సరస్వతీ పుత్ర శ్రీ మాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు : రచన-- వి. సదానందేశ్వరయ్య - అచ్చంగా తెలుగు

సరస్వతీ పుత్ర శ్రీ మాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు : రచన-- వి. సదానందేశ్వరయ్య

Share This

“ఏమానందముభూమీతలమున!

శివతాండవమట!శివలాస్యంబట!

 ఓ హో హో హో!యూహాఽతీతం

 బీయానందంబిలాతలంబున!

తమ్ములై, ఘటితమోదమ్ములై, సుకృతరూ

 పమ్ములై, శాస్త్రభాగ్యమ్ములై, నవకోర

కమ్ములై, వికచపుష్పమ్ములై, దుమ్మెదల

 తమ్ములై, భావమంద్రమ్ములై, హావఫు

ల్లమ్ములై, నూత్న రత్నమ్ములై, వల్గుహా

సమ్ములై, గన్గొనలసొమ్ములై, విశ్రాంతి

దమ్ములై, రక్తకిసలమ్ములై, రక్తిచి

హ్నమ్ములై, తంద్రగమనమ్ములై గెడఁగూడి

కులుకునీలపుఁగండ్లఁ దళకుజూపులు బూయ

ఘలుఘల్లుమని కాళ్ళఁ జిలిపిగజ్జెలు మ్రోయ

ఆడెనమ్మా! శివుఁడు

పాడెనమ్మా! భవుఁడు                                         (శివతాండవం)

“ ఓ అభాగ్య శిశువా

ఓ శిశువా!

చన్నుకుడూస్తున్నావా?

చచ్చినతల్లి నన్ను!

 ఓ శిశువా

నీ తల్లి మరణించింది

 నిన్ననే మరణించింది

నీకై గిలగిలలాడుతూ

నిలవలేక

నిలుపుకోలేక మరణించింది”

‘ఆమె చేసిన తప్పేమిటి?

ఆడది కావడమే

ఈ దేశంలో పుట్టడమే’

‘పాలే కాదు – యెదలో

ప్రవహించదు రక్తం కూడా.

రక్తము వారే త్రాగారు.

తొక్క మిగిల్చారు”

(పురోగమనం)

I have done much

That can only be called miraculous

Space and time I have controlled

Measured out the seas

 And voyaged the sky

I can count the stars

Make wars with men, with nature

I can weigh the Universe

Quite you can do all this

What lunacy is this

When you can’t control then anas, the heart

(Leaves in the wind)

                        ఇంతటి వైవిధ్యమైన రచనలు చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి, మహాకవి. పుంభావసరస్వతి శ్రీమాన్ డాక్టరు పుట్టపర్తి నారాయణాచార్యుల గురించి ఇప్పుడు నేను వ్రాయుట సూర్యున్ని, దివిటీ అంటించి మరీ చూపినట్లు అవుతుంది. శ్రీ నారాయణాచార్యులవారిని రాయలసీమలోని శిష్యులు, ప్రజలు స్వామి అని సంబోధిస్తారు. ఆచార్యులవారు శ్రీ కృష్ణదేవరాయల అస్థాన పండిత శ్రేష్టుడగు శ్రీ తిరుమల తాతాచార్యుల వంశములో, విజయనగర ప్రభువుల వేసవి విడిది పెనుకొండ (అనంతపురం జిల్లా) లో మార్చి 28, 1914 లో జన్మించారు. వారి తండ్రిగారైన శ్రీనివాసాచార్యులగారినుండి సంస్కృతాంధ్రభాషలు, అప్పటి పెనుగొండ సబ్ కలెక్టరు గారి సతీమణి శ్రీమతి పిట్ (Mrs. Pitt) గారి నుండి ఆంగ్లభాషా సాహిత్యాన్ని షేక్స్ పియర్ నాటకములు, వాటిలోని మానవతా విలువలు నేర్చుకున్నారు. భరతనాట్యాన్ని బుక్కపట్నానికి (అనంతపుతంజిల్లా) చెందిన నృత్యకళాకారిణి మహలక్ష్మమ్మ గారినుండి నేర్చుకున్నారు.  ఆచార్యులవారు తన పన్నెండవ ఏట విజయనగర ప్రభువుల వేసవి విడిది తన జన్మస్థలమగు పెనుగొండవైభవాన్ని గురించి పెనుగొండ లక్ష్మీ అను పద్యకావ్యాన్ని రచించారు.

ఇచట ఒక విచిత్రమైన సంఘటన జరిగినది. బహుశా ప్రపంచములో ఏ కవికి, రచయితకు యింతటి విచిత్ర సంఘటన జరిగి ఉండదు. స్వామివారి ఇరవది ఏట విద్వాన్ పరీక్షలో వారిచే రచించిన పెనుగొండ లక్ష్మి పాఠ్యాంశమును గురించి ప్రశ్నిస్తే వారు జవాబు వ్రాయవలసివచ్చింది. ఆ ప్రశ్నకు జవాబు రెండు పంక్తులు వ్రాస్తే చాలు కాని వారు 40 పంక్తులు వ్రాశారు.

విద్వాన్ పూర్తిచేసిన ఆచార్యులవారు ప్రొద్దుటూరు పురపాలక ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా ప్రవేశించారు. ప్రొద్దుటూరు (కడపజిల్లా) కళలకు, కళాకారులకు, సాహితీవేత్తలకు, ప్రసిద్ధి చెందినది. అవూరి మధ్యలో నున్న శ్రీ అగస్తేశ్వరాలయంలో ఆచార్యులవారు రోజూ 101 ప్రదక్షిణలు చేస్తూ 30 రోజులలో శివతాండవకృతి రచించారు. ప్రొద్దుటూరులో గండపెండేర విభూషితులు శ్రీ ఫిడేలు పెద్ద జమాపల్లగారి దగ్గర సంగీతం నేర్చుకొని ఘోరా కుంభార్, తులసీదాస్, గాంధి చరిత్ర, హరికథలుగా రచించి, గానం చేస్తూ వచ్చారు.

పెనుగొండ పాఠశాలలో తొమ్మిదవతరగతి కూడా పూర్తిచేయని స్వామి తన 16వ యేట తిరుపతి సంస్కృతకళాశాలలో విద్వాన్ చదువుటకై ప్రవేశానికి వెళ్ళారు. ఆకళాశాల ప్రిన్సిపల్ సంస్కృతాంధ్ర భాషలలో దిట్టయైన కపిస్థలం కృష్ణమాచార్యులవారు ఆ కాలంలో క్రొత్త విద్యార్థినులను వారివారి యోగ్యతననుసరించి అర్హమైన తరగతులలో చేర్చుకొనేవారు. ఈ ఇంటర్వ్యూలో తన కళాశాలలో చేర్చుకొనడానికి ప్రిన్సిపాల్ గారు నిరాకరించారు. ఆచార్యులవారి ఆత్మాభిమానం దెబ్బతిన్నది. వెంటనేఆశువుగా సంస్కృతంలో  అయిదారు శ్లోకములు చెబుతూ బయటికి నడిచారు. ప్రిన్సిపల్ గారు వారి ఆశుకవితాధోరణికి ముగ్ధులై పుట్టపర్తి వారిని పిలిపించి, ఇష్టం వచ్చిన తరగతిలో చేరమన్నారు.

శ్రీ పుట్టపర్తిని కవులో పండితులో తేల్చి చెప్పడం కష్టం. వారు ప్రకాండ పండిత కవులు. అలానే వారు ప్రగాఢ కవి పండితులు. పుట్టపర్తివారు గురుముఖంగా నేర్చినది బహుస్వల్పం. కాని ఆయనకు జీవితం నేర్పిన పాఠం, అనుభవాలు, చిన్నతనములోనే వివిధ సాహితీప్రక్రియలలోని మెళుకువలు, ధారణాశక్తి వారిని బహుముఖ సాహిత్య వ్యాసంగానికి, బహుభాషా వైశుద్ద్యమునకు అర్హులు చేసినది. వారు సంస్కృతాంధ్రములతో పాటు, ప్రాకృతభాషలు కన్నడం, అరవం, మళయాళం, మరాఠీ, హిందీ, ఇంగ్లీషు మున్నగు 14 భాషలలో ప్రవేశమే కాక పాండిత్యమును కూడా పొందిన ఘనత తెలుగునేలలో ఒక నారాయణాచార్యులకే దక్కింది.

హృషీకేశాశ్రమాధిపతి శ్రీ స్వామి శివానందగారు నారాయణాచార్యులవారికి సరస్వతీ పుత్ర బిరుదునిచ్చారు. మన కేంద్రప్రభుత్వము వారు 1972లో పద్మశ్రీ అవార్డునిచ్చి గౌరవించారు. ఇతర విశ్వవిద్యాలయాలు గుర్తించిన తర్వాత శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (1987) లో డాక్టరేటు ప్రదానం చేశారు.

వీరు రచించిన ప్రబంధనాయకుల గ్రంథంను మద్రాసు విశ్వవిద్యాలయంవారు మైసూరు విశ్వవిద్యాలయంవారు 1945-46లలో పాఠ్యాంశములుగా నిర్ణయించారు. భాగవతోపన్యాసములను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు పాఠ్యముగా నిర్ణయించిరి. శ్రీమాన్ నారాయణాచార్యులుగారు రచించిన అన్ని కావ్యాలలో అన్ని భాషల కవిత్వములోను ఆయన రచించిన శివతాండవము ప్రపంచప్రసిద్ధి చెందినది. శివతాండవ గీతాన్ని స్వయంగా ఆచార్యులవారు గానం చేస్తుంటే విన్నవారు ధన్యజీవులు. వారు గానం చేస్తుంటే అది శ్రవ్యకావ్యం నుంచి దృశ్యకావ్యంలోకి రూపాంతరము చెందుతుంది. శ్రోతలు తాము శివసదస్సులోనున్నట్లు ఊహించి లయబాద్ధంగా తలలూపి తాము నాట్యములో భాగస్వాములైనట్లు తన్మయం చెందేవారు.

పెనుగొండ లక్ష్మి శివతాండవ రచనే గాక వీరు దాదాపు 150 పైగా రచనలు చేసారు. అందులో కొన్ని అనువాదగ్రంథాలు ఉన్నవి. ఇందులో కొన్నివారు అసంపూర్ణంగా వదిలిన కావ్యాలు, రచనలు ఉన్నాయి. కొన్ని ముద్రణకు నోచుకోని గ్రంథాలు ఉన్నాయి. స్వామివారే అన్నట్లు ఆయన వల్ల ప్రకాశకులు బాగుపడ్డారు కానీ వారు బాగుపడలేదు. వారు వైష్ణవుడైనను శివతాండవం, శివ కర్ణామృతము లాంటి గ్రంథాలు రచించారు. నిరంతరము రామనామం జపించేవారు. రామచరితమానస్ ఆయన చదువుతుంటే హిందీవారే ఆశ్చర్యపడేవారు. ఆంగ్లభాషలో ఆయనకు గుర్తింపబడిన డిగ్రీ లేకున్నను, ఆచార్యులవారు షేక్ స్పియర్, వర్డ్స్ వర్త్, షెల్లీ, కీట్సు, మిల్టన్ రచనలపై వ్యాఖ్యానము చేశారు. ఆయన ఎన్నో అవధానాలు చేశారు. హరికథాగానం చేశారు. రాజంపేటలో బొబ్బిలి యుద్ధం నాటకంలో తాండ్రపాపారాయుని పాత్ర పోషించారు.

(రెండవ భాగం వచ్చే సంచికలో...)

No comments:

Post a Comment

Pages