శివం (శివుడు చెప్పిన కధ ) - రచన : ఫణి రాజ కార్తిక్ - అచ్చంగా తెలుగు

శివం (శివుడు చెప్పిన కధ ) - రచన : ఫణి రాజ కార్తిక్

Share This

నేనే... మీకు తెలుసుగా కొంతమంది నన్ను పరమేశ్వరుడు అని , లింగమయ్య అని ,శివుడని, విష్టువని , బ్రహ్మ అని ,శక్తి అని, అంటారు.

ఎవరు ఏ భాషలో ఏ భావంతో నన్ను పిలుస్తారో వారికి అలా అగుపిస్తాను. నా తత్వం అనంతమైనది....నా శక్తి  అఖండమైనది. జన్మ లేని ,ఆకారం లేని అనాదిని నేను. సృష్టి, స్థితి , లయను చేసే సర్వకర్తను నేను. అన్నినేనే. అంతా నేనే. నేను తప్ప వేరేది లేదు .నేను కానిది ఏదీ లేదు. నేనంటే సత్యము,సనాతనము,ఏ యోగమైనా నన్ను తెలుసుకోవటమే... ఏ భోగమైనా నేను ఇవ్వటమే. మీ లక్ష్యం నన్ను చేరటమే. సచ్చిదానందుడను, బ్రహ్మమును, పూర్వమును, సర్వరూపమును, సర్వాతీతుడను, నిత్య నిరాకార సాకారుడను, ఆది అనంత రహితుడను, సంకల్పరహితుడను,  నిర్మలుడను, కాలాతీతుడను నేను. మీ కళ్ళు నన్ను చూచుటకే,మీ వాక్కులు నన్ను పిలుచుటకే, మీ చర్యలు నన్ను తెలుసుకొనుటకే, బ్రహ్మoడాలు నా సంకల్పం చేత ఉన్నవి, నేనే కర్తను ,కర్మను, క్రియను....

అందరు అనుకుంటారు నేను కైలాసంలో ఉంటాను అని,కాని నేను కైలాస వాసినే కాదు , నేను ఉండేది నా భక్తుల హృదయాలలో. అందుకే నా మీద నమ్మకం ఉంచండి. నేను ఎక్కడో లేను, మీలోనే చైతన్య అత్మానందుడిగా ఉన్నాను.నన్ను ప్రార్దించుటకు మంత్ర తంత్రాలు, అనుష్ఠానాలు,హోమ యజ్ఞయాగాదులు, అవసరం లేదు....నా పరమాత్మా స్వరూప లింగాకారం మీద చారెడన్ని నీళ్ళు పోసి ,చిటికెడు బూడిద పూసి ,పిడికెడన్ని మారేడు ఆకులు పెట్టి ,ఒక్కసారి నన్ను ధ్యానిస్తే చాలు. ఎంతైనా భోళా శంకరుడిని కదా !నాకు మాత్రం మీరు తప్ప ఎవరున్నారు ? సముద్రమును సిరా చేసి కల్పవృక్షపు కొమ్మను కలంగా చేసి ,ఈ బ్రహ్మాండం మీద వ్రాసిన , ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగేలా చేసిన నాకు, మీ మీద ఉన్న ప్రేమను గూర్చి చెప్పటం మాత్రం వీలుకాదు. దేవతలకే దేవుడను నేను .నా నుండే వేదాలు ఉద్భవించినవి. పంచభూతములు నా ఆధీనములు. ఎందుకంటే వాటిని సృష్టించినది నేనే కదా.

శివ లింగమును పూజిస్తే ...నన్ను, బ్రహ్మ, విష్ణు, రుద్రులను,శక్తిని పూజించినట్లు. ఎందుకంటే నా లింగ స్వరూపం నా ప్రతీక. ఇక, నాకు ఎన్నో రూపములు ఉన్నా, నేనంటే మీకు గుర్తుకువచ్చేది లింగ స్వరూపమే ! నేను భస్మభూషితుడను. నా పక్కన నా అర్దాంగి పార్వతి ఎల్లప్పుడూ నన్ను ఆరాధిస్తూ ఉంటుంది . ఎంతైనా సదాశివుడను కదా. విష్ణు భగవానుడు ,బ్రహ్మ దేవుడు... అందరు నన్ను తదేకంగా ధ్యానిస్తూనే ఉంటారు. ఇక నేను త్రిశూలం ధరించి, త్రికాలాలకు, త్రిగుణములకు  అతీతంగా ,డమరుకం మ్రోగించి, కళలకు ఆద్యుడిగా ,భస్మం రాసుకున్న వైరాగిగా , విషం తాగిన గుర్తుగా నీలకంఠుడనై ,  రుద్రాక్ష ధరించిన సన్యాసినై , త్రినేత్రంతో జ్ఞానిగా ,స్థిరాసనంలో యోగిగా , జటాధరలతో నిరాడంబరుడిగా ,గంగని తలమీద జ్ఞాన ప్రవాహినిగా, చంద్రుడిని అర్దరూపం లో శోభాయమానంగా... మెడలో విషసర్పంతో సర్వజీవులను ప్రసన్న దృష్టితో చూసే ఫణిరాజునయి, కరుణగా ధ్యానించే వారికి జ్యోతిస్వరూపమైన తత్వంగా, నంది ,బృంగి ప్రమధ గణాలను భక్తులుగా, అన్ని జీవులూ సదా స్నేహితులై ఉండాలి అన్నందుకు సూచనగా ఉంటాను . వైకుంఠంలోను  , బ్రహ్మ లోకంలోను ఉన్నది నేనే, నా విభిన్న రూపాలే. మీరు మీ ఇష్టం వచ్చినట్లు నన్ను తలచ వచ్చు. మీరు ఏ రూపంలో ఎవరిని  ప్రార్ధించినా, అది చేరేది నాకే . నదిలోని నీళ్ళు సముద్రంలో కలవటం తప్పదు కదా !

నేను ఒక యాచకుడను ,బిచ్చగాడిని ,తలరాత లేని వాడిని , అర్ద నగ్న వికారిని అని అన్నా ,నన్ను తలచినట్లే భావిస్తాను . ఎంతైనా అప్పుడు మీ మది లో మెదిలేది నేనే కదా . భూతపతి , ప్రేతపతి, నేనే !భూతాలకు , ప్రేతాలకు అభయం ఎందుకు ఇచ్చాను అంటే.. అవి కూడా నా సృష్టి లో  భాగాలే కదా! అవి నన్ను శరణు  వేడాయి. వాటికి నేను తప్ప ఎవరు ఉన్నారు .పశువులకు పశుపతి అయినా అంతే! నా ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు. దోమ కూడా గిట్టదు. పుట్టుక చావు గురించి భయం ఎందుకు? నా నుంచి రావటం , నాలోకి రావటం అంతే, కాకపోతే మీకు కావాల్సింది భక్తే ! భక్తికి మాత్రమే నేను దాసుడిని. మరణ వేళలో నన్ను ధ్యానించండి ,మీ కోసం ఎప్పడూ మీ అంతిమ యాత్ర అయిన స్మశానoలో నిరీక్షిస్తూ ఉంటాను.

నా వైపు ఒక్క అడుగు వేయండి ,మీకు వంద అడుగులు చూపిస్తాను. నేను మాత్రమే కావాలని కొరుకొండి. మీకు అన్నీ ప్రసాదిస్తాను.

 నేనుండగా మీకు భయం ఎందుకు ?అందరికంటే ఆప్తుడు మీకు నేనే. మీ బంధాలు ఎప్పుడైనా మిమ్మల్ని విడిచి పోతాయి.కాని నేను మాత్రమే శాశ్వతం.నన్ను మీరు తల్లిగా, తండ్రిగా, గురువుగా, స్నేహితుడి గా భావించండి.మీ సేవకుడినై మీలో ఉన్న నాకు నేనే సేవలు చేసుకుంటాను .అన్నీ నాకు అర్పించండి, మీ కర్మను దహించి వేస్తాను .తెలిసో తెలియకో మీరు నా పూజ చేసినా ,దానికి కొండంత ఫలము ప్రసాదిస్తాను .మీరు నాకు అభిషేకం చేయకపోయినా,అభిషేకం చేసినట్లు భావించండి, అది స్వీకరిస్తాను. మీరు పదిమందికీ చేతనైన సహాయం చేయండి , దానిని శివపూజ వలె భావిస్తాను.

ఎందుకంటే మీలో ఉన్నట్టే వారిలో కుడా నేను ఉన్నాను కదా! మీరు ఎవరిని ఆనందపెట్టినా ఆనందపడేది నేనే! ఎవరిని బాధపెట్టినా బాధపడేది నేనే! నన్నుఎక్కడెక్కడో వెతక్కండి. నేను ఉంది మీ లోనే .మీరు మనసు పెట్టి పిలిస్తే వినపడేంత దూరం లో ఉన్నాను .మీరు చేసే ఏకబిల్వ అభిషేకాలు,దీపదానాలు విధి విధానాలను నేను ఎప్పుడూ విశ్లేసిస్తూనే ఉంటాను.

నా పూజ ఫలితంగా ఏమి ప్రసాదించానో వినండి,-“ ఇది త్రేతాయుగం నాటి సంగతి...  శ్రీరామ చంద్రుడు అంటే నాకు ఎంతో ఇష్టం. (ఆయన గారంటే నాకెంతో ఇష్టం కాబట్టే ఆయనకోసం హనుమంతుడిగా రూపం దాల్చాను) వన వాసమునకు బయలుదేరిన సతి, సోదర సమేత శ్రీరాముడు, పడవ ఎక్కి అవతల నది ఒడ్డుకి పోవలిసి వచ్చినది. అక్కడ ఉన్న శృంగబేర పురమునకు రాజైన గుహుడు, రామయ్య తండ్రి కోసం పడవను తెచ్చి, ఎక్కించుకొని వివిధ గుణాలతో కీర్తించి , రాముడిని సంతోష పెట్టాడు .దాంతో రాముడు , గుహునికి మోక్షాన్ని ప్రసాదించాడు.గుహుడుని రామయ్య ఆలింగనం చేసుకొని ,గుండెలకు హత్తుకొని ఇలా చెప్పాడు -“ఓ గుహుడా ! నీవు పూర్వజన్మలో కిరతకుడివి , ఒకనాడు శివరాత్రి దినమున నీవు నీ కుటుంబ పోషణ కై అడవికి  బయలుదేరావు. ఎంత వెదికినా ఏమియు దొరకలేదు .పక్కనే ఉన్న జలాశయమునకు పోయి అక్కడ కల మారేడు చెట్టు ఎక్కి కూర్చున్నావు .నీకు తెలియకుండా అక్కడ ఉన్న బిల్వ పత్రాలను కింద ఉన్న శివలింగం పై వేశావు.అక్కడకు వచ్చి నీరు త్రాగుతున్న జింకను బాణమును ఎక్కు పెట్టి  కొట్టపోగా అది గమనించిన జింక  “ఏమిటిది ?”అని అడిగెను .నీవు నీ కుటుంబం కోసం వేటాడుతున్నావని చెప్పావు. దాంతో ఆ లేడి  “ ఈ శివరాత్రి  రోజున నీవు పరోపకారం చెయ్యడం నీ కుటుంబాన్ని పోషించటం కన్నా ఎంతో ముఖ్యం. నాకు కాస్త గడువు కావాలి అని చెప్పి, తిరిగి వస్తానన్న షరతుకు ఒప్పించి, తన భర్త మరియు లేడికూన దగ్గరకు వెళ్ళింది . పిమ్మట ఆ జింకల కుటుంబం వచ్చి నిన్ను కలుసుకొని తమను ఆహరంగా తినమని చెప్పసాగాయి. కిరాతకుడివి ఐన నువ్వు ఈ సంఘటనతో  పశ్చాత్తాపం చెంది, కంటి నిండా నీరు కార్చావు. ఆ నీరు శివలింగం పై పడింది. కన్నీటి అభిషేకం చేసిన తపస్వి వయ్యావు.

ఆ జింకలను శ్లాఘించి, మనిషిగా మారి ఏడవటం మొదలు పెట్టావు. నీకు తెలియకుండానే శివపూజ చేసావు. దాంతో ప్రసన్నుడైన శివుడు ప్రత్యక్షమై నీ ముందు నిలబడ్డాడు .నీవు కన్నీటి అశ్రువులతో మహాదేవుని పాదాలయందు మోకరిల్లావు. నిన్ను శివుడు స్పృశించి ,”నీకు  ఆ జన్మలో భోగాలను,ఈ జన్మలో నన్ను చేరి పరమపదము పొందే విధంగానూ “ అనుగ్రహించాడు.నీవు ఆ జింకలను సైతం ఉద్దరించమని మహాదేవుడిని ప్రార్ధించావు. నీ పరోపకార ప్రార్ధనను మెచ్చుకున్న శివుడు “తథాస్తు” అని అంతర్దానం అయ్యాడు, అని రాముడు చెప్పగా ,గుహుడు రాం! రాం! జై శ్రీరామ్! జై శివరాం! అని ధన్యుడైనాడు.శ్రీరాముడు ఆలింగనం చేసుకున్న గుహుడు ధన్యుడు కదా,నేను సైతం హనుమ గా రాముడిని కౌగిలించుకొని ఆనందభరితుడను అయ్యాను.

ఒకానొకనాడు భగవంతుడైన విష్ణు దేవునికి సృష్టిని రక్షించు భారము , అవతారాలు దాల్చి లీలలు చేయు వరము ,అంతేగాక ,భోగ మోక్షాన్నిచే అధికారము అప్పగించినది నేనే. నేను నా ఆత్మ సమన్వయము తో ఎల్లపుడు ఆయన్ని ధ్యానిస్తుంటాను. ఆయనా నన్ను ధ్యానిస్తుంటాడు. నన్ను పూజించువారు శ్రీహరిని నిందించరాదు .శ్రీహరి నేను ఒక్కటే!  భక్తులు ఏ రూపంలో తలిస్తే ఆ రూపంలో ఉంటాము .మట్టి ఒకటే కానీ ,ఏ ప్రతిమను తయారు చేసుకొని పూజిస్తే  ఆ ప్రతిమ రూపాన్ని సంతరించుకుంటాను. శంభో అంటే ప్రసన్నడనౌతాను. మితి మీరితే ,దుష్టశిక్షణ చేసే  వీరభద్రుడను అవుతాను.

No comments:

Post a Comment

Pages