చిన్నా సైకిల్ (కధ) : భమిడిపాటి కళ్యాణగౌరి - అచ్చంగా తెలుగు

చిన్నా సైకిల్ (కధ) : భమిడిపాటి కళ్యాణగౌరి

Share This
" అమ్మగారూ మా అయనకు ఒంటి నిండా జ్వరం ఉంది. నేను ఇప్పుడు వెళ్ళాలి. లేకుంటే దీప్తమ్మ బర్త్ డే  పార్టీ అయ్యే వరకూ ఉండి అన్నీ చక్కబెట్టి మీరు ఎయిర్ పోర్ట్కి వెళ్ళాక వెళ్లేదాన్ని.. ఈ రోజు నన్ను వదిలేయండి.రేప్పొద్దుటే వేగం వచ్చి అన్నీ చేసేస్తాను. అంది భాగ్య గాయత్రి తో.
భాగ్య ఒక హౌసింగ్ సొసైటీలో నలుగిళ్లలో పాచి పని చేస్తుంది. 7వతరగతి వర్కూ చదివింది. ఆత్మాభిమానం ఎక్కువే..!
ఒక్కతే కూతురని పల్లెటూళ్ళో నే ఉంటున్నా.. చాకలి కుర్రాణ్ణి ప్రేమిస్తే పెళ్ళి చేశారు. మొగుడు, పెళ్ళాలిద్దరూ  సిటీకి వచ్చి కష్టపడి మంచి బ్రతుకు బ్రతకాలని నిర్ణయించుకున్నరు. ఆమె ఇంటిపనులు చేస్తుంటే గోపాల్, ఆ సొసైటీలో వారి బట్టలు ఇస్త్రీ చేసి సంపాదిస్తున్నారు. ఇద్దరికీ పది సంవత్సరాల కొడుకు ఈశ్వర్. కాలనీ బైట మురికి వాడలో ఇల్లు బడుగకు తీసుకున్నరు. కొడుకు ని మున్సిపల్ స్కూల్ లో వేశారు.
భాగ్య అందరి ఇళ్ళలో చాలా నమ్మకంగా పనిచేస్తూ.. మంచి పేరు సంపాదించుకుంది. కొత్తగ వచ్చిన వాళ్ళు ఆమె ఎవరింట్లోనైనా మానివేస్తే తాము పెట్టుకుందామని కుతూహలంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆమెకి పని బాగా వచ్చు.. అమెకు ఏదీ చెప్పాల్సిన పనిలేదు. చురుకుగా చేస్తూ కూడా దేనికదే చక్కగ చేసుకుంటూ పోతుంది. అందరూ ఇంటి తాళాలు అప్పగించి నిర్భయంగా వెళ్ళిపోతుంటారు.
ఈశ్వర్ చలాకీగా వుంటాడు. వాడికి అందరూ తల్లి భాగ్య పోలికంటారు. ఏదైనా ఇట్టే నేర్చేసుకుంటాడు.
అప్పుడప్పుడూ  తల్లికి తోడుగా సాయంత్రాలు భాగ్య పనిచేసే ఇళ్ళలోకి వెళ్ళి అక్కడున్నంత సేపూ అన్నీ వింతగా ,కుతూహలంతో గమనిస్తూ ఉంటాడు. వాడికి కంప్యూటర్లు,లాప్-టాప్ లు, వీడియో గేం లు , మొబైల్స్ అంతే చాలా ఇష్టం . ఎప్పటీకైనా తానవ్వన్నీ కొనుక్కుని, వాడీ చూడాలనే గాఢమైన కోరిక. అందుకే చదువులో కూడా చురుకుగా వుంటాడు. ఆరోజు గాయత్రి కూతురు.. దీప్తి పుట్టీనరోజు. అంతకు మూందు రోజు నుండే వేసవి సెలవులు ప్రారంభం. తల్లి కూతుళ్ళు బర్త్ డే పార్టీ అనంతరం అర్ధరాత్రి, ' దుబాయ్' ప్రయాణం అవుతున్నారు. గాయత్రి తమ్ముడు దుబాయ్ లో వుంటున్నాడు. వీళ్ళు ఒక 20 రోజులు అక్కడ గడిపి రావాలని, బయలుదేరుతున్నారు. గాయత్రి భర్త గిరీష్ పెద్ద కంపెనీలో లీగల్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు.
భాగ్య చెప్పిందంతా విని గాయత్రి "సరె. సరే! ఈ రోజు బిల్డింగ్ లో ఉన్న నా స్నేహితులు సహాయం చేస్తానని చెప్పారు. నువ్వు వెళ్ళు ఫర్వాలేదు. కానీ పార్టీ కదా! ఇల్లంతా మురికి గా తయారౌతుంది. రేపు పొద్దుటే వచ్చి అన్నీ శుభ్రం చేసేయ్యి.తాళాలు పక్కింటి వాళ్ళకి ఇచ్చివెళ్తాను. నీకు తెలుసుకదా అయ్యగారు అసలు దొరకరు. ప్రద్దుట వెళితే గానీ రాత్రికి తిరిగి రారు. రాత్రి భోజనం కోసం నువ్వు ఏదో వండి పెట్టు. ఆయన మైక్రోవేవ్ లో వేడి చేసుకుని తింటారు. నీవు వెళ్ళి మీ ఆయన్ని చూసుకో అని అప్పగింతలు పెట్టింది గాయత్రి.
మర్నాడూ ఉదయాన్నే పనిలోకి వచ్చే సరికి ఇల్లంతా కేకు ముద్దలు, బెలూన్లు.ధర్మోకోల్ బాల్స్, డిస్పోజబుల్ గ్లాసులు, ప్లేట్లు తో భయంకరం గా వుంది. చక చకా అన్నీ శుభ్ర పరచి గంటన్నర లో అన్నీ పనులూ పూర్తి చేసేసింది.  భాగ్య ఈశ్వర్ నికూడా వెంట తెచ్చుకుంది. తల్లికి సాయంగా చిన్న చిన్న పనులు వాడు కూడా తల్లికై సాయం చేశాడు.
అయితే ఎప్పుడు వీళ్ళింటికి వచ్చినా వాడీ కళ్ళకి ఆకర్షించేది.. దీప్తి సైకిల్. అది తలుపు ప్రక్క సన్నటి కారిడార్ లో పెట్టి ఉంటుంది. వాడికి ఎప్పుడైనా .. కనీసం ఒక్కసారన్నా దానిని తొక్కాలని కోరిక.  చిన్నవయసులో వాడికి ఉర్రూతలూగించే కోరిక అది.బాల్యం లో కొన్ని వస్తువుల మీదున్న ఆశ, కోరిక కొన్నిరోజుల తర్వాత ఉండక పోవచ్చు. కానీ అది అందనప్పుడు అందుకోవాలన్న ఆలోచన ధృడంగా వుంటుంది. ఇప్పుడు  వాడికి ఆ అవకాశం వచ్చింది.
పగలంతా ఇంట్లో ఏవరూ ఉండరు. స్కూల్ గ్రౌండ్ ఖాళీ. తనకేమో వేసవి
శెలవులు. అన్నిటినీ సద్వినియోగ పరచుకోవాలనుకున్నాడు.
ఇల్లు తుడుస్తుండగా భాగ్యకి డైనింగ్ టేబిల్ క్రింద మెరుస్తూ పడి వున్న బ్రాస్లెట్ దొరికింది. మెల్లగా తీసి తన చిన్నపర్స్ లో) దాచుకుంది. ఫ్లైట్ కి వెళ్ళే తొందరలో గాయత్రి పిల్ల వంటి మీద వస్తువులన్నీ తీసి ఇచ్చిందనే అనుకుంది. దీప్తి కుడా అది జారి క్రింద పడిన సంగతి గమనించలేదు.
ఈశ్వర్ రెట్టించిన ఉత్సాహంతో రోజూ తల్లికి తోడు గా పనిలోకి వస్తున్నాడు. భాగ్య తన కొడుకుని శ్రద్ధగా గమనించి మురిసిపోయింది. కానీ వాడి అంతరార్ధం ని గమనించలేకపోయింది. ఆమె లోపల పనిచేస్తున్నప్పుడు మెల్లిగ సైకిల్ తీసి బయట పెడతాడు. తల్లితో బయటకు వచ్చాక ఆమెకు బై చెప్పి సైకిల్ తీసుకుని స్కూల్ గ్రౌండ్ కి వెళ్ళీ సైకిల్ తొక్కుతాడు. పగలంతా సైకిల్ వాడి చేతుల్లోనే ఉంటుంది. సాయంత్రం సైకిల్ తెచ్చి మెట్ల ప్రక్కన పెట్టి తల్లి లోపల పనిచేసేటప్పుడు మెల్లిగా కారిడార్ లోకి చేరవేస్తాడు.ఇలా మెల్లిగా పడుతూ లేస్తూ .ఆ సైకిల్ తొక్కి ..తొక్కి .. మొత్తం మీద సైకిల్ నేర్చుకోవడమే గాక ఫీట్స్ చేయడము కూడా మొదలు పెట్టాడు. వాడి ఆనందానికి అవధులు లేవు. తానేదో సాధించాననే సంతోషం.
ఈ లోగా గాయత్రి అనుకున్న దానికంటే ముందుగా తిరిగి వచ్చింది. గాయత్రి వెళ్ళిన తర్వాత ప్రక్క బిల్డింగ్ లో కృష్ణమూర్తిగారి అమ్మాయి పురుడయ్యి..కవలలు పుట్టారు. భాగ్య ఆ పిల్లలకి స్నానం చేయించే పని ఒప్పుకుంది.ప్రొద్దునే గాయత్రి ఇంట్ళో పనిచేసి, పిల్లలకు స్నానం చేయించి మళ్ళీ గాయత్రి ఇంటికి వచ్చి మిగిలిన పనిపూర్తి చేస్తుంది.
ఆ రోజు గాయత్రి పదకొండు గంటలకు ఇళ్ళు చేరింది. దీప్తి ఇంట్లోకి రాగానే తనకి అత్యంత ఇష్టమైన చిన్నసైకిల్ కనబడలేదని గ్రహించింది. ఈ లోగా గాయత్రి హడావుడి చేయసాగింది. ఏమైపోయింది .. సైకిల్ ఏమై పోయిందంటూ..! కవలపిల్లలకి స్నానం చేయించి వచ్చిన భాగ్యకి ఏమీ అర్ధం కాలేదు. తాను ఒకటి రెండు సార్లు చూసింది తప్ప పెద్దగా పట్టించుకోలేదు.
"తానుచూసునప్పుడుందే..! మరి పక్కింటి కుర్రాడు రాహుల్ ఏమైనా తీసుకెళ్ళడేమో"అనుకుని కనుక్కునేందుకు వెళ్ళి అడిగింది.
"వాడు బయట క్రికెట్ ఆడేందుకెళ్ళాడు.. సరే నేను వెళ్ళీ రాహుల్ ని పిలుచుకు వస్తాను వాడూ కనిపెడతాడు ఎవరైనా తీసుకెళ్ళారేమో..అని అంది భాగ్య. ఎదురింటి విక్కిని అడిగింది. వాడూ " ఈశ్వర్ ఎక్కడికెళ్ళడో నాకు తెలీదు" అని చెప్పడు. ఈ లోగా రాహుల్ పరుగెతుకొచ్చి పైకి వెళ్ళి దీప్తి వాళ్ళ అమ్మతో ఈశ్వర్ దీప్తి సైకిల్ తొక్కుతుండగా తను చూశానని చెప్పాడు.
దాంతో గాయత్రి కోపంతో గట్టిగా అరవ సాగింది. తాళాలిచ్చి, ఇల్లప్పగిస్తే, ఇంట్లో ఏవరూలేని అదను చూసుకుని, ఇంట్లో దొంగతనం చేస్తారా! అని మాటల మీద మాటలు పేర్చుతూ, అవమానిస్తూ, నీతి జాతి ఉండదు. అలగా జనం అంతా ఇంతే..! వీళ్ళని నమ్మటానికి లేదు. తిన్నంటి వాసాలు లెక్కబెడతారు. దొంగతనం వీళ్ళ జన్మహక్కు. ఏమైనా అంటే స్ట్రైక్ చేస్తారు. యూనియన్లు అంటారు.. అని అరుస్తూ  బయటకి వచ్చి మరీ గోల చేయసాగింది. ఈశ్వర్ ని వెతుక్కుంటూ వెళ్ళిన భాగ్య తిరిగొచ్చేసరికి మతిపోయింది. గత మూడేళ్ళుగా వీళ్ళింట్లో
పనిచేస్తున్నా ఆవిధంగా అలోచించలేదు.వేరే ఇళ్ళల్లో కూడా నమ్మకంగా పనిచేస్తూ వచ్చిందే కానీ ఎప్పుడూ ఎవరి దగ్గరా మాటపడలేదు. ఇప్పుడు ఇట్లా ఎట్లా జరిగిందబ్బా..! అనుకుంది. తన కొడుకు ఈశ్వర్ రెండుపూట్ల తనతో వచ్చేవాడు.. ఎప్పుడూ తను చూడలేదే ఇది నిజమై వుండదు. వాడిమీద పూర్తినమ్మకం వుంది.
అనవసరంగా వాణ్ణి అనుమానించకూడదు, వాడు నాకొడుకు, నాకు తెలియకుండా ఇలాంటి పని చేయడం అసంభవం.అని తనలో తాను అనుకుంది.
రాహుల్ ని నిలదీస్తూ " ఈశ్వర్ ని నువ్వెక్కడ చూశావ్ " అని అడిగింది.
రాహుల్ , " మున్సిపల్ స్కూల్ గౌండ్లో రోజంత సైకిల్ తొక్కుతూ ఉంటాడు." అని చెప్పడు. అంతే.. సుడిగాలి వేగంతో దూసెకెళ్ళింది భాగ్య స్కూల్ వైపు. ఈశ్వర్ వీరావేశంతో సైకిల్ మీద ఫీట్ చేస్తూ కనిపించాడు.
తన కొడుక్కి సైకిల్ తొక్కడం వచ్చింది.. అన్న నిజాన్ని చూస్తున్న ఆనందం కన్నా.. వాడు దొంగతనంగా  సైకిల్ తెచ్చిన విషయం గుర్తొచ్చి.. ఒక్క అంగలో వాణ్ణి చేరి వాణ్ణి లాగి చెంపదెబ్బకొట్టింది. అంతే వాడు  ఆగిపోయాడు. తల వంచుకొన్నాడు. సైకిల్ ఒక చేత, వాడిని ఒక చేత పట్టుకుని తీసుకు వచ్చి, గాయత్రి ముందు నిలబెట్టింది. దీంతో గాయత్రి శివాలెత్తిపోయింది. నానా తిట్లు తిట్టీ వాణ్ణి దొంగను చేసింది. తను ఎంత నిజాయితీగా వున్నా.. కొడుకు వల్ల ఈ రోజు మాటపడాల్సి వచ్చినందుకు గుడ్ల నీళ్ళు కుక్కుకుని తలవంచుకుంది.
గాయత్రి రభస అయ్యిందనిపించి పిల్లని, సైకిల్ని తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇక నీపని అనవసరం అని కూడా చెప్పేసింది వెళ్తూ..వెళ్తూ..! ఇంట్లో ఇంకా ఏమేం వస్తువులు పోయాయో .. ఏమేం వున్నాయో వెతుక్కోవలి అంటూ లోనికెళ్ళింది. భాగ్య తలవంచుకుని కొడుకుని తీసుకుని ఇంటికి వెళ్ళింది. టంకు పెట్టె క్రింద లోని  చీరెల్ అ క్రింద నుంచి బ్రేస్లెట్ తీసి పర్స్ లో వేసుకుని, వడివడిగా వెళ్ళి గాయత్రి ఇంటి తలుపు తట్టింది. గాయత్రి చిరాగ్గా మొఖం చిట్లించింది. " జీతం కోసమేనా..రేప్పొద్దునరా ఇప్పుడేగా వచ్చింది ఇంట్లో సామాను, వస్తువులు చూసుకుని అప్పుడు లెక్కచూసి ఇస్తాను అంది వెటకారంగా..! భాగ్య పర్స్ లోనుంచి బ్రేస్లెట్ తీసింది. ఆరోజు పార్టీలో జారి పడి వుంటుంది. అయ్యగారికి ఇద్దామని వుంచాను గానీ, సారు దొరకలేదు. మీరు వస్తున్నారని తెలిస్తే ముందే తెచ్చేసేదాన్ని..నాకొడుకు చేసిన తప్పుకు క్షమించండి.. వాడికి సైకిల్ నేర్చుకోవాలనే సరదా తప్ప.. దొంగతనం చేయాలన్న ఆలోచనలేదు. వాడూ కూడా దీప్తమ్మ వయస్సు వాడే..! మేం పేదవాళ్ళం .. వాడికి సైకిల్ కొనిపెట్టి సరదా తీర్చే స్తోమతలేదు. ఇప్పుడు వాడీకి ఏంకావాలో కూడా ఇప్పుడే తెలిసింది.. నా జీతం మీరు రేపే ఇవ్వండి ఫర్వాలేదు. మీ ఇంట్లో పనికి మరలా మీరు పిలిచినా నా మనసు ఒప్పుకోదు. నాకొడుకట్లా చేసి ఉండకూడదు. వాణ్ణి చక్కగానే పెంచుతున్న గానీ వాడి మనసు తెలుసుకోలేక పోయా.. ! మీరు కోపంలో తిట్టిన తిట్లతో నాకు జ్ఞానం వచ్చింది. బంగారం ధరలు బాగా  పెరిగాయట కదా..! దీప్తమ్మ ఒంటి పై బంగారం వేసేటప్పుడు.. తీసేటప్పుడూ మీరు చూసుకోండి. నేను వెళ్తున్నా..! కొత్తపని వెతుక్కోవాలి... అంటూ వెనక్కి తిరిగింది భాగ్య. ఆమె కళ్ళలోనుంచి జారి పడ్డ నీటి చుక్కలు చీరె చెంగులో ఇంకి పోయాయ్... కానీ ఆ తర్వాత గాయత్రి కంట నీరు ధారలై ప్రవహించింది. ఇంతకాలం నుంచి భాగ్య కుటుంబం గురించి తెలిసికూడా.. చిన్న సైకిల్ కోసం లేనిపోని అపోహలతో.. నిందను మోసి..చిన్నమనసును గాయం చేసినన విషయం.. తలచుకుని తలకొట్టేసినట్లయ్యింది గాయత్రికి.. పేదదైన భాగ్య పెద్దమనసు ముందు.. ఆవేశంలో విజ్ఞత మరచిన తన మనసు ఏపాటిదని.. కృంగిపోయింది.

No comments:

Post a Comment

Pages