శ్రీ పుట్టపర్తి రచించిన ఇతర కావ్యాలలో జనప్రియ రామాయణం, ఆయనకు ప్రియమైన రచన. పండరి భాగవతము 20 వేలకు పైగా ఉన్న ద్విపద భక్తి రస రచన. విజయ ప్రబంధం, శ్రీనివాస ప్రబంధం రచించారు. అష్టపదులు వ్రాశారు. షాజీకావ్యము తేట గీతములో వ్రాశారు. సరస్వతీసంహారం విషాదాంతకన్నడ అనువాదం. తెలుగు తీరులు అనే వ్యాస సంపుటి, తెనాలి రామకృష్ణుని తెనుగు కవిత అనబడు రచనలు చేశారు. ఇంకా అల్లసాని పెద్దన, అరవిందయోగి, ముక్కుతిమ్మన, సమర్థరామదాసు, వసుచరిత్ర, విజయనగర సామాజికచరిత్ర మొదలగు వచన విమర్శనాత్మకరచనలు చేశారు.

జాతీయభావ పరంపరగా అగ్నివీణ మీటారు. వారి మేఘదూతము ఒక నిరుపేద నిర్దోషి కారాగారం నుండీ తన ఇల్లాలికి పంపిన మరొక మేఘసందేశము. ఆ సందేశము హంపి నుండి శ్రీకాకుళము వరకు పయనిస్తుంది. జాతీయాభిమానముతో గంధి మహాప్రస్థానము ముగించారు. మళయాళంలోని కొన్ని నవలలను, వ్యాసాలను తెలుగులోనికి తర్జుమా చేసారు. అలానే ‘ఏకవీర’ను , మళయాళంలోనికి అనువదించారు. పురోగమనం, గుడిగంటలు సామ్యవాదగమనంలో రచించి కష్టజీవులకు దోపిడీకి గురి కాబట్టి శ్రామికలోకంకు దగ్గరయ్యారు. ఇంకొక విచిత్రమేమిటంటే పండరి భాగవతమునకు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ స్వదస్తూరితో వ్రాసిన పీఠిక ఆ కావ్య ముద్రణకు ముందు కనిపించలేదట. స్వామి వారు భద్రపరచలేదు. తర్వాత వారి కుమారుడు శ్రీ అరవింద వెలుగులోకి తెచ్చారు. శ్రీ విశ్వనాథ గారు ఆ పీఠికలోని ఆఖరిపంక్తులు ఇలా ఉన్నాయి. ‘మా నడుమ మైత్రి చాలా ఏండ్లగా కలదు. కొన్ని కొన్ని యెడల నీయన నా కంటె గొప్పవాడుగా పరిగణింపబడుట నేనెరుగుదును. అట్టి నా నుండి అభిప్రాయమాసించుట వట్టి స్నేహధర్మము” (విశ్వనాథ) శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల ఆంగ్లకావ్యాలలో ప్రసిద్ధి చెందిన మహాకావ్యం Leaves in the wind దీనిని సరిచూచుటకు, అభిప్రాయ సేకరణకు అప్పటికాలంలోని ఒక ఆంగ్ల ఫ్రొఫెసర్‍కు ఇస్తే ఆయన punctuation, preposition, grammar ను సరి చూస్తూ మొత్తం కావ్యాన్ని చండాలము చేసాడు. అప్పుడాచార్యుల వారు మరొక శుద్ధప్రతిని తయారుచేసి ఆయన ఒక మిత్రుని సలహాపై భారతదేశంలో సుప్రసిద్ధ రచయితలైన శ్రీ హరీంద్రనాథ ఛటోపాధ్యాయులకు తమ Leaves in the wind ని చూపించి వారి అభిప్రాయమును అడిగినారు. Leaves in the wind పై శ్రీ హరీంద్రుని అభిప్రాయాలలో కొన్ని “Its volume of verse which reveals the sole of the author as being one which responds to beauty. Re-acts in anguish and looks into future finding there a better happier world”. దేశభక్తి, జాతీయభావం, సమాజపరిస్థితులపై ఒక కవిత this is free India అను కావ్యం. అందులోని కొన్ని పంక్తులు.

“Treachery, bribery, filthy plots

Political strife’s, childishness,

This is free India

This dust once had the gain of nobility

But now hatred, bitter tears

Lack of food, sluggishness, selfishness”.

(పుట్టపర్తి)

వీరు వ్రాసినది హీరో (The hero) ఆంగ్లనాటిక మహాభారత పరంపరంగా వ్రాసింది. ఇక ఉద్యోగ విషయాలలోకి వస్తే వారిని డా॥ బెజవాడ గోపాలరెడ్డిగారు డిల్లీలో సాహిత్యఅకాడమి గ్రంథాలయానికి అధ్యక్షులుగా నియమించారు. కానీ దేశరాజధానిలోని రాజకీయ దుర్గంధానికి, సాంఘిక వాతావరణంలోని కాలుష్యానికి తట్టుకోలేక మళ్లీ ప్రొద్దుటూరు చేరుకున్నారు.

మళయాళ భాషలో వీరికి మంచి ప్రవేశము కలిగివుండినందున ఆచార్యులవారిని ‘ఎటిమలాజికల్’ నిఘంటు నిర్మాణానికి తోడ్పడుటకు కేరళ తిరువాన్కూరు సంస్థవారు ఆహ్వానించారు. అప్పుడే విశ్వనాథవారి ఏకవీర నవళికను మళయాళభాషలో అనువదించారు. అలానే ఆ భాషలోని కొన్ని గ్రంథములు 1) తీరని బాకీ 2) ఏకాంకిలు 3) కథాగుచ్చము 4) స్మశానద్వీపము (పద్యకావ్యములు) ఆంధ్రీకరించారు. అలానే కొంతకాలం కేరళ విశ్వవిద్యాలయములో దక్షిణ దేశభాషలపై రీడరుగా పనిచేశారు. ఎన్నో ఉద్యోగాలు చేసినా ఆచార్యులవారి ముక్కుసూటితనం, నిర్మలత్వం, స్వతంత్రభావాలు, నిజాయితీ ఎక్కడ ఎక్కువ కాలం నిలవనీయలేదు. కడకు గడపకు (స్వగృహం) చేరుకున్నారు.

శ్రీమాన్ పుట్టపర్తి నారాయణచారి గారికి తగిన ఇల్లాలు, ఆదర్శసతీమణి శ్రీమతి కనకమ్మగారు. ఆమె పండితురాలు, కవయిత్రి, శ్రీవారితో కలిసి కనకమ్మవారు శ్రీ వచన భూషణం అను రెండు పర్వములలో వ్యాసాలు వ్రాసి ప్రచురించారు. అవి పాఠకుల ఆదరాభిమానాలు పొందాయి.

మాది కడపజిల్లా ప్రొద్దుటూరు, స్వామివారితో సాన్నిత్యము, చొరవ అనేక అనుభవాలు కలవు. పుట్టపర్తి వారికి సాహిత్య సంపద పుష్కలంగా ఉన్నా గంపెడి సంసారముతో నిత్యదరిద్రముతో 3/4 వ వంతు జీవితమంతా కష్టపడ్డారు. నిర్మొహమాటంతో వ్యవహార రహితముగా ఉండేవారు. కొందరు పనిగట్టుకొని వ్యక్తిగతంగానూ, సాహిత్యపరంగాను ద్వేషించేవారు. స్వామివారి అల్పబుద్ధికి నవ్వుకొనేవారు. సామాన్యచిరుశిష్యులను కూడా ‘ఏరా’ అంటూ ఆప్యాయంగా భుజంపై చేయివేసి, బీడీ త్రాగుతూ, అడ్డపంచ, ఉతికినచొక్కా ధరించి శివాలయము వరకు తీసుకెళ్ళి అనేకవిషయాలు చెప్పేవారు. కవితలు వినిపించేవారు.

నేను అనంతపురం కళాశాలలో 1958-59 లో చదివేటప్పుడు ప్రొద్దుటూరు నుంచి తెలుగు సంక్రాంతి అనే సాహిత్య మాసపత్రిక వచ్చేది. దానికి సంపాదకుడు శ్రీ. జి. సుబ్బయ్య అనే అపరాధపరిశోధక నవలలు వ్రాసే రచయిత. ఆ తెలుగు సంక్రాంతి సంచికలో నారాయణాచార్యులవారి గుడిగంటలు గేయరచనలు వచ్చేవి. తర్వాత ఆ పత్రిక నిలిచిపోయింది. ఈ గుడిగంటలు ప్రతి (original) స్వామివారి దగ్గర లేదు. సుబ్బయ్యగారు మరణించారు. అందులోని కొన్ని గేయాలు నాకు జ్ఞప్తి ఉన్న వరకు ఇక్కడే ఇస్తున్నాను. ఇందులో ఏవైనా వ్యాకరణ భాషాదోషాలు ఉంటే అవి నావే అని ప్రత్యేకించి చెప్పనవసరంలేదనుకుంటున్నాను.

గుడిగంటలు 

శని ఒకడే ఖగోళానికి

శని ఒకడే శాస్త్రానికి

మతి తప్పిన దేశానికి

ప్రతినాయకుడు ఒక శని

లేపాక్షి బసవన్న

లేచివచ్చిన కదా

కాంగ్రేసులో ధర్మ

కారుణ్యభావాలు

ఓహో దేశద్రోహులు

దేశానికి నాయకులట

నదీనృత్య దుష్మాగమ

మరీచికల సలలంబట

మతమొకప్పుడు

మహోద్యోగంబు

నేడు దేశానికది

పాడైన రోగంబు

చెప్పే కూతకు

చేసే చేతకు

సామ్యమున్నచో దివి

భువికేందు తులతూగు

ఇవి కేవలం నాకున్న పరిమిత జ్ఞాపకశక్తితో పేర్కొన్నాను. ఇందులో మాత్రాఛందస్సు కూడా లేకపోవచ్చు. ఈ గేయం అప్పట్లో కమ్యునిస్టు మహాసభల్లో బ్యానర్లు కట్టేవారు.

శ్రీమాన్ పుట్టపర్తి వారికి ప్రభుత్వము పద్మశ్రీ బిరుదునిచ్చిన సందర్భముగా మైదుకూరులో యువజనసాహితీ సంస్థ తరుపున 1973లో ఆచటి హైస్కూల్ ఆవరణలో ఒక బహిరంగసభ జరిగింది. ఆచార్యులవారికి సన్మానం, కవి సుధాకర ఎస్. రాజన్న కవి అధ్యక్షత వహించగా నేను వక్తను, ఆ రోజుల్లో సహజ యవ్వనం కారణంగా ఆచార్యులవారుపద్మశ్రీ తీసుకొన్నందుకు ఆక్షేపించాను. ఆ బిరుదు సినీనటుడు రేలంగి వేంకటరామయ్యకు ఇచ్చిన తర్వాత ఇచ్చారు. అంతకు మునుపే నారాయణాచార్యుల వారిని రేడియో గుర్తించని నాడు, శాసనమండలి, సాహిత్యపరిషత్తులు తిరస్కరించిన నాడు కూడా ప్రజలు, సాహితీ పిపాసులు, ప్రజల మనిషని గుర్తించారు. హంగులతో అహంతో కవులు గగనసీమలో విహరించే రోజుల్లో ఆయన మానవత్వమున్న మనిషిగా ప్రగతిపథంలో పయనించినారు. కావున ఆచార్యులవారు జనప్రియ రామాయణందే కాకుండా సమాజగతిని నగ్నంగా చిత్రించగల జనతారామాయణం వ్రాయుమని మరొక గుడిగంటలు మ్రోగించి, పురోగమనాన్ని వ్రాయమన్నాను. స్వామికి ఏ రోజు సభలోను అధ్యక్ష, ముఖ్య అతిధి, ముఖ్యోపన్యాసకులు అని సంభోదించేఅలవాటు లేదు. సన్మానానికి జవాబిస్తూ ఇలా అన్నారు. “వాడు సదానందం” చెప్పినట్లు నేను పద్మశ్రీ తీసుకొని తప్పుచేసినాను. ఇంకా MLCకి ప్రయత్నించాను. రేడియోలో ఉద్యోగం ఇస్తామంటే ఆశపడ్డాను. ఇవన్నీ పొరపాట్లే. పద్మశ్రీ అంటే ఏదో కొంత డబ్బు ఇస్తారనుకున్నాను. కాని డిల్లీలో ఒక కాగితం, స్మృతిచిహ్నం ఇచ్చారు. ఈ మాటను నేను శ్రీమతి ఇందిరాగాంధి గారిని అడిగాను. ఆమె ఆర్ధిక సహాయానికి మీ జిల్లా కలెక్టరుకు అప్లయ్ చేయమన్నారు. కడపలో కలెక్టరు గారిని అడిగినాను. ఆయన ఉపాధ్యాయవృత్తిలో ఉన్నవారు Below poverty line క్రింద రారని చెప్పి రిక్తహస్తాలు చూపించారు. కానీ సదానంద చెప్పినట్లు ఒకేరకమైన కవిత్వం నేను వ్రాయలేను. వ్రాయను. నేను వానివలె ఏ committed Ideology కు చెందిన వాడిని కాను. నా మనస్సు ఎలా స్పందిస్తే అలా వ్రాస్తాను. ఇప్పటికే కొన్ని వందలపేజీల గేయసాహిత్యం, ప్రాచీనసాహిత్యం వ్రాశాను ‘ఎవరైన ప్రచురించి నాకు కొన్ని ప్రతులిస్తే సంతోషిస్తానన్నారు” ఇదే ఆయన సిసలైన నిజాయితితో వెలిబుచ్చిన నిఖార్సయిన మనస్తత్వము”

శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులవారు కడపలో 1990 సెప్టెంబరు ఒకటోతారీఖు దివంగతులయిరి. 3-9-90 నాడు ప్రొద్దుటూరు శ్రీ అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో సంతాపసభ జరిగింది. ఆ సందర్భములో వారికి నివాళులు అర్పిస్తూ రాధేయగారు వ్రాసిన కవితలో కొన్ని పంక్తులు ఇవి.

“ ఒక వాల్మీకి

ఒక తులసీదాస్

ఒక మిల్టన్‍ల

త్రివేణి సంగమప్రతీకగా

ఓ ప్రబంధపరమేశ్వరుని

అక్షర తూణీరం

మహాప్రస్థానం చేరుకుంది.

అపురూప కావ్యాలు

భారతీయ సాహిత్య ప్రగతికి

అక్షర భాండాగారాలు

సరస్వతీ పుత్రుని అక్షరలక్షల్ని

‘సేఫ్ లాకర్స్’ లో

భద్రపరుచుకోవడమే

మన తక్షణ కర్తవ్యం

ఓ మహర్షీ, ఓ మహాత్మా

నీకివే మా జోహార్లు

ఆంధ్రదేశములో పెద్ద, చిన్నా అన్న భేదం లేకుండా అందరూ ఆయన్ని పొగిడారు. పలు ప్రక్రియల్లో సిద్ధహస్తులంతా ఆయన్ను ఆకాశానికెత్తారు.  శ్రీ. పి.వి. నరసింహారావు మొదలుకొని చిన్నసైజు రాజకీయ నాయకుల వరకూ ఇంతవరకూ ఇంతటి అమూల్య కవితా రత్నం, భారతావనిలో లేరని పొగిడారు. అయినా వారికి జ్ఞానపీఠ అవార్డు రాలేదు. ఆయన కూడా బాధపడ్డారు. శిష్యులు నిరుత్సాహపడినారు. దీనికి జవాబు మా గజ్జెల మల్లారెడ్డిగారిచ్చారు.

“జ్ఞానపీఠ రాలేదని

గ్లాని, చెంది ఫలితమేమి?

పట్టువిద్యలో తెరుగని

బాధవల్ల లాభమేమి?

ఫైరవీలు లేనిదే చిరు

పదవి రాదు మహాకవి

సామర్థ్యానికి నూకలు

చెల్లినాయి కళారవి!

--- మల్లారెడ్డి

 అయినా సీమలో పుట్టుట నారాయణాచార్యుల దౌర్భాగ్యం

అది దేశానికి పట్టిన గ్రహణం.

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top