటే  వేరే కంపార్ట్మెంట్ లోకి వెళ్ళారు. అదేవిధంగా రెండు, మూడు కంపార్ట్మెంట్లు పూర్తిచేసుకుక్నే సరికి పెద్దపల్లి స్టేషన్ వచ్చింది. స్టేషన్లో ట్రెయిన్ ఆగగానే, దిగి ప్లాట్ఫారం మీద ముందుకు నడిచింది లక్ష్మి. స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఊరివైపు ముందుకు సాగింది. ఆమెతో బాటే దిగి ఆమెనే చూస్తూ అనుసరించారు, ఆ ముగ్గురు యువకులు. రెగ్యులర్ గా స్టేషన్ బయటకువచ్చి, కాస్త దూరంగా ఉన్న చిన్న హోటల్ లాంటి భోజనశాల వైపు వెళ్ళి, అక్కడ ఆ మెస్ లో ఇంటావిడ పెట్టే భోజనం తిని, తిరిగి స్టేషన్ కు వచ్చి అక్కడే కాస్సేపు విశ్రాంతి తీసుకుని, స్టేషన్లోనే గడిపి తిరిగి తెల్లవారు ఝామున జమ్మికుంట వెళ్ళడం లక్ష్మికి కొన్ని సంవత్సరాలుగా అలవాటుగా మారింది. వేరేచోట, స్టేషన్ సమీపంలోనూ, ఊళ్ళోనూ, హోటళ్ళు గాని, చవకగా భోజనం పెట్టే మెస్ లు లేకకాదు, కానీ, ఊరికి కాస్త దూరంలో ఉండే ఈ మెస్ లో, ఆహరం చవకే కాదు, శుభ్రంగా, రుచికరంగా ఉంటుంది. పైగా ఇంటావిడ భోజనంతో పాటు, ఆప్యాయతకూడా కలిపిపెడుతుంది. ప్రేమగా, కన్న తల్లిలా, పిల్లల కడుపు ఆకలి చూసి అన్నం పెడుతుంది. స్టేషన్ సమీపంలో ఉండే కాంపిటీషన్, రద్దీ తట్టుకోవాలంటే, అద్దె తక్కువలో వసతి కావాలంటే కాస్త దూర్గంగా వెళ్ళక తప్పదు. పైగా, రుచికరమైన భోజనం, ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఆప్యాయతతో కలిపి దొరుకుతుంటే, కాస్త దూరమైనా వెళ్ళటానికి సందేహించరు. అందువల్ల, కాస్త దూరమైనా ప్రతీరోజూ ఆ మెస్ కే వెళ్ళీ భోజనం చేసి తిరిగి స్టేషన్ కు రావటం అలవాటు చేసుకుంది, లక్ష్మి. అదేవిధంగా, ఆ రోజుకూడా భోజనానికి వెళ్ళసాగింది, లక్ష్మి. ట్రైన్ ఎక్కిన దగ్గర్నుంచి తనని ఫాలో అవుతునా ఆ ముగ్గురు యువకులూ కూడా,అదే స్టేషన్లో దిగడం, తననే పరిశీలించటం గమనించలేదు. మెస్ కి వెళ్ళి భోజనం చేయగానే, తిరిగి స్టేషన్ వైపు తిరుగు ప్రయాణం సాగించింది. రెండింటి మధ్య దూరం సుమారు ఒకటిన్నర నుంచి రెండు కిలోమీటర్లుంటుంది. కానీ కొన్నేళ్ళుగా అలవాటుగా తిరుగుతున్న లక్ష్మికి అదేమంత పెద్ద దూరంకాదు. ఆడుతూ పాడుతూ తిరుగుతుంది. సుమారుగా సగం దూరం వరకు వచ్చేసరికి స్ట్రీట్ లైట్స్ ఆరిపోయాయి. పరధ్యానంగా నడుస్తున్న లక్ష్మి ఒక్కసారిగా ప్రాంతమంతా చీకటయ్యేసరికి ఉలిక్కిపడింది. చుట్టూ గాఢాంధకారం. అమావాస్య రాత్రులేమో, కన్నుపొడుచుకున్నా ఏమి కానరావడంలేదు. బిక్కు బిక్కుమంటూ అడుగులు వేస్తూ ముందుకు సాగుతూనే ఉంది. నడకవేగం పెంచాలో, తగ్గించాలో తెలియడంలేదు. తెలిసిన దారే కాబట్టి అలవాటుగా అడుగులు పడుతున్నాయి. తనకు తెలియకుండానే, నడక వేగం తగ్గి, అడుగులు నెమ్మదిగా పడడం మొదలయ్యింది. నెమ్మదిగా నడుస్తున్న లక్ష్మి, అకస్మాత్తుగా ఎదురుగా ఎవరో అడ్డం వచ్చినట్లనిపించేసరికి ఆగిపోయింది. ఆకారం ఎవరో తెలియడంలేదు గానీ, ఎవఓ ఎదురుగా అడ్డంగా నిలుచున్నట్లయి, ప్రక్కకు తప్పుకుని ముందుకు సాగబోయింది. ప్రక్కన కూడా ఎవరో మనిషి ఉన్న ఫీలింగ్. భావనే కాదు. నిజంగా మనిషి అడ్డమున్నాడు. ఏంచేయాలో అర్థంకాలేదు. ఎవరూ! అంటూ గట్టిగా అరవబోయింది. కానీ, అప్పటికే ఇరుప్రక్కలా ముందు ఉన్న మనుషులు ముగ్గురూ ఆమెను చుట్టిముట్టి ఆమెకా అవకాశం ఇవ్వకుండా బలవంతంగా, ఒడిసి పట్టుకుని, నోటిని గట్టిగా మూసివేసారు. గట్టిగా అరుద్దామనుకున్న లక్ష్మి నోటినుంచి, చిన్న మూలుగు మాత్రమే వెలువడింది. పెనుగులాట ప్రారమ్హమైంది. తను స్వతహాగా ధైర్యస్తురాలైనా, ఆత్మరక్షణకు అవసరమైన టెక్నిక్ లు నేర్చుకున్నా, ఆ చీకటికో ఏమీ కానరాని, అయోమయ స్థితిలో, గాభరాలో, అవేమి ప్రయోగించలేకపోయింది. ఆ ముగ్గురూ, మూర్ఖంతో, మృగాల్లా మారి ఆమెను రోడ్ ప్రక్కకు లాకుపోయారు. అప్పటికే ఆ మృగల్లాంటి మనుషులు, జేబురుమాళ్ళను ఆమె నోటిలో కుక్కి అరవటానికి అవకాశం లేకుండా చేశారు. వాళ్ళ చేతులు ఆమె శరీరంపై ఎక్కడెక్కడో తడుముతున్నాయి. అసహనంతో, నిస్సాహయతతో, లక్ష్మి మూగగా రోదిస్తోంది. "ఈ రోజు ఇలా ఎందుకు జరిగిందో తెలియదు, ఎన్నో రోజులనుంచి, ఎంతో అలవాటుగా తిరుగుతున్న ప్రదేశమేనా! ఇవాళ నా పరిస్థితి ఇలా ఎందుకు జరిగింది. తెలిసి నేనెవరికీ కీడు తలపెట్టలేదు. నా చేతనైనంతలో ఇతరులకు సాయాన్నే అందించాను గాని, ఎవరికీ అన్యాయం అపకారం చెయ్యలేదే!ఏసలు నన్నిలా పడుచేయటానికి ప్రయ్త్నిస్తున్న వీళ్ళెవరు? నేను కనీసం వాళ్ళ ముఖాలైనా చూడలేదే! నా కిలాంటి అపకారం తలపెట్టాలనీ, నన్నిలా పాడు చేయాలనే తలంపు వాళ్ళకెందుకు కలిగింది." పరిపరి విధాల వాళ్ళ గురించి ఆలోచిస్తూ మూగగా రోదిస్తోంది, లక్ష్మి. ఏమి చెయ్యలేని స్థితి! చేతులు జోడించి ప్రార్ధిస్తోంది. నోటితో వేడుకుందామంటే, రుమాళ్ళు నోటిలో కుక్కు బంధించారు. ఆ అవకాశం లేకుండా చేశారు. సమాధానం చెప్పలేక, నోట మాటకు అవకాశ లేక, మూగగానే వేడుకొంటోంది. ఆకలితో నకనక లాడే మృగానికి వేట దొరికాక, దాని కడుపు నింపుకోవటానికే ప్రయత్నిస్తుంది గానీ; జాలీ, కరుణా కలుగుతాయా! ఇంకా జంతువుకేనా నీతి న్యాయం ఉంటుందేమో కానీ, ఈ మధాంధులకు అటువంటివి ఉంటాYఆ? ఏ కోశానా ఉండవు!! మిగిలిన ఇద్దరు, వినోదం చూస్తూ ఉండగా, మూడోవాడు లక్ష్మిని ఆక్రమించాడు. ఎంత పెనుగులాడినా ఫలితం శూన్యం. పైగా కామక్రీడలో పైశాచికానందం అనుభవిస్తున్న తమ మితృనికి, మిగిలిన ఇద్దరూ సహకరిస్తున్నారు. తృప్తిగా లేచి, తన స్థానాన్ని మరో స్నేహితునికిచ్చి, ఆతని స్థానంలో మరో మితృనితో పాటు సహకరించటం మొదలుపెట్టాడు. ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరుగా ముగ్గురూ ఆమెను ఆక్రమించుకొనె, తమ ఆకలి తీర్చుకున్నారు. మొదట లేని అనుభవంతోనే, బలవంతం చేయబడ్డ లక్ష్మి, శీలం కోల్పోయిన కన్నెకుసుమం,మూగగా, బేలగా రోదిస్తూ, అచేతన అయి, స్పృహ కోల్పోయింది. కానీ కామంతో కళ్ళు మూసుకుపోయిన మదాంధులు ముగ్గురికీ ఆ అమ్మాయి ఎటువంటి పరిస్థితుల్లో ఉందో, స్పృహ ఉందో లేదో, జీవం ఉందో లేదో పట్టలేదు. ముగ్గురూ తమ పని కానిచ్చుకుని, పైశాచికానందంతో తిరిగి స్టేషన్ వైపు నడుచుకుంటూ వెళ్ళీపోయారు. ఈ ఘోరం చూడలేక, కళ్ళు మూసుకున్నట్లుగ, అంతవరకూ గాఢాంధకారంలో మునిగిపోయిన ఆ ప్రదేశం, పోయిన కరంటు తిగిరి రావటంతో, స్ట్రిట్ లైట్లు వెలగటంతో, వెలుగును వెదజల్లి, పగలులా మారింది. ఆ వెలుగులో చింపిరి జుట్టుతో, చిరిగిన బట్టల్తో నడుస్తున్న ప్రేతంలో అడుగులేస్తున్న లక్ష్మిని చూసి ఊళ్ళోంచి స్టేషన్ వైపు నడుస్తున్న జనం ఆశ్చర్యపోయారు. కరంటు రావటంతో మెల్లిగా జన సంచారం మొదలయింది. అలా నడుస్తున్న లక్ష్మి నడకలో మార్పు వచ్చింది. స్థితప్రజ్ఞలా, ధైర్యం తెచ్చుకుని పోలీసు స్టేషన్ వైపు అడుగులేసింది. నలుగురు ఆడపిల్లల్లంటిది కాదు, తను! ఇన్ని చట్టాలు చేస్తున్నా సగటు ఆడదానికి న్యాయం చేయలేని ఈ ప్రభుత్వాలూ, న్యాయస్థానాలు, ప్రజా ప్రతినిధులూ...ఇవన్ని ఎందుకు? గాంధిజీ కలలు కన్న - అర్ధరాతి ఆడపిల్ల ధైర్యంగా తిరిగే రోజులు ఎప్పుడొస్తాయి? ఎవరో ఒకరు దీనికి ప్రారంభం పలకనిదే, వ్యవస్థ ఎలా మారుతుంది? "నిర్భయచట్టం" ఏర్పరిచి, సరియైనా శిక్షాస్మృతి అమలుపరచనప్పుడు, ప్రల్లో మార్పు ఎలా వస్తుంది? ఈ "మృగాళ్ళూ" మగాళ్ళుగా ఎప్పుడు మారతారు? తనుకూడా ఒక ఆడదాని గర్భమ్నుంచే జన్మించానని, మరో ఆడదానికి భర్తగా, జీవితాంతం తోడుంటానని బాసచేసిన ఈ మగవాడి బుధ్ధి ఎప్పుడు మారుతుంది? స్త్రీని పవిగ్త్ర మూర్తిగా, పూజించవలసిన దైవంగా, మాతృమూర్తిగా, సోదరిగా, గౌరవించాలనే ఆలోచన ఈ తుచ్చులకెప్పుడు కలుగుతుంది? వీళ్ళకెప్పుడు జ్ఞానోదయం కలుగుతుంది?... ఇల పరిపరివిధాల ఆలోచించుకుంటుంటే, ఆ ఆలోచిన్స్తున్న మనస్సుకు జత కలిసినట్లుగా ఆమె కాళ్ళు ఊళ్ళోని పోలీసు స్టేషన్ వైపు నడుస్తున్నాయి. ఆ కామంధులపై "నిర్భయచట్టం" క్రింద కంప్లైంట్ చేయటానికి - ఈ లక్ష్మి అనే "సబల" ముందుకు సాగింది.  

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top