// తమసోమా జ్యోతిర్గమయా // - భావరాజు పద్మిని - అచ్చంగా తెలుగు

// తమసోమా జ్యోతిర్గమయా // - భావరాజు పద్మిని

Share This

// తమసోమా జ్యోతిర్గమయా //

-      భావరాజు పద్మిని

అదొక పెద్ద వేదిక... అందంగా అలంకరించిన ఆ వేదిక వెనుక భాగంలో దయారసం ఉట్టిపడుతున్న మదర్ థెరీసా బొమ్మ ఉంది. వివిధ రంగాల్లోని ప్రముఖులు, వ్యాపార దిగ్గజాలు ఆ వేదికను అలంకరించి ఉన్నారు... నిస్వార్ధ  హృదయంతో సమాజ సేవ చేసే వారికి, పేదవారి అభివృద్ధికి దోహద పడిన వాళ్లకి, సామాజిక న్యాయం కోసం పోరాడిన వాళ్లకి, ఆ రోజున  “మదర్ థెరీసా స్మారక అవార్డుల ప్రదానోత్సవం “ జరుగుతోంది...

తరువాతి అవార్డు ... “ఆశ్రిత “ స్త్రీ సంక్షేమ సంఘం స్థాపకురాలు “దీపిక” గారికి ఇవ్వబడుతుంది. వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము.... అన్న మాటలు వినబడగానే... అందరి చూపులు ప్రేక్షకుల్లో వెదకసాగాయి ... సరిగ్గా అప్పుడే ,తెలుగింటి మణిదీపంలా చక్కటి చీరకట్టుతో, ఆహార్యంతో ఉన్న ఒక స్త్రీ లేచి, హుందాగా వేదికపైకి నడిచి వెళ్ళింది. అవార్డు ప్రదానోత్సవం తరువాత... ఇప్పుడు “దీపిక “గారిని, వారి మనోభావాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం... అన్నారు వ్యాఖ్యాతలు.

ప్రశాంత వదనంతో అవార్డును ఒక చేతబట్టి, మైక్ వద్దకు వెళ్లి, ముందుగా అందరికీ నమస్కరించింది దీపిక. ఆమెలో ఎటువంటి ఉద్వేగం లేదు...  అన్ని ఆటుపోట్లూ చూసిన సాగర గాంభీర్యం...

“జీవితంలో పరిస్థితులతో పోరాడలేక ఎన్నోసార్లు మనం చావాలని అనుకుంటాం. పుట్టడం, చావడం ఇంతేనా జీవితం ? కాదు, ఈ రెంటి మధ్య ఏదో గొప్ప పరమార్ధం దాగి ఉంటుంది. దాన్ని అన్వేషించాలి, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అందుకోవాలి. ఇటువంటి తృష్ణ తోనే మొదలైన నా పయనం, ఇదిగో ఈ రోజున ఈ వేదికదాకా నన్ను చేర్చింది. ఒక కుగ్రామంలో మొదలైన నా కధ, ఇంత ప్రతిష్టాత్మకమైన బహుమతి అందుకునే దాకా ఎన్ని మలుపులు తిరిగిందో మీరు తెలుసుకోవాలి.   ఎందుకంటే నా జీవితం ఇచ్చిన సందేశం ఎందరో ఆడపడుచులకు  స్పూర్తి కావాలి.... “ అంటూ ఒక్క క్షణం గట్టిగా ఊపిరిపీల్చి, ఇలా చెప్పసాగింది దీపిక.

మాది కృష్ణాజిల్లా లోని ఒక కుగ్రామం. నాన్నగారు వేదపండితులు. మా అమ్మానాన్నలకు నేను ఏకైక సంతానం. లేక లేక కలిగిన నన్ను తమ ఇంటి దీపంగా భావించి, “దీపిక “అని పేరు పెట్టారు. నేను ఆడింది ఆట, పాడింది పాట ! లలిత కళలు, భగవద్గీత శ్లోకాలు, సంగీతం, నాట్యం ఇలా ఎన్నో నేర్పించారు. పదొవ తరగతి వరకు మా ఊళ్లోనే చదివాను. ఇంటర్ కు వచ్చేసరికి, నా కాలేజీ చదువు పూర్తి చెయ్యడానికి, నాన్నగారు పక్క ఊరికి మకాం మార్చారు. ఆయన ముఖ్యమైన కార్యక్రమాలకు మా ఊరు వెళ్లి వస్తుండేవారు. అక్కడ కాలేజీ లో తెలుగు మీడియం లో ఇంటర్ ప్రధమ శ్రేణిలో పాస్ అయ్యి, డిగ్రీ లోకి అడుగు పెట్టాను. ఇంతలో ఒక అనుకోని సంఘటన మా జీవితాల్ని కుదిపేసింది. ఒకరోజు నాన్నగారు మా ఊరికి వెళ్లి వస్తుండగా పాము కాటుకు గురై మరణించారు. అమ్మా, నేనూ దిక్కులేని వాళ్ళమై, మేనమామ పంచన చేరాము. నా చదువు ఆగిపోయింది.

ఏడాది తిరిగాకా, మా మేనమామ మంచి సంబంధం అంటూ ,విదేశాల్లో పెద్ద ఉద్యోగంలో ఉన్న, ఆస్థిపరుడు, అందగాడైన “అరవింద్” సంబంధం తెచ్చాడు. పెళ్ళికొడుకుకు ఎక్కువ సెలవలు లేవంటూ, పది రోజుల్లోనే పెళ్లి ఏర్పాట్లు చేసేసారు. అందరి ఆమోదంతో శరవేగంతో నా పెళ్లి జరిగిపోయింది. అంతా నేను పెట్టి పుట్టానని, బంగారంలాంటి భర్త దొరికాడని, నా అదృష్టాన్ని మెచ్చుకున్నారు. మరో నెల రోజుల తర్వాత “డిపెండెంట్ వీసా “ మీద నేనూ అమెరికాలో అడుగుపెట్టాను. తోట మధ్యన ఉన్న చక్కటి పొదరిల్లు లాంటి అరవింద్ ఇంట్లోకి, నేను వెళ్లేసరికి, అక్కడ ఒక విదేశీ వనిత ఉంది. అరవింద్ రాగానే ఎంతో చనువుగా ముద్దుపెట్టుకుని, కౌగిలించుకుంది.  నేను ఆశ్చర్యపోయాను....

“ఈమె నా గర్ల్ ఫ్రెండ్, కొలీగ్ రీటా ! మేము గత 3 ఏళ్ళ నుంచి కలిసే ఉంటున్నాము. తాగుతాము, కలిసి క్లబ్ లకు వాటికీ తిరుగుతాము. ఈమె నాకంటే వయసులో పెద్దదని, మా పెళ్ళికి మా అమ్మానాన్నలు ఒప్పుకోలేదు. మా అమ్మ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తే, ఆమె పోరు పడలేక, నిన్ను పెళ్లి చేసుకున్నాను. నీపై నాకు ఎటువంటి ఇష్టం, కోరిక లేవు. నువ్వొచ్చావని, నాకు, రీటా కి వేరే ఇల్లు తీసుకున్నాను. నువ్వు నా భార్య హోదాలో ఇక్కడే ఉంటూ , నేనిచ్చే డబ్బుతో బ్రతుకుతూ నోరు మూసుకు పడుంటావో, లేక ఏడుస్తూ మీ ఊరికే తిరిగివెళ్ళి, ‘మొగుడు వదిలేసిన ఆడది ‘ అని ముద్ర వేయించుకుని, అయినవాళ్ళకి భారంగా మిగులుతావో, నీ ఇష్టం !” అని తెగేసి చెప్పేసి, కొంత డబ్బు అక్కడ పెట్టి, రీటాతో వెళ్ళిపోయాడు అరవింద్.

కన్నీళ్లు ఉబికి వచ్చాయి నాకు. తనకోసం ఒకరు...తన తల్లి కోసం ఒకరు. నయవంచన చేసి, ఒక ఆడపిల్ల గొంతు కోసాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి ? ఎక్కడకు వెళ్ళాలి ? నా వేదన అరణ్యరోదన.... గుండె పగిలేలా ఏడ్చాను. చావాలని అనుకున్నాను. నాపైనే ప్రాణాలు పెట్టుకు బ్రతుకుతున్న అమ్మ గుర్తుకొచ్చింది. జీవితమంటే పుట్టడం, చావడం మాత్రమే కాదని, ప్రతి పుట్టుక వెనుక ఒక బలమైన కారణం ఉంటుందని అనిపించింది. నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. అమ్మకు ఈ వార్త చెప్పి, బాధపెట్టే కంటే, గుండె రాయి చేసుకుని, ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. 3 రోజులు భారంగా గడిచింది. 4 వ రోజు లాన్ లో విరబూసిన గులాబీలను, సున్నితమైన వాటి రేకులను తాకుతూ చీలుస్తున్న ముళ్ళను చూస్తూ... ప్రతి పువ్వు కింద... ఎన్ని కనబడని ముళ్ళో ... అనుకోసాగాను.

‘ఆర్ యు ఫ్రం ఇండియా ?’ అన్నాడు తన బంతిని వెతుక్కుంటూ వచ్చిన చిన్నారి, అతని వెనుక ఉన్న ఒకామె  “ఏమ్మా, తెలుగమ్మాయివా, నీ చీరకట్టు చూసి అనుకున్నా, నా పేరు వాణి, మీ పక్కింట్లో ఉంటాను ...” అంది. అంతవరకూ ఆపుకున్న ఉద్వేగం ఆగక, పరుగున వెళ్లి ఆమెను కౌగిలించుకున్నాను. బాబును ఇంటికి పంపి, ఆమె నాతో వచ్చి, జరిగింది శ్రద్ధగా వింది.

“దీపికా ! అరవింద్ ను గత 4 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. తాగుడు, తిరుగుడు... ఏ అర్ధరాత్రో ఇంటికి వస్తాడు, పోతాడు. అతనిది దారి తప్పిన బాధ్యతారహిత జీవితం. పెళ్లి పేరుతో నిన్ను వంచించడం హేయం. అతను నిన్ను ఒక బొమ్మగా తప్ప, భార్యగా చూడలేడు. అందుకే చెప్తున్నాను... గుండె దిటవు చేసుకుని, నీ కాళ్ళపై నువ్వు నిలబడే ప్రయత్నం చెయ్యి. నీ సమస్యకి నేను పరిష్కారం చూపించలేకపోవచ్చు. కాని నీకు ఒక మంచి వ్యాపకం కల్పించగలను. నావంటి  ప్రవాసాంధ్రుల దేహాలు ఇక్కడే ఉన్నా, ఆత్మలు ఇండియా లోనే ఉంటాయి. మా పిల్లలకు మన భాష, సంస్కృతి గురించి నేర్పాలన్న తపన ఒకవైపు, సమయాభావం వల్ల నేర్పలేని అసహాయత ఒకవైపు. పెద్దగా చదువుకోకపోయినా, నీకు తెలుగు భాష, శ్లోకాలు చక్కగా వచ్చు కనుక, ముందుగా మా పిల్లలకు అవి నేర్పించు. ఇందుకుగాను నీకు కొంత డబ్బు ఇస్తాను. నీ మనసుకూ కాస్త ఊరటగా ఉంటుంది. అంతేకాక, మా తెలుగు సంఘం తరఫున పిల్లలకు సెలవల్లో, వారాంతాల్లో తెలుగు పాఠాలు చెప్తుంటాము. కొన్నాళ్ళు పోయాకా, నువ్వు వాటిలో కూడా పాలుపంచుకోవచ్చు. “ అంది.

నెమ్మదిగా వాణి సాయంతో ఫోన్ చెయ్యడం, మార్కెట్ కు వెళ్ళిరావటం వంటివి నేర్చుకున్నాను. తెలుగు పాఠాలు మొదలు పెట్టి మంచి పేరు తెచ్చుకున్నాను. పరాయి గూటిలో చిలక పలుకులు పలికే ప్రవాసాంధ్రుల పిల్లల్ని, వాళ్ళ కల్మషం లేని నవ్వుల్ని చూస్తూ, నా బాధను మర్చిపోయేదాన్ని. తెలుగు సంఘంలో వారాంతపు క్లాసులతో బాటు, అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ కాస్త డబ్బు, కొంతమంది ఆత్మీయులను వెనకేసుకోగలిగాను.

నెలకోసారి మొక్కుబడిగా అరవింద్ రీటాతో సహా ఫోన్ చేసి వచ్చి, కొంత డబ్బు, సరుకులు అక్కడ పెట్టి, వెళ్ళిపోయేవాడు. కనీసం నా మొహం వంక కూడా చూసేవాడు కాదు. అతని ధోరణికి అలవాటు పడిపోయాను. నా కష్టం అమ్మకు తెలియకుండా, ఎప్పుడైనా ఫోన్ చేసి, నవ్వుతూ మాట్లాడేదాన్ని. ఇలా రోజులు గడిచిపోతుండగా... ఒక రోజు ఆశనిపాతం వంటి మరొక వార్త ! బాగా తాగి, కార్ నడుపుతున్న అరవింద్, అతనితోనే ఉన్న రీటా ఆక్సిడెంట్ లో చనిపోయారట. అతని మీద నేను ఆధారపడి వచ్చాను కనుక, ఒక నెల రోజుల్లో అతని వీసా ఎక్ష్పైర్ అవుతుంది కనుక, నేను ఇక అక్కడ ఉండే వీలు లేదు! నా భవిష్యత్తు అగమ్యగోచరం !

కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న నన్ను అక్కున చేర్చుకుంది వాణి కుటుంబం. దిగులుమేఘాలు కమ్మిన నన్ను మలయమారుతంలా ఓదారుస్తూ ఇలా అంది వాణి “ చూడు దీపికా ! భగవంతుడు కొందరికి అన్నీ ఇస్తాడు, కొందరి వద్ద అన్నీ లాక్కుంటాడు. నా జీవితంలోనే ఈ చీకట్లు ఎందుకు, అని బాధపడుతూ కూర్చునే బదులు, నీ గుండె గూటిలో చిన్న ఆశాదీపం వెలిగించి, నీ జీవితాన్ని సార్ధకం చేసుకునే దిశగా ఆలోచించాలి. అండదండలు, బంధుమిత్రులు ఉన్నప్పుడు ,ధైర్యంగా నిలబడడం గొప్ప కాదు. ఏ ఆసరా లేకపోయినా మనకోసం, మనచుట్టూ ఉన్న సమాజం కోసం దీపస్థంభంలా నిలబడి వెలుగు పంచడం గొప్ప. అటువంటి మొక్కవోని ధైర్యం, స్పూర్తి, పట్టుదల, ఇతరులకు సాయపడే దయాగుణం నీలో చూసాను.

ఒక్కసారి ఆలోచించు, పుట్టింటికీ, అత్తింటికీ కాకుండా పోయిన నీవంటి ఆడపిల్లలు ఎందరో ! స్త్రీని దేవతగా పూజించే మన దేశంలోనే, అటువంటివారు దయనీయ స్థితిలో ఉన్నారు. వారందరి కోసం నువ్వు నిలబడాలి. అందుకే... నిన్ను అడక్కుండా నీ భావి జీవితానికి సంబంధించి మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసాము.

బళ్ళారి వద్ద ఉన్న కుగ్రామంలో మా తాతగారికి సంబంధించిన సత్రం, కొన్ని ఎకరాల స్థలం ఉన్నాయి. అదంతా నీ పేరున రాసాము. నువ్వు చెయ్యబోయే మంచి పనులకు ఇది మా తరఫున ఇచ్చే విరాళంగా భావించు. నీ భర్త ఆస్థులు, ఇల్లు అమ్మిన మొత్తం, నీ బ్యాంకు లో వేసాము. నువ్వక్కడికి వెళ్లి, ఆ సత్రాన్ని పునరుద్ధరించి, “ఆశ్రిత “అనే స్త్రీ సంక్షేమ సేవా సంఘాన్ని నెలకొల్పాలి. నీ వంటి నిరాశ్రయులైన విధివంచితలకు ఆశ్రయం ఇవ్వాలి, ఆసరాగా నిలబడాలి. కష్టంలో ప్రతి  ఆడపిల్ల “ఆశ్రిత “ నే తల్చుకుని, లేగదూడ ఆవు వద్దకు చేరినట్లు, పరుగున చేరే విధంగా దాన్ని తీర్చిదిద్దాలి. నీకు మా  ప్రవాసాంధ్రుల సాయం ఎప్పుడూ ఉంటుంది. ఇదిగో నీ టికెట్.... వచ్చే వారమే నీ ప్రయాణం...”.

ఎన్ని సార్లు మొదలంటా నరికినా... ఎక్కడినుంచో జీవం ఆశగా చిగురులేస్తుంది. అలా నన్ను చిగురింపచేస్తున్న వాణి ఆశయాన్ని నెరవేర్చాలన్న ధృడ సంకల్పంతో నా దేశంలోకి తిరిగి అడుగుపెట్టాను. అమ్మకు కబురుపెట్టి, ఇక్కడికి రప్పించుకుని, అంతా వివరించాను. అమ్మ మొదట కలతపడ్డా, నెమ్మదిగా తేరుకుని, నాకు అన్నివిధాలుగా తోడుగా నిలబడింది.  “ఆశ్రిత “ను నెలకొల్పి , ఒక గ్రంథాలయం, ధ్యాన మందిరం, చేతి వృత్తుల శిక్షణా కేంద్రం, అనాధ శిశు సంరక్షణా కేంద్రం, వృద్ధాశ్రమం నిర్మించి, ఆ ఆవరణ ను ఒక నందనవనంగా తీర్చిదిద్దాను. అవసరంలో ఉన్న ఆడపిల్లల కోసం హెల్ప్ లైన్ నంబెర్ లను ఏర్పాటు చేసాను. అవసరమైతే పోలీసు, లాయర్ లను సంప్రదించి, సాయం పొందే అవకాశం కల్పించాను. విధివంచితలైన స్త్రీలు, పుట్టిల్లు, అత్తిల్లు కాకుండా మాకు “ఆశ్రిత” కూడా ఉంది, అనుకునేలా స్త్రీల కోసం ఒక నవలోకాన్ని ఏర్పరిచాను.

కొన్ని మానవ మృగాలు చెరిస్తే , అనుకోని శాపంలా ఎయిడ్స్ బారినపడ్డ కల్పన, భర్త బాగా కొట్టి చున్నీతో ఉరేసి చంపబోతే, పారిపోయి వచ్చిన ఫాతిమా, ఒక మోసగాడి ప్రేమవలలో చిక్కి అనాధగా వదిలివేయబడ్డ జాస్మిన్, భార్యను బెదిరించి, బూతు సినిమాలు తీసి అమ్ముతుంటే, అతన్ని చంపి జైలుకు వెళ్లి వచ్చిన హైమ... కన్నతండ్రే కసాయిగా నడి రోడ్డుపై సీసా సారా కోసం తనను వేలం వేస్తే, తప్పించుకు వచ్చిన మల్లి, ప్రేమించలేదని తన తల్లిదండ్రుల్ని పొడిచి చంపి, తన మొహాన ఆసిడ్ పోస్తే, దిక్కులేక మమ్మల్ని చేరిన మీనా, ముసలి వయసులో కొడుకు రోడ్డుమీద వదిలేసి వెళ్తే, సాటివారి సాయంతో మా వద్దకు వచ్చిన జయమ్మ...  ఇలా కులమతాల ప్రసక్తి లేకుండా “ఆశ్రిత” ను చేరిన ఎందరో ఆడపడుచులు, వృత్తి విద్యలు నేర్చి, స్వయం ఉపాధి సాధించి, “ఆశ్రిత “ తమ పాలిటి “ఆశ్రిత కల్పవృక్షం “ అంటారు. తమ బాధల్ని మరచి, అనాధలైన శిశువులకు అమ్మలుగా, అవ్వలకు బిడ్డలుగా సేవ అందిస్తున్నారు. అప్పట్లో వాణి చేసిన దిశానిర్దేశమే, ఇన్నాళ్ళ మా అందరి కృషి ఫలితమే, ఈ ప్రేమాలయానికి పునాదిగా మారి, నేను ఈ వేదిక ఎక్కేలా చేసింది.

ఇప్పుడు చెప్పండి... ఆనాడు నేను నిరాశతో ఆత్మహత్య చేసుకుని ఉంటే... ఇదంతా సాధ్యపడేదా ? ఆనాడు వాణి నన్ను అర్ధం చేసుకుని, అండగా నిలబడి, ఆదుకోకపోయి ఉంటే...  “ఆశ్రిత” ఉండేదా ? కొడిగడుతున్న ఈ దీపిక అనే    ప్రమిదను, వాణి వంటి ప్రేమైకహృదయాల ఆర్ద్రత తడపకపోతే... ఇందరి జీవితాలు తిరిగి వెలిగేవా ?

స్త్రీ హృదయం కుసుమ కొమలమే కావచ్చు. కాని అవసరమైతే వజ్రమంత కఠినత్వాన్ని సంతరించుకుని, ఆమె ధైర్యంగా నిలబడగలదు. కాని, తమలోనే ఉన్న ఈ శక్తిని చాలా మంది గుర్తించరు. ఈనాడు ఎందరో స్త్రీలు క్షణికావేశంలో, షాక్ లో తమ జీవితాలు అంతం చేసుకుంటున్నారు. కాని, పుట్టింది కేవలం చావడానికేనా ? ఆలోచించండి...

చావుకి, పుట్టుకకి మధ్యన ఉన్న రహస్యం ... ఒక నిండు జీవితం ఇచ్చే గొప్ప సందేశం.... అదేమిటంటే... “జీవితంలో ఎన్నో అనుకోని సంఘటనలు అనే మలుపులు ఎదురౌతాయి. అటువంటప్పుడు అలుపు సహజమే ! కాని అలసినప్పుడే విసిగిపోయి, ఆ క్షణాన్ని మీ జీవితపు చివరిమలుపు చేసుకోక,  మరింత శక్తిని కూడగట్టుకోవాలి. ఆ సంకల్పం అనే శక్తితో అన్ని మలుపులూ అధిగమించి, విధిని ఎదిరించి, ఒక కొత్త దారిని ఏర్పరుచుకోవాలి, అనుకున్నది సాధించాలి. సుడిగాలిలో దీపంలా ఉన్న ఎన్నో జీవితాలకు మీ ప్రేమ అనే చెతులొడ్డి అండగా నిలవాలి. మార్గదీపికలై వెలగాలి. ప్రతి మనిషి పయనం ఇంతే... చీకటి నుంచి వెలుగు వైపుకు... తమసోమా జ్యోతిర్గమయ ! దీపంలా వెలగండి... ఇతరులకు వెలుగులు పంచండి... “అంటూ వేదిక దిగి వెళ్తున్న దీపికకు అశ్రునయనాలతో మూగగా వీడ్కోలు పలికాయి ఎన్నో మనసులు.

ఆ చిరుదీపిక పంచిన వెలుగులు కొన్ని తరాల వరకూ ఎన్నో హృదయపు ప్రమిదల్ని వెలిగిస్తూనే ఉంటాయి !

No comments:

Post a Comment

Pages