గోదావరి కధలు - రాగి డబ్బు (రచన : బి.వి.ఎస్.రామారావు) - అచ్చంగా తెలుగు

గోదావరి కధలు - రాగి డబ్బు (రచన : బి.వి.ఎస్.రామారావు)

Share This

 ఆనాడుదయం....

“ఏమండీ! లేవండీ! చూడండి – ఎంత పొద్దెక్కిందో.”

“అబ్బా! ఉండవే! ఇంకా తెల్లారందే!”

“ఇంకా నయం”

“అబ్బా! చలి…….”

“ఛీ! పాడు. పరగడుపునే ఈ బుద్ధులేమిటండీ, నా జుట్టు రేపేస్తున్నారు….. అయ్యో, దుద్దులు గీరేస్తున్నాయి. రాను రాను మీకు కుర్రచేష్టలెక్కువయిపోతున్నాయి.”

“అబ్బా!! కాఫీ!”

“సరే కాఫీ పట్టుకొస్తాను. మీరు నాకో హామీ ఇవ్వాలి.”

“ఏమని?”

“మన అమ్మాయికి మూడుముళ్ళు పడేదాకా మీరీ వ్యాపారానికి సెలవు పెట్టి, ఇంటిపట్టునుంటానని.”

“ఎందుకని?”

“ఎందుకేమిటండీ? బోల్డు పనులుంటాయి.”

“ఏమిటో? ఆ బోల్డు.”

“శుభలేఖ లేయించాలీ..”

“అవెప్పుడో ప్రింటయి, ఎడ్రస్సులతో సహా ఉన్నాయి. సాయంకాలం నీకు చూపించి, నువ్వెప్పుడు ‘సై’ అంటే అప్పుడు పోస్టులో వేయమని గుమాస్తాకు పురమాయిస్తాను.”

“బేండు, సన్నాయివాళ్ళని మాట్లాడాలీ..”

“అడ్వాన్సులు కూడా ఇచ్చేశాను.”

“వంటవాళ్ళని కుదర్చాలి.”

“కుదిర్చేశానుగా..”

“విడిదీ అదీ ఏర్పాటు చెయ్యాలి. ఈ విశాఖపట్నంలో ఇళ్ళు కూడా దొరకవు.”

“అదుగో! ఆ ఎదురుగా ఉన్న కొత్తమేడంతా వాడుకోమని నాకు తాళాలెప్పుడో ఇచ్చేశారు.”

“పందిళ్ళూ, గట్రా వేయించాలి.”

“సాయంత్రానికి వేయించమంటే వేయించేస్తాను. సరేనా!”

“అయ్యో రామ! అమావాస్య దాటనీయండి.”

“మరైతే నన్నింట్లో కూర్చొని ఏంచెయ్యమంటావు?”

“మీకేం. మీరు మారాజులా ఫోన్లమీద పన్లు జరిపించేస్తారు. నాకెక్కడ తెములుతుంది. పసుపు కొట్టించాలి, అటుకులు దంపించాలి, సున్నిపిండి ఆడించాలి.”

“నువ్వు ‘వూ’ అంటే రేపీపాటికి అవన్నీ ఇక్కడుంటాయి. నువ్వు అనవసరంగా హైరానా పడకు.”

“అలాంటే ఎలాగండీ. ఒక్కగానొక్క కూతురు. నాని పెళ్ళికీమాత్రం కష్టపడకపోతే ఎలా?”

“సరే కష్టపడు.”

“మీకన్నీ వేళాకోళంగానే ఉంటాయి. లగ్నం పట్టుమని నెల్లాళ్ళు కూడా లేదు. కుర్రాళ్ళిద్దరికీ ఉత్తరాలు రాసి కోడళ్ళిద్దర్నీ అమావాస్య వెళ్ళేక విదియనాడు పంపించమనండి.”

“అమావాస్యదాకా ఎందుకు? దశమినాడే పంపించమని నిన్ననే ఫోన్లు చేశాను. సరేనా?”

“లగ్నం ముంచుకువస్తోంది. వియ్యాలవారికి లాంఛనాలు ముందుగా అందజేస్తే బావుంటుంది. వాళ్ళసలే మొహమాటస్తులు. పోనీ! మీరోసారి హైదరాబాదు వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి రాకూడదూ.”

“వెళ్తాను.”

“ఎప్పుడు?”

“ఇవ్వాళే”

“బడాయి”

“ఆ పేంటు జేబులో చూడు. టిక్కెట్టు రిజర్వు చేశానో, లేదో.”

“వియ్యపురాలికి, ముగ్గురాడపడుచులకి లాంఛనాలు ఎంతిస్తే బావుంటుందంటారు?”

“అయిదువేలు.”

“అదేం బావుంటుందండీ. మన యిద్దరి కుర్రాళ్ళ పెళ్ళిళ్ళకి రెండు వేల అయిదువందల చొప్పున నాకు ముట్టాయి. మనం కూడా అంతే యివ్వాలి. వాళ్ళు ఎంతో మంచివాళ్ళండి. ఆ మాటకొస్తే వాళ్ళకింకా యెక్కువ ఇవ్వాలంటాను.”

“సరే నీ ఇష్టం”

“అయినా ఇవ్వాళ ఆదివారం. మీకు బ్యాంకులో డబ్బెవరిస్తారు?”

“నిన్ననే డ్రాఫ్టు తీసుకున్నాను. చొక్కా జేబులో ఉంది చూడు.”

“ఇరవై వేలే!”

“వియ్యపురాలికి అయిదు, ముగ్గురాడపడుచులకీ మూడైదులు”

“ఏమండీ! మీది చాలా మంచి మనసండీ!”

“… … … …”

“ఛీ! వదలండి, పట్టపగలు మీ దగ్గరకి రావాలంటే భయంగా ఉంది.”

“మన అమ్మాయికి రాజాలాంటి సంబంధం దొరికింది.”

“దానికేం లోటు. అందంలో నీ పోలిక, తెలివితేటల్లో నా పోలిక.”

“అంటే నాకు తెలివితేటలు లేవనేగా మీ అర్థం.”

“అంటే నేనందంగా లేననేగా  నీ అర్థం.”

“నేనలా అన్నానా!”

“పోనీ నేనలా అన్నానా!”

“అబ్బ! ఉండండి. ఇన్నేళ్ళొచ్చినా మీ చిలిపిచేష్టలు పోనిచ్చుకోలేదు. ఎదిగిన ఆడపిల్ల ఇంట్లో ఉంది.”

***

                  “ఏట్రయిను కెళ్తారు.”

“గోదావరి ఎక్స్‍ప్రెస్ సాయంత్రం అయిదు.”

“అయిదు గంటలకి చవితి వచ్చేస్తుంది. మూడుగంటలకే బయలుదేరండి.”

“అలాక్కానీ.”

“అంతముందుగా వెళ్ళి ఏంచేస్తారండీ.”

“అవును ఏం చెయ్యమంటావు?”

“మీసామాన్లు సర్దుకోండి. ముందుగా ‘నిర్ఘ్యం’ పెడతాను.”

“అయితే ఇంకా బోల్డు టైముంది. ఇలారా.”

“వద్దులెండి. రైల్లోకి ఏం వండమంటారు?”

“పూర్ణంబూర్లు, రసగుల్లా, పాయసం, సంతర్పణకూర, పప్పు ధప్పళం వగైరాలు, మామూలే,”

“బడాయి. కాస్త మజ్జిగపులుసు, పాటోళీ వండిస్తాను. కేరేజి మాత్రం మరిచిపోకుండా తెండి.”

 

ఆనాడు సాయంత్రం

 

“ఏవండీ! ఇవ్వాళ ట్రయిను చాలా రద్దీగా ఉందండీ.”

“బెర్తు రిజర్వేషనుండగా ఎంత రద్దీగా ఉంటే నాకేం.”

“ఏవండీ! రైలు గోదావరి బ్రిడ్జి ఎక్కినపుడు గోదాట్లో ఈ రెండు రాగిడబ్బులు పడేసి దండం పెట్టండి. మనకంతా శుభం జరుగుతుంది.”

“ఎందుకూ? నా దగ్గర ఈ రూపాయి కాసు ఉంది ఇది పడేస్తా.”

“ఇంకా నయం. డబ్బుంది కదా అని నోట్ల కట్టలు పడేస్తాననలేదు. గోదావరి తల్లికి రాగిడబ్బే వెయ్యాలి.”

“రెండు రాగిడబ్బులు ఎందుకిస్తున్నావు?”

“మీరు విసిరినపుడు ఒకటైనా గోదావరిలో పడుతుందని.”

“సరే! అలాగే! ఇంఅ నువ్వు ఇంటికెళ్ళు.”

“ఏవండీ! మీరా బెర్తు మార్పించుకొని మరో బెర్తు అడిగి పుచ్చుకోండి.”

“దానికేం లోయరు బెర్తు. బ్రహ్మాండంగా ఉంటే”

“ఆ ఇద్దరు ఆడాళ్ళతోనూ మీరు ప్రయాణం చెయ్యడం నాకిష్టం లేదండీ. చూడండి, మిమ్మల్ని నవిలేటట్లు ఎలా చూస్తున్నారో, పైగా మీ బెర్తుమీదే కూర్చున్నారు.

“వాళ్ళా ముసలాయనకి సెండాఫ్ ఇవ్వడానికొచ్చారు.నువ్వు ఇదై పోకు.”

“అయితే మిగతా రెండు బెర్తులూ ఖాళీయేనా?”

“అవి అనకాపల్లి కోటా”

“అక్కడ ఆడాళ్ళు ఎక్కరని గేరంటీ ఏమిటీ?”

“అంటే నీ ఉద్దేశ్యం ఆ ఆడాళ్ళని పబ్లిగ్గా ఏదో చేస్తాననేగా.”

“ఛా! ఏమిటా మాటలు. వాళ్ళే మిమ్మల్నేదైనా చేస్తారని.”

“అంటే నే నొట్టి వాజమ్మననేగా నీ ఉద్దేశం.”

“చూశారా! నేనలా అన్నానా!”

“సరే నువ్వింటికెళ్ళు. నేను పోయి కూర్చుంటాను.”

“ఉండండి. ఆ పిల్లలిద్దర్నీ దిగనీండి.”

“పోనీ నువ్వెళ్ళి వాళ్ళని దిగమను.”

“ఏమండీ! ఆ ముసలాయన హైదరాబాదేనా, లేక మధ్యలో దిగిపోతాడా!”

“అనకాపల్లిలో యెక్కబోయే ఆడాళ్ళ మానాన్ని సంరక్షిస్తూ వాళ్ళని నా బారినుంచి తప్పించడానికి హైదరాబాదు దాకా వస్తున్నాడు. సరేనా!”

“పొండి మీరు మరీనూ..”

“ఆ రాగిడబ్బు మాట మర్చిపోకండేం అది నాకు సెంటిమెంటు.”

“ఎందుకు మర్చిపోతాను. నీ సెంటిమెంటు నా సెంటిమెంటు కాదా?”

“ఏవండీ! నన్ను చూస్తే ఒక్కక్షణం ఊరుకోలేరు. మరీ మూడు రోజులు ఎలా ఉండగలరండీ?”

“ఉండలేను. పెట్టె, బెడ్డింగు దించేసుకొని ఇంటికి పోదాం పద.”

“అబ్బ మీకన్నీ వేళాకోళాలే.”

“… … …”

“మీరు తింటే నిద్దరోతారు.”

“… … …”

“రాగి డబ్బులు గోదాట్లో వేసేదాకా కేరీరు విప్పద్దు.”

“అసలు కేరీరే విప్పను, సరేనా.”

“అలాగయితే ఆకలేసి, నీరసంవచ్చి నిద్దరోతారు. పోనీ ఆ ముసలాయన్ని జ్ఞాపకం చెయ్యమనండి.”

“ఎవరు? ఆ మాన సంరక్షకుడ్నా?”

“నే నిందాకట్నించి చూస్తున్నాను, ఆ ముసలాయనంటే మీకు ఎందుకంత అక్కసు పాపం!”

“సర్లే, నేను గుడ్లప్పగించి చూస్తూ కూర్చుంటాను. బ్రిడ్జి రాగానే ఈ రాగిడబ్బులు రెండూ పడేసి నీ పేరుమీద దండం పెడతాను సరేనా?”

“ఏదో ఒక బ్రిడ్జి రాగానే ఇవి పడేసి మొక్కుబడి తీర్చేసుకుంటారు. నాకు తెలుసు.”

“రాజమండ్రి స్టేషను దాటాక గోదావరి బ్రిడ్జెక్కి రైలు మోత ఎక్కించినపుడు, నది గోదాట్లో ఇవి పడేస్తాను. ఒట్టు.”

“ మీరెళుతున్నది శుభకార్యం మీద. ఈ విషయంలో అశ్రద్ధ చెయ్యవద్దు.”

సిగ్నలు ఇచ్చేశారు. వెళ్ళు.”

“హమ్మయ్య. ఆ పిశాచాలు రెండూ దిగాయి. ఇంక మీరెళ్ళి కూర్చోండి.”

“ఇదిగో.. మంచినీళ్ళ చెంబు, నీళ్ళగ్లాసు, కేరీరు అన్నీ బుట్టలో ఉన్నాయి. జాగ్రత్త!”

“త్వరగా వచ్చేస్తారు కదూ!”

“… … …”

“మీరు చేరగానే ఫోను చేయండి.”

“… … …”

“ఇదిగో నేను దిగడుతున్నా! గోదాట్లో రాగిడబ్బులు వేయడం మరచిపోవద్దు.”

ఆనాడు రాత్రి

                  “హలో! హలో!”

“ఎవరు?”

“నేనే! నీ మొగుణ్ణి.”

“ఇందాకనే కదండీ ట్రయినెక్కింది. అప్పుడే హైదరాబాదులో ఎలా వాలారు?”

“నేను రాజమండ్రినుంచి మాట్లాడుతున్నాను.”

“రాజమండ్రీయా!”

“అవును. నువ్వన్నట్లే జరిగింది. గోదాట్లో రాగిడబ్బు పడలేదు.”

“మీరు రాజమండ్రి దాటకుండా గోదావరి ఎలా వచ్చిందండీ. ఇందులో ఏదో తిరకాసు ఉంది.”

“అబ్బ! చెప్పేది వినవే.”

“నా కర్థమైపోయింది మీరేదో ఇలాంటిది చేస్తారని నాకు మొదట్నుంచీ అనుమానంగానే ఉంది.”

“నేను నిడదవోల్లో దిగి వెనక్కి వచ్చేశానే.”

“ఎందుకుట పాపం?”

“రైలు లేటయింది. నాకు నిద్ర ముంచుకువచ్చింది. బ్రిడ్జి మోతకు లేచి డబ్బు విసిరేద్దామంటే ఆ ముసలి పీనుగ కిటికీ తలుపులేసేసి మేకులు కొట్టేశాడు. ఎంతకీ ఊళ్ళేదు.”

“దబాయించకండి. ముందర చెప్పండి. అనకాపల్లిలో ఎంతమంది ఎక్కారు?”

“ఇద్దరే”

“ఎన్నేళ్ళుంటాయి?”

“పద్దెనిమిది, ముప్పై రెండు.”

“ఇంకా ఎందుకు బుకాయిస్తారు ఆ ముసలాయన్ని ఆడిపోసుకుంటూ?”

“ఏమిటే నువ్వనేది?”

“ఇంతకీ మీ పక్కనున్నది పద్దెనిమిదేళ్ళదా? ముప్పై రెండేళ్ళదా?”

“అబ్బా! వాళ్ళిద్దరూ మగాళ్ళే.”

“నా మీద ఒట్టే.”

“ఒట్టు.”

“మీకు చాలా బాధగా ఉంది కదూ.”

“నీ బొంద”

“కిటికీ తలుపులు మేకులేస్తే, తలుపు తీసుకొని బయటి కిటికీలోంచి విసరవచ్చు కదా!”

“ఆపనే  చేశా! అప్పటికే గోదావరి దాటేసి గట్టు వచ్చేసింది.”

“పోనీ తిరుగు ప్రయాణంలో వెయ్యచ్చుకదా.!”

“ఏమో! నువ్వన్నిసార్లు గుచ్చి గుచ్చి చెప్పావు. నేనేదో సెంటిమెంటుగా ఫీలయ్యాను. నిడదవోల్లో రాజమండ్రి వెళ్ళే ట్రయిను సిద్ధంగా ఉంటే ఎక్కేశాను.”

“ఉద్దరించారు. మీ మకాం ఎక్కడ?”

“అప్సరా హోటల్, రూమ్ నంబరు-101.”

“హోటలా! తలుపులు గట్టిగా బిగించుకోండి. ఫేను వేసుకోవద్దు. మీకిట్టే జలుబు చేస్తుంది. రేపుదయమే ఫోను కొట్టి లేపుతాను.”

“ఎక్స్టెండ్ ప్లీజ్”

“ఇంకా యేమిటండీ అర్ధరాత్రివేళ అంకమ్మ శివాలు.”

“ఏదో ఒకటి మాట్లాడవే, నాకు నిద్దరట్టేదాకా.”

“గోదావరిలో రాగిడబ్బు యెప్పుడేస్తారుట?”

“పొద్దున్న లేచీ లేవడంతో ఆ పనిచేసి ఈస్టుకోస్టు యెక్కేస్తా.”

“పాటోళీ పూర్తిగా తిన్నారా?”

… … …

“మజ్జిగపులుసులో ఉప్పు తక్కువైనట్టు ఉంది. విడిగా పొట్లంలో కట్టి ఉందా, వేసుకోలేకపోయారా?”

… … …

“ఇదిగో మిమ్మల్నే… ఇంతలోనే మొద్దునిద్ర… మిమ్మల్నే… ఫోను పెట్టేస్తున్నాను.”

మర్నాడుదయం

                  “హలో! హలో!”

“నేనే నే.”

“ఏవండీ! నిజంగా మీరు మీరేనా?”

“ ఒట్టు నీ తోడు.”

“హమ్మయ్య, పొద్దుట్నుంచి ఎంత కంగారు పెట్టేశారండీ. ఇది మూడో సారి మీకు ఫోను చెయ్యడం. అసలు మీరు  బయటకెందుకెళ్ళారు?”

“ఎందుకేంటీ? గోదాట్లో స్నానం చెయ్యడానికి, బ్రాహ్మడిచేత సంకల్పం చెప్పించుకొని, నువ్విచ్చిన రాగిడబులు పడేసి దండం పెట్టడానికి.”

“ఇంకా నయం. రాత్రికి రాత్రి మీరు ఏ టాక్సీయో కట్టించుకొని నిన్నటి పాపిష్టి రైలును బెజవాడలో పట్టుకొని యెక్కేశారేమోనని ఎంతో భయపడిపోయాను. మీరెంతకేనా సమర్ధులు.”

“ఇంతకీ ఏమైందే?”

“ఏమటవమేమిటండీ? మీరు రేడియో వినలేదా?”

“లేదు.”

“నిన్న మీరెక్కిన రైలు, కాజీపేట ఇవతల గూడ్సుబండిని ఢీకొట్టి తిరగబడిందట. అందులోని ప్రయాణికులు బతికి బట్టకడతారన్న నమ్మకం లేదట.”

“అయ్య బాబోయ్”

“అవునండీ. ఆ గోదావరి తల్లే మిమ్మల్ని రక్షించింది.”

“కాదే! నీ సెంటిమెంటే నన్ను కాపాడింది.”

***********

No comments:

Post a Comment

Pages