పల్లవికందని ప్రభుడవె కన్నా!
పెయ్యేటి  రంగారావు
 


 పల్లవికందని ప్రభుడవె కన్నా!
ఎటుల నిన్ను కొలిచెదనన్నా?  ||

1. నీ సొగసులను వర్ణించుటకు
భాష చాలదు, భావము చాలదు
నీ మహిమలను నుతియించుటకు
కలము సాగదు, కన్నీరాగదు ||

2. ఆద్యంతములే లేని వాడవే
ఆఈఓ లతొ ఎటు పొగడెదరా?
గీతాబోధను చేసిన వాడవే
ఏ గీతలతో నిను గీసెదరా?  ||

3. తత్వము తెలియదు, భాష్యము తెలియదు
ఏ భాషలతో  స్తుతియింతునురా?
భక్తి తెలియదు, జపవిధి తెలియదు
ఏ సౌరున నిను పూజింతునురా?  ||

4. కుబ్జనైనా, కుచేలునైనా
కాచినవాడవు నీవే కదరా
కామ మోహముల కుములుచుంటిని
కరుణజూపి నను కావవేలరా? ||

5. యజ్ఞయాగముల చేయగలేను
పురుషసూక్తమున పూజింపలేను
నిను స్మరియించుటె నాకు తెలియును
నామస్మరణతొ తనివినొందరా, కన్నా ||

6. భవబంధమ్ముల మ్రగ్గినవాడను
నీలో కలియుట ఎరుగని వాడను
అనాయాసముగ మరణము నిడుచు
నన్ను నీలో కలుపుకోరా, వెన్నూ! ||

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top