ఆయారే... మేడే ( ఆయుధమై నేడే ) - శ్రీగార్గేయ - అచ్చంగా తెలుగు

ఆయారే... మేడే ( ఆయుధమై నేడే ) - శ్రీగార్గేయ

Share This

 రైతు, కూలీ రక్తం కలిస్తేనే నవ ప్రపంచం. రక్తాన్ని చెమటగా మార్చి మరో ప్రపంచాన్ని బాటలు వేసే వారి ఘర్మజలానికి ఖరీదు కట్టే షరాబు లేడు అంటారు శ్రీశ్రీ. పొలాన్ని దున్ని హేమం పిండాలన్నా... గనిలో..పనిలో... కార్ఖానాలో రక్తం చిందించి... మరో ప్రపంచాన్ని సృష్టించాలన్నా కార్మికులకే సాధ్యం. అలాంటి కార్మిక లోకానికి అచ్చంగా తెలుగు సగర్వంగా సలామ్ చేస్తోంది. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా తెలుగు సాహిత్యంతో కార్మికలోకం ఎంతగా పెనవేసుకుపోయిందో... ఓ సారి చూసొద్దామా....

తెలుగు సాహిత్యం జానపదాలతోనే ప్రారంభమైందని చెబుతారు. రాతలు లేకుండా జనాల నోళ్ళలోనే నానుతూ... నోటి నుంచి నోటికి... తరం నుంచి తరానికి.... ఈ సాహిత్యం వ్యాపించింది. అదంతా శ్రామికుల సంపదే అని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. శ్రమ అంటే... పొలం పని మాత్రమే కాదు... ఇంట్లో వడ్లు దంచడం దగ్గర్నుంచి అడుగడుగునా తెలుగు సాహిత్యంలో ఎన్నో అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా కృషి ప్రధాన దేశమైన భారత దేశంలో.... వ్యవసాయానికి దగ్గరగా ఉండే ఎంతో సాహిత్యాన్ని మనం గమనించవచ్చు.

అప్పట్లో ఇప్పట్లా మరలు లేవు. అందుకే రాగులు విసురుకోవాలి. వడ్లు దంచుకోవాలి. అలాంటి సందర్భంలోనుంచి పుట్టిన ఓ జాన పద గేయం ఉంది.

రాగులిసరాలేనూ రాయెత్తాలేనూ... రాజ్యాలు ఏలేటి రాజుల్లా బిడ్డాను

వొడ్లు దంచాలేనూ వాగిట్లో గూచోని వాదులాడేనూ...

అంటూ ఓ పక్క విసురుతూ.... విసురుగా ఈ పాట అందుకునే అత్తా కోడళ్ళు అప్పట్లో ప్రతి గడపకూ కనిపించే వారు. అంతేనా ఇప్పడు చాలా మందికి కపిలకు పోవడం అంటే తెలియదు. అప్పట్లో పొలానికి నీళ్ళు పెట్టడానికి ఈ పదం వాడే వారు. ఈ సందర్భంలోనూ కపిల పాటలు పుట్టుకొచ్చాయి. అందులో ఓ పాటను చూస్తే...

నీళ్ళ కంటానేను వస్తీ నిన్ను జూడవస్తిగదరా...

నీళ్ళ రేవులో నీవులేవు కంటినీరే కడవ నిండో...

అంటూ... ఆర్ధ్రంగానూ శ్రమను మరచిపోయే వారు. అంతే కాదు వడ్లు దంటేటప్పుడు...

అత్తలేని కోడలుత్తమురాలు

కోడలు లేనియత్త గుణవంతూరాలు

అంటూ సాగే ఆరళ్ళ పాట సైతం మనకు తెలిసిందే. అలాగే విసర్రాతి పాటలుగా చెప్పుకునే

గట్టురాయని ఇంట్లో పుట్టె గౌరమ్మా..

పుట్టుటే గౌరమ్మ ఏమేమి గోరు..

కుట్టూ వయ్యారి రవికె, కుంకుమ కాయ

జాలవయ్యా రవికె, జామాల పేరు... అంటూ సాగుతుంది. అలాగే తుమ్మెద పాటలు, ఊయల పాటలు ఇలా ఎన్నో గీతాలు ప్రజల నోళ్ళలో నాని నాని తెలుగు సాహిత్యంలో భాగమయ్యాయి. అంతగా శ్రమైక జీవన సౌందర్యం తెలుగు సాహిత్యంతో పెనవేసుకుపోయింది.

కొన్ని తరాల తర్వాత శ్రామికుని శక్తి విలువను తెలుసుకునే రోజు వచ్చింది. ఓ విధంగా చెప్పాలంటే... శ్రీశ్రీతో ఇది మరింత ఎత్తుకు ఎగిసింది.

పొలాలనన్నీ,

హలాలదున్నీ,

ఇలాతలంలో హేమం పిండగ-

జగానికంతా సౌఖ్యం నిండగ-

విరామమెరుగక పరిశ్రమించే,

బలం ధరిత్రికి బలికావించే,

కర్షక వీరుల కాయం నిండా

కాలువకట్టే ఘర్మజలానికి,

ఘర్మజలానికి

ధర్మజలానికి,

ఘర్మజలానికి ఖరీదు లేదోయ్‌!

నరాల బిగువూ,

కరాల సత్తువ

వరాలవర్షం కురిపించాలని,

ప్రపంచభాగ్యం వర్ధిల్లాలని-

గనిలో, వనిలో, కార్ఖానాలో

పరిక్లమిస్తూ,

పరిప్లవిస్తూ,

ధనిక స్వామికి దాస్యం చేసే,

యంత్రభూతముల కోరలు తోమే,

కార్మిక వీరుల కన్నుల నిండా

కణకణమండే,

గలగల తొణకే

విలాపాగ్నులకు, విషాదాశ్రులకు

ఖరీదు కట్టే షరాబు లేడోయ్‌!

నిరపరాధులై దురదృష్టంచే

చెరసాలలో చిక్కేవాళ్లూ-

లోహ రాక్షసుల పదఘట్టనచే

కొనప్రాణంతో కనలేవాళ్లూ-

కష్టం చాలక కడుపుమంటలే

తెగించి సమ్మెలు కట్టేవాళ్లూ-

శ్రమ నిష్ఫలమై,

జని నిష్ఠురమై,

నూతిని గోతిని వెదకేవాళ్లూ-

అనేకులింకా అభాగ్యులంతా,

అనాథులంతా,

అశాంతులంతా

దీర్ఘశ్రుతిలో, తీవ్రధ్వనితో

విప్లవశంఖం వినిపిస్తారోయ్‌!

కావున- లోకపుటన్యాయాలూ,

కాల్చే ఆకలి, కూల్చే వేదన,

దారిద్య్రాలూ, దౌర్జన్యాలూ

పరిష్కరించే, బహిష్కరించే

బాటలు తీస్తూ,

పాటలు వ్రాస్తూ,

నాలో కదలే నవ్యకవిత్వం

కార్మికలోకపు కళ్యాణానికి,

శ్రామిక లోకపు సౌభాగ్యానికి

సమర్పణంగా

సమర్చనంగా-

త్రిలోకాలలో

త్రికాలాలలో,

శ్రమైక జీవన సౌందర్యానికి

సమానమైనది లేనేలేదని

కష్టజీవులకు

కర్మవీరులకు

నిత్యమంగళం నిర్దేశిస్తూ,

స్వస్తివాక్యములు సంధానిస్తూ,

స్వర్ణవాద్యములు సంరావిస్తూ

వ్యథార్త జీవిత యథార్థ దృశ్యం

పునాదిగా ఇక జనించబోయే

భావివేదముల జీవనాదములు

జగత్తుకంతా చవులిస్తానోయ్‌!

కమ్మరి కొలిమీ, కుమ్మరి చక్రం,

జాలరి పగ్గం,

సాలె లల మగ్గం,

శరీరకష్టం స్ఫురింపజేసే

గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి,

సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు-

నా వినుతించే,

నా విరుతించే,

నా వినిపించే నవీన గీతికి,

నా విరచించే నవీన రీతికి,

భావం!

భాగ్యం!

ప్రాణం!

ప్రణవం.

ఈ ఒక్క గీతం చాలదా... కార్మిక కర్షకులకు నివాళి అర్పించడానికి. శ్రీశ్రీ కలం నుంచి జాలువారిన ఈ ప్రతిజ్ఞ కవిత... ధనిక స్వాములకు దాస్యం చేసే కార్మిక వీరుల ఘర్మజలం విలువెంతో తెలియజేసింది. సహస్రవృత్తుల సమస్త చిహ్నాలకు జేజేలు అర్పించింది. ఓ విధంగా చెప్పాలంటే... ఇది కార్మిక, కర్షిక లోకానికి జాతీయ గీతం లాంటింది.

ఈ పాట ఓ చిత్రంలోనూ తెరకెక్కింది. ఇక సినిమాల విషయానికొస్తే... శ్రామిక శక్తి విలువను సినీ కవులు తమ పాటల్లో అద్భుతంగా వర్ణించారు. ఉదాహరణకు వెలుగు నీడలు సినిమాలో పెండ్యాల నాగేశ్వరరావు కలం నుంచి జాలు వారిన ఈ గీతాన్ని చూడండి.

ఓ రంగయో పూల రంగయో

ఓర చూపు చాలించి

సాగిపోవయో

పొద్దువాలి పోతున్నదోయి

ఇంత మొద్దు నడక

నీకెందుకోయి - "పొద్దు" "ఓ రంగయో"

పగలనక రేయనక

పడుతున్న శ్రమనంతా

పరుల కొరకు ధారపోయు

మూగజీవులు

ఆటలలో పాటలలో

ఆయాసం మరిచిపోయి

ఆనందం పొందగలను

ధన్యజీవులు "ఓ రంగయో"

కడుపారగ కూడులేని

తలదాచగ గూడులేని

ఈ దీనుల జీవితాలు

మారు టెన్నడో "కడుపారగ"

కలవారలు లేనివారి

కష్టాలను తీర్చుదారి

కనిపెట్టి మేలు చేయగలిగనప్పుడే "ఓ రంగయో"

అలాగే రోజులు మారాయి సినిమాలోని మరో గీతం రైతుల శ్రమజీవన సౌందర్యాన్ని కళ్ళకు కడుతుంది.

కల్ల కపటం కానని వాడ లోకం పోకడం తెలియని వాడ కల్ల కపటం కానని వాడ లోకం పోకడం తెలియని వాడ

ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న

నవ ధ్యానాలను గంపకెత్తుకొని చద్ది అన్నము మూట గట్టుకొని ముళ్లు గర్రను చేతబట్టుకొని ఇల్లాలునీ వెంటబెట్టుకొని

ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న

పడమట దిక్కున వరద గుడేసె ఉరుముల మెరుపుల వానలు గురిసె వాగులు వంకలు ఉరవడి జేసె ఎండిన బీళ్లూ ఇగుళ్ళు వేసె

ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న

పోటేరును కరి జూచి పన్ను కోయల పటదాపట ఎడ్ల దోల్నుతో హై హై హై హై రాళ్లు తప్పక కొంత వేటుతో విత్తనము విసిరిసిరి జల్లుకో

ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న

పొలాలమ్ముకొని పోయేవారు టౌనులో మేడలు కట్టేవారు బ్యాంకులో డబ్బును దాచేవారు ఈ చట్టిని గమనించరు వారు

ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న

పల్లెటూళ్లలో చల్లనివాళ్లు పాలిపిత్తుతో బతికే వాళ్లు ప్రజాసేవయని అరచేవాళ్లు వొళ్లు వంచి చాకిరికి మళ్లరు

ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న

పదవులు తిరమని బ్రమిసే వాళ్లే కోట్లు గుంజి నిను మొరచే వాళ్లే నీవే దిక్కనివత్తురు పదవోయ్

రోజులు మారాయ్ రోజులు మారాయ్మారాయ్మారాయ్మారాయ్రోజులు మారాయ్ ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న

అలాగే ఆర్. నారాయణ మూర్తి గారి సినిమాలన్నీ శ్రామిక శక్తి గురించి తెరకెక్కినవే కావడం వల్ల... ఇలాంటి ఎన్నో గీతాలు ఆ సినిమాల్లో కనిపిస్తాయి. ప్రజా కవుల కలాల నుంచి జాలు వారినవి కావడం వల్ల... వాటిలో జీవధార ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రపంచకార్మికులందరికీ మరో సారి మేడే శుభాకాంక్షలు....

No comments:

Post a Comment

Pages