‘సిరివెన్నెల’ పూయించిన కలువపూలు - అచ్చంగా తెలుగు

‘సిరివెన్నెల’ పూయించిన కలువపూలు

Share This

‘సిరివెన్నెల’ పూయించిన కలువపూలు

భావరాజు పద్మిని

సాహసం ఆయన పధం... రాజసం ఆయన రధం... అందుకే, ఆయన సాహితీరధం సాగితే ఆపడం ఎవ్వరికీ సాధ్యం కాలేదు. హరితాక్షర వనాల కోసం భావనల వసంతం తానే తరలి రానే వచ్చింది. అప్పటివరకూ కుదురులేని గాలి, ఆయన ఊపిరి ఊయలలో కొత్త ప్రాణం పోసుకునేందుకు వెదురులోకి కుదురుగా ఒదిగింది. అవును ... ఆయన రాకతో తెలుగు పాటకు కొత్తగా రెక్కలొచ్చాయి. ‘చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలీ...’ అని అడిగితే, అదిగో, ‘అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో జాబిలి ఉంది...’అంటూ ,తెలుగు సినీ వినీలాకాశంలో ‘సిరివెన్నెల’ జిలుగులు చిమ్ముతున్న నిండు పున్నమి జాబిలి...  సిరివెన్నెల గారిని చూపుతూ , ప్రతీ తెలుగు మనసూ ఆనందంతో పరవళ్ళు తొక్కుతుంది. తమ గుండె నదిపై తళుకు లీనుతున్న ఆ వెన్నెలను ఒక్కసారి తడుముకుని, పున్నమి సంద్రంలా ఉప్పొంగుతూ, మా ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’ అని గర్వంగా చెప్తుంది. ‘రండి రండి రండి... దయచేయండి...’ అని ఆ పుంభావ సరస్వతి ఆహ్వానించగానే అక్షరాలు పదాలై, పదాలు వాక్యాలై, నవ లాస్యం చేస్తూ పరుగుపరుగున తెలుగింటి గడప చేరి, ప్రతీ గుండె గూటికీ భావాల తోరణం కట్టాయి. అదేమి మాయాజాలమో... ప్రాగ్దిశ వీణియపై ఆయన పాటలు ‘తెల్లారింది లేగండో ... ‘, ‘తెలిమంచు కరిగింది...’, ‘తెలవారదేమో స్వామి...’ అంటూ మనల్ని మేలుకొలిపిన క్షణం నుంచీ ఆయన ‘మాటంటే మాటేనంట !’ పాటంటే పంచదారే నంట అనుకుంటూ తిరిగి, ‘చందమామ రావే...’ అంటూ మనల్ని వెన్నెల బృందావన విహారం చేయించి , ‘నమ్మకు నమ్మకు ఈ రేయిని...’ అంటూ మనకు కటువైన సత్యాన్ని గుర్తు చేసి, చివరకు ‘హాయి హాయి హాయి వెన్నెలమ్మ...’ అంటూ మనల్ని జోల పాడి నిద్ర పుచ్చే వరకూ, ఈ పాటలు మన జీవితాల్లో మిళితమై, అంతర్భాగామైపోయాయి. సొంత ఊరు, కన్నతల్లీ, మాతృభాష... ఇవి ప్రతీ వ్యక్తి జీవితంలోనూ మరపురానివి. సొంత ఊరికి దూరంగా ఉంటున్న వారంతా, తమ ఊళ్లకు వెళ్తున్నప్పుడు...’ ఈ గాలి, ఈ నేల...’ అని పాడకుండా ఉండగలరా ? వారిని ఆ ఊరి ఏరు, గాలి, నీరు, గోరింక, స్వాగాతించవా, అప్పుడు ఉప్పొంగిన గుండెలు నింగి దాగా ఎగసి పరవశించవా ? ‘చుక్కలన్నీ ముగ్గులై ఫక్కుమన్న ముంగిలి..’ వీడి, మళ్ళీ పొలిమేర దాటిపోతున్నా, మధుర జ్ఞాపకాలను, ‘గుండెల్లో గువ్వలచెన్న’ డినీ దాచుకుని, మరలి వెళ్ళని మనసు ఉంటుందా? ‘అల్లంత దూరాన ఆ తారక’ కళ్ళెదుట నిలచినప్పుడు, ‘కనులు తెరచినా కనులు మూసినా కలలు’ ఆగనప్పుడు , ‘నేను నేనులా లేనే నిన్నమొన్నలా’ అంటూ ఆశ్చర్యపోతూ, ‘మనసంతా నువ్వే...’ అన్న ప్రేమైక భావనలో మమేకమైనప్పుడు, ‘మనసే ఎదురు తిరిగి మాట’ విననప్పుడు, ‘ఒకే ఒక మాట...’ పెదవోపలేనంత తియ్యటి మాట చెప్పాలని అనిపించినప్పుడు, ‘అణువణువును మీటే మమతల మౌనం, పదపద మంటే’ ప్రాణం నిలవనప్పుడు, సిరివెన్నెల పాటలు పాడుకుంటూ... చెప్పలేని భావాల్ని సైతం అతి సులువుగా అక్షరాల్లో పొదిగి మనకిచ్చిన ఆయన జాణతనం చూసి, ‘నెరజాణవులే, వరవీణవులే...  ‘ అని పాడి సలాం కొట్టి, గులాం కాని తెలుగువారు ఉంటారా? చిన్నబోయి, దిగులు పడ్డప్పుడు, ‘సరేలే ఊరుకో, పరేషానేందుకు...’ అని,‘సూరీడు పువ్వా జాబిల్లి నువ్వా, చినబోయినావెందుకే ...’ అంటూ, ‘మరీ అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకలా ...’ అంటూ మనల్ని ఓదార్చి, ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి...’ అంటూ కొత్త స్పూర్తిని అందిస్తాయి సిరివెన్నెల గారి పాటలు. సరదాగా విని నవ్వుకునేందుకు ‘వారెవ్వా ఏమి ఫేసు...’ , ‘భద్రం బి కేర్ఫుల్ బ్రదరూ ...’, ‘గోపీ లోలా నీ పాల పడ్డామురా...’ , ‘బోడి చదువులు వేస్టు’ వంటి పాటలైనా, ‘మేరా భారత్ కొ సలాం’, ‘ఇందిరమ్మ ఇంటిపేరు కాదుర గాంధీ...’ వంటి దేశభక్తి గేయాలైనా, ‘నిగ్గదీసి అడుగు’ వంటి పాటలైనా, పాత్రకు, సందర్భానికి తగ్గట్టు అలవోకగా అందిస్తారు సిరివెన్నెల. ౩౦౦౦ పైగా పాటలు రాసినా, ఇప్పటివరకూ, ఒక్క బూతు పదం, అశ్లీలత లేకుండా కలుపుమొక్కలు లేని అక్షర సేద్యం చేసారు సిరివెన్నెల. నిగూఢమైన భావగాంభీర్యంతో రాసే ఆయన పాట విన్నవారికి, ఆ పాటలోని భావం తెలుసుకోవాలి అన్నంత ఆసక్తి కలుగుతుంది.  ‘ఔరా అమ్మకచెల్లా... ఆలకించి ఊరక ఉండడమెల్లా ... ‘ మీ సాహితీ ‘సిరివెన్నెల’ జలతారు పరదాల చలువను ఆస్వాదించిన మనసులు ఒక్క పాటైనా పాడక మిన్నకుండడం ఎలా? మీ పుట్టినరోజున వేవేల పున్నమి వెన్నెలలు కాసి, మా మనసులనే కలువబాలల్ని వికసింపచేసి, పరవశాల కొలనులో తెలియాడించకపోవడం ఎలా ? ఆనందడోలికల్లో తేలియాడే మా తెలుగు గుండెల చప్పుళ్ళు, మంగళవాద్యాలై మీకు మనస్పూర్తిగా చెబుతున్నాయి... ‘పుట్టినరోజు శుభాకాంక్షలు, సిరివెన్నల గారు ! మీరు పూయించిన సాహితీకుసుమ సౌరభాలు వాడిపోని పూలగుత్తిలా మా మనసుల్లో ఎప్పటికీ పదిలం ! పదిలం !’    

No comments:

Post a Comment

Pages