పిల్లలు - తల్లిదండ్రులు : చెరుకు రామమోహనరావు - అచ్చంగా తెలుగు

పిల్లలు - తల్లిదండ్రులు : చెరుకు రామమోహనరావు

Share This
రాజవత్ పంచ వర్షాణి దశ వర్షాణి తాడవత్ ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రన్ మిత్ర వదా చరేత్
  ఇది నీతిశాస్త్ర వచనము.శిశువు పుట్టిన మొదటి 5 సంవత్సరములు రాజు/రాణి లాగా చూసుకో. ఆతరువాత 10 సంవత్సరములు పట్టి తిట్టి కొట్టి ఏమి చేసి అయినా సరే  పిల్లలను దారిలో వుంచవలె. 16 వ సంవత్సరము వచ్చినప్పటి నుండి సంతానమును స్నేహితులగా చూసుకోమ్మన్నది ఆర్య వాక్కు. మరి దాన్ని పాటించుతూ వున్నామా!

పెద్ద చేయు పనుల దద్దయు గమనించి

చేయుచుందురింట చిన్నవారు

బుద్ధి లేని పనుల పోరాదు పెద్దలు

రామమోహనుక్తి రమ్య సూక్తి

కొన్ని వాస్తవాలను గమనించుదాము. పెళ్ళయిన అనతి కాలములోనే ఒక శిశువు కలిగితే, ఆ శిశువు వయసు 2 సం. లోపు వున్నప్పుడు కొందరు దంపతులు సరసమైన తమ కోరికలనాపుకోలేక అసహ్యముగానో అసభ్యముగానో ప్రవర్తించుచుంటారు.
ఇది చాలా తప్పయిన విషయము . పిల్లలలో జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. వాళ్ళు గమనించినది ఆ వయసులో వ్యక్తపరచ లేకున్నా వయసు వచ్చిన తరువాత తమ జ్ఞాపకాలకు రెక్కలు సమకూర్చుకొంటారు. ఇంకొక జంట తరచూ పోట్లాడుకొంటూ వుంటారు. అది కూడా ఆ శిశువు మనసులో నెలవైపోతుంది. పెరిగేకొద్దీ తాను విపరీతమైన 'అహం' తో సాటి వారితో తగవులాడుతాడు. అదే ఒక గుడికి పోయినపుడు తల్లిదండ్రులు కాకుండా శిశువుతో 3,4 ధర్మాలు భిక్షగాళ్ళకు చేసేవిధముగా చూడండి. పెద్దయితే వారిలో ఎక్కడ లేని దయ జాలి ఉంచుకొంటారు. సాటి మనిషికి సాయపడగలుగుతారు.ఆడపిల్లలకు మొదటిసారి తలనీలాలు తీయిన్చినతరువాత మరులా క్రాపులు కటింగులు లేకుండా చూడండి. పిల్లలకు చిన్న యసులోనే పరికిణీలు కట్టించండి. కాలకృత్యములు తీర్చుకొన్న వెంటనే స్త్నానము చేయిచి మీకు తెలిసిన శ్లోకాలో పద్యాలో ఒక్కొక్కటిగా చెప్పించండి.ప్రతిచెట్టు అటు బీజము వల్లనైనా ఇటు గాలికో, ఎటూ గాకుంటే కాకి పిచ్చుకల ద్వారానో మొక్కగా మొలుస్తుంది.మొలిచినతరువాత మనకు పరిశీలించే సమయము వుంటే మొక్క మంచిదా కాదా అని తెలుసుకొని దానిని వుంచటమో వూడపీకడమో చేస్తాము . మరి చూడకపోతే ఏదోఒకరోజు గోడ్డలికెరగాక తప్పదు. మొక్క వంగుతుందికానీ మాను వంగదు కదా! పిల్లలకు చిన్న వయసు లో తప్పక రామాయణ భారత నీతిచంద్రిక కథలు చెప్పండి, పెద్దలను ఇంటిలో వుంచుకోనేవాళ్ళు వారితో చెప్పించండి. ఇవికాక సమయస్పూర్తి, హాస్యము , మొదలగు గుణముల కాలవాలమైన కాళీదాసు,తెనాలి రామకృష్ణ కథలు తెలియజేయండి.ఈ కాలము పిల్లలకు అక్షర వ్యత్యాసాలే తెలియదు. మన భాష లోని అక్షరాలలో ప్రాణ మహా ప్రాణాలను గూర్చి పిల్లలకు ఈ కాలములో చెప్పేటప్పటికి చెప్పే వారి ప్రాణాలు పోతాయి. భాష నాశనమౌతుందన్న చింత రవ్వంత కూడా లేకుండా ఎంతో కాలము నుండి వస్తున్న భాషను కేవలము తమ పేరు ప్రతిష్ఠ కోసమే పాటుబడి,వున్న అక్షరాలలో కొన్ని తీసివేసియును, వాడుక భాష అన్న పేరుతోను, చనిపోయిన మహనీయులు చనిపోయి కూడా మనలను మన పిల్లలను చంపుచున్నారు. ఇప్పుడు బాధ్యత తల్లిదండ్రుల మీద పడింది. తప్పక పిల్లలకు 'అమరము' ఆంధ్ర నామ సంగ్రహము' నేర్పించండి.ముఖ్యము గా గుర్తుంచుకోవలసినది ఏమిటంటే ఆధునిక కవులైన 'శ్రీ శ్రీ' 'దేవరకొండ బాలగంగాధర తిలక్' లాంటివారి కవితల లోని కొన్ని పదాలు నిఘంటువును ఆశ్రయించనిదే అర్థము చేసుకోలేరు. దిగంబర కవితలు నగ్న కవితలు ఎందుటాకులైపోయినాయి. పచ్చగా ఎప్పటికీ ఉండేది కళ్యాణ సాహిత్యమే. తండ్రి పిల్లలకు సినిమా కథానాయకుడు. అతనే ఆదర్శము.మరి ఆతండ్రి పిల్లలను పెళ్ళాన్ని తీసుకొని పార్టీలని పబ్బులని, ఫంగ్షన్లని తీసుకు పోతున్నాడు. అవి చూసి పిల్లలు ఏమి నేర్చుకొంటారు అనే ఆలోచన వారికి ఉందా! సినిమా మంచిదయితేనే పిల్లలతో కూడా వెళ్ళండి.చేతులు కాలిన పిదప ఆకులు పట్టుకోవద్దు.ఒక కొడుకు ఈ విధంగా తండ్రి తో అంటున్నాడు.

పబ్బుకేగ వలయు పదివేలు నాకివ్వు

"తనయ! డబ్బు గాదు తగినబుద్ధి

నీకు వలయు " నన్న నీవద్ద యది లేదు

కలిగియున్న దడుగ గలుగుదనెను

ఆ స్థితి కలగకుండా చూచుకొనుట మంచిది. కాస్త 7 నుండి 10 సంవత్సరముల లోపువారవుతునే ఆడ మగ తేడా లేకుండా ఆటలు మొదలు పెడతారు. సహవాసము మంచిదయితే పరవాలేదు. కాకుంటే? 'సహవాస దోషయా పుణ్య గుణా భవంతు' సహవాస దోషయా పాప గుణాభవంతు అన్నారు పెద్దలు. మరి ఎంతమంది తల్లిదండ్రులకు ఇవి గమనించే వెసలుబాటు వుంది. అసభ్యమైన అసహ్యమైన మన బుద్ధికి అనూహ్యమైన తిట్లను ఆడ పిల్లలు తమ ఆటలలో వాడుచున్నారు. ఇక ఇంట్లో శుభ్రత. ఇంటి పనులకు పెట్టుకొన్న పనిమనుషులు ఎంత శుభ్రముగా పని చేస్తారు అన్నది మీ ఆలోచనకే వదిలి మీరు చేసే పనుల గూర్చి ఒక మాట చెబుతాను. చాలా మంది ఇళ్ళలో mineral water పేరుతో వచ్చే నీళ్ళు త్రాగడానికి ,పిల్లలకు త్రాపడానికి అలవాటు పడినారు. అసలు అందులో ఏమి minerals కలుస్తున్నాయి ,అవి minerals అని అనవలెనా లేక అవి chemicals అనవలేనా! సాధారణమైన మంచినీరు త్రాపుటలేదే పిల్లలలో రోగ నిరోధక శక్తి పెంపొందగలదా? ఇంట్లో అమ్మ తదితర పెద్దలు చేసే వంట కంటే hotel భోజనాలు అంత ఆరోగ్యకరమా? మీరిట్లు పెంచితే వాళ్ళు వాళ్ళ పిల్లలను ఎట్లు పెంచుతారు అన్నది ఆలోచించుతున్నారా. ఇక ఆటల గురించి ఒక్క మాట . శ్రీ మహావిషునువు చేతిలో శంఖచక్రగాదాఖడ్గములున్నట్లు నేటి పిల్లలచేతిలో శెలవు తోజున తెల్లవారుతూనే బ్యాటు,బాలు,స్టంప్సు,గ్లోవ్సు వుండవలసినదే.బయట ఆడే ఆట అది ఒక్కటే. గోలీలు ,బొంగరాలు,బిళ్ళంగోడు (చిల్ల-కట్టే,గిల్లి-దండ) మొదలగు సూర్యుని వెలుతురులో ఆడే ఆటలు చీకటిలోకి వెళ్ళిపోయినాయి. చీకటి ఆటలు వెలుతురులోనే పిల్లలు ఆడుతూవుంటే చూసే దౌర్భాగ్యస్థితిలోమనమున్నాము. అసలు గోలీలు బొంగరాలు లాంటి ఆటలలో ఏకాగ్రత ,లక్ష్యము, పట్టుదల మొదలుగునవి వ్యక్తిగతముగా పెంపొందించు కొనవచ్చును. మట్టిలో ఆడుటవల్ల పిల్లలలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఆట వస్తువుల ఖర్చు ఈ కాలమైతే ఒక 5 రూపాయలు.అదే క్రికెట్ అయితే 2000 రూపాయలకు పై మాటే. వర్షా కాలములో ఇంట్లో బారాకట్ట,పులిజుదము, బేరి ఆట మొదలుగునవి ఆడే వారు. వానికగు ఖర్చు 'శ్యున్యము.' ఇప్పుడు పిల్లల indoor games కు వేల వేల రూపాయలు తగలేస్తున్నారు. పిల్లలలో అతి తక్కువగా, తాము చేసే పని తప్పా ఒప్పా అని తర్కించుకొనే వాళ్ళు కూడా వుంటారు. అప్పుడు వారు మంచి వైపు మొగ్గు చూపే అవకాశముంటుంది. కానీ ఈ విధమైన నిర్ణయాలను తీసుకొనే విధంగా అతి చిన్న వయసునుండి పిల్లలకు చెబుతూ రావలసిన బాధ్యత తల్లి తండ్రులపై వుంటుంది. ఒక చిన్న కథ చెబుతాను. అన్నివ్యసనాలూ కలిగిన ఒక రాజుకు ఇద్దరు కొడుకులుండేవారు. రాజ కుటుంబము కాబట్టి పెద్దవుతూనే ఎవరి భవనాలు వారికుండేవి. కానీ బాల్యములో తల్లిదండ్రుల వద్ద వుండేవారు కావున ఇరువురూ తండ్రిని పరిశీలించేవారు. పెద్దవాడు తల్లికి తెలియకుండా తండ్రిని ఎంతో జాగ్రత్తగా గమనించేవాడు. చిన్నవాడిని మాత్రము తల్లి గమనించి ఎంతో గోముగా తన తండ్రి చేసే పనులన్నీ చేయకూడనివి అని హెచ్చరించింది. బాలుని మనసులో అది బలంగా నాటుకుంది. వారు ఇరువురు పెద్దవారై తమ తమ భవనాలలో ఉండజొచ్చినారు. రాజు తన కాలము ముగియ వచ్చిందని తెలుసుకొని మంత్రితో తన ఇద్దరు కొడుకులలో తగిన వారసుని ఎన్నామని మంత్రి తో చెప్పినాడు. సరేయన్న మంత్రి మొదటి కొడుకు వద్దకు పోయి చూస్థే తండ్రెంతనో తానంతగానే వున్నాడు. మంత్రి 'నీవు వ్యసనాలకు ఇంత బానిసవైపోయినావే రాజ్యము ఎట్లు ఎలగలవు' అన్నాడు. అందుకు అతడు 'వేరే ఏమి నేర్చుకోగలను ఆ తండ్రిని చూసి' అన్నాడు. మంత్రి రెండా రాకుమారుని వద్దకు పోతే ఎంతో కళా కాంతులతో అలరారుచున్నాడు. మంత్రి అతనితో కూడా అదే ప్రశ్న అడిగినాడు. అందుకు ఆ రెండవ అబ్బాయి నేను తండ్రినుండి ఏమేమి నేర్చుకొనకూడదు అన్న విషయాన్ని నేర్చుకొన్నాను. ఇది నా తల్లి పెట్టిన భిక్ష అన్నాడు. తరువాత ఎవరు రాజైవుంటారు అన్న ముగింపు మీకు తెలిసిందే . పిల్లల మానసిక స్థితికి వారి తల్లిదండ్రులే కారణము. మానసిక చికిత్సా నిపుణుడు చేయగలిగినది డబ్బు తీసుకొనుట మాత్రమె.అదే తల్లి దండ్రులు తలచితే తమ సంతును ఉన్నత శిఖరాలనధిరోహింప జేయవచ్చు. ఈనాటి మన మానసిక దుస్థితి ఈ విధముగా లేదేమో యోచించండి.

పండు తేనె తెనుంగు ప్రాచి పోవగ జూచు

ప్రతిభ గలిగినట్టి  ప్రభుత మనది

నన్నయ తిక్కన్న నాణెంపు కవితల 

కాలాన గలిపేటి ఘనత మనది

శాస్త్రీయ సంగీత ఛాయ నాసాంతమ్ము

పడనీక కాపాడు పాట మనది

అలవలాతల కూడ అద్భుతమ్మౌకైత

యనుచు కొండాడేటి యాస్థ మనది

అమెరికా తప్పటడుగుల నడుగు లిడుచు

స్వాభిమానమ్ము నమ్మేటి సరళి మనది

విల్వలకు వల్వలెల్లను విప్పివేసి

గంతులేయించు చున్నట్టి గరిత మనది

మనదు సాస్కృతి నంతయు మరచి పోయి

నాగారీకమ్ము కౌగిట నలిగిపోయి

తాతలను వారి చేతల త్రవ్వి గోయి

పాతి పెట్టితిమన బదుల్ పల్కగలమె

ఈ విషయము గమనించండి. డబ్బు సమయాన్ని హరించుతుంది. మనము డబ్బుకు దాసులము అందుకే కుబేరుని వాహనము మనిషి . ప్రక్కనే వున్నాడు పరమేశ్వరుడు(ఉత్తరము ప్రక్కన ఈశాన్యము) . కానీ దృష్టి ఆవైపు మరలదు . దాసునిగా ఉన్నంతకాలము దండన అనుభవించ వలసినదేకదా. సమయమంతా సంపాదనకే సరిపోతే సంతానముతో సహవాసమెన్నడు. 

 తెల్లవారినతోడ తేనీరు సేవించి

 జాగింగు చేసేసి జంట తోడ 

 బ్రష్షింగు బేతింగు బహుశీఘ్రముగ చేసి

 కనగ నూడిల్సుతో కడుపు నింపి

 కం కమ్ము కమ్మంచు కన్నబిడ్డలనంత

 స్కూలుకు కారులో చొరగజేసి

 అమ్మగారొకచోట అయ్యగారొకచోట

 కార్యాలయంముల గడిపి గడిపి

  పగటి యాకలి కేంటీను పాలు జేసి

 రాత్రి కన్నమ్ము స్టవ్ లోనె రగుల బెట్టి

 వీధి వంటలకొట్టుకు విధిగ బోయి

కూరలను తెచ్చి కడుపున కూరుతారు

 పిల్లల ప్రేమబోయె కన పెద్దలు చేరగ వృద్ధ వాటికల్

ఇల్లను పేరు నిల్చెనది ఇమ్ముకు మారుగ నివ్వ బాధలన్ 

ఉల్లము చిల్లులయ్యె గన ఊహలు మొత్తము జారిపోవగన్ 

చెల్లని కాసుగా మిగిలె జీవిత యంత్రము త్రుప్పు పట్టగన్ 

'నా' నుండి'మన' చేరవలేనంటే ఎంతో మానసిక పరిపక్వత అవసరము .కష్టనష్టాలు వుంటాయి కానీ కడకు సంస్కృతి నిలిపిన సంతృప్తి మిగులుతుంది.సంస్కృతి నిలిస్తే సంతోషము వెల్లివిరుస్తుంది. 

 పెద్దలు లేని ఇల్లు గద్దలు తిరిగే ఆకాశము లాంటిది.

తత్సత్

No comments:

Post a Comment

Pages