“ముగ్ధమోహనం” పుస్తక పరిచయం - భావరాజు పద్మిని. - అచ్చంగా తెలుగు

“ముగ్ధమోహనం” పుస్తక పరిచయం - భావరాజు పద్మిని.

Share This

ఒక ప్రక్క సున్నితమైన భావోద్వేగాల సమాహారం... మరో ప్రక్క కరడుగట్టిన క్రూరత్వపు విలయతాండవం... రెండిటినీ సమాంతరంగా నడిపిస్తూ, ఏ మాత్రం సమతౌల్యం తగ్గకుండా మేళవిస్తే... అది మెస్మరైజింగ్ రైటర్ విసురజ ‘ముగ్ధమోహనం’ నవల.

ఏ మనిషీ పుట్టుకతోనే ఉన్మాది/నేరస్థుడూ కాడు. పుట్టిన నేపధ్యం, పరిస్థితులు, సమాజం నుంచి తిరస్కరణ, కొరవైన ప్రేమ, ఆకలి, పేదరికం, ఇవన్నీ అతన్ని ప్రభావితం చేస్తాయి. ఆ సమయంలో సమాజం పట్ల వారికి ఉన్న తిరస్కార భావాన్ని, అసహ్యాన్ని, బలోపేతం చేసి, తమ స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుంటారు కొందరు. రక్తం వారిలోని విరక్తికి ఆజ్యం , ప్రాణం వారికి తృణప్రాయం, ధనం వారికి ఇంధనం... తమకు తెలియకుండానే ఉన్మాదం చేతిలో ఆయుధాలై, కుటుంబానికి, మమతకు దూరంగా, భయాన్ని మత్తులో ముంచేసి బ్రతుకుతారు వీళ్ళు.

అయితే, బండలైన ఆ గుండెల లోతుల్లో కూడా, మమత, మానవత్వం అనే నీటి చెలమ ఉంటుంది. అయితే, అది చూసే మనసుండాలి, ఆ మనసు ఆర్ద్రత, బండల్లోని తడిని తట్టి లేపాలి. అలా కరుణ, శౌర్యం, తెగువ, మంచితనం, ఆత్మీయత, ప్రాణాలను సైతం లెక్క చెయ్యని దేశభక్తి .... అన్నీ కలిసిన పాత్ర ‘కార్తికేయ’.... చిరుతపులిలా నేరస్తులను, తీవ్రవాదులను మెరుపు వేగంతో చాకచక్యంగా వెంటాడుతూ, పిడుగు పాటులా చావుదెబ్బ తీస్తూ వేటాడుతూ, దేశాన్ని క్రూరుల కోరల నుంచి రక్షిస్తూ ఉంటాడు, మన నవలలోని నాయకుడు కార్తికేయ.

మాటల్లో అమాయకత్వం, మనసులో వెన్నెల చలువ, రూపంలో అప్సరసలను పోలే అందం, స్త్రీ మమత లోని లాలిత్యం అన్నీ కలిపితే ముగ్ధ. ఆమె ప్రకృతి ప్రేమిక, పున్నమి చంద్రిక. ఎప్పుడూ తన పల్లెటూరి చెట్లూ, చేమలూ, ప్రకృతి, పెరట్లోని జామచెట్టు, ఇల్లు, తమ్ముడూ, నాన్న, జగన్నాధుడి కోవెల, కోవెలలోని చిన్ననాటి స్నేహితురాలు... ఇవే ప్రపంచంగా పెరిగిన ముగ్ధ, మొట్టమొదటిసారి ‘తాజ్ మహల్’ చూడాలనే కోరికతో ఢిల్లీ వీధుల్లో అడుగుపెడుతుంది. అనుకోని పరిస్థితుల్లో కార్తికేయతో పరిచయమై, ప్రేమలో పడుతుంది. అతడిని చంపాలనుకునే తీవ్రవాదుల చేతుల్లో ఇరుక్కుంటుంది.

ఇక డబ్బే ప్రపంచంగా, భారత దేశాన్ని కైవశం చేసుకుని, తాను మకుటం లేని మహారాణిగా వెలగాలని ఆశిస్తూ,అందుకు ఎన్ని ప్రాణాలైనా తీసే, ఎటువంటి సెంటిమెంట్స్ లేని  పాత్ర మోహన. ఈమె ఆలోచనలు పాదరసం అంత వేగవంతమైనవి, ఈమె చూపులు చురకత్తుల్లా పదునైనవి, శత్రువుల ఎత్తులు క్షణాల్లో చిత్తులు చేసే ఈమె... అంతర్జాతీయ నేరస్తురాలు. మెరికెల్లాంటి మగాళ్ళనైనా, తలెగరేసే తీవ్రవాదులనైనా సవాలు చేసి, తన పేరు వింటేనే వాళ్ళ వెన్నులోంచి వణుకు పుట్టించగల దిట్ట మోహన. అటువంటి మొహనకు మొదటిసారి భయం చిరునామా తెలిసింది. ఆ భయాన్ని మట్టుపెట్టాలని, తానే భయానికి  బలహీనతగా  మారి అతని ఎదుట నిలిచింది.

అయితే, మొదటిసారి ఆమె మమత రుచి చూసింది. తనకు తెలిసిన జనన మరణాల మధ్య ఇంత అందమైన అనుభూతి ఉందని తెలుసుకుంది. ఆమెలోని స్త్రీత్వం, సౌకుమార్యం మేలుకుంది. తను ఏ దేశంలో తన మేధతో  విలయం సృష్టించాలని అనుకుందో, అదే దేశానికి తన తెలివితేటలు ఉపయోగపడే విధంగా మలచుకోవాలని అనుకుంది. అయితే మోహన ఇలా మారడం వెనుక కారణాలు ఏమిటి ?

ఇదంతా ఎలా జరిగింది ? ముగ్ధ, కార్తికేయ, మోహన వీళ్ళ మధ్య కధను విసురజ(జగన్నాథ్ వెళిదిమెళ్ళ ) గారు మలచిన తీరు చదివి తెలుసుకోవాల్సిందే ! ప్రేమకు అందమైన అక్షర రూపం ఇచ్చేందుకు రచయత నాలుగు గంటలు పడ్డ కష్టం... పదాలలో ప్రతిఫలిస్తూ, పాఠకుల మనసుల్లో మధురానుభూతిగా నిలిచిపోతుంది.

ఇంతకు ముందు మీరు అనేక సస్పెన్స్/డిటెక్టివ్ థ్రిల్లర్ నవలలు చదివే ఉంటారు. అయితే ప్రేమకు, పగకు మధ్య పాఠకుల మనసుల్ని సయ్యాటలాడించి, తుఫాను- మలయమారుతాల సగమంలో సుడులు తిప్పి, చివరకు పూల రెక్కలు స్పృశించే హిమబిందువు ముగ్ధతను మన గుండె లోతుల్లో ముద్రిస్తుంది ఈ నవల. మనసు మూలల్లోని సున్నితత్వాన్ని తట్టి, ప్రతీ చదువరి స్మృతి పధంలో చిరకాలం నిలిచిపోయే ఈ నవల తప్పక చదివి తీరాల్సిందే ! ‘మెన్ రోబో’ అంతర్జాల పత్రికలో వచ్చి, పలువురి మన్ననలు పొందిన ఈ నవల ప్రతులు ప్రస్తుతం విశాలాంధ్ర లో అందుబాటులో ఉన్నాయి.

పుస్తకం పేరు :ముగ్ధమోహనం

ప్రచురణకర్తలు : మాన్ రోబో క్రియేషన్స్

ప్రతులకు : విశాలాంధ్ర అన్ని శాఖలలోనూ అందుబాటులో ఉంది.

ఇతర వివరాలకు దర్శించండి : www.manrobo.net, http://bhavajhari.blogspot.in/

No comments:

Post a Comment

Pages